Thirty years
-
30 ఏళ్ల క్రితం ఇండియా ఇలానే ఉండేది..ఇప్పుడు కావలసింది అవే..
పేపర్ తెరిస్తే ఘోరమైన వార్తలు. రక్త సంబంధాల మధ్య కూడా కక్షలు, కార్పణ్యాలు. మానవ సంబంధాలపై విశ్వాసం పోయేలా సంఘటనలు.ఇటువంటి సమయంలో ఒక ట్విటర్ పోస్ట్ చాలామందికి హాయినిచ్చింది. ‘గాయత్రీ... ఇడ్లీలు చేశా. ఇంటికి రా’ అని తన పొరుగింటివారు వాట్సప్ మెసేజ్ పెట్టినసంగతిని మైసూర్‌కు చెందిన ఒక మహిళ షేర్ చేస్తూ తమ కాలనీలో అందరూ ఎంత స్నేహంగా ఉంటారో చెప్పింది. ‘ముప్పై ఏళ్ల క్రితం ఇండియా ఇలాగే ఉండేది’ అని అందరూ రెస్పాండ్ అవుతున్నారు. ఏం... ఇప్పుడు ఎందుకు అలా ఉండకూడదు? నిజమే. పక్కింటి పాప తలుపు తట్టి ‘బీరకాయ కూర చేసింది అమ్మ. ఇచ్చి రమ్మంది’ అని చెప్తే చాలా బాగుంటుంది. ‘గడి ముందుకేసి కూరగాయలకు వెళుతున్నా. కాస్త చూస్తుండక్కా’ అని ఎదురింటి వాళ్లతో అంటే ‘అదేం భాగ్యం. వెళ్లిరా’ అని సొంతింటి కన్నా ఈ ఇంటి పైనే దృష్టి పెట్టే వాళ్లు దొరికితే మరెంతో బాగుంటుంది. ఇలా ఉండటానికే మనుషులు ఇష్టపడేవాళ్లు. కాని ఇప్పుడు ఇలా ఉండటం ‘భాగ్యం’ అని చెప్పుకునే స్థాయికి చేరుకున్నాం. మైసూర్లో ఒక కాలనీ ‘గాయత్రి. ఇడ్లీలు చేశా. ఇంటికి రా’ అని తనకు వచ్చిన మెసేజ్‌ను ట్విటర్లో పోస్ట్ చేస్తూ ‘మా కాలనీలో అంతా ఇలాంటి స్నేహమే’ అని గాయత్రి జయరామన్ అనే మైసూర్ జర్నలిస్ట్ ట్వీట్ చేసింది. 20 ఏళ్లుగా పాత్రికేయరంగంలో ఉన్న గాయత్రి ‘హూ మి, పూర్’ అనే పుస్తకం రాసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే గాయత్రి పక్కింటావిడ ఇడ్లీలకు పిలవడంతో సంతోషపడి తన కాలనీ స్నేహాలన్నీ ట్వీట్లుగా రాసింది. ‘యోగా సెంటర్‌కు రాపిడో బుక్ చేద్దామని ఇంటి బయట నిలబడతానా... ఎవరో ఒకరు దింపడానికి వస్తారు. నా కుక్కపిల్ల నేను బయటికెళ్తే గోల చేస్తుంది. నేను ఇంట్లోనే ఉన్నాననే భావన కలిగించడానికి తలుపు తెరిచి పెట్టి పనుల కోసం బయటకు వెళితే మా కాలనీలో అందరూ కాపలా కాసేవాళ్లే. ఒక రోజు ఒకావిడ బిసిబేలాబాత్ పంపుతారు. నిన్న ఒకామె సాంబార్ పంపింది. మా కాలనీలో ఒకరి గిన్నెలు మరొకరి వంట గదిలో ఉండటం మామూలే. ఇలాంటి స్నేహాలతో మేమంతా ఉండటం సంతోషంగా ఉంది’ అని రాసింది. దాంతో చాలామంది కనెక్ట్ అయ్యారు. ‘మేము గవర్నమెంట్ క్వార్టర్స్‌లో ఉన్నప్పుడు అందరం ఇలాగే ఉండేవాళ్లం’ అని ఒకరు రాస్తే ‘మైసూర్లో అందరూ ఇలా ఉండొచ్చు. బెంగళూరులో ఈ వాతావరణం మిస్ అవుతున్నాను’ అని మరొకరు రాశారు.‘ముప్పై ఏళ్ల క్రితం అందరూ ఇలా ఉన్నవాళ్లే. ఇప్పుడెక్కడ’ అని మరొకరు బాధ పడ్డారు. ‘లాక్డౌన్ సమయంలో కొంతకాలం మాత్రం ఇలా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ ఎవరి గుహల్లోకి వాళ్లు వెళ్లిపోయారు’ అని మరొకరు రాశారు. ఇరుగు పొరుగుతో స్నేహంగా ఉండటం, ‘ఏం బాబాయ్’ అంటే ‘ఏం అల్లుడూ’ అని పలకరించుకోవడం.. ‘ఆంటీ ఇంటి నుంచి టీ పౌడర్ తీసుకురాపో’ అని పంపించడం కూడా అసాధ్యమైన విషయాలుగా మారిపోతే ఏ ఊతంతో ఏ స్పందనలతో జీవించాలి మనం? శ్రుతి మించి ప్రైవసీ పల్లెల్లో అయినా పట్నాల్లో అయినా ప్రతి ఒక్కరూ శ్రుతి మించిన ప్రైవసీలోకి జారుకుంటున్నారు. మొదట ఉమ్మడి కుటుంబాలు వద్దనుకున్నారు. ఆ తర్వాత తల్లిదండ్రుల నుంచి పిల్లలు విడిపోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇరుగు పొరుగు వారిని వద్దనుకుంటున్నారు. కేవలం ఎప్పుడూ ఇళ్లకు కూడా రాని కొందరు స్నేహితులు, పరిచయస్తులు చాలనుకునే స్థితికి చేరుకున్నారు. ‘మన బతుకులో ఎవరి జోక్యం అక్కర్లేదు’ అనే భావనలో ఉన్న సౌకర్యం ఎలా ఉన్నా ‘ఎవరి సాయం, తోడు లేకుండా బతుకు ఎలా ఉంటుంది’ అనే ప్రశ్నకు జవాబు దొరకడం లేదు. ప్రైవసీ పిచ్చి ఒంటరితనంలోకి, ఏకాంతంలోకి, మనకు ఎవరూ లేరని భావనలోకి నెట్టి అభద్రతకు, ఆందోళనకు గురి చేస్తుంది. ‘ఎదుటివారి లోపాలు వెతకడం, జడ్జ్ చేయడం, మనకు హితవు చెప్పిన వారిని కూడా పగవారిని చేసుకోవడం, అనుబంధాలు ఆర్థికపరమైన సాయాలు కోరతాయనే మిషతో అందరినీ దూరం పెట్టడం’ ఇవి నేడు ప్రతి మనిషిని కేవలం కుటుంబ జీవితానికి, కుటుంబ అనుబంధాలకి (అవి కూడా సరిగ్గా ఉంటే) పరిమితం చేస్తున్నాయి. పక్కింటామె ‘ఇడ్లీ తిందూరా’ అని పిలవడమే వార్తగా మారి, అది చదివి ఆనంద బాష్పాలు వచ్చే స్థితికి మనం చేరుకుంటే ఆ తప్పు ఇడ్లీదో చట్నీదో కాదు. మనదే. ప్రేమ, అభిమానాలే ఇంధనాలు ఒక దూరప్రయాణం పరిచయస్తులు ఎవరూ లేని రైలులో చేస్తుంటే ఎలా ఉంటుందో, జీవన ప్రయాణం ప్రేమ, అభిమానాలు పంచేవాళ్లు లేకుంటే అలా ఉంటుంది. నలుగురు స్నేహితులతో సాగే పిక్నిక్ యాత్రలా జీవితం ఎందుకు ఉండకూడదు? కనీసం అప్పుడప్పుడన్నా వీధి అరుగుపై ఇరుగు పొరుగుతో కబుర్లు చెప్పుకునే కమ్మదనంతో జీవితం ఎందుకు ఉండకూడదు? పిల్లలు కూడా తల్లిదండ్రులను చూసి ఇరుగు పొరుగు పిల్లలతో స్నేహం చేయడం మానేస్తున్నారు. దీనివల్ల వారి మానసిక ఆరోగ్యం ఎలా ఉండబోతోందో ఆలోచించారా? (చదవండి: అర్చన... అనుకున్నది సాధించింది) -
30 ఏళ్ల వివాదం: ఉప్పునిప్పుగా ఉక్రెయిన్–రష్యా బంధం
నేషనల్ డెస్క్, సాక్షి: ఉక్రెయిన్‌తో రష్యా వివాదం ఇప్పటిది కాదు. ఉక్రెయిన్ వందలాది ఏళ్లుగా రష్యన్ సామ్రాజ్యంలో భాగమే. తర్వాత కూడా అవిభక్త సోవియట్ యూనియన్‌లో భాగంగానే కొనసాగుతూ వచ్చింది. 30 ఏళ్ల క్రితం, అంటే 1991లో ప్రచ్ఛనయుద్ధానంతరం సోవియట్ విచ్ఛిన్నం తర్వాత ఉక్రెయిన్ స్వతంత్ర దేశమైంది. నాటి నుంచీ రష్యాతో విభేదాలు రగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ యూరప్ దేశాల వైపు మొగ్గుతుండటం రష్యాను కలవరపెడుతూ వచ్చింది. యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వం కోరడంతో పాటు తనను నాటోలో చేర్చుకోవాలని కూడా ఉక్రెయిన్ విజ్ఞప్తి చేసింది. ఈ పరిణామం రష్యాను మరింత కలవరపెట్టింది. నాటో కూటమి ఉక్రెయిన్‌లో తిష్ట వేస్తే తన భద్రతకు పెను ముప్పన్నది రష్యా ఆందోళన. పైగా నాటోలో చేరితే అమెరికా సహా సభ్య దేశాల సైనిక దన్నుతో ఉక్రెయిన్ బలోపేతమవుతుంది. ఈ పరిణామం రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలవరపెట్టింది. 2000లో రష్యా పగ్గాలు చేపట్టిన నాటినుంచే ఉక్రెయిన్‌పై ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ నాటో సభ్యత్వం ఇవ్వకూడదని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. చదవండి: (రష్యాకు స్ట్రాంగ్ వార్నింగ్.. ఆ దేశాల జోలికొస్తే ఖబడ్దార్) వివాదాల్ని ఎగదోసి... ఉక్రెయిన్‌లో తమ కీలుబొమ్మ సర్కార్లను ఏర్పరచడం ద్వారా ఆ దేశ వ్యవహారాలను నియంత్రించేందుకు పుతిన్ ప్రయత్నించారు. పుతిన్ దన్నుతో ఉక్రెయిన్ అధ్యక్షుడైన విక్టర్ యాంకోవిచ్ రష్యా అనుకూల వ్యవహారాలతో వివాదాస్పదునిగా నిలిచారు. 2014లో యూరోపియన్ యూనియన్‌లో చేరేందుకు నిరాకరించారు. దీనిపై జనాగ్రహం పెల్లుబికి ఆందోళనలు చెలరేగడంతో పదవి నుంచి దిగిపోయారు. ఈ కల్లోల సమయంలో రష్యా హఠాత్తుగా దాడికి దిగి దక్షిణ ఉక్రెయిన్‌లోని రష్యన్ల మెజారిటీ ప్రాంతమైన క్రిమియా ద్వీపకల్పాన్ని ఆక్రమించి తనలో కలిపేసుకుంది. అంతటితో ఆగకుండా తూర్పు ఉక్రెయిన్‌లో డొనెట్స్క్, లుహాన్స్క్ల సమాహారమైన డోన్బాస్ ప్రాంతంలో వేర్పాటువాద ఆందోళనలకు అన్నివిధాలా మద్దతిస్తూ వచ్చింది. అక్కడ చెలరేగిన హింసాకాండకు 14 వేల మందికి పైగా బలయ్యారు. చదవండి: (Russia-Ukraine War: నా పదవీకాలంలో అత్యంత విషాద క్షణాలు!) మిన్స్క్ ఒప్పందం ఉద్రిక్తతలను చల్లార్చేందుకు యూరప్ దేశాలు రంగంలోకి దిగాయి. ఫలితంగా 2015లో బెలారస్ రాజధాని మిన్స్క్లో జర్మనీ, ఫ్రాన్స్ మధ్యవర్తిత్వంలో రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం వేర్పాటువాదులు ఆక్రమించుకున్న డొనెట్స్క్, లుహాన్స్క్ వ్యవహారాల్లో ఉక్రెయిన్ వేలు పెట్టరాదు. యథాతథ స్థితి కొనసాగింపునకు రష్యా అంగీకరించాలి. కానీ ఒప్పందాన్ని గౌరవించడం లేదంటూ రెండు దేశాలూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొద్ది నెలలుగా ఉక్రెయిన్‌కు మూడువైపులా భారీ సైనిక మోహరింపులకు పుతిన్ తెర తీసి పశ్చిమ దేశాలకు కంటిపై కునుకు లేకుండా చేశారు. యుద్ధం ఆలోచన లేదంటూనే మోహరింపులను రెండు లక్షల దాకా పెంచారు. బెలారస్లో వేలాది సైనికులతో అణు విన్యాసాలు చేస్తూ వచ్చారు. తాజాగా డోన్బాస్కు స్వతంత్ర హోదా ఇస్తున్నట్టు ప్రకటించడమే గాక, ఉక్రెయిన్‌కు చరిత్రలో ఎన్నడూ ప్రత్యేక అస్తిత్వం లేదంటూ తన ఉద్దేశాలను చెప్పకనే చెప్పారు. వెనువెంటనే దానిపైకి యుద్ధానికి దిగి యూరప్‌లో పెను సంక్షోభానికి తెర తీశారు. ఇలా మొదలైంది.. 2021 మార్చి ఉక్రెయిన్ సరిహద్దుల వెంబడి రష్యా సైన్యాల మోహరింపు ఆరంభం 2021 డిసెంబర్ సరిహద్దుల వద్ద దాదాపుగా లక్ష దాకా మోహరించిన రష్యా సైన్యాలు 2022 జనవరి ►ఉద్రిక్తతలను చల్లార్చేందుకు రష్యా, నాటో మధ్య చర్చలు. ►సేనలను అప్రమత్తం చేసిన నాటో 2022 ఫిబ్రవరి ►తూర్పు ఉక్రెయిన్‌లోని 2 రెబెల్ ప్రాబల్య ప్రాంతాల్లోకి రష్యా సైన్యం ►రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించిన పశ్చిమ దేశాలు ►ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి దాడికి రష్యా శ్రీకారం -
సామాన్యుడి 30 ఏళ్ల కృషి..
పాట్నా: బిహార్‌కు చెందిన దశరథ్ మాంఝీ అనే వ్యక్తి కొండచర్యలు విరిగిపడి తన భార్య మరణించడంతో ఒక్కడే ఒక కొండను తొలచి గ్రామానికి రహదారి నిర్మించిన విషయం తెలిసిందే. 22 ఏళ్లు కష్టపడి ఒక్కడే ఈ పనిని చేయడంతో ఈ విషయం అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తరువాత మాంఝీ కథతో సినిమా కూడా తెరకెక్కింది. సరిగ్గా ఇప్పుడు అలాంటి భగీరధ ప్రయత్నంతో బిహార్‌కు చెందిన మరో వ్యక్తి అందరి చూపును తనవైపు తిప్పుకున్నాడు. ఆయన పేరు లంగీ భుయాన్. బిహార్‌లోని గయ ప్రాంతంలోని కోటీలావ గ్రామానికి చెందిన వ్యక్తి. వర్షాకాలంలో ఆ ఊరి సమీపంలో ఉన్న కొండలపై కురిసిన వాన నీరు వృథాగా పోవడం గమనించిన లంగీ భుయాన్‌కు ఒక ఆలోచన వచ్చింది. వర్షం నీరు వ్యర్థంగా పోకుండా కాలువ తవ్వాలనే ఆలోచన తట్టింది. అనుకున్నదే తడవుగా ఒక కాలువ తవ్వి కొండ దగ్గర నుంచి దానికి మార్గం వేయాలనుకున్నాడు. 30 ఏళ్ల క్రితం కొండ కింద నుంచి కాలువ తవ్వడం మొదలుపెట్టి ఇన్నాళ్లకు పూర్తి చేశాడు. 3 కిలోమీటర్ల పొడవున కాలువ తవ్వి తన ఊరికి అందించాడు. దీంతో అక్కడ ఉన్న పంట పొలాలన్నింటికీ ఆ నీరే ఆధారమవుతోంది. ఇన్నేళ్ల లంగీభుయాన్ ప్రయత్నం సఫలం కావడంతో గ్రామస్తులందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి భుయాన్ మాట్లాడుతూ, ఎంతోమంది ఉపాధి కోసం పట్టణాలకు వెళుతున్నారు. నేను మాత్రం గ్రామాన్ని నమ్ముకుని జీవిస్తున్నాను. ఈ 30 ఏళ్లలో కాలువ తవ్వుతుంటే నాకు సాయం చేసినవాళ్లే లేకుండా పోయారు. పశువులను మేత కోసం రోజు కొండ ప్రాంతానికి తోలుకొని వెళ్లేవాడిని, ఆ సమయంలో కాలువ తవ్వే పనులను చేసేవాడిని ’ అని తెలిపారు. లంగీభుయాన్ కాలువ తవ్వడంతో స్థానిక నేతలు, గ్రామ ప్రజలు ఆయనను ఘనంగా సత్కరించారు. చదవండి: రాజకీయ దిగ్గజాన్ని కోల్పోయాం : మోదీ -
ఇదీ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కథ!
-
మూడు దశాబ్ధాల తర్వాత ఓటెత్తారు!!
-
పచ్చధనమని..?
హుజూర్నగర్, న్యూస్‌లైన్: గ్రీన్‌ల్యాండ్ పై అక్రమార్కుల కన్నుపడింది. దాదాపు 30 ఏళ్ల నుంచి వివిధ వెంచర్ల ద్వారా పంచాయతీకి చెందాల్సిన భూములు ఇప్పుడు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. హుజూర్నగర్ గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు వివిధ లే అవుట్ల ద్వారా సంక్రమించిన స్థలాలు కనిపించకుండా పోయాయి. 1982 నుంచి 2011 వరకు పట్టణంలో 137, 187, 188, 190, 191, 203, 204, 205, 206, 207, 208, 211, 212, 285, 292, 300, 302, 478 తదితర సర్వే నంబర్లలో 46 వెంచర్ల ద్వారా లేఅవుట్ రూపంలో గ్రామ పంచాయతీకి సుమారు 60వేల చదరపు గజాల స్థలాలను కేటాయించారు. కాగా ఆయా స్థలాలు నిబంధనల ప్రకారం సంబంధిత పంచాయతీ ఈఓల పేరుమీద అగ్రిమెంట్ చేయాల్సి ఉంది. కానీ, ఈ స్థలాలను కొందరు ప్రజాప్రతినిధులు, మధ్యవర్తుల ద్వారా గ్రామ పంచాయతీ అధికారి పేరు మీద అగ్రిమెంట్ చేయకుండా సంబంధిత స్థల యజమాని పేరు మీదనే ఉంచారు. దీంతో ఈ స్థలాలు విక్రయించుకునేందుకు ఆయా స్థలాల యజమానులకు వెసులుబాటు కలిగింది. ఈ విషయంలో పట్టణానికి చెందిన ప్రజాప్రతినిధులు కొందరు మధ్యవర్తులుగా గ్రామ పంచాయతీ ఈఓ, ప్లాట్ యజమానుల మధ్య అవగాహన కుదిర్చి స్థలాలను విక్రయించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్లాట్లను ఆయా ప్లాట్ల వెంట ఉన్న వారు పంచాయతీ అధికారులతో అవగాహన కుదుర్చుకుని కబ్జాలు చేశారు. కబ్జాకు గురైన స్థలాలివిగో... 204 సర్వే నంబర్లో గ్రామ పంచాయతీకి లేఅవుట్ కింద 450 చదరపు గజాలను కేటాయించారు. ఈ స్థలాన్ని గ్రామ పంచాయతీకి అగ్రిమెంట్ చేయకుండా అప్పటి ఈఓ పాలకవర్గంలోని కొందరు ప్రజాప్రతినిధులతో కలిసి సదరు యజమాని పేరు మీదనే ఉంచారు. దీంతో ఆ యజమాని గత ఏడాది ఈ ప్లాట్‌ను అమ్ముకున్నాడు. అదేవిధంగా 208 సర్వే నంబర్లోని ప్లాట్ నెం.45లో 203 చదరపు గజాలను కూడా గత ఏడాదే అమ్మారు. సర్వే నెం.298/అ, 298/ఆ, 298/ఉ, 298/ఇ, 298/ఊ, 298/అ1లలో గ్రామ పంచాయితీ లే అవుట్ కింద130, 131, 132, 133, 134, 143, 144, 129, 145 నంబర్ ప్లాట్లను మొత్తం 2268 చదరపు గజాలను కేటాయించారు. ఈ స్థలాలు గ్రామ పంచాయతీకి అగ్రిమెంట్ చేయకుండా ప్రస్తుతం బీనామీ పేర్లతో ఉంచారు. వీటిని ఏ క్షణంలో నైనా విక్రయించేందుకు సదరు బినామీలు సమయం కోసం వేచిచూస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో గ్రామ పంచాయతీ కాస్త నగర పంచాయతీగా మారడంతో ప్లాట్ల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో కొందరు మధ్యవర్తులు అదేపనిగా విక్రయాలు, కబ్జాలు చేయిస్తూ చక్రం తిప్పుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే 1982 నుంచి 2011 వరకు గ్రామ పంచాయితీకి కేటాయించిన లే అవుట్ భూముల అన్యాక్రాంతంపై గత ఏడాది అఖిలపక్ష నాయకులు విచారణ జరపాలని కోరుతూ నగర పంచాయతీ కమిషనర్‌కు, ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేసి ఆందోళన కూడా చేశారు. అయినా వాటిపై ఉన్నతాధికారులు ఎలాంటి విచారణ జరపలేదు. ఇప్పటికైనా వాటిపై విచారణ చేపట్టకుంటే ఆందోళన చేపట్టేందుకు అఖిలపక్షం నాయకులు సిద్ధమవుతున్నారు. రికార్డులు తనిఖీ చేస్తున్నాం : నగర పంచాయతీ కమిషనర్ పంచాయతీ లే అవుట్ స్థలాల కబ్జా విషయంపై రికార్డులు తనిఖీ చేస్తున్నామని హుజూర్నగర్ నగర పంచాయతీ కమిషనర్ కోట రాంరెడ్డి తెలిపారు. హుజూర్నగర్ పంచాయతీగా ఉన్నకాలంలో అన్యాక్రాంతమైన ప్లాట్లను గుర్తిస్తున్నామన్నారు. త్వరలోనే వాటిని గుర్తించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.