
ప్రతి మనిషికీ ప్రాణవాయువు తరువాత అత్యంత ప్రామాణికమైనది నీరు. మనిషి దేహంలో సుమారు 60 నుంచి 70 శాతం నీరు ఉంటుంది. ఆహారం లేకుండా కొన్ని రోజులు బతకగలమేమో కానీ, నీరు అందకుంటే మాత్రం ప్రాణాపాయమే. అయితే ఇంతటి ప్రామాణికమైన నీరు ప్రస్తుతం వ్యాపారంగా మారిన విషయం విదితమే. నీటిని కూడా లీటర్ల చొప్పున అమ్మడం, మనం కొనడం సాధరణమైపోయింది. అయితే ఇటీవల నగరంలో జరిగిన సినిమా వేడుకలో ప్రముఖ టాలీవుడ్ సినీ హీరో ఓ వాటర్ బాటిల్‌తో నీరు తాగడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎందుకంటే సుమారు 330 మిల్లీలీటర్లు ఉండే ఈ వాటర్ బాటిల్ ధర అక్షరాలా 130 నుంచి 160 రూపాయలట. అంటే ఆ బ్రాండ్ ఒక లీటర్ నీరు సుమారు రూ.500. నిజంగా హైదరాబాద్‌లో వందలు, వేలు ఖర్చు చేసి ఒక లీటర్ నీటిని కొంటున్నారా.. అంటే? ఔననే సమాధానం వస్తుంది. వందలు వేలు కాదు.. కొందరు ప్రముఖులు ఏకంగా లక్షల రూపాయలు విలువైన వాటర్ బాటిళ్లు కొని మరీ తాగుతున్నారు.
సాధారణంగా హైదరాబాద్ నగరంలో ఒక లీటర్ వాటర్ బాటిల్ ధర రూ.20లు. ఫ్లేవర్డ్ వాటర్ బాటిల్ లేదా స్పార్లి్కంగ్ మినరల్ వాటర్ బాటిల్ ధర రూ.30 నుంచి 50 వరకూ ఉంటుంది. ప్రీమియం నేచురల్ మినరల్ వాటర్ బాటిల్ ధర రూ.40 నుంచి 100 వరకూ ఉంటుంది.
వాటర్ బాటిళ్ల అమ్మకం ఐఎస్‌ఐ మార్క్, బ్రాండింగ్, ప్రభుత్వ నిబంధనలు తదితర అంశాల పై ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి సహజ వనరైన నీటిని ఇంత ధరల్లో అమ్మడం కూడా అనైతికమని పలు సంస్థలు, సామాజిక వేత్తలు నినదిస్తున్నారు.
కానీ హైదరాబాద్ వంటి మహానగరంలో నీటిని వేలకు వేలు పెట్టి మరీ తాగున్నారనే విషయం ఇటీవల కాలంలో ప్రాచుర్యంలోకి వస్తోంది. సాధారణంగా కొన్ని రెస్టారెంట్లకు వెళితే బయట 20 రూపాయలకు లభించే లీటర్ వాటర్‌బాటిల్ ధర 40 నుంచి 80 ఉంటుంది.
దీనికి సొంత బ్రాండింగ్, నీటి స్వచ్ఛత, మినరల్స్ మిక్సింగ్ వంటి అంశాలను వెల్లడిస్తారు. దీనికి మించి నగరంలోని కొన్ని స్టార్ హోటళ్లలో 250 నుంచి 300 మి.లీ వాటర్‌బాటిల్ ధర సుమారు 200 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. నేచురల్ మినరల్ వాటర్ అని, నేచురల్లీ ఆల్కలైన్ వాటర్ అనీ విభిన్న పద్ధతుల్లో ఈ నీటిని అందిస్తున్నారు.
ఎన్విరాన్‌మెంటల్లీ సర్టిఫైడ్ బ్రాండ్స్ అంటూ లీటర్‌కు సుమారు వెయ్యిరూపాయల వరకూ ధర నిర్ణయిస్తున్నారు. నగరంలోని 3 స్టార్, 5 స్టార్ హోటళ్లలో జరిగే బిజినెస్ మీటింగ్స్, ఫంక్షన్స్‌లో ఈ తరహా వాటర్ బాటిళ్లు దర్శనమిస్తున్నాయి. అంతే కాదు.. సాధారణంగా లంచ్ లేదా డిన్నర్ కోసం వెళ్లిన నగరవాసులు సైతం ఈ నీటిని సేవిస్తుండటం విశేషం. నార్వేలోని భూగర్భ జలాల నుండి సేకరించిన వోస్ ఆర్టేసియన్ వాటర్ (12 బాటిళ్ల ప్యాక్ సుమారుగా 6,600), ఆరావల్లి పర్వత శ్రేణి నుంచి సేకరించిన ఆవా సహజ అల్కలైన్ వాటర్, క్రికెటర్ కోహ్లీ తాగే ఎమియన్ వంటి ఖరీదైన బ్రాండ్స్ నగరంలో లభిస్తుండటం విశేషం.
వజ్రాల బాటిల్స్‌లో తాగే నీరు..
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నీరుగా బెవర్లీ హిల్స్ 90 ఏ20 డైమండ్ ఎడిషన్ గుర్తింపు పొందింది. ఈ బ్రాండ్ లగ్జరీ కలెక్షన్ డైమండ్ ఎడిషన్ బాటిల్ ధర రూ.65 లక్షల వరకూ ఉంది. ఈ బాటిల్‌లో 600 జీ/వీఎస్ తెల్ల వజ్రాలు, 250కు పైగా నల్ల వజ్రాలతో అలంకరించిన బంగారు టోపీ సెట్ ఉంటుంది. ఆక్వా డీ క్రిస్టల్లో ట్రిబ్యూటో మోడిగ్లియాని అనే బ్రాండ్ వాటర్ బాటిల్ ధర రూ.44 లక్షలకు పైమాటే.
ఈ బాటిల్ 2010లో అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డును దక్కించుకుంది. ఫిజియన్, ఫ్రెంచ్ స్ప్రింగ్స్–ఐస్లాండ్ హిమ నదీ నుంచి సేకరించిన ఈ నీటిని 750 మి.లీ పరిమాణంలో 24–క్యారెట్ల బంగారు బాటిల్‌లో అందిస్తారు. దక్షిణ కాలిఫోరి్నయాలోని పలోమర్ పర్వతం నుంచి సేకరించే బ్లింగ్ హెచ్20 ధర 2 లక్షల వరకూ ఉంది. నెవాస్ గ్లో–ఇన్–ది–డార్క్ బాటిల్ వాటర్ మాగ్నమ్ ధర దాదాపు రూ.1.32 లక్షలు.
వంద శాతం సహజమట..!
వందలు వేలు కాదు.. ప్రపంచవ్యాప్తంగా తాగే నీటిని లక్షల విలువ చేసే బాటిళ్లలో అమ్మడం కూడా మొదలైంది. ఇంతటి ఖరీదైన వాటర్ బాటిళ్లు మన దేశంలో కూడా కొని తాగుతున్నారు కొందరు ధనవంతులు, సెలబ్రిటీలు. ప్రముఖ భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకునే ఏవియన్ నేచురల్ స్ప్రింగ్ వాటర్ మాత్రమే తాగుతాడు.
ఈ నీరు వంద శాతం సహజ నీరు, ఫ్రాన్స్‌లోని ఏవియన్–లెస్–బెయిన్స్ సమీపంలోని సహజ వనరుల నుంచి సేకరించినవి. ఈ స్వచ్ఛమైన నీటిలో సహజ ఖనిజాలంటాయని, అంతేకాకుండా ఎలాంటి రసాయనాలతో కలుషితం కాదని నిర్థారించినవి. విరాట్ కోహ్లీ ప్రతి యేటా సుమారు రూ.4.3 లక్షల వరకూ ఈ నీటి కోసం వెచ్చిస్తాడని సమాచారం.
(చదవండి: 'అపూర్వ బంధం'.. తోబుట్టువుల ప్రేమ..అనుబంధాలకు ప్రతీక..!)