భూమాయలో పడొద్దు | Layouts are not allowed to be alerted | Sakshi
Sakshi News home page

భూమాయలో పడొద్దు

Published Tue, Sep 23 2014 2:00 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

భూమాయలో పడొద్దు - Sakshi

భూమాయలో పడొద్దు

- కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త
- అనుమతులు లేని లేఔట్లతో అప్రమత్తం
తిరుపతి తుడా: అదిగో మెడికల్ హబ్.. ఇక్కడ ఐఐటీ.. పక్కనే పాకశాస్త్ర కళాశాల.. దగ్గర్లో హైకోర్టు బెంచ్.. టూరిజం హబ్.. అంటూ హోరెత్తుతున్న ప్రచారాలతో తిరుపతి  పరిసర ప్రాంతాల్లో గడిచిన రెండు నెలలు గా స్థిరాస్తి క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.  భూముల ధరలు రోజురోజుకూ పెరుగుతూ ఆకాశాన్నం టుతున్నాయి. ఈ నేపథ్యంలో భూములు, భవనాలు కొనుగోలు చేసేటప్పుడు రికార్డులన్నీ సక్రమంగా సరిచూసుకోకపోతే మోసగాళ్ల ఉచ్చులో పడ్డట్టే. మాయమాటలతో ముంచేసేందుకు బ్రోకర్లు సిద్ధంగా ఉన్నారు. కొనుగోలుదారుల ఆరాటాన్ని.. అమాయకత్వాన్ని పెట్టుబడిగా పెట్టి టోకరా వేసేవాళ్లు చాలామంది ఉన్నారు.
 
ఖాళీ స్థలం.. భవనం.. అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్.. ఏదైనా సరే కొనుగోలు చేసేవారికి తిరుపతి రూరల్ సబ్ రిజిస్ట్రార్ బాలాజీ, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శ్యాంకుమార్ సూచనలు ఇవీ.. భూమి ఎక్కడుందో చూసుకోకుండా కొనుగోలు చేయకూడదు.
 ప్రతి భూమికి సంబంధించి ఈసీ (ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్), లింక్ డాక్యుమెంట్లు సరిచూసుకోవాలి. ఈసీ తీసుకున్నప్పుడు నేరుగా పరిశీలించుకోవాలి. మధ్యవర్తులు తెచ్చి చూపించే ఈసీలను నమ్మకూడదు.భూమి యాజమాన్య హక్కులు చూసుకోవాలి. అది పట్టానా? ప్రయివేటుదా..? ప్రభుత్వానిదా..?  ఆ భూమి ఉన్నట్లు తెలిపిన సర్వే నంబరు క్షేత్రస్థాయిలో ఉందా.. లేదా...? తెలుసుకోవాలి.

ఇరుగు పొరుగు సర్వే నంబర్లను రికార్డులో చేర్చి ఫలానా సర్వే నంబరు అదేనంటూ బుకాయించే ప్రమాదం కూడా ఉంది. కాగితాల్లో సర్వే నంబరు చూసి నమ్మడం కంటే సంబంధిత సర్వే నంబరును ప్రభుత్వ సర్వేయర్ ద్వారా నిర్ధారించుకోవాలి.
 ఆక్రమించిన భూములేమో నిర్ధారించుకోవాలి. నిషేధిత భూముల జాబితా(ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్- బదిలీ నిషేధిత భూమి)లో ఉందేమో పరిశీలించుకోవాలి. ఈ వివరాలు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల వద్ద ఉంటాయి. ఆర్‌ఎస్‌ఆర్ (రీ సర్వే రిజిస్టర్)లో ఏ కేటగిరి భూమో తెలుస్తుంది.
 
ప్రభుత్వానిదైతే అసైన్డ్ భూములు, వాగులు, వంకలు, చెరువులు, శ్మశానాలు, వక్ఫ్, క్రిస్టియన్ మైనారిటీ, నీటి పారుదల శాఖలకు చెందినవేమో చూసుకోవాలి.భూమి సర్వే నంబరు ప్రకారం అడంగల్ చూసుకోవాలి. పట్టాదారు పాస్ పుస్తకంలో నమోదైందో లేదో చూడాలి. ఏ గ్రామానికి సంబంధించిన భూమి. క్రయ విక్రయాల వివరాలు మీ సేవలో పొందవచ్చు. ఇంటి స్థలం అయితే దస్తావేజులను పరిశీలించుకోవాలి. స్థలం అసైన్‌మెంటు (ఇంటి నంబరు, ఇరుగుపొరుగు ఇళ్ల వివరాలు) చూడాలి. పట్టణాలు, మున్సిపల్ ప్రాంతాల్లో ప్రణాళికా విభాగాల్లో దస్తావేజులు సరైనవో కాదో నిర్ధారించుకోవాలి. గ్రామ పరిధిలో నివేశన స్థలాలైతే గ్రామ కంఠంలో ఉందా? ప్రభుత్వ గ్రామ కంఠంలో ఉందా?ప్రైవేటు కంఠమా? చూసుకోవాలి.
 
ఏ స్థలం రికార్డులైనా తారుమారు చేయడానికి, నకిలీలు  రూపొందించడానికి అవకాశం ఉంది. పోటీకి వస్తారని కొందరు రహస్యంగా కొనుగోలు చేయడం పరిపాటిగా జరుగుతోంది. ఆయా భూముల ఇరుగుపొరుగు వారిని సంప్రదిస్తే వాస్తవాలు తెలుస్తాయి. నగరపాలక సంస్థలు, పురపాలక పరిధిలో మాస్టర్ ప్లాన్‌లో ఉందా..  లేదా..? చూసుకోవాలి.తుడా పరిధిలో ప్లాట్లు అనుమతి పొందిన లేఔట్లా.. కాదా..?  చూసుకోవాలి. తనఖా పెట్టిన ఆస్తిని కూడా విక్రయించే ప్రయత్నాలు జరుగుతుంటాయి. సంబంధిత ప్లాటుపై తీసుకున్న రుణం చెల్లించారా లేదా తెలుసుకోవాలి.అపార్టుమెంట్ అయితే అనుమతి పొందిన ప్లాన్ ప్రకారం జరిగిందా లేదో చేసుకోవాలి.సామాజిక అవసరాల (పార్కులు, ఆట స్థలాలు, రోడ్లు, పారిశ్రామిక అవసరాలు)కు సంబంధించిన భూములను విక్రయించే ప్రయత్నాలు జరుగుతుం టాయి. వాటిని కనిపెట్టాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement