నేషనల్ డెస్క్, సాక్షి: ఉక్రెయిన్‌తో రష్యా వివాదం ఇప్పటిది కాదు. ఉక్రెయిన్ వందలాది ఏళ్లుగా రష్యన్ సామ్రాజ్యంలో భాగమే. తర్వాత కూడా అవిభక్త సోవియట్ యూనియన్లో భాగంగానే కొనసాగుతూ వచ్చింది. 30 ఏళ్ల క్రితం, అంటే 1991లో ప్రచ్ఛనయుద్ధానంతరం సోవియట్ విచ్ఛిన్నం తర్వాత ఉక్రెయిన్ స్వతంత్ర దేశమైంది. నాటి నుంచీ రష్యాతో విభేదాలు రగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ యూరప్ దేశాల వైపు మొగ్గుతుండటం రష్యాను కలవరపెడుతూ వచ్చింది.
యూరోపియన్ యూనియన్లో సభ్యత్వం కోరడంతో పాటు తనను నాటోలో చేర్చుకోవాలని కూడా ఉక్రెయిన్ విజ్ఞప్తి చేసింది. ఈ పరిణామం రష్యాను మరింత కలవరపెట్టింది. నాటో కూటమి ఉక్రెయిన్‌లో తిష్ట వేస్తే తన భద్రతకు పెను ముప్పన్నది రష్యా ఆందోళన. పైగా నాటోలో చేరితే అమెరికా సహా సభ్య దేశాల సైనిక దన్నుతో ఉక్రెయిన్ బలోపేతమవుతుంది. ఈ పరిణామం రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలవరపెట్టింది. 2000లో రష్యా పగ్గాలు చేపట్టిన నాటినుంచే ఉక్రెయిన్‌పై ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ నాటో సభ్యత్వం ఇవ్వకూడదని డిమాండ్ చేస్తూ వస్తున్నారు.
చదవండి: (రష్యాకు స్ట్రాంగ్ వార్నింగ్.. ఆ దేశాల జోలికొస్తే ఖబడ్దార్)
వివాదాల్ని ఎగదోసి...
ఉక్రెయిన్లో తమ కీలుబొమ్మ సర్కార్లను ఏర్పరచడం ద్వారా ఆ దేశ వ్యవహారాలను నియంత్రించేందుకు పుతిన్ ప్రయత్నించారు. పుతిన్ దన్నుతో ఉక్రెయిన్ అధ్యక్షుడైన విక్టర్ యాంకోవిచ్ రష్యా అనుకూల వ్యవహారాలతో వివాదాస్పదునిగా నిలిచారు. 2014లో యూరోపియన్ యూనియన్‌లో చేరేందుకు నిరాకరించారు. దీనిపై జనాగ్రహం పెల్లుబికి ఆందోళనలు చెలరేగడంతో పదవి నుంచి దిగిపోయారు.
ఈ కల్లోల సమయంలో రష్యా హఠాత్తుగా దాడికి దిగి దక్షిణ ఉక్రెయిన్‌లోని రష్యన్ల మెజారిటీ ప్రాంతమైన క్రిమియా ద్వీపకల్పాన్ని ఆక్రమించి తనలో కలిపేసుకుంది. అంతటితో ఆగకుండా తూర్పు ఉక్రెయిన్లో డొనెట్‌స్క్, లుహాన్‌స్క్‌ల సమాహారమైన డోన్బాస్ ప్రాంతంలో వేర్పాటువాద ఆందోళనలకు అన్నివిధాలా మద్దతిస్తూ వచ్చింది. అక్కడ చెలరేగిన హింసాకాండకు 14 వేల మందికి పైగా బలయ్యారు.
చదవండి: (Russia-Ukraine War: నా పదవీకాలంలో అత్యంత విషాద క్షణాలు!)
మిన్స్‌క్ ఒప్పందం
ఉద్రిక్తతలను చల్లార్చేందుకు యూరప్ దేశాలు రంగంలోకి దిగాయి. ఫలితంగా 2015లో బెలారస్ రాజధాని మిన్స్‌క్‌లో జర్మనీ, ఫ్రాన్స్ మధ్యవర్తిత్వంలో రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం వేర్పాటువాదులు ఆక్రమించుకున్న డొనెట్‌స్క్, లుహాన్‌స్క్ వ్యవహారాల్లో ఉక్రెయిన్ వేలు పెట్టరాదు. యథాతథ స్థితి కొనసాగింపునకు రష్యా అంగీకరించాలి. కానీ ఒప్పందాన్ని గౌరవించడం లేదంటూ రెండు దేశాలూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొద్ది నెలలుగా ఉక్రెయిన్‌కు మూడువైపులా భారీ సైనిక మోహరింపులకు పుతిన్ తెర తీసి పశ్చిమ దేశాలకు కంటిపై కునుకు లేకుండా చేశారు.
యుద్ధం ఆలోచన లేదంటూనే మోహరింపులను రెండు లక్షల దాకా పెంచారు. బెలారస్‌లో వేలాది సైనికులతో అణు విన్యాసాలు చేస్తూ వచ్చారు. తాజాగా డోన్బాస్‌కు స్వతంత్ర హోదా ఇస్తున్నట్టు ప్రకటించడమే గాక, ఉక్రెయిన్‌కు చరిత్రలో ఎన్నడూ ప్రత్యేక అస్తిత్వం లేదంటూ తన ఉద్దేశాలను చెప్పకనే చెప్పారు. వెనువెంటనే దానిపైకి యుద్ధానికి దిగి యూరప్‌లో పెను సంక్షోభానికి తెర తీశారు.
ఇలా మొదలైంది..
2021 మార్చి
ఉక్రెయిన్ సరిహద్దుల వెంబడి రష్యా సైన్యాల మోహరింపు ఆరంభం
2021 డిసెంబర్
సరిహద్దుల వద్ద దాదాపుగా లక్ష దాకా మోహరించిన రష్యా సైన్యాలు
2022 జనవరి
►ఉద్రిక్తతలను చల్లార్చేందుకు రష్యా, నాటో మధ్య చర్చలు.
►సేనలను అప్రమత్తం చేసిన నాటో
2022 ఫిబ్రవరి
►తూర్పు ఉక్రెయిన్లోని 2 రెబెల్ ప్రాబల్య ప్రాంతాల్లోకి రష్యా సైన్యం
►రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించిన పశ్చిమ దేశాలు
►ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి దాడికి రష్యా శ్రీకారం
Comments
Please login to add a commentAdd a comment