సాక్షి, బళ్లారి : నగరంలోని బుడా లేఔట్లలో (బళ్లారి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) సమస్యలు తిష్ట వేయడంతో ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు ఇళ్లు కట్టించుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. బుడాకు అధ్యక్షుడు, కమిషనర్, పలువురు అధికారులు లేఔట్లు, నగరాభివృద్ధి కోసం పని చేస్తారు. ఇటీవల బళ్లారిలోని బుడా పరిధిలో వేసిన లేఔట్లలో సమస్యలు కుప్పలు తెప్పలుగా ఉండటంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఆందోళన చెందుతున్నారు.
నగర శివార్లలోని అటల్ బిహారీ వాజ్‌పేయి బుడా కాలనీ ఏర్పాటు చేసి రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఆ కాలనీలో నీటి సౌకర్యం కల్పించలేదు. దీంతో అక్కడ ఇళ్ల నిర్మాణాలు చేపట్టే వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. విధిలేక ఇళ్ల నిర్మాణాల కోసం వేలాది రూపాయలు నీటి కోసం వెచ్చిస్తున్నారు. ఐదేళ్ల లోపు ఇంటి నిర్మాణాలు చేపట్టాలని నిబంధనలు పెట్టిన బుడా అధికారులు రెండు సంవత్సరాలైనా నీటి వసతి కల్పించడంలో ఎందుకు దృష్టి పెట్టడం లేదని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
చిన్న ఇళ్లు నిర్మాణం చేపట్టేందుకు కూడా కనీసం రూ.50 వేలు నీటి కోసం ఖర్చు పెట్టాల్సి వస్తోందని ఆ కాలనీ వాసులు వాపోతున్నారు. ప్లాట్లు అమ్మేసి కోట్లాది రూపాయలు బుడాకు ఆదాయం సమకూర్చుకున్న పాలకులు, అధికారులు నీటి వసతి కల్పించడంపై దృష్టి పెట్టక పోవడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. లైఔట్‌కు సంబంధించి కార్పొరేషన్ అధికారులు తమకేమీ దాఖలాలు అందలేదని, వాజ్‌పేయి లేఔట్ సంగనకల్లు పంచాయతీ పరిధిలోకి చేర్చారని చెప్పడం గమనార్హం. కాలనీలో నీటి సమస్యతో పాటు విద్యుత్ సమస్య వెంటాడుతోందని కాలనీలో ఇంటిని నిర్మించుకుంటున్న టీ.మాధవరావు వాపోయాడు.
ఇంటి నిర్మాణం కోసం రూ.వేలు ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో వేసిన ప్లాట్లుకే సరైన సదుపాయాలు కల్పించకపోతే ఇక ప్రైవేటు లేఔట్ల పరిస్థితి ఎలా ఉంటుందోనని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇక్కడి సమస్యలు పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
వాజ్‌పేయి లేఔట్‌లో సమస్యల తిష్ట
Published Fri, Oct 10 2014 2:45 AM | Last Updated on Thu, Aug 16 2018 4:01 PM
Advertisement
Advertisement