ఐదేళ్లుగా పోచారంలో రైతు పేరిట 33 ఎకరాలకు చెల్లింపు
రూ. 16.80 లక్షలు రికవరీకి రెవెన్యూ శాఖ నోటీసులు
మేడ్చల్ జిల్లాలో సాగయ్యేది 28,162 ఎకరాలే.. రైతుబంధు 66,519 ఎకరాలకు
రంగారెడ్డి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి
సాక్షి,మేడ్చల్ జిల్లా: మేడ్చల్ జిల్లాలో రైతుబంధు పక్కదారి పట్టింది. సాగుకు నోచుకోని లేఅవుట్లు, వెంచర్లు, గుట్టలు, రాళ్లురప్పలు, కంచెలు ఉన్న వేలాది ఎకరాలకు కూడా పెట్టుబడి సాయం అందింది. ఘట్‌కేసర్ మండలం పోచారం మున్సిపాలిటీ పరిధిలోని 38, 39, 40 సర్వేనంబర్లలోని 33 ఎకరాల లేఅవుట్‌కు రైతుబంధు అందింది. ఇందులో కొంత వ్యవసాయభూమి కూడా ఉంది.
రైతు మోత్కుపల్లి యాదగిరిరెడ్డి పేరిట ఐదేళ్లుగా ఈ వెంచర్‌కు రూ. 20 లక్షలు రైతుబంధు పేరిట జమ అయిన విషయం బయటకు పొక్కింది. పోచారానికి చెందిన ఓ వ్యక్తి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, రెవెన్యూ అధికారులు విచారించి ఇది వాస్తవమేనని తేల్చారు. మోత్కుపల్లి యాదగిరిరెడ్డి నుంచి రూ.16.80 లక్షలు రికవరీ చేయాలని అధికారులు నిర్ణయించారు. కీసర ఆర్డీఓ ఉపేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు ఘట్‌కేసర్ తహసీల్దార్ రైతు యాదగిరిరెడ్డి నుంచి రూ.16.80 లక్షల రికవరీ పేరిట నోటీసులు జారీ చేశారు.
నగర శివారులో ఇలా..
నగర శివారులో ఉన్న మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 28,162 ఎకరాల్లో మాత్రమే వివిధ పంటలు సాగవుతున్నాయి. అయితే ఏటా ప్రతి సీజన్‌లో పెట్టుబడి సాయం కింద 66,519 ఎకరాలకు రూ. 39.92 కోట్లు విడుదల అవుతున్నాయి. ఆధార్‌కార్డు అనుసంధానం ఆధారంగా రూ. 33.25 కోట్లు సంబంధిత రైతుల బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తోంది. అయితే మిగతావి సాగు భూములు కావని, వెంచర్లు, ఫామ్ ల్యాండ్స్, బీడు భూములనే ఆరోపణలున్నాయి.
రంగారెడ్డి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. రంగారెడ్డి జిల్లాలో 4,45,428 ఎకరాలు ఉన్నాయి. పెట్టుబడి సాయం ప్రతీ సీజన్లో రూ.345.36 కోట్ల చొప్పున ఏడాదిలో రెండు పర్యాయాలు ప్రభుత్వం చెల్లిస్తోంది. రంగారెడ్డి జిలాల్లో సీజన్ల వారీగా సాగవుతున్న భూములకు రూ.222.71 కోట్లు సరిపోతుందని రైతు సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఈ లెక్కన ప్రభుత్వం అదనంగా రూ.117 కోట్లు మేర లేఅవుట్లు, రాళ్లు, రప్పలు, గుట్టలు, కంచెలు ఉన్న భూములకు చెల్లిస్తుందని వారు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment