హుజూర్‌నగర్, న్యూస్‌లైన్: గ్రీన్‌ల్యాండ్ పై అక్రమార్కుల కన్నుపడింది. దాదాపు 30 ఏళ్ల నుంచి వివిధ వెంచర్ల ద్వారా పంచాయతీకి చెందాల్సిన భూములు ఇప్పుడు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. హుజూర్‌నగర్ గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు వివిధ లే అవుట్‌ల ద్వారా సంక్రమించిన స్థలాలు కనిపించకుండా పోయాయి.
1982 నుంచి 2011 వరకు పట్టణంలో 137, 187, 188, 190, 191, 203, 204, 205, 206, 207, 208, 211, 212, 285, 292, 300, 302, 478 తదితర సర్వే నంబర్లలో 46 వెంచర్ల ద్వారా లేఅవుట్ రూపంలో గ్రామ పంచాయతీకి సుమారు 60వేల చదరపు గజాల స్థలాలను కేటాయించారు. కాగా ఆయా స్థలాలు నిబంధనల ప్రకారం సంబంధిత పంచాయతీ ఈఓల పేరుమీద అగ్రిమెంట్ చేయాల్సి ఉంది.
కానీ, ఈ స్థలాలను కొందరు ప్రజాప్రతినిధులు, మధ్యవర్తుల ద్వారా గ్రామ పంచాయతీ అధికారి పేరు మీద అగ్రిమెంట్ చేయకుండా సంబంధిత స్థల యజమాని పేరు మీదనే ఉంచారు. దీంతో ఈ స్థలాలు విక్రయించుకునేందుకు ఆయా స్థలాల యజమానులకు వెసులుబాటు కలిగింది. ఈ విషయంలో పట్టణానికి చెందిన ప్రజాప్రతినిధులు కొందరు మధ్యవర్తులుగా గ్రామ పంచాయతీ ఈఓ, ప్లాట్ యజమానుల మధ్య అవగాహన కుదిర్చి స్థలాలను విక్రయించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్లాట్లను ఆయా ప్లాట్ల వెంట ఉన్న వారు పంచాయతీ అధికారులతో అవగాహన కుదుర్చుకుని కబ్జాలు చేశారు.
కబ్జాకు గురైన స్థలాలివిగో...
204 సర్వే నంబర్‌లో గ్రామ పంచాయతీకి లేఅవుట్ కింద 450 చదరపు గజాలను కేటాయించారు. ఈ స్థలాన్ని గ్రామ పంచాయతీకి అగ్రిమెంట్ చేయకుండా అప్పటి ఈఓ పాలకవర్గంలోని కొందరు ప్రజాప్రతినిధులతో కలిసి సదరు యజమాని పేరు మీదనే ఉంచారు. దీంతో ఆ యజమాని గత ఏడాది ఈ ప్లాట్‌ను అమ్ముకున్నాడు. అదేవిధంగా 208 సర్వే నంబర్‌లోని ప్లాట్ నెం.45లో 203 చదరపు గజాలను కూడా గత ఏడాదే అమ్మారు. సర్వే నెం.298/అ, 298/ఆ, 298/ఉ, 298/ఇ, 298/ఊ, 298/అ1లలో గ్రామ పంచాయితీ లే అవుట్ కింద130, 131, 132, 133, 134, 143, 144, 129, 145 నంబర్ ప్లాట్లను మొత్తం 2268 చదరపు గజాలను కేటాయించారు. ఈ స్థలాలు గ్రామ పంచాయతీకి అగ్రిమెంట్ చేయకుండా ప్రస్తుతం బీనామీ పేర్లతో ఉంచారు. వీటిని ఏ క్షణంలో నైనా విక్రయించేందుకు సదరు బినామీలు సమయం కోసం వేచిచూస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో గ్రామ పంచాయతీ కాస్త నగర పంచాయతీగా మారడంతో ప్లాట్ల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో కొందరు మధ్యవర్తులు అదేపనిగా విక్రయాలు, కబ్జాలు చేయిస్తూ చక్రం తిప్పుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే 1982 నుంచి 2011 వరకు గ్రామ పంచాయితీకి కేటాయించిన లే అవుట్ భూముల అన్యాక్రాంతంపై గత ఏడాది అఖిలపక్ష నాయకులు విచారణ జరపాలని కోరుతూ నగర పంచాయతీ కమిషనర్‌కు, ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేసి ఆందోళన కూడా చేశారు. అయినా వాటిపై ఉన్నతాధికారులు ఎలాంటి విచారణ జరపలేదు. ఇప్పటికైనా వాటిపై విచారణ చేపట్టకుంటే ఆందోళన చేపట్టేందుకు అఖిలపక్షం నాయకులు సిద్ధమవుతున్నారు.
రికార్డులు తనిఖీ చేస్తున్నాం :
నగర పంచాయతీ కమిషనర్
పంచాయతీ లే అవుట్ స్థలాల కబ్జా విషయంపై రికార్డులు తనిఖీ చేస్తున్నామని హుజూర్‌నగర్ నగర పంచాయతీ కమిషనర్ కోట రాంరెడ్డి తెలిపారు. హుజూర్‌నగర్ పంచాయతీగా ఉన్నకాలంలో అన్యాక్రాంతమైన ప్లాట్లను గుర్తిస్తున్నామన్నారు. త్వరలోనే వాటిని గుర్తించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
పచ్చధనమని..?
Published Mon, Aug 5 2013 3:04 AM | Last Updated on Fri, Sep 1 2017 9:38 PM
Advertisement