world war II
-
క్వీన్ ఎలిజబెత్ II వెడ్డింగ్ గౌను.. వెరీ ఇంట్రెస్టింగ్!
బ్రిటన్ దివంగత రాణి క్వీన్ ఎలిజబెత్ II పెళ్లి నాటి గౌను వెనుక చాల పెద్ద కథ ఉంది. ఆమె 1947 నవంబర్ 20న ప్రిన్స్ ఫిలిప్‌ని వివాహం చేసుకున్నారు. అయితే సరిగ్గా అదే సమయంలో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతోంది. దీంతో బ్రిటన్ దేశం ప్రజలు పొదుపు పాటించేలా గట్టి చర్యలు తీసుకుంది. అంటే ఆ సమయంలో ఎలాంటి ఫంక్షన్లకు విలాసవతంగా డబ్బులు ఖర్చుపెట్టడానికి వీల్లేకుండా ఆంక్షలు విధించింది. ఇది బ్రిటన్ రాజ వంశానికి కూడా వర్తిస్తుందట. ఎందుకుంటే యథా రాజా తథా ప్రజాః అన్న ఆర్యోక్తి రీత్యా బ్రిటన్ రాజవంశానికి కూడా పొదుపు పాటించక తప్పలేదు. దీంతో అదే టైంలో రాణి ఎలిజబెత్ II వివాహం జరగనుండటంతో ఆమె దుస్తుల ఖర్చుల కోసం ఆ రాజవంశం ఎలా పొదుపు పాటించిందో వింటే ఆశ్చర్యపోతారు.దివంగత క్వీన్ ఎలిజబెత్ II వివాహం వెస్ట్మిన్స్టర్ అబ్బేలో ఘనంగా జరిగింది. రాణి వివాహ గౌనులో అత్యద్భుతంగా కనిపించింది. అక్కడకు విచ్చేసిన అతిధులందరి చూపులను ఆకర్షించింది. ఆమె గౌనుని బ్రిటన్ రాజ వంశానికి చెందిన ప్రముఖ ప్యాషన్ డిజైనర్ డచెస్ శాటిన్ రూపొందించారు. దీన్ని చక్కటి పూలు, ముత్యాలతో అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు. అతని డిజైన్‌కి అనుగుణంగా వివాహ వెడ్డింగ్ హాలు పెయింటింగ్‌ను కూడా తీర్చిదిద్దారు. ఆ గౌనుపై దాదాపు 10 వేలకు పైగా ముత్యాలను వినియోగించారు. సుమారు 14 అడుగుల పొడవుతో ఎంబ్రాడరీ డిజైన్‌తో తీర్చిదిద్దారు. అయితే ఈ డిజైనన్ని పెళ్లికి మూడు నెలల ముందుగా ఆమోదించింది రాజకుటుంబం. అందువల్ల ఆ డిజైన్‌కి అనుగుణంగా వెడ్డింగ్ డెకరేషన్‌ని ఏర్పాటు చేశారు. దీని ధర వచ్చేసి ఆ రోజుల్లే దాదపు రూ. 25 లక్షల ధర పైనే పలికిందట. అయితే రెండో ప్రపంచ యుద్ధం దృష్ట్యా పొదుపుకి పెద్ద పీట వేస్తూ బ్రిటన్ దేశం ఇచ్చిన రేషన్ కూపన్లను వినియోగించుకుని విలాసవంతంగా డబ్బులు వెచ్చించకుండా జాగ్రత్త పడిందట రాజ కుటుంబం. యుధ్దం కారణంగా బ్రిటన్ ప్రభుత్వం పొదుపు చర్యల్లో భాగంగా ఆహారం, బట్టలు, సబ్బులు వంటి కొన్ని వాటిని రేషన్ చేసింది. దీంతో రాజకుటుంబం ఆ రేషన్‌ని ఉపయోగించుకునే మన రాణి ఎలిబబెత్ పెళ్లి గౌనుని కొనుగోలు చేసిందట. తాము రాజవంశస్తులమనే దర్పం చూపక పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించి అందరి అభిమానాన్ని సొంతం చేసుకుంది బ్రిటన్ రాజ కుటుంబం. (చదవండి: ఐపీఎల్ ఆటగాళ్ల ‘వేలం'లో మెరిసిన ఆ చిన్నది ఎవరు?) -
85 ఏళ్ల తర్వాత ఎయిర్‌పోర్ట్‌లో పేలిన బాంబు.. 87 విమానాల రద్దు
టోక్యో: జపాన్ రెండో ప్రపంచ యుద్ధ బాంబులు తాజాగా కలకలం రేపుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా.. జపాన్‌లో బాంబులను జారవిడించింది. అయితే ఆ బాంబులు జపాన్‌లో ఎక్కడో చోట పేలుతూనే ఉన్నాయి.తాజాగా అక్టోబర్ 2న సౌత్‌వెస్ట్ జపాన్‌లోని మియాజాకి విమానాశ్రయం రన్‌వే పై ఓ బాంబు పేలింది. దీంతో బాంబు పేలిన ప్రదేశంలో ఏడు మీటర్ల వెడల్పు, ఒక మీటరు లోతు భూమి ధ్వంసమైంది. బాంబు విస్పోటనంతో సమాచారం అందుకున్న ఎయిర్ పోర్ట్ అధికారులు రన్‌వేని షట్‌డౌన్ చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.బాంబు విస్పోటనం అయ్యే సమయంలో రన్‌వేపై సుమారు 87కి పైగా విమానాలు ఉన్నాయి. అయినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని వెలుగులోకి వచ్చిన మీడియా కథనాలు హైలెట్ చేస్తున్నాయి. ఎయిర్పోర్ట్ రన్‌వే మీద బాంబు పడిన ప్రదేశాన్ని పునర్నిర్మిస్తామని, ఆ పనులు గురువారం నాటికి పూర్తి చేస్తామని జపాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి యోషిమాస హయాషి తెలిపారు.విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయంమియాజాకి విమానాశ్రయంపై బాంబు విస్పోటనంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎయిర్పోర్ట్ నుంచి జపాన్ నగరాలైన టోక్యో,ఒసాకా,ఫుకుయోకాతో పాటు ఇతర ప్రాంతాలకు రాకపోకలు నిర్వహించే ప్రముఖ ఎయిర్ లైన్ దిగ్గజం జపాన్ ఎయిర్‌లైన్స్ (జేఏఎల్), ఆల్ నిప్పాన్ ఎయిర్‌లైన్స్ (ఏఎన్ఏ)తో పాటు ఇతర విమానాయాన సంస్థలు సర్వీసుల్ని రద్దు చేసుకున్నట్లు సమాచారం.85ఏళ్ల క్రితం యుద్ధంరెండో ప్రపంచం యుద్ధం జరిగింది 85ఏళ్ల అవుతుంది. అయినప్పటికీ యుద్ధ సమయంలో జపాన్‌పై అమెరికా ప్రయోగించిన బాంబులు నిత్యం ఎక్కడ ఒక చోట పేలుతూనే ఉన్నాయి. కేంద్ర రవాణ శాఖ అధికారిక లెక్కల ప్రకారం.. గతేడాది మియాజాకి విమానాశ్రయంలో 37.5 టన్నుల బరువైన 2,348 బాంబులను జపాన్ డిఫెన్స్ ఫోర్స్ నిర్విర్యం చేసింది. -
రెండో ప్రపంచయుద్ధవీరుడికి ఘనంగా పుట్టినరోజు వేడుకలు
రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొన్న సైనికుడు, ప్రతిష్టాత్మక ‘బర్మా స్టార్ అవార్డ్’ గ్రహీత రిటైర్డ్ లాన్స్ నాయక్ చరణ్ సింగ్ 100వ పుట్టినరోజు వేడుకలను భారత సైన్యం ఘనంగా నిర్వహించింది. శనివారం హిమాచల్ ప్రదేశ్‌లోని స్వగృహంలో ఆయనతో కేక్ కట్చేయించి జన్మదిన వేడుకలను ఆరంభించారు. ఆర్మీ తరఫున సైతం బ్రిగేడియర్ అధికారి, సైనికులు పాల్గొనడంతో కార్యక్రమం సందడిగా మారింది. 1924 సెపె్టంబర్ ఏడో తేదీన జన్మించిన చరణ్‌సింగ్ 1942 ఆగస్ట్ 26వ తేదీన భారత్‌లో బ్రిటిష్ సైన్యం ఫిరోజ్పూŠ కంటోన్మెంట్ యూనిట్లో చేరారు. రెండో ప్రపంచయుద్ధంలో వీరోచితంగా పోరాడారు. సింగపూర్ నుంచి లాహోర్ దాకా పలు దేశాల్లో యుద్ధక్షేత్రాల్లో తన ధైర్యసాహసాలను ప్రదర్శించారు. తర్వాత హిమాచల్‌ప్రదేశ్‌లోని యోల్ కంటోన్మెంట్‌లోనూ పనిచేశారు. ‘‘ 17 ఏళ్లపాటు సైన్యంలో చూపిన ప్రతిభకు బర్మా స్టార్ అవార్డ్‌ను, ఇండియన్ ఇండిపెండెన్స్ మెడల్‌ను ఆయన పొందారు. 1959 మే 17న పదవీవిరమణ చేశారు. తర్వాత ప్రస్తుతం తన శేషజీవితాన్ని రోపార్ జిల్లాలోని దేక్వాలా గ్రామంలో గడుపుతున్నారు. ఆయనకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. సొంతింట్లో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో బ్రిగేడియన్ అధికారి, సైనికులు పాల్గొన్నారు. దేశసేవలో తరించిన మాజీ సైనికులను గుర్తుపెట్టుకుని వారిని తగు సందర్భంలో గౌరవిస్తూ భారతసైన్యం పలు కార్యక్రమాలు చేస్తున్న విషయం విదితమే. ఇందులోభాగంగానే శనివారం చరణ్‌సింగ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించినట్లు సైన్యాధికారి ఒకరు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘ దశాబ్దాల క్రితం సైన్యంలో పనిచేసినా సరే ఆర్మీ దృష్టిలో అతను ఎప్పటికీ సైనికుడే. సైన్యంలో భాగమే. సైన్యానికి, పౌరులకు స్ఫూర్తిప్రదాతలుగా వారిని సదా స్మరించుకోవాలి. వారి నుంచి నేటి సైనికులు ఎంతో నేర్చుకోవాలి’ అని సైన్యం పేర్కొంది. – న్యూఢిల్లీ -
కొలెస్ట్రాల్ కంట్రోల్‌తో సెంచరీ కొట్టేశాడు! ఎలాగంటే..
గోర్డాన్ గ్రెన్లే హంట్ అనే వ్యక్తి 104వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. అతనికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఈ ఏజ్‌లో కూడా తన పనులు తాను చేసుకుంటాడు. అతను రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి వ్యక్తి. ఆ టైంలో ఆక్స్‌ఫర్డ్‌లోని కార్ల తయారీ సంస్థ బ్రిటిష్ లైలాండ్ రాయల్ ఎలక్ట్రిక్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్‌లో పనిచేసేవాడు. అతనికి విపరీతమైన ఆకలి ఉందని, అయినా సమతుల్యమైన ఆహారం తీసుకుని జిహ్వ చాపల్యాన్ని అదుపులో ఉంచుకుంటానని చెబుతున్నాడు. ప్రతిరోజు తాను ఇంట్లో చేసిన అల్పహారాన్నే తీసుకుంటానని చెబుతున్నాడు. ఎక్కువ ఫ్రూట్ సలాడ్ తీసుకుంటానని, తరుచుగా సాల్మన్ చేపలు, చిప్స్ తీసుకుంటానని అన్నారు. అంతేగాదు అతడి శరీరంలో కొలస్ట్రాల్ స్థాయిలు కూడా నార్మల్‌గానే ఉన్నాయి. అతడి రెండో భార్య 2019లో మరణించడంతో డోర్సెట్‌లోని లార్క్సెలీస్ రెంట్ హోమ్‌లో నివశిస్తున్నాడు. తన తండ్రి దీర్ఘాయువుకి తిండిపై ఉన్న ఇష్టం, శ్రద్ధేనని కొడుకు ఫిలిప్స్ చెబుతున్నాడు.తన తండ్రి గుర్రం మాదిరిగా వేగంగా తింటాడు, డైట్ దగ్గరక వచ్చేటప్పటికీ చాలా స్ట్రిట్‌గా ఉంటాడని అన్నారు. అతను తన వయసు గురించి చాలా గర్వంగా ఫీలవ్వుతుంటాడని చెబుతున్నాడు. ఆ వృద్ధుడి సుదీర్ఘ జీవితానికి కొలస్ట్రాల్ స్థాయిలు ఎలా తోడ్పడయ్యన్నది సవివరంగా చూద్దాం.కొలస్ట్రాల్ స్థాయిలు జీవితకాలాన్ని ఎలా ప్రభావితం చేస్తాయంటే..కొలస్ట్రాల స్థాయిని అదుపులో ఉంచుకోవడం వల్ల సుదీర్ఘకాలం ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. అధిక కొలస్ట్రాల్ స్థాయిలు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. అంతేగాదు పరిశోధనల్లో వారానికి రెండు భాగాలు సాల్మాన్ చేపలు తీసుకోవడం వల్ల అధిక కొలస్ట్రాల్‌ను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. సాల్మన్ చాలా పోషకాలను కలిగి ఉన్న ఆహారాల్లో ఒకటి. ప్రతి వంద గ్రాముల సాల్మన్లో 25 గ్రాముల ప్రోటీన్, 11 గ్రాముల కొవ్వు, ఒమేగా 3 ప్యాటీ యాసిడ్, విటమిన్ బీ12, సెలీనియం, నియాసిన్, పాంతోతేనిక్ ఆమ్లం, థియామిన్, ఫోలిక్ యాసిడ్, పోటాషియం, ఫాస్ఫరస్ తదితరాలు ఉంటాయి. అలాగే శాకాహారులకు కొలస్ట్రాల్‌ని అదుపులో ఉంచుకునేందుకు తీసుకోవాల్సినవి..నట్స్: బాదం, వాల్నట్ వంటి కొన్ని గింజలలో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్, ప్లాంట్ స్టెరాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.అవకాడోలు: మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు సమృద్ధిగా ఉన్న అవకాడోలు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.చిక్కుళ్ళు: బీన్స్, కాయధాన్యాలు, చిక్పీస్ వంటి కొన్ని చిక్కుళ్ళు దానిలోని ఫైబర్లు కొలస్ట్రాల్‌ని కరిగించి జీర్ణవ్యవస్థను మెరుగ్గా ఉంచుతాయి.(చదవండి: ఆ వ్యాధులకు తప్పుదారి పట్టించే ఆ ఫుడ్ ప్రకటనలే కారణం!) -
బతుకు చితికి.. గూడు చెదిరి... వలస బాట
పుట్టిన నేల.. పెరిగిన ఊరు.. ఇవే మనిషి అస్తిత్వం. కానీ యుద్ధం, హింస ప్రజలను నిరాశ్రయులను చేస్తోంది. అధికార దాహం, అహంకార ధోరణి కోట్ల మందిని సొంత నేలకే పరాయివాళ్లుగా మారుస్తోంది. గత పదేళ్లలో ప్రపంచ జనాభాలో ప్రతి 69 మందిలో ఒకరు చొప్పున ఏకంగా 12 కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. వీరిలో చాలామంది తలదాచుకునేందుకు కూడా దిక్కులేక శరణార్థులుగా మారాల్సి వస్తోంది. ప్రాణాలను చేతబట్టుకుని విదేశాల బాట పట్టాల్సిన దుస్థితి దాపురిస్తోంది...! – సాక్షి, నేషనల్ డెస్క్సంఘర్షణ, హింస, మానవ హక్కుల ఉల్లంఘనల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 11.7 కోట్ల మందికి పైగా నిరాశ్రయులైనట్టు ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషన్ (యూఎన్‌హెచ్‌సీఆర్) వెల్లడించింది. వీరిలో 6.83 కోట్ల మంది సంఘర్షణలు, ఇతర సంక్షోభాల కారణంగా సొంత దేశాల్లోనే ఇతర ప్రాంతాలకు చెదిరిపోయారు. దాదాపు 4.5 కోట్ల మంది పొట్ట చేత పట్టుకుని శరణార్థులుగా విదేశాలకు వలస వెళ్లారు. 2024 తొలి నాలుగు నెలల్లో ఇది మరింత పెరిగింది.పదేళ్లకోసారి రెట్టింపు.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1951లో ఐరోపాలోని శరణార్థుల హక్కులను పరిరక్షించేందుకు ఐక్యరాజ్యసమితి శరణార్థుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. 1967లో శరణార్థుల కన్వెన్షన్ ఆవిర్భవించినప్పుడు 20 లక్షల మంది శరణార్థులున్నారు. ⇒ 1980 నాటికి కోటికి చేరిన శరణార్థులు ⇒ 1990 నాటికి రెండు కోట్లకు చేరిన సంఖ్య⇒ 2021 చివరి నాటికి 3 కోట్లను మించిన శరణార్థులు⇒ తాజాగా 11 కోట్లు దాటేసిన వైనం2020 నుంచి వేగంగా...⇒ 2022లో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక 2023 చివరి నాటికి 60 లక్షల మంది ఉక్రేనియన్లు నిరాశ్రయులయ్యారు. వీరిలో చాలామంది దేశం విడిచి వెళ్లారు. ⇒ 2023లో సుడాన్లో సైన్యం, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య ఘర్షణలు శరణార్థుల సంఖ్యను 10.5 లక్షలు పెంచాయి. ⇒ ఇక ఇజ్రాయెల్ దాడులతో గాజాలో గతేడాది చివరి మూడు నెలల్లో 10.7 లక్షల మంది నిరాశ్రయులై వలస వెళ్లారు.ఎక్కడి నుంచి వస్తున్నారు?⇒ ప్రపంచవ్యాప్తంగా నమోదైన దాదాపు 4.5 కోట్ల మంది శరణార్థులలో దాదాపు మూడొంతులు (72 శాతం) ఐదు దేశాల నుంచే వచ్చారు.అఫ్గానిస్తాన్ 64 లక్షలు సిరియా 64 లక్షలు వెనెజులా 61 లక్షలు ఉక్రెయిన్ 60 లక్షలు పాలస్తీనా 60 లక్షలుఆశ్రయమిస్తున్న దేశాలు?⇒ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 శాతం మంది శరణార్థులు తమ స మీప పొరుగు దేశాల్లోనే బతుకీడుస్తున్నారు. ⇒ ఇరాన్, పాకిస్తాన్‌లోని శరణార్థులందరూ అఫ్గాన్లే. ⇒ టర్కీలో ఎక్కువ మంది శరణార్థులు సిరియన్లు.దేశం శరణార్థులు ఇరాన్ 38 లక్షలు తుర్కియే 33 లక్షలు కొలంబియా 29 లక్షలు జర్మనీ 26 లక్షలు పాకిస్తాన్ 20 లక్షలు -
వృద్ధ జంబూకం ‘నాటో’
రెండు ఖండాలను కలుపుతూ ప్రపంచానికి శాంతినీ, సుస్థిరతనూ, రక్షణనూ వాగ్దానం చేస్తూ బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో ఏర్పడిన నాటో కూటమి గురువారం తన 75 వసంతాల సంబరాలను జరుపుకొంది. అయితే ప్రకటిత సంకల్పానికీ, దశాబ్దాల దాని ఆచరణకూ ఎక్కడా పొంతన కనబడదు. నాటో నేపథ్యం, దాని ఉద్దేశాలు పూర్తిగా కొట్టిపారేయదగ్గవి కాదు. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ సైన్యాన్ని మట్టికరిపించిన సోవియెట్ యూనియన్ సేనలు తూర్పు యూరప్ దేశాల్లో తిష్ఠవేసి కదల్లేదు. అవి తమవైపు చొచ్చుకు రావొచ్చన్న సందేహం పశ్చిమ యూరప్ దేశాలకుంది. తాము ఒక్కటై ఎదిరించకపోతే దురాక్రమణకు బలి కావటం ఖాయమన్న భయం వాటికి పట్టుకుంది. నాటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ దీన్ని చక్కగా వినియోగించుకుని ఉత్తర అమెరికా ఖండంలో తన పొరుగు దేశమైన కెనడాను కలుపుకొని పశ్చిమ యూరప్ దేశాలతో జతకట్టి పటిష్ఠమైన సైనిక కూటమి నాటోకు అంకురార్పణ చేశారు. సోవియెట్ సేనలకు వ్యతిరేకంగా దృఢమైన సైనిక కుడ్యం ఏర్పర్చటమే దీని ప్రధాన ధ్యేయం. నాటో దేశాలు రోజూ పరస్పరం సంభాషించుకుంటాయని, పరిస్థితులను సమీక్షించుకుంటూ నిరంతర సంసిద్ధ తలో వుంటాయని, తగిన నిర్ణయాలు తీసుకుంటాయని నాటో వెబ్సైట్ ఘనంగా చెబుతోంది. మంచిదే. కానీ ఇన్నేళ్ల దాని ఉనికిలో ఒక్కసారైనా సోవియెట్ యూనియన్ నుంచీ లేదా దాని ప్రస్తుత రూపమైన రష్యా నుంచీ ప్రత్యక్షంగా కావొచ్చు... పరోక్షంగా కావొచ్చు ఏనాడూ సవాళ్లు ఎదురు కాలేదు. సైనిక కూటమి ఆవిర్భావం దానికదే ప్రత్యర్థిని హద్దు మీరకుండా చేసివుండొచ్చన్న వాదన కూడా కొట్టి పారేయలేం. కానీ నాటో హడావిడి గమనించాక 1955లో సోవియెట్ యూనియన్ సైతం తన ఆధ్వర్యంలోని తూర్పు యూరప్ దేశాలను కలుపుకొని వార్సా కూటమి పేరుతో మరో సైనిక కూటమి నిర్మించింది. ఇరుపక్షాలూ అణ్వాయుధాలనూ, ఇతర భారీ ఆయుధ సామగ్రిని మోహరించటంతో ప్రచ్ఛన్న యుద్ధ దశలో యూరప్ ఖండం మొత్తం నిరంతర యుద్ధ భయంతో వణికింది. మరి ప్రపంచ శాంతి, సుస్థిరతల జాడెక్కడ? పరస్పర మోహరింపులతో నెలకొన్న ఒక రకమైన స్తబ్దతను శాంతిగా భావించటం సాధ్య మేనా? నాటో అంచనాకు తగ్గట్టు సోవియెట్ సేనలు దండయాత్రలు చేయకపోలేదు. 1956లో హంగరీ, 1968లో జెకొస్లోవేకియా, 1979లో అఫ్గానిస్తాన్ దేశాలను అవి దురాక్రమించాయి. కానీ యూరప్ ఖండంలోని తటస్థ దేశాలు ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, స్వీడన్, యుగోస్లేవియా, ఆస్ట్రియా వైపుగానీ... నాటో దేశాలవైపుగానీ చొచ్చుకొచ్చే ఆలోచన చేయలేదు. నిజానికి తాను కూడా నాటోలో చేరతానన్న సోవియెట్ యూనియన్ వినతిని 1954లో తోసిపుచ్చాకే వార్సా కూటమి ఏర్పడింది. 1989లో సోవియెట్ పతనం, అంతకుముందే తూర్పు యూరప్ దేశాలు ఒక్కొక్కటిగా దాన్నుంచి దూరం జరగటం, వార్సా కూటమి కనుమరుగవటం వంటి పరిణామాల తర్వాత వాస్తవానికి నాటో అవసరం ఎంతమాత్రం లేదు. చిత్రం ఏమంటే... సోవియెట్ పతనానికి బాటలు పరిచిన నాటి అధ్యక్షుడు గోర్బచెవ్, ఆ తర్వాతకాలంలో ప్రస్తుత రష్యా అధ్యక్షుడు పుతిన్ సైతం నాటోలో చేరటా నికి సిద్ధపడ్డారు. కానీ ఆ ప్రతిపాదనను నాటో తోసిపుచ్చింది. అంతేకాదు... ఉభయ జర్మనీల విలీ నానికి సహకరించాలంటూ పశ్చిమ యూరప్ దేశాల నేతలు గోర్బచెవ్‌ను అర్థించినప్పుడు ఆయన కొక హామీ ఇచ్చారు. నాటోను ఒక్క అంగుళం కూడా విస్తరించబోమన్నదే ఆ హామీ సారాంశం. కానీ జరిగిందంతా అందుకు విరుద్ధం. సోవియెట్ పతనం నాటికి నాటో సభ్య దేశాలు 16 కాగా, రష్యా అభ్యంతరాలనూ బేఖాతరు చేస్తూ మరో 15 దేశాలను చేర్చుకున్నారు. ఇందులో పూర్వపు వార్సా కూటమి దేశాలున్నాయి. కనీసం తన ఇరుగు పొరుగు దేశాలకు సభ్యత్వం ఇవ్వొద్దన్న రష్యా ప్రతి పాదన సైతం బుట్టదాఖలా అయింది. పొరుగునున్న కెనడా, మెక్సికో దేశాలకు వార్సా కూటమి సభ్యత్వం ఇస్తే అమెరికా చూస్తూ ఊరుకుంటుందా? నాటో పుట్టుకకు దారితీసిన మూలకారణమే మాయమైనప్పుడు విశాల యూరప్ భద్రత కోసం ఒక నూతన వ్యవస్థ ఏర్పాటు చేయటానికి బదులు రష్యాను ఏకాకి చేయాలన్న వ్యూహం వెనకున్న విజ్ఞతేమిటో ఆ కూటమి నేతలు చెప్పగలరా? నిజానికి నాటో చిత్తశుద్ధితో విశాల యూరప్ భద్రతపై దృష్టి సారించివుంటే పుతిన్ ఉక్రెయిన్ దురాక్రమణకు సాహసించేవారు కాదు. యూరప్ ఖండంలో అణ్వాయుధాల బెడద పూర్తిగా సమసిపోయేది. అసలు ప్రపంచ శాంతి, సుస్థిరతలకు దోహదం కలగటం మాట అటుంచి నాటో వల్ల ప్రపంచానికి వచ్చిన సమస్యలే అధికం. ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకూ 200 సైనిక ఘర్షణలు చోటు చేసుకోగా అందులో 20 వరకూ విస్తృతమైనవి. వెళ్లినచోటల్లా విధ్వంసమే తప్ప నాటో సాధించిందేమీ లేదు. ఇందుకు లిబియా, సిరియా, అఫ్గానిస్తాన్, సూడాన్, సోమాలియా వగైరాలను ఉదా హరించవచ్చు. స్థానిక ప్రభుత్వాలను కూలదోసేందుకు విచ్చలవిడిగా మిలిటెంట్ సంస్థలకు నాటో ఆయుధాలందించటం పర్యవసానంగా ఐసిస్ అనే భయంకర ఉగ్రవాద సంస్థ పురుడుపోసుకుంది. కనిపించని శత్రువుపై కత్తి ఝుళిపించటం కోసం నాటో సభ్యదేశాల్లో ప్రతి ఒక్కటీ తమ జీడీపీల్లో 2 శాతం నాటోకు అర్పిస్తున్నాయి. తన ఉనికి కోసం శత్రువును ‘సృష్టించుకునే’ ధోరణి నుంచి నాటో బయటపడనంతకాలం ఈ పరిస్థితి మారదు. ప్రపంచంలో శాశ్వత శాంతి కోసం ప్రయత్నించ టమా... నిరంతరం యుద్ధ భయంతో అణ్వాయుధాల నీడలో మనుగడ సాగించటమా అన్నది యూరప్ దేశాల ప్రజలే తేల్చుకోవాలి. -
రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న 'సుబేదార్ థాన్సేయా' మృతి
న్యూఢిల్లీ: రెండవ ప్రపంచ యుద్ధంలో వీరోచితంగా పోరాడిన సైనికులలో 'సుబేదార్ థాన్సేయా' ఒకరు. మిజోరంకు చెందిన మాజీ సైనికుడు థాన్సేయా 102 సంవత్సరాల వయస్సులో మరణించినట్లు అధికారులు సోమవారం తెలిపారు. యుద్ధంలో అనుభవజ్ఞుడైన సుబేదార్ థాన్సేయా బలీయమైన అసమానతలకు వ్యతిరేకంగా వ్యతిరేకంగా జరిగిన కొహిమా యుద్ధంలో ప్రదర్శించిన అతని తెగువ.. మిత్రరాజ్యా దళాల విజయానికి కీలక పాత్ర పోషించారు. భారత ఆర్మీ చరిత్రలో విజయ చిహ్నంగా ఆయన మిలిగిపోతారని సీనియర్ ఆర్మీ అధికారి అన్నారు. సుబేదార్ థాన్సేయా పదవీ విరమణ పొందిన తర్వాత.. కూడా సమాజం, దేశం పట్ల అమితమైన అంకిత భావాన్ని ప్రదర్శించారు. తన అనుభవాలను తెలియజేయడంతోపాటు, విద్య, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఆయన చురుకుగా పాల్గొంటూ.. యువ తరాలలో దేశభక్తి పెంపొందించారని అధికారులు వెల్లడించింది. సుబేదార్ థాన్సేయాకు నివాళులర్పించదానికి ఆర్మీ మాత్రమే కాకుండా ఆయనను అభిమానించే చాలామంది తరలి వచ్చారు. మన దేశానికి ఆయన చేసిన కృషి, రెండవ ప్రపంచ యుద్ధంలో అతని పాత్ర అనన్య సామాన్యమని పలువురు కొనియాడారు. -
ఊహకు అందని ఉక్కిరిబిక్కిరి
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ‘జరగని’ ఒక ఘటన ఆనాటి బ్రిటిష్ ఆధిపత్యంలోని భారత సామ్రాజ్యాన్ని వణికించింది. మద్రాస్‌కు అభిముఖంగా ఉన్న పశ్చిమ దిశ ప్రాంతమంతటా భయభ్రాంతులు వ్యాపించాయి. సింగపూర్‌ను లొంగదీసుకున్న జపాన్‌కు తర్వాతి లక్ష్యం ఈ ప్రాంతమే అనుకోవ డమే దీనికి కారణం. దాంతో నగరంలోని 8 లక్షల మందిలో 7 లక్షలమంది కట్టుబట్టలతో పారిపోయారు. మద్రాసు జూ లోని సింహాలు, పులులు, నల్ల చిరుతలు, ఎలుగుబంట్లు, విషసర్పాలను కాల్చి చంపారు... బాంబులు పడితే అవి ఆ గందరగోళంలో జనాల మీద పడకుండా! ఆ యుద్ధానికి అవి మూల్యం చెల్లించాయి. ఊహాత్మకమైన దండయాత్ర ముప్పునకే ఆనాటి ప్రభుత్వం అంతగా ప్రభావితం అయిందా? అవునని ఒప్పుకోక తప్పదు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసి ఎనభై ఏళ్లు అయినప్పటికీ, ఆ యుద్ధం గురించి మనకు తెలియనిది ఏముంటుందని చాలామంది అనుకుంటారు. అది తప్పు అని ముకుంద్ పద్మనాభన్ రుజువు చేశారు. అసలేనాడూ సంభవించకనే, నిజంగానే సంభవించిందన్నంతగా ఒక అసంబద్ధ మైన కలవరానికి గురిచేసిన ఒకానొక ఘటనపై తాజాగా ఆయన పుస్తకం రాశారు. దాని పేరు: ‘ద గ్రేట్ ఫ్లా్యప్ ఆఫ్ 1942: హౌ ద రాజ్ ప్యానిక్డ్ ఓవర్ ఎ జపనీస్ నాన్–ఇన్వేషన్’. 1942 ఫిబ్రవరిలో సింగపూర్ పతనానంతరం... అప్పటికింకా బ్రిటిష్ ఆధిపత్యంలోనే ఉన్న భారత సామ్రాజ్యానికి–మరీ ముఖ్యంగా మద్రాస్‌కు అభిముఖంగా ఉన్న పశ్చిమ దిశ ప్రాంతమంతటా భయ భ్రాంతులు వ్యాపించాయి. మలయా ద్వీపకల్పానికి మద్రాసు దగ్గరగా ఉండటమన్నది... సింగపూర్ తర్వాత జపాన్ తదుపరి దాడి ఇక మద్రాసు మీదనేనన్న సూచనప్రాయతకు తావిచ్చింది. అసలక్కడేమీ లేకుండానే, ఊరికే ఊహించుకుని భయపడ్డామని ప్రత్యేకించి మీరు గుర్తు చేసుకున్నప్పుడు ఆ భయాందోళన స్థాయి మరింతదైన గొప్ప దిగ్భ్రమను కలిగిస్తుంది. సింగపూర్ పతనం అయ్యే సమయానికి మద్రాసులోని మూడింట ఒక వంతు జనాభా ప్రాణ భయంతో తట్టాబుట్టా వదిలి పారిపోయింది. ఆరు వారాల తర్వాత నగర జనాభా కేవలం 25 శాతమే మిగిలి ఉందని ‘ది ఇండియన్ ఎక్స్ ప్రెస్’ రాసింది. పాల్ జయరాజన్ అనే ఐసీఎస్ అధికారి అంచనా ప్రకారమైతే మద్రాస్ జనాభా 13 శాతానికి తగ్గిపోయింది. దానర్థం 8 లక్షల మందిలో 7 లక్షలమంది కట్టుబట్టలతో నగరాన్ని వదిలి వెళ్లారని! ‘ఈ లెక్క నమ్మశక్యమైనదిగా కనిపించకున్నా, నమ్మశక్యం కానిది గానూ అనిపించడం లేదు’ అని ముకుంద్ పద్మనాభన్ వ్యాఖ్యానించారు. పుస్తకంలో ఆహ్లాదం కలిగించే కథలు చెప్పుకోదగినన్ని ఉన్నప్ప టికీ, వాటిల్లో ఒక్కటి కూడా మద్రాసులో జరిగిన దానిని మించి అద్భు తమైనదేమీ కాదు. ‘‘సింహాలు, పులులు, నల్ల చిరుతలు, ఎలుగుబంట్లు, విషసర్పాలను వెతికి మరీ కాల్చి చంపారు. జపాన్ విసిరే బాంబులు కనుక జంతు ప్రదర్శన శాలలను, వాటì కదలికలను నియంత్రించి ఉంచిన ఆవరణలను (ఎన్క్లోజర్లు) ధ్వంసం చేసినప్పుడు, వాటి నుంచి క్రూర జంతువులు స్వేచ్ఛగా బయటికి ఉరికి, మనుషుల మీద పడకుండా నివారించటానికి ముందస్తుగానే వాటిని చంపేయాలన్న ఆదేశాలు అమలు అయ్యాయి.’’ చూస్తుంటే ఆనాటి జరగని ఘటనకు అత్యధిక మూల్యం చెల్లించుకున్నది జంతువులే అనిపిస్తోంది. నిజంగా ఇటువంటిదే లండన్‌లో జరిగింది. ‘‘1939 సెప్టెంబర్ ఆరంభంలో, యుద్ధం మొదలైన మొదటి వారం... విస్తుగొల్పేటంతటి స్థాయిలో 4 లక్షల నుంచి 7 లక్షల 50 వేల దాకా పిల్లులు, శునకాలను చంపేశారని అంచనా.’’ అంటే, బ్రిటిష్ ప్రజలు తమ పెంపుడు జీవు లను త్యాగం చేయటానికి కూడా సంకోచించనంతగా ప్రేమిస్తారు! మద్రాసు గవర్నరు పారిపోయి ఉండకపోవచ్చు. కానీ మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు చేసింది కచ్చితంగా పారిపోవటమే! సర్ సిడ్నీ వాడ్స్‌వర్త్ ‘‘రెండు కార్లలో తన సతీమణి, డ్రైవరు, బట్లరు, కుక్, మూడు పెంపుడు శునకాలతో అనంతపురం బయలుదేరారు. తమ వాహనాల పైభాగాన పరుపులను కట్టి, వాటిల్లో పింగాణీపాత్రలు, గిన్నెలు, బట్టలు, న్యాయశాస్త్ర గ్రంథాలు, వెండి దీపాల వంటి అవస రమైన, విలువైన సామగ్రిని కుక్కేశారు’’. తిరిగి రెండు వారాల తర్వాత ఆయన వెనక్కు వచ్చారు. ఒక మంచి ఉల్లాసభరితమైన సెలవు సమయాన్ని గడిపాక! ఐ.సి.ఎస్. అధికారులు మద్రాసును విడిచిపెట్టి పోలేదు. బదు లుగా వారు జపాన్ సేనలకు చుక్కయినా దక్కకుండా ఉండేందుకు ‘గొప్ప’ మార్గాలనే కనిపెట్టారు. చెట్టినాడు రాజా సాహచర్యంలో పాల్ జయరాజన్ మద్రాస్ క్లబ్బుల్లో పీకల దాకా మద్యం సేవించారు. తర్వాత, వారంతా కలిసి ‘‘మిగిలిన మద్యాన్నంతా కాలువలో పారబోశారు’’. ఇక జపాన్ బాంబు దాడుల గురించి చింతించాల్సినంత భయం లేని ఢిల్లీలో కవి డబ్లు్య.హెచ్. ఆడెన్ సోదరుడైన జాన్ బిక్నెల్ ఆడెన్ సౌత్ బ్లాక్‌ను రక్షించటానికి ఒక హాస్యాస్పదమైన తలతిక్క పథకాన్ని రూపొందించారు. సౌత్‌బ్లాక్ భవంతిని కనిపించనీయ కుండా చేయటం కోసం దట్టమైన పొగ మేఘాలను సృష్టించే ఒక పరికరాన్ని తయారు చేశారు. అయితే అది కేవలం కాలుష్యాన్ని వెదజల్లడానికి మాత్రమే పనికొచ్చింది. యునైటెడ్ ప్రావిన్సు (ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్)లో ఒక వదంతి అనియంత్రిత ఆందోళన గాడ్పులను వ్యాపింపజేసింది. ‘‘ఒక జపాన్ మనిషి ఆకాశం నుంచి భూమిపైన జరుగుతున్న ఒక వేడుకలోని జనసమూహం మధ్యకు దిగి, వారిని ఉద్దేశించి ప్రసంగించి, తిరిగి అలాగే ఆకాశంలోకి వెళ్లిపోయాడు అనే కథ అది.’’ కళ్లారా చూసినంతగా ఆ వదంతిని అంతా నమ్మేశారు. చివరికొచ్చేసరికి పద్మనాభన్ ముఖ్యమైన ప్రశ్నలు లేవనెత్తారు. కానీ దురదృష్టవశాత్తూ వాటికి సమాధానాలు మాత్రం చెప్పలేదు. ‘‘కేవలం ఊహాత్మకమైన దండయాత్ర ముప్పునకే భారతదేశం అంతగా ప్రభావితం అయిందా? పాలన యంత్రాంగం ఆ స్థాయిలో అప్రమత్తం అవాల్సి ఉండిందా? దేశవ్యాప్తంగా అంతగా కీకర బీకరలు అవసరమా?’’ సహజంగానే విమర్శలు వచ్చాయి. ‘‘టిబెట్‌లోకి ఉపసంహరించుకోవడానికి గానీ భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటోందా? లేక, చివరికి మనం పామిర్ పర్వతాలను అధిరోహించి, ప్రపంచ పైకప్పును గానీ చేరుకోబోతున్నామా? ఇంకా ఎక్కడైనా ధైర్య సాహ సాలు మిగిలి ఉన్నాయా?’’ అని ‘ద స్టేట్స్‌మన్’ పత్రిక గొప్ప గద్దింపుతో ఉరిమింది. కానీ ఎవరూ ఆ ఉరుమును విన్నట్లు లేరు. సరే, ఇంత జరిగినా ‘ద గ్రేట్ ఫ్లా్యప్...’ రావలసినంతగా ఎందుకు గమనింపునకు రాలేదు? ఎందుకంటే, ‘‘ఇండియా వైపు నుంచి ఒక్క అధికారిక ప్రకటన, ఒక్క పరిగణన కూడా లేకపోవడం వల్ల!’’ మద్రా సును వదిలి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయిన తన తాత గారి నుంచి, తన తల్లి నుంచి పద్మనాభన్ ఆనాటి విషయాలను తెలుసుకున్నారు. వారు చెప్పిన కథల్ని ఈయన మరింతగా తవ్వి పోశారు. తత్ఫలితంగా నాటి భయాలు ఎంత విస్తృతంగా, ఎంత అతిశయోక్తితో ఉండేవో, తరచు వాటి ప్రతిస్పందన ఎంత నవ్వు పుట్టించేలా ఉండేదో ఆయన కనుగొన్నారు. ఇది కనుక మీకు డాడ్స్ ఆర్మీ (ప్రహసనం)ని గుర్తు చేసినట్లయితే, అలా గుర్తుకు రావటం తప్పేమీ కాకపోవచ్చు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
రెండో ప్రపంచయుద్ధం నాటి బాంబు వెలికితీత
లండన్: రెండో ప్రపంచయుద్దంకాలంలో బ్రిటన్‌పై శత్రుదేశం జారవిడిచిన 500 కేజీల బరువైన పేలని బాంబును అధికారులు తాజాగా కనుగొన్నారు. ఇప్పటికీ అది పేలే సామర్థ్యం కల్గిఉండటం విశేషం. దీంతో హుటాహుటిన ఏకంగా 10,000కుపైగా స్థానికులను అక్కడి నుంచి ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. యుద్ధంకాకుండా శాంతికాలంలో బ్రిటన్‌లో ఇలా పౌరులను తరలించడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. నైరుతి బ్రిటన్‌లోని ప్లైమౌత్ తీరపట్టణంలో ఈ ఘటన జరిగింది. పట్టణంలోని ఒక ఇంటి పెరట్లో నేలలో మంగళవారం ఈ భారీ బాంబును కనుగొన్నారు. అందర్నీ వేరే చోటుకు తరలించాక దీనినీ దగ్గర్లోని సముద్రజలాల్లోకి తీసుకెళ్లి పేల్చేశామని బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. -
చరిత్రలోనే తొలిసారి.. ఇటలీ ప్రధానిగా ఓ మహిళ.. ఎవరీ జార్జియా మెలోని?
జార్జియా మెలోని(45).. ఇటలీ తొలి మహిళా ప్రధానమంత్రిగా అవతరించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీ ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన తొలి ప్రధానిగా ఆమె చరిత్ర పుస్తకాల్లో చోటు సంపాదించుకున్నారు. అంతేగాక ఇటలీ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన పూర్తి అతివాద ప్రభుత్వం కూడా ఇదే. బ్రదర్ ఆఫ్ ఇటలీ పార్టీకి చెందిన అతివాద జార్జియా మెలోని ఇటీవల(ఆదివారం) జరిగిన ఎన్నికల్లో మారియో డ్రాఘీపై భారీ మెజార్టీతో గెలుపొందారు. గత ఎన్నికల్లో కేవలం 4 శాతం మాత్రమే ఓట్లు సాధించిన మెలోనీ పార్టీ ఈసారి 25 శాతం ఓట్లతో ఘన విజయం సాధించింది. ఆమె నేతృత్వంలోని కూటమి 43 శాతానికి పైగా ఓట్లను గెలుచుకుంది. ప్రధానిగా గెలిచిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాము అన్ని వర్గాల ప్రజలకు సేవ చేస్తామని, ఎవరినీ మోసం చేయమని తెలిపారు.ఈ నెలాఖరులోగా ప్రధాని పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది Meet Giorgia Meloni, Italy's first female Prime Minister. pic.twitter.com/RHMYYS1rPn — Rishi Bagree (@rishibagree) September 27, 2022 ఎవరీ జర్జియా మెలోని.. జార్జియా గ్రాబ్టెల్లాలోని ఓ కార్మిక కుటుంబంలో జన్మించారు. ఆమె పుట్టిన వెంటనే తండ్రి కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో మెలోని తన తల్లి వద్దే పెరిగింది. 15 ఏళ్ల వయసులో ఫాసిస్టు నియంత బెనిటో ముస్సోలినీ మద్దతుదారులు స్థాపించిన ‘ఇటాలియన్ సోషల్ మూవ్మెంట్’ యూత్ విభాగంలో చేరారు. 1990లో నేషనల్ అలయెన్స్ (ఏఎన్)లో ఎంఎస్ఐ భాగమైంది. ఆ తర్వాత మాజీ ప్రధాని సిల్వియో బెర్లస్కోనీ స్థాపించిన ప్రధాన కన్జర్వేటివ్ గ్రూపులో విలీనమైంది. చదవండి: క్వీన్ ఎలిజబెత్ హ్యాండ్‌బ్యాగ్ వెనక ఇంత రహస్యముందా? ‘బ్రదర్ ఆఫ్ ఇటలీ’ స్థాపన 2012లో మెలోని ఏఎన్లోని ఇతర సభ్యులు అందులో నుంచి బయటకు వచ్చి ‘బ్రదర్ ఆఫ్ ఇటలీ’ పార్టీని స్థాపించారు. ఇటలీ జాతీయ గీతంలోని తొలి పంక్తులనే ఈ పార్టీకి పేరుగా పెట్టారు. ఓ ఇంటర్వ్యూలో మెలోని మాట్లాడుతూ.. తన పార్టీని యూఎస్ రిపబ్లికన్ పార్టీ, బ్రిటన్‌కు చెందిన కన్జర్వేటివ్ పార్టీతో పోల్చారు. తన పార్టీ దేశభక్తికి, కుటుంబ సంప్రదాయ విలువలకు ప్రాధాన్యం ఇస్తుందని వెల్లడించారు. 21 ఏళ్లకే రాజకీయాల్లోకి మెలోని తన 21 ఏళ్ల వయసులోనే అధికారికంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పోటి చేసిన తొలి ఎన్నికల్లోనే విజయం సాధించారు. 2008 బెర్లుస్కోనీ ప్రభుత్వంలో ఆమె యూత్ పోర్ట్‌ఫోలియో మంత్రిగా పనిచేశారు. అప్పటికి ఆమె వయసు 31 ఏళ్లు. అతిచిన్న వయసులో ఆ ఘనత సాధించిన మహిళగా మెలోని రికార్డులకెక్కారు. 2019లో మెలోని ‘నేను జార్జియా, నేను మహిళను, నేను తల్లిని, నేను ఇటాలియన్‌ని, నేను క్రిస్టియన్. నా నుంచి వీటిని వేరుచేయలేరు’ అంటూ చేసిన ప్రసంగం ఆమె మద్దతుదారులను ఉత్సాహపరిచింది. ఎల్జీబీటీకి వ్యతిరేకం జూన్‌లో ఇచ్చిన మరో ప్రసంగంలో ఆమె సంప్రదాయ కుటుంబాలకు మద్దతు ఇస్తానని ప్రకటించారు. లైంగిక గుర్తింపు, ఎల్జీబీటీ లాబీని తీవ్రంగా వ్యతిరేకించారు. లింగపరమైన గుర్తింపునకు ఓకే కానీ, జెండర్ భావజాలానికి తాను వ్యతిరేకమని చెప్పారు. సురక్షితమైన సరిహద్దులకు ఓకే కానీ.. ఇస్లాం హింసకు వ్యతిరేకమని తెలిపారు. మన ప్రజల కోసం పనిచేయాలని కానీ అంతర్జాతీయ ఫైనాన్స్ సంస్థల కోసం కాదని జార్జియా స్పష్టం చేశారు. స్పానిష్ రైటిస్ట్ పార్టీ వోక్స్ మద్దతుదారులను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఐరోపా పార్లమెంట్‌లోని మితవాద యూరోపియన్ కన్జర్వేటివ్, రిఫార్మిస్ట్ గ్రూప్‌కు మెలోని అధ్యక్షురాలిగా ఉన్నారు. ఇందులో ఆమె బ్రదర్స్ ఆఫ్ ఇటలీ, పోలాండ్ నేషనలిస్ట్ లా అండ్ జస్టిస్ పార్టీ, స్పెయిన్ రైట్ వోక్స్ మితవాద స్వీడన్ డెమొక్రాట్లు ఉన్నాయి.. దేశ రాజకీయాల్లో మార్పులు కాగా ఇటలీ ప్రధానిగా మెలోని బాధ్యతలు స్వీకరిస్తే ఆ దేశ రాజకీయాల్లో కీల మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. దీనికి కారణం ఆమె ఎల్జీబీటీ హక్కులకు వ్యతిరేకంగా ఆమె తన గళాన్ని వినిపించడం. అలాగే ఇటలీ నౌకాదళం లిబియా సముద్ర మార్గాన్ని మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేగాక దేశంలోని ముస్లిం వర్గాలకు వ్యతిరేకంగా తరచూ హెచ్చరికలు జారీ చేశారు. చదవండి: NASA's DART Mission: నాసా ప్రయోగం దిగ్విజయం.. గ్రహశకలాల్ని ఇక దారి మళ్లించగలం! -
మంచి మాట: అభిప్రాయం కాదు... అవగాహన
వ్యక్తి తన వ్యక్తిత్వానికి అతీతంగా వస్తుతత్త్వానికి, ఉన్న విషయానికి మాలిమి అవాలి. అనుకోవడం నుంచి తెలుసుకోవడానికి పయనించాలి. అభిప్రాయం నుండి అవగాహనలోకీ చేరాలి. అనుకోవడం అంటేనే తెలివిడిలేనితనం. ‘ఇది నా అభిప్రాయం‘ అనడం ఒక మనిషి అవగాహనా రాహిత్యాన్ని తెలియజేస్తూంటుంది. విషయం, వాస్తవం, సత్యం ఇవి మనిషి మనిషికీ మారవు. అభిప్రాయాలే వేర్వేరుగానూ, రకరకాలుగానూ ఉంటాయి. ఒక విషయం గురించి ఏదో అనుకోవడం ఏమిటి? విషయాల్ని తెలుసుకోవడం లేదా తటస్థంగా ఉండడం అన్నదే సరైనది. లోకంలో ప్రతి ఒక్కరూ అభిప్రాయపడడం గొప్ప అనుకుంటూంటారు. ముఖ్యంగా ప్రపంచంలో ఉన్న 67% మధ్యతరగతి వ్యక్తులు అభిప్రాయపడుతూ బతుకుతూంటారు. అభిప్రాయాలు మనిషి అశక్తతకు, తెలివిడిలేనితనానికి వ్యక్తీకరణలు. అభిప్రాయపడడం అన్నది మధ్యతరగతి మాంద్యంగానూ, జాడ్యంగానూ ఉంది. అందువల్ల గందరగోళం తప్పితే మరొకటి ఉండదు. ఉపిరి పీల్చుకోవడం తరువాత ఒక వ్యక్తి తప్పకుండా చేసే పని అభిప్రాయపడడమే. మనుషులకు తప్పితే ఏ జంతువుకూ అభిప్రాయాలుండవు. అందుకే జంతువుల్లో లేని అశాంతి మనుషుల్లో మాత్రమే ఉంది. ‘ఇది నా అభిప్రాయం’, ‘నేను ఏమనుకుంటున్నానంటే‘, ‘నేను చెప్పేదేమిటంటే’... అనే స్థితి నుండీ, స్థాయి నుండీ మధ్య తరగతి మనిషి ఇంకా ఎదగలేదు. మనిషి అవగాహనకూ అతీతంగా తన అభిప్రాయాల వల్లా, ఏదో అనుకోవడం వల్లా తన ఎదుగుదలకు తానే అడ్డుపడుతున్నాడు. ఒక కుటుంబంలోని వ్యక్తుల అభిప్రాయాల వల్లా, ఏదేదో అనుకోవడం వల్లా ఆ కుటుంబాలు ఛిద్రమైన సందర్భాలు ఎన్నెన్నో ఉన్నాయి. అభిప్రాయపడడం, అనుకోవడం ఒక మానసిక బలహీనత. హిట్లర్ అభిప్రాయాల వల్ల రెండవ ప్రపంచ యుద్ధం వచ్చి మొత్తం మానవాళికి పెనుహాని జరిగింది. అభిప్రాయపడడం కూడా మూర్ఖత్వంలాగే అపాయకరమైనదే! కొన్ని సందర్భాల్లో మూఢనమ్మకంలాగా కీడు చేసేదే! నా అభిప్రాయం మేరకు అనేది ప్రపంచానికి మేలు చేసినది కాకపోగా అనర్థాల్ని కలిగించింది, మనుషుల మధ్య అంతరాల్ని పెంచింది. మనస్పర్థలను సృష్టించింది. ఈ చింతనతో ఎన్నో దశాబ్దుల క్రితం నుండీ అంతర్జాతీయ సంస్థలు ప్రపంచానికీ, మానవాళికీ అత్యవసరమయ్యే ఎన్నో ఉత్పాదనల్ని ఉత్పత్తి చేసి అందుబాటులోకి తెచ్చాయి, సగటు మనిషికి హితాన్ని చేకూర్చాయి. చూడడం, వినడం, అవగతం చేసుకోవడం, చెప్పడం ఇవి మనిషికి సరిగ్గా అలవడలేదు. వ్యక్తిగత అభిప్రాయాలూ, ఉద్దేశాల వల్ల సాటి మనిషికీ, సమాజానికీ ప్రయోజనం ఉండదు. అభిప్రాయాలు, ఉద్దేశాలు, అనుకోవడం ఇవి కాదు ఎరుక, అవగాహన, విజ్ఞతలే కావాలి. ఒకరి ఎరుక, అవగాహన మరొకరికీ, సమాజానికీ ఉపయోగపడతాయి. ఈ ప్రపంచానికి మేలు చేసినవన్నీ అవగాహనలే, వాస్తవాలే, సత్యాలే. ఒక వైద్యుడి చదువు లేదా ఎరుక మాత్రమే రోగికి అవసరమవుతుంది. ఒక అధ్యాపకుడికి ఎరుక ఉన్నప్పుడు మాత్రమే విద్యార్థికి సరైన విద్య వస్తుంది. ’రెండు రెళ్లు నాలుగు’ అన్న ఎఱుకను మాత్రమే ఉపాధ్యాయుడు విద్యార్థికి అందజెయ్యాలి. అదే విద్యార్థికి కావాల్సింది. ఆ రెండురెళ్లు నాలుగు అన్నది అవగాహన. ఆ అవగాహనే ఒక వ్యక్తి జీవనానికి తోడ్పడేది. ఇలా ఏ విషయంలోనైనా ఎరుకవల్ల వచ్చే లేదా వచ్చిన అవగాహన మాత్రమే మేలు చేస్తుంది. అభిప్రాయం అనేది పూర్తిగా వ్యక్తిగతం. ఎవరి అభిప్రాయాలు వాళ్లవి. అభిప్రాయాలు సార్వత్రికమైనవి కావు అపై సార్వజనీనమైనవీ కావు. మనం సరిగ్గా ఉండాలంటే మనకు ఉండాల్సింది అభిప్రాయాలు కాదు అవగాహనలు. బతకడం అంటే అభిప్రాయాల్ని మోసుకుంటూ ఉండిపోవడమా? కాదు. బతకడం అంటే తెలుసుకుని అవగాహనతో సాగడం. అభిప్రాయపడడం ఒక వ్యక్తికి ఆరంభదశ కావచ్చు. కానీ వ్యక్తి అక్కడే ఉండిపోకూడదు. తన అభిప్రాయాన్ని వాస్తవం లేదా ఉన్న విషయంతో సరిపోల్చి చూసుకోవాలి. తాను అనుకున్న దానికి ఏ మాత్రం ఉనికి ఉంది అన్నదాన్ని పరిశీలించగలగాలి. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఒక గాయకుడు గొప్ప గాయకుడు అన్న అభిప్రాయం ఉంటే ఆ గాయకుడి సామర్థ్యాన్ని, గాయకుడి వ్యాప్తిని, తరువాతి తరం వాళ్లపై ఆ గాయకుడి ప్రభావాన్ని, పరిశీలించగలిగితే ఆ గాయకుడు గొప్ప గాయకుడు అన్న అభిప్రాయం సరైనదా కాదా అనేది తెలిసిపోతుంది. విజ్ఞానశాస్త్రవేత్తల ఆవిష్కరణలను పరిశీలిస్తే మనకు అవగాహన అన్నది ఏమిటో అర్థమై పోతుంది. విజ్ఞాన శాస్త్రవేత్తలు ఒక అభిప్రాయంతోనో, ఏదో ఒకటనుకునో మొదలుపెడతారు. ప్రయోగాలు, ఆలోచనలు, పరిశీలనలు చేస్తూ, చేస్తూ తమను తాము మార్చుకుంటూ, సరిచేసుకుంటూ ఒక దశలో వాళ్లు సరైన ఆవిష్కరణలు చెయ్యగలుతారు. ఆ ఆవిష్కరణ జరిగాక అది అవగాహన అవుతుంది. ఆ అవగాహనే లోకానికి ఉపయోగ పడేదవుతుంది. అవగాహన మనిషికి స్వేచ్ఛను ఇస్తుంది. సాటి మనిషికి, సమాజానికి మేలు చేస్తుంది. శాంతిని ఇస్తుంది. ఈ సత్యాన్ని బుద్ధిలోకి తీసుకుందాం. అభిప్రాయాలకు అతీతంగా ‘బతకడం’ నేర్చుకుందాం. అభిప్రాయపడడం ఒక వ్యక్తికి ఆరంభదశ కావచ్చు. కానీ వ్యక్తి అక్కడే ఉండిపోకూడదు. తన అభిప్రాయాన్ని వాస్తవం లేదా ఉన్న విషయంతో సరిపోల్చి చూసుకోవాలి. తాను అనుకున్న దానికి ఏ మాత్రం ఉనికి ఉంది అన్నదాన్ని పరిశీలించగలగాలి. – రోచిష్మాన్ -
Russia-Ukraine war: రష్యా విక్టరీ డే: మే 9న ఏం జరగబోతోంది?
మే 9.. రష్యా చరిత్రలో ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. అది వారికి విజయోత్సవ దినోత్సవం. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీలో నాజీలపై సోవియెట్ యూనియన్ విజయం సాధించిన రోజు. సోవియెట్ యూనియన్ అధినేత జోసెఫ్ స్టాలిన్ ముందు 1945 సంవత్సరం, మే9న నాజీలు లొంగిపోయిన రోజు. ప్రతీ ఏడాది అదే రోజు విజయోత్సవ వేడుకలు అంబరాన్ని తాకుతాయి. రష్యా తన మిలటరీ సత్తా ప్రపంచానికి చాటి చెప్పేలా మాస్కోలోని రెడ్ స్క్వేర్ వద్ద సైనిక పెరేడ్ నిర్వహిస్తుంది. కానీ ఈ సారి ఉక్రెయిన్‌పై దండయాత్ర కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ తేదీకి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ తేదీన ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక మలుపు తిప్పుతారని, అధికారంగా యుద్ధాన్ని ప్రకటించి ఆ దేశాన్ని దశల వారీగా స్వాధీనం చేసుకుంటారా అన్న చర్చ జరుగుతోంది. యుద్ధం కీలక మలుపు తిరుగుతుందా? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విజయోత్సవ వేడుకల్ని గత కొద్ది ఏళ్లుగా కొత్త దేశాలపై యుద్ధ ప్రకటనలు చేయడానికే ఉపయోగిస్తున్నారు. గత ఏడాది మే 9న పుతిన్ చేసిన ప్రసంగంలో రష్యా శత్రువులందరూ తమ దేశాన్ని చుట్టుముట్టేస్తున్నారని, పశ్చిమ సిద్ధాంతాలను తమపై రుద్దే ప్రయత్నం జరుగుతోందని వాపోయారు. ఈ ఏడాది కూడా విక్టరీ డే నాడు పుతిన్ సంచలన ప్రకటన చేస్తారన్న అంచనాలున్నాయి. మారియుపోల్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్టుగా ప్రకటనతో పాటుగా పూర్తి స్థాయిలో యుద్ధాన్ని ప్రకటించి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి అణ్వాయుధాలను ప్రయోగిస్తారని మరి కొందరు ప్రచారం చేస్తున్నారు. విజయోత్సవ దిన వేడుకల్ని ఉక్రెయిన్ నగరాల్లో కూడా నిర్వహించడానికి రష్యా సన్నాహాలు చేస్తున్నట్టు ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. మారియుపోల్ సహా శిథిలావస్థకు చేరుకున్న పలు నగరాలను రష్యా సైన్యం పరిశుభ్రం చేస్తూ ఉండడమే దీనికి తార్కాణమని పేర్కొంటోంది. పశ్చిమ దేశాల ఆందోళనలు ఎందుకు ? ఈ ఏడాది విక్టరీ డే రోజు పుతిన్ ప్రజల్ని రెచ్చగొట్టేలా ప్రసంగించి వారందరితో ఆయుధాలు పట్టించే ప్రమాదం ఉందని పశ్చిమాది దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉక్రెయిన్ దండయాత్రపై రష్యన్లలో నెలకొన్న అసమ్మతిని చల్లార్చి వారిలో దేశభక్తి రేగేలా పుతిన్ ప్రసంగించడానికి సిద్ధమయ్యారని డ్యూక్ యూనివర్సిటీ ప్రొఫెసర్, రష్యా వ్యవహారాల్లో నిపుణుడు సైమన్ మిల్స్ అభిప్రాయపడ్డారు. ‘‘ఇన్నాళ్లూ ఉక్రెయిన్‌పై మిలటరీ ఆపరేషన్ అని చెబుతూ వస్తున్న పుతిన్ ఆ దేశంపై యుద్ధాన్ని ప్రకటించి సాధారణ రష్యన్లని కూడా యుద్ధోన్ముఖుల్ని చేయడమే ఆయన ముందున్న లక్ష్యం’’ అని మిల్స్ అంచనా వేస్తున్నారు. యూదుడైన జెలెన్స్కీని ఉక్రెయిన్ గద్దె దింపి ‘‘నాజీరహితం’’ చేయడమే రష్యా లక్ష్యమన్న సందేశాన్ని కూడా ఇచ్చే అవకాశాలున్నాయి. మార్షల్ లా అమలు చేస్తారా ? ఈ ఏడాది విక్టరీ డే ప్రసంగంలో పుతిన్ మార్షల్ చట్టాన్ని ప్రకటిస్తారన్న ఊహాగానాలున్నాయి. ఈ చట్టాన్ని అమలు చేస్తే ఎన్నికల నిర్వహణ రద్దవుతుంది. అధికారాలన్నీ పుతిన్ చేతిలోనే ఉంటాయి. 18 ఏళ్ల వయసు నిండిన యువకులందరూ అవసరమైతే కదనరంగానికి వెళ్లాల్సి వస్తుంది. వారు దేశం విడిచి పెట్టి వెళ్లడానికి వీల్లేదు. అయితే ఇలాంటి కఠినమైన చట్టాన్ని తీసుకువస్తే రాజకీయంగా పుతిన్‌కు వ్యతిరేకత ఎదురవుతుందన్న చర్చ కూడా జరుగుతోంది. శిథిల ఉక్రెయిన్ ► ఉక్రెయిన్‌పై రష్యా నిర్విరామంగా దాడులు చేస్తూ 75 రోజులు గడుస్తూ ఉన్న నేపథ్యంలో ఆ చిన్న దేశంలో జరిగే నష్టం అపారంగా ఉంది. కీవ్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్ చేసిన అధ్యయనం ప్రకారం ఇప్పటివరకు 60 వేల కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం జరిగింది. ► మౌలిక సదుపాయాలు ధ్వంసం కావడంతో జరిగిన ఆర్థిక నష్టం 9,200 కోట్ల డాలర్లకు పైగా ఉంటుందని ఒక అంచనా. ► వ్యాపారాలు దెబ్బ తినడంతో వెయ్యి కోట్ల డాలర్ల నష్టం సంభవించింది. ► 195 ఫ్యాక్టరీలు, 230 ఆరోగ్య కేంద్రాలు, 940 విద్యా సంస్థలు, అయిదు రైల్వేస్టేషన్లు, 95 ప్రార్థనాలయాలు, 140 వారసత్వ, సాంస్కృతిక భవంతులు రష్యన్ దాడుల్లో ధ్వంసమయ్యాయి ► 23,800 కిలోమీటర్ల రహదారులు నాశనమయ్యాయి. వీటి విలువే 6 వేల కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా ► నెలకి 700 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం లభిస్తే తప్ప ఉక్రెయిన్ కోలుకునే పరిస్థితి లేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కరోనా దెబ్బ.. ఆయుషు తగ్గింది!
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా రేపిన కలకలం ఇప్పట్లో ఆగిపోయేలా లేదు. కోవిడ్ కారణంగా ఇప్పటికే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోగా, కోట్ల సంఖ్యలో వైరస్ బారినపడిన వారు ఇతర రుగ్మతలు ఎదుర్కొంటున్నారు. మనిషి ఆయుర్దాయంపై కూడా కరోనా తీవ్ర ప్రభావం చూపిందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కోవిడ్ సంక్షోభంతో మనుషుల సగటు ఆయుషు గణనీయంగా పడిపోయిందని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు తాజాగా తేల్చారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి. -
రెండో ప్రపంచ యుద్ధం నాటి మొసలి..
-
హిట్లర్ పెంచుకున్న మొసలి ఇదేనా?
మాస్కో: రెండో ప్రపంచ యుద్ధం నుంచి బయటపడిన 84 ఏళ్ల మొసలి శుక్రవారం ఉదయం మరణించింది. ఈ మేరకు జూ అధికారులు ట్విటర్ వేదికగా సాటర్న్(మొసలి) మరణాన్ని వెల్లడించారు. గౌరవించే వయసులోనే చనిపోయిందని పేర్కొన్నారు. కాగా సాటర్న్ యునైటెడ్ స్టేట్స్లో జన్మించింది. 1936లో దీన్ని జర్మనీలోని బెర్లిన్ జూకు బహుమానంగా ఇచ్చారు. ఇక రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైనన మయంలో జర్మనీపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. ఈ క్రమంలో బెర్లిన్ జూపైనా బాంబు దాడులు జరిగాయి. (ఎలుక పెయింటింగ్‌కు ఎంత డిమాండో..) ఎన్నో జీవులు బాంబు ధాటికి నేలకొరిగినప్పటికీ ఈ మొసలి మాత్రం చాకచక్యంగా తప్పించుకోగలిగింది. సుమారు మూడేళ్ల తరువాత బ్రిటీష్ సైన్యానికి కనిపించింది. దీంతో దాన్ని బ్రిటన్ తన మిత్రదేశమైన రష్యాకు బహుమానంగా అందించింది. అలా అది చివరికి మాస్కో జూకు చేరింది. అక్కడే 74 ఏళ్లు జీవించింది. అది చనిపోవడంతో జూ సిబ్బంది భావోద్వేగానికి లోనయ్యారు. సాటర్న్‌ను తమ చిన్ననాటి నుంచి చూస్తూ వచ్చామని దాని జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కాగా ఇది నాజీల నాయకుడు అడాల్ఫ్ హిట్లర్‌కు చెందిన మొసలిగా ప్రాచుర్యం పొందినప్పటికీ అవన్నీ వుట్టి పుకార్లేనని జూ అధికారులు స్పష్టం చేశారు. (మొసలి నోట్లో తల పెట్టింది..) -
పుతిన్‌కు కిమ్ జోంగ్ ఉన్ లేఖ
సియోల్ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌కు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ రెండవ ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాల విజయం 75 వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాశారు. కరోనా వైరస్ వ్యాప్తిపై రష్యా విజయం సాధించాలని ఆకాంక్షించారు. కరోనాపై విజయం సాధించి శక్తివంతమైన రష్యాను నిర్మించడానికి అక్కడి ప్రజలు చేస్తున్న పోరాటంలో విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రష్యాలో కరోనా కోరలు చాస్తుంది. ఇప్పుడు అక్కడ ప్రతీరోజు కొన్ని వేల కేసులు నమోదవుతున్నాయి. రష్యాలో కరోనా కేసులు లక్షా 87వేలకు చేరుకోగా, మృతుల సంఖ్య 1723కు చేరుకుంది. (దాయాది దేశంపై మండిపడ్డ ఉత్తర కొరియా) అంతకుముందు కిమ్ చైనా కరోనాపై పోరాటం చేసి సాధించిన విజయాలను ప్రశంసిస్తూ ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు వ్యక్తిగత సందేశాన్ని పంపినట్లు అధికారిక కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ శనివారం తెలిపింది. వైరస్ బారిన పడకుండా నెలల తరబడి దేశ సరిహద్దును మూసివేసిన తరువాత చైనా, ఉత్తర కొరియా దౌత్యపరమైన చర్యలు ఆర్థికంగా లాభం చేకూరుతాయని నిపుణులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 40 లక్షలు దాటగా, ఇప్పటివరకు కరోనాతో 2.75 లక్షల మంది మృతి చెందారు. కాగా ప్రపంచవ్యాప్తంగా 13.77 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. (జిన్‌పింగ్‌పై కిమ్ జోంగ్ ఉన్ ప్రశంసలు!) (మొన్న కనబడింది నకిలీ కిమ్, మరో కొత్త వాదన!) -
కరోనా: ప్రపంచ యుద్ధం తర్వాత మళ్లీ గెలిచాడు
కరోనా వైరస్ లక్షల్లో ప్రాణాలను హరిస్తూ ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. మనుషుల్లో భయం అనే బీజాలను నాటింది. అయితే ఇది కూడా సాధారణ జబ్బులాంటిదేనని, ధైర్యంతో దీన్ని జయించవచ్చని తొంభైతొమ్మిదేళ్ల వృద్ధుడు నిరూపించాడు. ఈ అద్భుత ఘటన బ్రెజిల్లో చోటు చేసుకుంది. ఎర్మాండో పివేటా రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రెజిల్ ఫిరంగిదళంలో సేవలందించాడు. ఆయన మిత్ర దేశాల తరపున పోరాటం కొనసాగించాడు. రెండవ లెఫ్టినెంట్‌గా పని చేసిన ఆయన ఈమధ్యే కరోనా బారిన పడ్డాడు. కానీ యుద్ధాన్నే జయించిన అతనికి కరోనా బెదిరిపోయింది. ఎనిమిది రోజుల చికిత్స అనంతరం కరోనా నుంచి బయటపడ్డాడు. (వేతన ఫిర్యాదుల పరిష్కారానికి 20 కంట్రోల్ రూమ్‌లు) ఆర్మీ క్యాప్ ధరించిన ఆయన ఆసుపత్రి నుంచి బయటకు వ్తుండగా అధికారులు సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా అక్కడి ఆర్మీ అధికారులు స్పందిస్తూ.. అతను మరో యుద్ధాన్ని జయించాడని కొనియాడారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా 1914 జూలై 28 నుంచి 1918 నవంబర్ వరకు కొనసాగిన మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా దేశాలతో కూడిన మిత్రరాజ్యాలు విజయం సాధించాయి. జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ, ఇటలీ దేశాలు ఓడిపోయాయి. 1939 సెప్టెంబర్ 1 నుంచి 1945 సెప్టెంబర్ 2 వరకు కొనసాగిన రెండో ప్రపంచ యుద్ధంలోనూ మిత్రరాజ్యాలే గెలుపొందాయి. (అమ్మా వచ్చేయమ్మా : నర్సు కూతురి కంటతడి) -
ప్రేమలో పడ్డా.. పెళ్లిదాకా వచ్చింది..: రతన్ టాటా
ముంబై: భారతదేశానికి అంతర్జాతీయస్థాయి ప్రమాణాలను తీసుకువచ్చిన పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా. టాటా గ్రూప్ చైర్మన్‌గానే కాకుండా గొప్ప మానవతావాదిగా కూడా ఆయన గుర్తింపు పొందారు. వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడంతో పాటుగా తన వంతుగా పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. కోటీశ్వరుడైనప్పటికీ నిరాడంబరంగా జీవనం సాగించే రతన్ టాటా యువతకు రోల్ మోడల్ అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే ఆయనకు ఈ గుర్తింపు కేవలం ఒక్కరోజులోనే రాలేదు. అంతేకాదు సంపన్న కుటుంబంలో జన్మించినప్పటికీ ఆయన బాల్యమేమీ పూల పాన్పు కాదు. పదేళ్ల వయస్సులోనే తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో ఒంటరిగా మిగిలిపోయిన రతన్ టాటాను ఆయన బామ్మ చేరదీశారు. మనవడిని కంటికి రెప్పలా కాపాడుకుంటూనే... తల్లిదండ్రుల విడాకుల వ్యవహారం కారణంగా ఆయన కుంగిపోకుండా గుండె నిబ్బరంతో పెరిగేలా చేశారు. అలా తనకోసం ఎన్నెన్నో త్యాగాలు చేసి.. తనను ఉన్నతస్థాయికి తీసుకువచ్చిన బామ్మ కోసం రతన్ టాటా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారట. చివరిరోజుల్లో ఆమెకు తోడుగా ఉండేందుకు ఇండియాకు రావడం వల్ల ప్రేమించిన అమ్మాయికి దూరమయ్యారట. అందుకే బ్రహ్మచారిగా మిగిలిపోయారట. ఈ విషయాలను ప్రఖ్యాత హ్యుమన్స్ ఆఫ్ బాంబేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా రతన్ టాటానే చెప్పుకొచ్చారు. అమ్మానాన్నల విడాకులు, బాల్యంలో ఎదురైన చేదు అనుభవాలు, వాటిని అధిగమించిన తీరు గురించి పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘నా బాల్యం బాగానే ఉండేది. అయితే నా సోదరుడు, నేను కాస్త పెరిగిపెద్దవాళ్లం అవుతున్న కొద్దీ.. మా అమ్మానాన్నల విడాకుల వ్యవహారం వల్ల తోటి విద్యార్థుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అప్పట్లో విడిపోవడం అంటే ఇప్పటిలా తేలికైన విషయం కాదు. అందుకే స్కూళ్లో మమ్మల్ని ర్యాగింగ్ చేసేవాళ్లు. అయితే అలాంటి సమయాల్లో మా బామ్మ మాకు ఎంతో అండగా నిలిచింది. అలా కొన్నాళ్లు గడిచింది. కానీ ఎప్పుడైతే మా అమ్మ మళ్లీ పెళ్లి చేసుకున్నారో అప్పటి నుంచి ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయి. అయితే అప్పుడు కూడా బామ్మ తోడుగా నిలిచింది. సంయమనంతో ఉండటం నేర్పించింది. నేటికీ నేను అది కొనసాగిస్తున్నాను. నాకింకా గుర్తుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తను నన్ను నా సోదరుడిని వేసవి సెలవుల కోసం లండన్‌కు తీసుకువెళ్లింది. అక్కడికి వెళ్లిన తర్వాత ఎలా ఉండాలో ముఖ్యంగా డిగ్నిటీ గురించి నేర్పించింది. ఆ విషయాలన్నీ మా మెదళ్లలో ముద్రపడిపోయాయి. తను ఎల్లప్పుడూ మా కోసమే జీవించింది. ఇప్పడు ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు అంటే చెప్పలేం గానీ... మా నాన్నతో కూడా నాకు విభేదాలు వచ్చాయి. నేను వయోలిన్ వాయించడం నేర్చుకుంటానంటే.. నాన్న పియానో నేర్చుకోవాలని పట్టుబట్టారు.(చదవండి: రతన్ టాటా అద్భుత రిప్లై) నేను అమెరికాలో చదువుతానంటే ఆయన లండన్‌లోనే చదవాలన్నారు. నేను ఆర్కిటెక్ట్ అవుతానంటే.. ఇంజనీర్ కావాలని పట్టుబట్టారు. అప్పుడు మళ్లీ బామ్మే రంగంలోకి దిగింది. తన వల్లే ఆర్కిటెక్చర్ గ్రాడ్యుయేట్ అయ్యాను. అయితే ఈ విషయం నాన్నను నిరాశకు గురిచేసింది. ఆ తర్వాత నేను సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టాను. బామ్మ చెప్పినట్లుగా మృదువుగా మాట్లాడుతూనే.. నాకు కావాల్సిన వాటిని సాధించుకునేవాడిని. దీనంతంటికీ తనిచ్చిన ధైర్యమే కారణం. కాలేజీ అయి పోయిన తర్వాత.. లాస్ ఏంజెల్స్‌లోని ఓ నిర్మాణ సంస్థలో జాబ్ సంపాదించాను. రెండేళ్లపాటు అక్కడే పనిచేశాను. అక్కడ ఉన్నది కొంతకాలమే గానీ.. అక్కడి వాతావరణం ఎంతో అందమైనది. నా సొంత కారు, నేను ఇష్టంగా చేసే జాబ్. నేను ప్రేమలో పడింది కూడా అక్కడే. ఓ అమ్మాయిని ప్రేమించాను... దాదాపుగా మా పెళ్లి అయిపోయినట్లే అనే భావన. కానీ అప్పుడే నేను ఇండియాకు రావాల్సి వచ్చింది. అప్పటికే ఏడేళ్లుగా బామ్మ ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంది. తనను చూడటానికి.. తనతో ఉండటానికి ఇక్కడికి వచ్చేశాను. నాతో పాటు ఆ అమ్మాయి కూడా వస్తుందనుకున్నా.(హాలీవుడ్ స్టార్లా రతన్ టాటా..) అయితే 1962లో ఇండో- చైనా యుద్ధం జరుగుతున్న సమయ అది. అప్పుడు తను ఇక్కడికి రావడానికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అలా ఆ బంధం బీటలు వారింది’’ అని 82 ఏళ్ల రతన్ టాటా తన అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. కాగా రతన్ టాటా తల్లిదండ్రులు నావల్ టాటా- సోనూ టాటా 1948లో విడాకులు తీసుకున్నారు. అనంతరం ఇరువురూ వేర్వేరు వివాహాలు చేసుకున్నారు. ఇక నావల్ టాటాకు రెండో భార్య వల్ల కలిగిన సంతానం నోయల్ టాటా. కాగా పారిశ్రామిక రంగంలో టాటా గ్రూప్‌ను మేటిగా నిలిపిన రతన్ టాటాను భారత ప్రభుత్వం.. పద్మ భూషణ్(2000), పద్మ విభూషణ్(2008) పురస్కారాలతో సత్కరించిన విషయం తెలిసిందే. -
70 ఏళ్ల తర్వాత బయటడింది..
ఫ్రాంక్ఫర్ట్ : రెండు ప్రపంచ యుద్ధాలు మానవ జాతిని అతలాకుతలం చేశాయి. మరీ ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధం సృష్టించిన బీభత్సాన్ని ప్రపంచం నేటికి మర్చిపోలేదు. అందుకు ప్రధాన కారణం ఈ యుద్ధంలో వాడిన బాంబులే. ఇప్పుడున్నంత టెక్నాలజీ లేని కాలంలోనే ఆనాడు తయారు చేసిన బాంబులు తీవ్ర మారణహోమాన్ని సృష్టించాయి. అంతటి విపత్తు సృష్టించిన నాటి బాంబు ఒకటి బయటపడటంతో జనాలు మరోసారి భయభ్రాంతులకు గురయ్యారు. ఈ సంఘటన జర్మనిలో చోటుచేసుకుంది. భవన నిర్మాణ పనుల చేపడుతున్న సమయంలో ఇది బయటపడింది. విషయం తెలుసుకున్న అధికారులు లుడ్విగ్షాఫెన్ నగరంలోని 18500 మంది ప్రజలను ఖాళీ చేయించారు. అనంతరం బాంబు డిస్పోజల్ టీమ్ దానిని సురక్షితంగా నిర్వీర్యం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధం జరిగే సమయంలో జర్మనీపై అమెరికా దళాలు వేసిన బాంబు ఇది. దీని బరువు సుమారు 500 కిలోలు. బాంబు నిర్వర్యం చేసే క్రమంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా కిలోమీటరు మేర పరిసర ప్రాంతాల్లోని ప్రజలను మరోచోటికి తరలించామని అధికారులు తెలిపారు. అంతేకాక కేవలం గంట సేపట్లోనే ఈ బాంబును నిర్వీర్యం చేశామన్నారు. అనంతరం అధికారులు బాంబును నిర్వీర్యం చేశామని, నగరంలోని ప్రజలంతా మళ్లీ వాళ్ల ఇళ్లకు రావచ్చని ఓ అధికారి ట్వీట్ చేశారు. అంతేకాక ఆ బాంబు తాలూకు ఫొటోను కూడా పోస్ట్ చేశారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసి ఇప్పటికి 70 ఏళ్లు గడిచిన తర్వాత కూడా జర్మనీలో ఇలాంటి పేలని బాంబులు అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నాయి. గతేడాది కూడా ఫ్రాంక్‌ఫర్ట్‌లో 1.8 టన్నుల బరువున్న బ్రిటన్ బాంబు బయటపడింది. ఆ సమయంలో నగరంలోని 60 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో బెర్లిన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ దగ్గర కూడా మరో బ్రిటిష్ బాంబు కనిపించింది. -
ప్రపంచ చరిత్రలోనే అత్యంత దుర్దినం!
ఆగస్టు 6.. ప్రపంచ చరిత్రలోనే అత్యంత దుర్దినం. జపాన్ వాసులైతే ఈ తేదీని అంత తేలికగా మరిచిపోలేరు. రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా అగ్రరాజ్యం అమెరికా అణుదాడికి బలైన నగరాలు హిరోషిమా, నాగసాకి. హిరోషిమాలో లిటిల్ బాయ్ విధ్వంసానికి నేటికి సరిగ్గా 73 ఏళ్లు. 1945 ఆగస్టు 6న ఉదయం దాదాపు ఎనిమిదన్నర గంటల ప్రాంతం (జపాన్ స్థానిక కాలమానం ప్రకారం)లో హిరోషిమా గగనతలంలో చక్కర్లు కొట్టింది అమెరికన్ బాంబర్ బి–29. దానికి లిటిల్ బాయ్ అని అమెరికా పేరు పెట్టింది. భూతలానికి కొన్ని మీటర్ల ఎత్తులో ఉండగానే లిటిల్ బాయ్ పేలాడు. కొన్ని సెకన్లలో హిరోషిమా శ్మశానంలా మారిపోయింది. 64 కేజీల యురేనియం గొలుసుకట్టు చర్య జరిగి ఒక ట్యూమర్ కణంలా పెరుగుతూ 67 టన్నుల జౌల్స్ శక్తిని విడుదల చేసింది. క్షణంలో 70 వేలమంది ఉన్న చోటే చచ్చి పడిపోయారు!. అనంతరం మరో 70 వేల మంది మృత్యువాత పడ్డారు. కార్బన్ రియాక్షన్ జరిగి బాంబు సమీపంలో ఉన్న వాళ్ల శరీరాలు కార్బన్ బొమ్మలుగా మారిపోయాయి. చుట్టుపక్కల నుండి చూస్తే నేల మీద ఒక 50వేల అడుగుల పుట్టగొడుగు ఆకారపు మేఘంలా ఉందా విధ్వంసం. క్షణాల్లో నగరం ఆవిరైపోయింది. ఎక్కడ చూసినా కూలిన భవంతులు. శవాల దిబ్బలు. వేల మంది గాయాలపాలై తీవ్ర అనారోగ్యానికి సైతం గురయ్యారు. ఆపై కెమికల్స్ వల్ల పుట్టుకొచ్చిన భయానక వ్యాధులతో లక్షల మంది మృత్యువాత పడ్డారు. అయితే అంత వినాశనం జరిగినా ఒకే ఒక్క భవనం జన్‌బకూ డోమ్ అనే ఒకే ఒక్క భవనం మాత్రం ఆ దుర్ఘటనకు సాక్ష్యంలా నిలిచింది. 73 ఏళ్ల క్రితం విధ్వంసాన్ని తట్టుకున్న భవనమే ప్రస్తుతం హిరోషిమా శాంతి చిహ్నంగా గుర్తింపు పొందుతోంది. చివరగా ఆ విధ్వంసాన్ని చూసి, శత్రువులైన అమెరికన్లే కన్నీరు పెట్టారు. భారీ విస్ఫోటనం అక్కడి జీవాల్ని మాత్రమే మాయం చేయగలిగింది... జీవాన్ని కాదు! రెండేళ్ల తరువాత బూడిదమయమై వున్న ఆ నగరంలో మొలకలు రావడం వారిలో ఆశల్ని చిగురింప చేసింది. యురేనియం ఆనవాళ్లు మెల్లగా చెరిగిపోయినా.. దాని తాలూకు దుష్పరిణామాలు అలాగే ఉన్నాయి. ఆ పేలుడులో బతికిన వారి జీవితాన్ని నరకంగా మార్చేందుకు డిసీజ్ ఎక్స్ అనే రోగం పుట్టుకొచ్చింది. ఒంటినిండా మచ్చలు వచ్చి రక్తపు వాంతులతో ప్రాణాలని మింగేస్తుందా రోగం. 6 లక్షలమంది ఈ వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. అది రాబోయే తరాలని పీడించకుండా ఉండాలని ఎన్నో ప్రయోగాలకు వ్యాధిగ్రస్తులు తమ శరీరాలనే అప్పగించారు. ఆ ప్రయోగాలు వారిని శారీరకంగానే కాక, మానసికంగానూ బాధించేవి. ఫలితంగా ఇప్పుడు హిరోషిమాలో రేడియేషన్ కారక వ్యాధులు ఎంతో తక్కువ. గత తరాల త్యాగాల ప్రతిఫలమే నేటి హిరోషిమా. నాటి విధ్వసానికి సజీవ సాక్ష్యంలా నిలిచిన డోమ్ భవనం (కుడి ఫొటో ప్రస్తుతం) జపాన్ లొంగిపోయేలోపే దారుణం రెండో ప్రపంచ యుద్ధ సమయం (1945)లో సోవియట్ యూనియన్ అధినేత స్టాలిన్, అమెరికా అధ్యక్షుడు హ్యారీ ఎస్ ట్రూమన్, గ్రేట్ బ్రిటన్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ (చర్చిల్ తర్వాత క్లెమెంట్ అట్లీ) జర్మనీలో సమావేశమయ్యారు. యుద్ధానికి తెర దించడంపై ఆ ఏడాది జూలై 27 నుంచి ఆగస్టు రెండవ తేదీ వరకు చర్చించారు. జపాన్ బేషరతుగా లొంగిపోవాలన్నది డిమాండ్. అప్పటి జపాన్ అంత సామర్థ్యం, అధికార బలం లేనిది కనుక బేషరతుగా లొంగిపోవడానికి సిద్ధమైంది. జపాన్ తమ అంగీకారం తెలిపేలోపే.. తాము తయారుచేసిన అణు బాంబులను వాడే అవకాశం మళ్లీ రాకపోవచ్చునని అమెరికా భావించింది. ఈ కారణంగా ఆగస్టు 6న హిరోషిమాపై లిటిల్ బాయ్ అనే అణుబాంబును ప్రయోగించిన అమెరికా.. దాని నుంచి తేరుకునేలోగా నాగసాకి పట్టణంపై ఫ్యాట్ మ్యాన్ అనే మరో అణుబాంబును ప్రయోగించి తమ రాక్షసత్వాన్ని ప్రదర్శించింది. శాంతికి చిహ్నంగా మారిన హిరోషిమా జపాన్‌లోని హొన్షు దీవిలో ఉన్న హిరోషిమా పెద్ద నగరం. హిరోషిమా అంటే జపాన్ భాష జపనీస్‌లో విశాలమైనది అనే అర్థం వస్తుంది. ఇప్పటికీ జపాన్ ఆర్థిక నిర్మాణంలో అతి ముఖ్యమైన నగరమే. దేశ విదేశాల నుండి ఇప్పటికీ ఎందరో వ్యాపారుల రాకపోకలతో కొత్త జీవితాన్ని గడుపుతోంది హిరోషిమా. అత్యాధునిక సదుపాయాలు, అధునాతన రహదారులు, ఆకాశాన్ని తాకే భవనాల నడుమ రాత్రిపూట నియాన్ దీపాల వెలుగులో నక్షత్రాల దీవిలా కనిపిస్తుంది హిరోషిమా. ప్రపంచశాంతికి చిహ్నంగా మారి, శాంతి కపోతాన్ని స్వేచ్ఛగా ఎగరవేస్తోంది హిరోషిమా. అణువిధ్వంసం అనంతరం శాంతి చేకూరాలని 1949లో హిరోషిమా పీస్ మెమోరియల్ పార్క్‌ను నిర్మించారు. కొన్నేళ్లపాటు శ్రమించి ఏర్పాటు చేసిన హిరోషిమా పీస్ మెమోరియల్ మ్యూజియాన్ని 1955లో ప్రారంభించారు. అణ్వాయుధాల పూర్తి నిర్మూలన కొరకు హిరోషిమా మెమోరియల్ పార్క్‌లో 1964లో వెలిగించిన శాంతి జ్యోతి ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. అణ్వాయుధాలు పూర్తిగా నిషేధం కావాలని మరెన్నో దేశాలు ఆకాంక్షిస్తున్నాయి. -
వియ్ కెన్ డు ఇట్
ఏళ్లుగా చూస్తోంది ప్రపంచం ఈ పోస్టర్ని. హోవర్ట్ మిల్లర్ అనే ఆర్టిస్టు ఈ పెయింటింగ్‌ని వేశాడు. ఎప్పుడూ.. 1940లలో! రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న టైమ్‌లో! తలకు ఎరుపు, తెలుపు పోల్కా చుక్కల ‘బందన’ కట్టుకుని వర్కింగ్ కోట్తో కాలిఫోర్నియాలోని నేవల్ ఎయిర్ స్టేషన్లో పని చేస్తూ ఉన్న ఓ ఇరవై ఏళ్ల యువతి ఫోటోను న్యూస్పేపర్లలో, మ్యాగజీన్స్‌లో చూసి, ఇన్స్పైర్ అయ్యి, ఈ చిత్రాన్ని గీశాడు హోవర్ట్. ఒక ఆడపిల్ల.. మగ ప్రపంచంలోకి వచ్చి జాబ్ చెయ్యడం ఎంత పెద్ద అమెరికాలో అయినా అప్పట్లో అపురూపమే. ఆమె ఫొటోను ఎవరు తీసి, ఎవరు పత్రికలకు ఇచ్చారో తెలీదు. ఆ ఫొటోలోని పోలికల్ని తీసుకుని, పిడికిలి బిగించి చెయ్యెత్తి బలాన్ని చూపిస్తున్న బొమ్మను గీశాడు హోవర్ట్. ఒరిజినల్ ఫొటో కన్నా కూడా, (అందులో ఆ యువతి తన పనిలో లీనమై ఉంటుంది) ఆ ఫొటోను చూసి గీసిన ‘పిడికిలి’ బొమ్మ అమెరికా అంతటా బాగా పాపురల్ అయింది. దాన్ని అమెరికా ప్రభుత్వం తీసుకుంది! ఫ్యాక్టరీల్లోకి, షిప్యార్డుల్లోకి, ఇంకా కష్టమైన పనుల్లోకి మహిళల్ని రప్పించేందుకు దానినొక ఇన్స్పైరింగ్ పోస్టర్‌గా వాడుకుంది. పోస్టర్‌లోని అమ్మాయికి ‘రోజీ ది రివెటర్’ అనే పేరు పెట్టి, ‘వియ్ కెన్ డు ఇట్’ అనే క్యాప్షన్ టైటిల్‌తో పోస్టర్లు ప్రింట్ చేయించి, గోడలపై అంటించి, యుద్ధ విధుల్లోకి కూడా అమ్మాయిల్ని ఆహ్వానించింది! అమెరికన్ జానపద గాథల్లోని వర్కింగ్ క్లాస్ విమనే రోజీ! ప్రపంచ యుద్ధం ముగిశాక కూడా ఆ పోస్టర్ ప్రాధాన్యం తగ్గలేదు. అమ్మాయిల మనోబలానికి ‘వియ్ ఎన్ డు ఇట్’ పోస్టర్ ఒక ప్రతీకగా నిలిచిపోయింది. కాలం గడిచింది. ఇంతకీ పోల్కా చుక్కల ఆ అమ్మాయి ఎవరు అన్న ప్రశ్న వచ్చింది. 1980లో గెరాల్డిన్ హోఫ్ డోయల్ అనే మహిళ అది తన ఫొటోనేనని ప్రకటించింది. ప్రపంచం కూడా అది గెరాల్డిన్ ఫోటోనేనని నమ్ముతూ వచ్చింది. అయితే 2009తో సడెన్‌గా నవోమీ పార్కర్ ఫ్రేలే సీన్లోకి వచ్చారు! ‘వరల్డ్ వార్ 2 హోమ్ ఫ్రంట్ నేషనల్ హిస్టారిక్ పార్క్’లో ఒరిజినల్ ఫొటో చూసి, ఆనందంతో కెవ్వున అరిచినంత పనిచేశారు నవోమీ. అది తన ఫొటోనే! అయితే ఫొటో కింద గెరాల్డిన్ డోయల్ అనే పేరు ఉండడం చూసి షాక్ తిన్నారు. అది నా ఫొటోనే.. నా ఫొటోనే అన్నారు కానీ ఎవరు నమ్ముతారు? రుజువేమిటి? రుజువు చెయ్యడానికి 2016 వరకు నవోమీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ ప్రయత్నంలో జేమ్స్ కింబ్లే అనే యూనివర్శిటీ ప్రొఫెసర్ ఆమెకు సహాయం చేస్తూ వచ్చారు. చివరికి నవోమీనే ‘రోజీ ది రివెటర్’ అని రూడీ అయింది. ‘రెటోరిక్ అండ్ పబ్లిక్ ఎఫైర్స్’ మ్యాగజీన్లో జ్ఞాపకాలు, గుర్తులు, ఆనవాళ్లతో సహా నవోమీ కథ వచ్చింది. నవోమీ ఎంతో సంతోషించారు. వాషింగ్టన్లో ఉంటున్న 97 ఏళ్ల నవోమీ పార్కర్ ఫ్రేలే మొన్న జనవరి 20న కన్ను మూసేవరకు ఆ సంతోషం ఆమె వెంటే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిమా మూర్తులైన స్త్రీలు కొందరు ప్రతి దేశానికీ కావాలి. అమెరికన్లు నన్ను ఒక ప్రతిమగా భావించడం నాకు సంతోషంగా ఉంది. – నవోమీ పార్కర్ ఫ్రేలే (1916) -
పోనివ్వని నవ్వు
సందర్భం నమ్మకం పైకి ఎలా ఉన్నా, లోలోపల మనుషులంతా నిజంగా చాలా మంచివాళ్లని నా నమ్మకం. యాన్ ఫ్రాంక్ డైరీలోని ఒక వాక్యం! ఆ వాక్యం చదివి యాన్ తండ్రి పెద్దగా ఏడ్చేశాడు. అంతకు ముందే అతడికో ఉత్తరం వచ్చింది. బెర్జెన్ ల్సన్ నిర్బంధ శిబిరంలో యాన్ ఫ్రాంక్‌కు పరిచయం అయిన ఒక నర్సు నుంచి వచ్చిన ఉత్తరం అది. యాన్ చనిపోయిందని! అప్పుడు రాలేదు యాన్ తండ్రికి అంత ఏడుపు. యాన్ డైరీలో ఈ వాక్యం చదివాక, గుండె పగిలి కళ్లలోంచి దుఃఖం ఎగజిమ్మినట్టుగా ఏడ్చేశాడు. యాన్ డైరీలను గుండెకు హత్తుకున్నాడు. ‘‘కూతుర్ని పొదవి పట్టుకున్నట్టు ఆయన ఆమె డైరీలను పట్టుకున్నారు. కూతురి తల నిమిరినట్టుగా ఆ డైరీల పేజీలను తిప్పారు. కూతురు చదువుతుంటే వింటున్నట్టుగా కళ్లు మూసుకున్నారు. డైరీలను ముఖానికి తాకించుకున్నారు. డైరీలు తెరిచి ఒక్కో పేరా చదవడం మొదలుపెట్టారు. చదువుతున్నారు. ఏడుస్తున్నారు. చదువుతున్నారు ఏడుస్తున్నారు. చదువుతూ చదువుతూ ఒకచోట పెద్దగా బద్దలైపోయారు’’ అని మీప్ కీస్ ఓ ఇంటర్వూ్యలో బహిర్గతం చేశారు. మీప్ కీస్ యాన్ ఫ్రాంక్‌కు సన్నిహితురాలు. యాన్ కన్నా ఇరవై ఏళ్లు పెద్ద. యాన్ తండ్రి దగ్గర టైపిస్టు. యాన్ డైరీలను భద్రపరిచిన వ్యక్తిగా, నాజీల నుంచి యాన్ కుటుంబాన్ని దాచిన మానవతామూర్తిగా చరిత్రలో నిలిచిపోయారు. 2010లో తన నూరేళ్ల వయసులో చనిపోయారు. చనిపోడానికి కొన్ని సంవత్సరాల ముందు, నాటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ, కూతురు డైరీలను ప్రేమగా స్పృశిస్తూ ఆ తండ్రి ఎంతగా విలపించిందీ మీప్ కీస్ లోకానికి చెప్పారు. ‘‘నా కూతురు.. నా కూతురు.. ఏం రాసిందో చూడు మీప్’’ అని డైరీని ఆమె చేతికి ఇచ్చారు యాన్ తండ్రి. ముఖాన్ని చేతుల్లో దాచుకుని మనిషంతా కదిలిపోయి, కుమిలి కుమిలి చాలాసేపు.. చాలాసేపు... ఏడుస్తూ ఉండిపోయారు. డైరీలో ఆయన వేలు పెట్టి చూపించిన వాక్యంపై మీప్ కీస్ కళ్లు ఆగాయి. ‘... పైకి ఎలా ఉన్నా, లోలోపల మనుషులంతా నిజంగా చాలా మంచివాళ్లు అని నా నమ్మకం’. ఈ వాక్యం చదివి మీప్ కీస్‌కి కూడా దుఃఖం ఆగలేదు. యుద్ధం ముగిసేనాటి ఆ కుటుంబంలో మిగిలి ఉన్నది యాన్ తండ్రి ఒక్కరే. ఆయన భార్య, ఆయన పెద్ద కూతురు, ఆయన చిన్న కూతురు యాన్ ఫ్రాంక్.. శిబిరంలోనే అక్కడి అమానుష పరిస్థితులకు తట్టుకోలేక అనారోగ్యంతో చనిపోయారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసి, మానవ దేహాల గుట్టల్లోంచి ఆవిర్లుగా ప్రాణాలు పైకి లేస్తున్నప్పుడు.. 1945 జనవరి 27 న రష్యన్ దళాలు జర్మనీలోని నాజీల శిబిరాలను బద్దలు కొట్టాయి. అలా.. కొనఊపిరితో ఓ శిబిరం నుంచి బయట పడ్డారు యాన్ తండ్రి. ఆయన్ని ఎలాగో కలుసుకుని కూతురి డైరీలను భద్రంగా ఆయనకు ఇచ్చారు మీప్ కీస్. యాన్ ఫ్రాంక్ 15 ఏళ్ల వయసులో చనిపోయింది. అయితే ఆమె డైరీలు ఇప్పటికీ బతికి ఉన్నాయి. ఎంతో మందిని బతికిస్తున్నాయి! యాన్ డైరీల నిండా మనుషులపై ప్రేమ ఉంది. మనుషుల మంచితనంపై నమ్మకం ఉంది. రెండు యుద్ధాల తర్వాత కూడా ప్రపంచం మానవత్వంపై నమ్మకం కోల్పోలేదంటే యాన్ డైరీలూ ఒక కారణం. రెండో ప్రపంచ యుద్ధం లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. యాన్ డైరీలు కోట్ల మందిని మానవ విద్వేషం నుంచి బయటపడేస్తున్నాయి. యుద్ధం ఒక మనిషి అయితే, ఆ మనిషికి యాన్ డైరీలోని పై వాక్యాన్ని చదవడానికి ఇస్తే.. ఆ యుద్ధం కూడా యాన్ తండ్రిలా వలవల ఏడ్చేస్తుంది. ఇవాళ యాన్ ఫ్రాంక్ పుట్టిన రోజు కాదు. జూన్ 12, 1929 తను పుట్టింది. ఇవాళ యాన్ ఫ్రాంక్ చనిపోయిన రోజు కూడా కాదు. 1945 ఫిబ్రవరిలో, మార్చిలోనో చనిపోయి ఉండొచ్చని మాత్రమే రికార్డులలో ఉంది. ఇవాళ యాన్ ఫ్రాంక్ను నాజీలు బందీగా పట్టుకెళ్లిన రోజు కూడా కాదు. 1944 ఆగస్టు 4న ఆమెను తీసుకెళ్లారు. ఇప్పుడు ఈ చిన్నారి మాట ఎందుకు వచ్చిందంటే.. నమ్మకద్రోహులు ఎవరో ఆ రోజున ఆమెను, ఆమె కుటుంబాన్ని జర్మనీ పోలీసులకు పట్టించి ఉంటారన్న అనుమానం ఒకటి చరిత్రలో ఉంది. అయితే నమ్మకద్రోహం జరిగిందనేదానికి ఆధారాలేమీ కనిపించడం లేదని, అనుకోకుండా ఆమె పోలీసులకు కనిపించి ఉండొచ్చని ఆమ్స్టర్డామ్ (నెదర్లాండ్స్) లోని ‘యాన్ ఫ్రాంక్ హౌస్’ మ్యూజియం పరిశోధకులు మొన్న శనివారం నాడు ప్రకటించారు. ఒకవేళ నిజంగానే నమ్మకద్రోహం జరిగి ఉన్నా యాన్ ఫ్రాంక్ ఆత్మ ఆ ద్రోహుల్ని క్షమించేస్తుంది. మనుషుల మీద, మానవత్వం మీద అంత నమ్మకం ఆ అమ్మాయికి! -
తప్పించుకున్నాడు.. ధన్యుడు కాలేదు..!
హిమ సంద్రంలో ఈత కొట్టాడు.. పీకల్లోతు మంచులో కూరుకుపోయాడు. శత్రువులు తరుముకొస్తుంటే.. మొరారుుస్తున్న తుపాకీతో తంటాలు పడ్డాడు. ఎలాగో ఒకడిని కాల్చాడు. ప్రాణాలు నిలబెట్టుకున్నాడు. ఏ వైపు నుంచి ఎవడు ఎప్పుడొస్తాడో తెలియని స్థితిలో వారాల పాటు మంచు గుహల్లో తలదాచుకున్నాడు. ఎముకలు కొరికే చలిబారి నుంచి.. అంతకంటే భయంకరమైన శత్రువు దృష్టి నుంచి ఎట్టకేలకు తప్పించుకున్నాడు. ‘‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడే’’ కావాలి. కానీ, ‘జాన్ బాల్‌సడ్’ మాత్రం కొందరి దృష్టిలో హీరో కాలేకపోయాడు. అతడి వీరోచిత పోరాటాన్ని నార్వేజియన్లు తప్పుగా అర్థం చేసుకున్నారు..! 1943, మార్చి 29.. పదకొండు మంది కమాండోలు, సిబ్బందితో కలిసి నార్వేలోని ఉత్తర జార్డ్స లోకి ప్రవేశించాడు జాన్ బాల్‌సడ్. రెండో ప్రపంచయుద్ధంలో భాగంగా తమ దేశాన్ని ఆక్రమించుకున్న జర్మన్ సేనల తాట తీయాలనేదే అతడి ఆశయం. ఆ మాటకొస్తే.. భయంకరమైన జార్డ్స లో అతడితో పాటు ప్రయాణిస్తున్న అందరి లక్ష్యమూ అదే. చేపల వేటకు అనువుగా ఉండే ఆ బోట్లో కొంత దూరం బాగానే ప్రయాణించారు జాన్, అతడి బృందం. ఆ క్షణంలోనే అతడికి పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చారుు. మూడేళ్ల క్రితం స్వీడన్‌కు పారిపోయాడు జాన్. నాజీ సేనల అకృత్యాలను భరించలేక నార్వేను విడిచి వెళ్లిపోయాడు. కానీ, తన దేశాన్ని అలాగే విడిచిపెట్టేయాలని అతడు భావించలేదు. తనలాంటి భావాలున్న మరికొందరు యువకుల్ని స్వీడన్లో కలిశాడు. వీరందరికీ మిత్రరాజ్య సేనలు సహకారం అందించారుు. జర్మనీ సేనలపై ఎదురుదాడి చేసేలా యుద్ధ విద్యల్లో శిక్షణ ఇచ్చారుు. అలా శిక్షణ పూర్తి చేసుకున్నాక, ఒక్కొక్కరూ ఒక్కో బాధ్యతను నెత్తిన వేసుకున్నారు. జాన్ బాల్‌సడ్ బృందానికి అప్పగించిన పని.. జర్మన్ ఎరుుర్ కంట్రోల్ టవర్‌ను పేల్చేయడం! తద్వారా నాజీలకు ఆకాశ మార్గంలో యుద్ధం చేసే అవకాశాలను తగ్గించాలని బలంగా నిర్ణరుుంచుకున్నారు జాన్ బృంద సభ్యులు. దీనికోసం 8 టన్నుల బరువుండే పేలుడు పదార్థాలను తమతో పాటు తీసుకెళ్లారు. టవర్ సమీపంలోకి చేరుకోగానే మంచు కిందిభాగంలోని నీటిలో ఈదుకుంటూ పేలుడు పదార్థాలను అమర్చి, తర్వాత పేల్చేయాలి. అన్నీ సవ్యంగా జరిగితే ఇదే జరిగి ఉండేది. కానీ, జాన్ బృందం చేసిన ఓ పొరపాటు ఆ మిషన్ స్వరూపాన్నే మార్చేసింది. బోట్ సముద్రజలాల్లోకి బయలుదేరే ముందు వారు ఓ వ్యక్తిని కలవాల్సి ఉంది. అరుుతే, అతడి పేరుతోనే ఉన్న మరో వ్యక్తిని పొరపాటున కలిసి, తమ ప్లాన్ మొత్తాన్నీ అతడికి వివరించారు. నాజీలకు వీరవిధేయుడైన ఆ వ్యక్తి.. ఈ మొత్తం పన్నాగాన్ని వెంటనే వారికి చేరవేశాడు. అంతే.. ప్లాన్ మొత్తం నాశనమైపోరుుంది. జర్మన్ సేనలు యుద్ధ నౌకల్లో బోట్‌ను వెంబడించారుు. నలువైపుల నుంచీ కాల్పులు మొదలుపెట్టారుు. దీంతో ఏ దిక్కుకు వెళ్లాలో బోట్లోని వారికి అర్థం కాలేదు. అందరూ మంచు నీళ్లలోకి దూకారు. జాన్ దాదాపు 60 మీటర్లు ఈదుకుంటూ ఒడ్డుకు చేరాడు. అరుుతే, తుపాకుల మోత మాత్రం అతడిని వెంటాడుతూనే ఉంది. పరుగు లంకించుకున్నాడు. తన సహచరులు ఒక్కొక్కరే తుపాకీ గుళ్లకు బలైపోవడం అతడికి తెలుస్తూనే ఉంది. చివరకు తానొక్కడే మిగిలాడు. కళ్లెదురుగా కనిపించిన చిన్నపాటి మంచు ప్రవాహాన్ని ఈది.. అవతలి వైపు మంచు కొండ మీదికి ఎక్కి, బండరాళ్ల చాటున దాక్కున్నాడు. ఈదే క్రమంలో అతడి కాలి బూటు ఒకటి ఊడిపోరుుంది. ఆ మంచుకొండపై బూటులేని పాదంతో చాలా సేపు అలాగే ఉండాల్సివచ్చింది. నాలుగు దిక్కులూ గాలిస్తోన్న శత్రువులు జాన్‌ను పసిగట్టారు. అతడు తలదాచుకున్న కొండ మీదికి ఎక్కుతున్నారు. వారిని కాల్చిపడేసేందుకు ఎంతగానో ప్రయత్నించాడు ఈ నార్వేజియన్. అరుుతే, మంచుదెబ్బకి తుపాకీ మూగబోరుుంది. శత్రువులు దగ్గరకు వస్తోన్న కొద్దీ అతడిలో ఉత్కంఠ మరింత పెరగసాగింది. చిట్టచివరి నిమిషంలో ఎలాగో పేలింది తుపాకీ.. రివ్వున దూసుకొచ్చిన బుల్లెట్ల ధాటికి ఒక జర్మన్ సైనికుడు కొండమీది నుంచి పడి మరణించాడు. ఇంకొకడు గాయపడ్డాడు. అలా తప్పించుకునే అవకాశం అనూహ్యంగా దొరకడంతో మంచు సరస్సు మీది నుంచి పరుగు లంకించాడు జాన్. అక్కడికి దగ్గర్లోని ఓ మంచు గుహలోకి ప్రవేశించాడు. అక్కడే ప్రమాదవశాత్తూ గోతిలో పడ్డాడు. బయటకు రాలేక, అందులోనే నాలుగురోజుల పాటు ఉండిపోయాడు. తర్వాత ఎలాగో బయటపడ్డా.. నాజీలు అక్కడే గస్తీ కాయడంతో గుహ నుంచి బయటకు రాలేకపోయాడు. అలా దాదాపు తొమ్మిది వారాలు గడపాల్సి వచ్చింది. ఈ క్రమంలో బూటు లేని కాలు పూర్తిగా మంచు దెబ్బకు గడ్డకట్టుకుపోరుుంది. దాన్ని అలాగే ఉంచితే తన ప్రాణాలకే ప్రమాదం అని గ్రహించిన జాన్.. వెంట తెచ్చుకున్న కత్తితో కాలి వేళ్లను స్వయంగా నరుక్కున్నాడు. అలా ప్రాణాలు కాపాడుకున్నాడు. అరుుతే, మరోవైపు మంచు తీవ్రత పెరిగిపోవడంతో కళ్లు దెబ్బతిన్నారుు. దాదాపు గుడ్డివాడైపోయాడు. ఈ క్రమంలో ఓ చిన్నపాటి పడవపై ఎక్కి ప్రయాణం మొదలుపెట్టాడు. తీరం చేరే నాటికి పూర్తిగా సృ్పహ కోల్పోయాడు. తీరంలో అతడిని గుర్తించిన స్థానికులు.. అతడికి వైద్య సహాయం అందించి, నాజీ సేనల కంట పడకుండా తిరిగి స్వీడన్‌కు పంపించారు. అలా అప్పటి భయంకర పరిస్థితుల నుంచి బయటపడ్డ ఒకే ఒక్కడిగా నిలిచాడు. అరుుతే, జర్మన్లను దెబ్బ కొట్టే ప్లాన్‌ను సక్రమంగా అమలు చేయలేకపోయారని చాలామంది జాన్‌ను విమర్శించారు. అతడి సాహసయాత్రను గుర్తించేందుకు కొందరు ఇష్టపడలేదు. చివరకు జాన్ బాల్‌సడ్ కూడా కొన్నాళ్లు తన ముఖం చూపేందుకు ఇష్టపడలేదంటే.. అతడు అనుభవించిన వేదన తెలుస్తుంది. ఏదేమైనా ఈ నార్వే వీరుడి దేశభక్తిని మాత్రం ఎవ్వరూ శంకించలేరు..! -
యుద్ధం ఓడిపోయింది
చరిత్ర పెద్దలకు దేవుడిచ్చే కానుక పిల్లలు. పిల్లలకు పెద్దలు ఇవ్వవలసిన కానుక ప్రేమ. వాస్తవానికి పిల్లలకు పెద్దలకు ఇచ్చే ప్రేమ.. ‘ఇచ్చే ప్రేమ’ కాదు. ‘తీసుకునే ప్రేమ’. పిల్లల సందడి లేకపోతే ఈ ప్రపంచం బోర్ కొట్టేస్తుంది. ‘ఎందుకు బతుకుతున్నాంరా.. దేవుడా’ అనిపిస్తుంది. పిల్లలంటే.. కడుపున పుట్టిన పిల్లలు మాత్రమే కాదు, పుడమిన పుట్టిన పిల్లలందరూ! ఆలోచించండి.. ఏదైనా పిల్లలుంటేనే ఆనందాన్నిస్తుంది. పూల తోట బాగుంటుంది. పిల్లలు తూనీగల్లా ఆ తోటలో పరుగులు తీస్తుంటే ఇంకా బాగుంటుంది. జాబిల్లి బాగుంటుంది. పిల్లలు ఆ జాబిల్లిని చూస్తూ ఏవేవో ప్రశ్నలు వేస్తుంటే ఇంకా బాగుంటుంది. పెద్ద పెద్ద కట్టడాలు కట్టుకుంటాం, వాటి మెట్లు పిల్లలెక్కి దిగుతుంటేనే అవి ప్రాణమున్న నిర్మాణాలు. ఫ్లైట్‌లో ఎగిరిపోతుంటాం, పిల్లలు మన సీటెక్కి తొక్కుతుంటేనే విమానం ఎక్కిన ఫీలింగ్. విహారం, వినోదం, సంస్కృతి, సంప్రదాయం.. ఏదైనా పిల్లల నవ్వులు వినిపిస్తేనే పరిపూర్ణం అయినట్టు. పండగైనా.. పిల్లలు పీకి పందిరేస్తేనే బాగా జరిగినట్టు. పసితనంలోని ‘పవర్ ఆఫ్ హీలింగ్’ ఇదంతా. పిల్లలు ఏదీ దాచుకోరు. బాధనీ, సంతోషాన్నీ! ప్రతిదీ దాచుకుంటాం కదా... అందుకే పిల్లంటే మనకంత ఆపేక్ష. అంత ప్రేమ. అంత వాత్సల్యం. ఈ చిన్నారిని చూడండి. ఆ నవ్వు చూడండి. ఆ క్షణంలో వాడికి ఇంకేం అక్కర్లేదు.. గుండెకు హత్తుకున్న ఆ కొత్త షూ తప్ప. యుద్ధంలో అమ్మ తప్పిపోయింది. నాన్న తప్పిపోయాడు. యుద్ధం వీడిని అనాథను చేసింది. ఓ ఆశ్రమం చేరదీసింది. వీడు ఏడుస్తున్నాడు. వాళ్లు ఓదారుస్తున్నారు. ఏడాది గడిచింది. ఇంతలో క్రిస్మస్ వచ్చింది. కానుక తెచ్చింది. కొత్త షూ! వీడి కళ్లు మెరిశాయి. ఏడుపు మానేశాడు. యుద్ధం జరిగినన్నాళ్లూ కొత్త అన్నదేదీ వీడు చూడలేదు. అందుకే ఆ మెరుపు. ‘లైఫ్’ మ్యాగజీన్ ఫొటోగ్రాఫర్ ఆ మెరుపును ఫొటో తీశాడు. యుద్ధంతో చితికిపోయి ఉన్న ప్రపంచ దేశాలకు ఈ చిన్నారి నవ్వు మళ్లీ ప్రాణం పోసింది. యుద్ధం ఓడిపోయింది. ఆరు కోట్ల మందిని పొట్టన పెట్టుకున్న యుద్ధానికైనా... ఇలాంటి ఒక్క చిరునవ్వు చాలు - సిగ్గుతో చితికి చావడానికి. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా అనాథ అయిన ఎంతో మంది బాలల్లో ఈ చిన్నారి ఒకడు. పేరు వెర్ఫెల్. దేశం ఆస్ట్రియా. అక్కడి యామ్ హిమ్మెల్ అనాథాశ్రమంలో ఇతడు పెరిగాడు. 1946 డిసెం బర్లో రెడ్‌క్రాస్ సంస్థ కానుకగా ఇచ్చిన కొత్త షూ జతను ఆ చిన్నారి పట్టలేని ఆనందంతో గుండెకు హత్తుకోవడం అక్కడున్న వాళ్లకు కన్నీళ్లు తెప్పించిందని ై‘లెఫ్’ పత్రిక రాసింది. ప్రపంచంలోని అరుదైన ఫొటోలలో ఇది ఒకటి. -
ఐక్య శాంతి సమితి
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, ప్రపంచంలో శాంతి సామరస్యాల కోసం 1945 అక్టోబర్ 24న ఆవిర్భవించిన ఐక్యరాజ్య సమితి రేపు 71వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. యుద్ధం ఏ కారణం వల్ల జరిగినా అది మానవాళి వినాశనానికే దారితీస్తుంది. యుద్ధం ఎలా ప్రారంభం అయినా దానికి మూలం... జాతి, మత ఆధిక్య ఘర్షణల్లోనే కనిపిస్తుంది. అందుకే సమితి నిరంతరం అభివృద్ధి గురించే మాట్లాడుతుంది. ‘‘మనుషులంతా ఒక్కటే అనుకున్నప్పుడు, దేశాలన్నీ ఒకటిగా ఉన్నప్పుడు మానవాళి సుఖశాంతులతో వర్థిల్లుతుంది’’ అని... వచ్చే జనవరి 1న సమితి కొత్త ప్రధాన కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఆంటోనియో గటెరస్ అంటున్నారు. సమితి ఎప్పుడూ మతాలను ప్రస్తావించదు. శాంతిని మాత్రమే ప్రవచిస్తుంది. మతాలు ఎన్నున్నా అవన్నీ మానవ కల్పితాలు తప్ప, దేవుని సంకల్పాలు కావు. అందుకే... ‘మతములన్ని మాసిపోవును, జ్ఞానమొక్కటే నిలిచిపోవును’ అని స్వామి వివేకానంద అన్నారు. ఆయన అంతరార్థం జ్ఞానమే దైవమని. ఈ తరానికి అవసరమైన జ్ఞానం... శాంతి జ్ఞానం. పురాణాలు దైవాన్ని ‘అద్వైతం’అని సంబోధించాయి. అంటే రెండో మాట, రెండో రూపం లేనిది అని. ‘ఏకైకం’ అన్నమాట. పవిత్ర ఖురాన్ ‘అల్లాహ్’ అంటే అత్యుత్తమమైన దేవుడు అని వివరిస్తోంది. పవిత్ర బైబిలు గంథంలో మోషే ప్రవక్త తనకు దర్శనం ఇచ్చిన మహాశక్తిమంతుడైన దేవుడిని తమరి నామధేయం ఏమిటో బయలు పరచమని ప్రాధేయపడతాడు. అందుకు బదులుగా యావే (డజిఠీజి); ‘యెహోవా’ అన్న గొప్ప శబ్దం వినిపిస్తుంది. హెబ్రీ భాషలో దానర్థం ‘సదా ఉన్నవాడు, ఉండేవాడు’. దైవశక్తి లేదా జ్ఞానశక్తి లేదా శాంతిశక్తి యుగయుగాల వరకు జీవించే ఉంటుంది. మానవుల్లా, ఇతర జీవచరాల్లా కొంతకాలం ఉండి గతించేది కాదు. మతాలకు అతీతంగా ఆ దివ్యమైన శక్తిని ఆరాధించాలి. అప్పుడే మానవజీవితం సార్థకమౌతుంది. శాంతిమయం అవుతుంది. బైబిల్లోనే ఒక వాక్యం ఉంది. ‘సృష్టికర్త అయిన దేవుడిని నీ పూర్ణ హృదయంతో ఆరాధించు. నిన్ను వలెనే నీ పొరుగువారిని ప్రేమించు’ అని! సాటి మనిషిని ప్రేమించడం అంటే దైవాన్ని ఆరాధించడమే. పురాతన హిందూ శాస్త్రాలు ‘మానవ సేవే, మాధవ సేవ’ అని చాటుతున్నాయి. ఈ సూక్తిని పాటించినప్పుడు భూతలం స్వర్గమయం అవుతుంది. శాంతిధామం అవుతుంది. - యస్. విజయ భాస్కర్