రెండు ఖండాలను కలుపుతూ ప్రపంచానికి శాంతినీ, సుస్థిరతనూ, రక్షణనూ వాగ్దానం చేస్తూ బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో ఏర్పడిన నాటో కూటమి గురువారం తన 75 వసంతాల సంబరాలను జరుపుకొంది. అయితే ప్రకటిత సంకల్పానికీ, దశాబ్దాల దాని ఆచరణకూ ఎక్కడా పొంతన కనబడదు. నాటో నేపథ్యం, దాని ఉద్దేశాలు పూర్తిగా కొట్టిపారేయదగ్గవి కాదు. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ సైన్యాన్ని మట్టికరిపించిన సోవియెట్ యూనియన్ సేనలు తూర్పు యూరప్ దేశాల్లో తిష్ఠవేసి కదల్లేదు.
అవి తమవైపు చొచ్చుకు రావొచ్చన్న సందేహం పశ్చిమ యూరప్ దేశాలకుంది. తాము ఒక్కటై ఎదిరించకపోతే దురాక్రమణకు బలి కావటం ఖాయమన్న భయం వాటికి పట్టుకుంది. నాటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ దీన్ని చక్కగా వినియోగించుకుని ఉత్తర అమెరికా ఖండంలో తన పొరుగు దేశమైన కెనడాను కలుపుకొని పశ్చిమ యూరప్ దేశాలతో జతకట్టి పటిష్ఠమైన సైనిక కూటమి నాటోకు అంకురార్పణ చేశారు. సోవియెట్ సేనలకు వ్యతిరేకంగా దృఢమైన సైనిక కుడ్యం ఏర్పర్చటమే దీని ప్రధాన ధ్యేయం. నాటో దేశాలు రోజూ పరస్పరం సంభాషించుకుంటాయని, పరిస్థితులను సమీక్షించుకుంటూ నిరంతర సంసిద్ధ తలో వుంటాయని, తగిన నిర్ణయాలు తీసుకుంటాయని నాటో వెబ్‌సైట్ ఘనంగా చెబుతోంది.
మంచిదే. కానీ ఇన్నేళ్ల దాని ఉనికిలో ఒక్కసారైనా సోవియెట్ యూనియన్ నుంచీ లేదా దాని ప్రస్తుత రూపమైన రష్యా నుంచీ ప్రత్యక్షంగా కావొచ్చు... పరోక్షంగా కావొచ్చు ఏనాడూ సవాళ్లు ఎదురు కాలేదు. సైనిక కూటమి ఆవిర్భావం దానికదే ప్రత్యర్థిని హద్దు మీరకుండా చేసివుండొచ్చన్న వాదన కూడా కొట్టి పారేయలేం. కానీ నాటో హడావిడి గమనించాక 1955లో సోవియెట్ యూనియన్ సైతం తన ఆధ్వర్యంలోని తూర్పు యూరప్ దేశాలను కలుపుకొని వార్సా కూటమి పేరుతో మరో సైనిక కూటమి నిర్మించింది. ఇరుపక్షాలూ అణ్వాయుధాలనూ, ఇతర భారీ ఆయుధ సామగ్రిని మోహరించటంతో ప్రచ్ఛన్న యుద్ధ దశలో యూరప్ ఖండం మొత్తం నిరంతర యుద్ధ భయంతో వణికింది.
మరి ప్రపంచ శాంతి, సుస్థిరతల జాడెక్కడ? పరస్పర మోహరింపులతో నెలకొన్న ఒక రకమైన స్తబ్దతను శాంతిగా భావించటం సాధ్య మేనా? నాటో అంచనాకు తగ్గట్టు సోవియెట్ సేనలు దండయాత్రలు చేయకపోలేదు. 1956లో హంగరీ, 1968లో జెకొస్లోవేకియా, 1979లో అఫ్గానిస్తాన్ దేశాలను అవి దురాక్రమించాయి. కానీ యూరప్ ఖండంలోని తటస్థ దేశాలు ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, స్వీడన్, యుగోస్లేవియా, ఆస్ట్రియా వైపుగానీ... నాటో దేశాలవైపుగానీ చొచ్చుకొచ్చే ఆలోచన చేయలేదు. నిజానికి తాను కూడా నాటోలో చేరతానన్న సోవియెట్ యూనియన్ వినతిని 1954లో తోసిపుచ్చాకే వార్సా కూటమి ఏర్పడింది.
1989లో సోవియెట్ పతనం, అంతకుముందే తూర్పు యూరప్ దేశాలు ఒక్కొక్కటిగా దాన్నుంచి దూరం జరగటం, వార్సా కూటమి కనుమరుగవటం వంటి పరిణామాల తర్వాత వాస్తవానికి నాటో అవసరం ఎంతమాత్రం లేదు. చిత్రం ఏమంటే... సోవియెట్ పతనానికి బాటలు పరిచిన నాటి అధ్యక్షుడు గోర్బచెవ్, ఆ తర్వాతకాలంలో ప్రస్తుత రష్యా అధ్యక్షుడు పుతిన్ సైతం నాటోలో చేరటా నికి సిద్ధపడ్డారు. కానీ ఆ ప్రతిపాదనను నాటో తోసిపుచ్చింది. అంతేకాదు... ఉభయ జర్మనీల విలీ నానికి సహకరించాలంటూ పశ్చిమ యూరప్ దేశాల నేతలు గోర్బచెవ్‌ను అర్థించినప్పుడు ఆయన కొక హామీ ఇచ్చారు.
నాటోను ఒక్క అంగుళం కూడా విస్తరించబోమన్నదే ఆ హామీ సారాంశం. కానీ జరిగిందంతా అందుకు విరుద్ధం. సోవియెట్ పతనం నాటికి నాటో సభ్య దేశాలు 16 కాగా, రష్యా అభ్యంతరాలనూ బేఖాతరు చేస్తూ మరో 15 దేశాలను చేర్చుకున్నారు. ఇందులో పూర్వపు వార్సా కూటమి దేశాలున్నాయి. కనీసం తన ఇరుగు పొరుగు దేశాలకు సభ్యత్వం ఇవ్వొద్దన్న రష్యా ప్రతి పాదన సైతం బుట్టదాఖలా అయింది.
పొరుగునున్న కెనడా, మెక్సికో దేశాలకు వార్సా కూటమి సభ్యత్వం ఇస్తే అమెరికా చూస్తూ ఊరుకుంటుందా? నాటో పుట్టుకకు దారితీసిన మూలకారణమే మాయమైనప్పుడు విశాల యూరప్ భద్రత కోసం ఒక నూతన వ్యవస్థ ఏర్పాటు చేయటానికి బదులు రష్యాను ఏకాకి చేయాలన్న వ్యూహం వెనకున్న విజ్ఞతేమిటో ఆ కూటమి నేతలు చెప్పగలరా? నిజానికి నాటో చిత్తశుద్ధితో విశాల యూరప్ భద్రతపై దృష్టి సారించివుంటే పుతిన్ ఉక్రెయిన్ దురాక్రమణకు సాహసించేవారు కాదు. యూరప్ ఖండంలో అణ్వాయుధాల బెడద పూర్తిగా సమసిపోయేది.
అసలు ప్రపంచ శాంతి, సుస్థిరతలకు దోహదం కలగటం మాట అటుంచి నాటో వల్ల ప్రపంచానికి వచ్చిన సమస్యలే అధికం. ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకూ 200 సైనిక ఘర్షణలు చోటు చేసుకోగా అందులో 20 వరకూ విస్తృతమైనవి. వెళ్లినచోటల్లా విధ్వంసమే తప్ప నాటో సాధించిందేమీ లేదు. ఇందుకు లిబియా, సిరియా, అఫ్గానిస్తాన్, సూడాన్, సోమాలియా వగైరాలను ఉదా హరించవచ్చు.
స్థానిక ప్రభుత్వాలను కూలదోసేందుకు విచ్చలవిడిగా మిలిటెంట్ సంస్థలకు నాటో ఆయుధాలందించటం పర్యవసానంగా ఐసిస్ అనే భయంకర ఉగ్రవాద సంస్థ పురుడుపోసుకుంది. కనిపించని శత్రువుపై కత్తి ఝుళిపించటం కోసం నాటో సభ్యదేశాల్లో ప్రతి ఒక్కటీ తమ జీడీపీల్లో 2 శాతం నాటోకు అర్పిస్తున్నాయి. తన ఉనికి కోసం శత్రువును ‘సృష్టించుకునే’ ధోరణి నుంచి నాటో బయటపడనంతకాలం ఈ పరిస్థితి మారదు. ప్రపంచంలో శాశ్వత శాంతి కోసం ప్రయత్నించ టమా... నిరంతరం యుద్ధ భయంతో అణ్వాయుధాల నీడలో మనుగడ సాగించటమా అన్నది యూరప్ దేశాల ప్రజలే తేల్చుకోవాలి.
వృద్ధ జంబూకం ‘నాటో’
Published Fri, Apr 5 2024 12:31 AM | Last Updated on Fri, Apr 5 2024 12:31 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment