గ్రామీణ శ్రీలంకకు ప్రతీక
కొలంబో: కొలంబో సంపన్న, ప్రముఖ కుటుంబాలకు అపరిచితుడు. రైతు నేస్తం. గ్రామీణ శ్రీలంకకు ప్రతీక. పేరున్న స్కూళ్లలో చదువుకోని, ఇంగ్లీష్‌లో మాట్లాడని సామాన్యుడు. ఎల్లప్పుడూ సంప్రదాయ దుస్తులనే ధరించే జాతీయవాది. దేశంలో రాజ్యాంగ, ప్రజాస్వామ్య సంస్కరణలకు గట్టి మద్దతుదారు. శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు స్వీకరించబోతున్న మైత్రిపాల సిరిసేన(63) వ్యక్తిత్వాన్ని వివరించేందుకు ఈ పదాలు చాలు. శ్రీలంక ఉత్తర మధ్య రాష్ట్రానికి చెందిన మధ్యతరగతి కుటుంబంలో 1951లో సిరిసేన జన్మించారు.
1971లోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు ప్రయత్నిస్తున్నాడన్న ఆరోపణలపై రెండేళ్లు జైలుశిక్ష అనుభవించారు. 1989లో శ్రీలంక ఫ్రీడం పార్టీలో చేరి క్రియాశీల రాజకీయాల్లో అడుగిడి, అదే ఏడాది ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి వరుసగా 1994, 2000, 2001 ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. పలు ప్రభుత్వాల్లో ఆరోగ్యశాఖ, రక్షణశాఖలకు మంత్రిగా పనిచేశారు. ఆయనను హతమార్చేందుకు ఎల్టీటీఈ ఐదుసార్లు విఫలయత్నం చేసింది. 2008లో ఎల్టీటీఈ ఆత్మాహుతి దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. సిరిసేన తండ్రి రెండో ప్రపంచయుద్ధంలో సైనికుడిగా పనిచేశారు.
ఐక్య ప్రతిపక్ష కూటమి అభ్యర్థి.. ఇప్పటివరకు రెండుసార్లు వరుసగా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన మహీంద రాజపక్సకు సిరిసేన మంత్రివర్గ సహచరుడు. రాజపక్స నుంచి విడివడి ఐక్య ప్రతిపక్ష కూటమి అభ్యర్థిగా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. మొదట్లో సిరిసేనను రాజపక్సకు బలమైన ప్రత్యర్థిగా ఎవరూ భావించలేదు. రైతు నేపథ్యం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో సిరిసేనకు లభించిన భారీ మద్దతు, పట్టణాల్లో ప్రధాన ప్రతిపక్షం యునెటైడ్ నేషనల్ పార్టీ(యూఎన్‌పీ)కున్న పట్టు, రాజపక్సపై అవినీతి ఆరోపణలు, ఆయన కుటుంబ పాలనపై వ్యతిరేకత.. ఇవన్నీ కలసివచ్చి ఎన్నికల్లో సిరిసేనను విజయ పథంలో నిలిపాయి. మరోవైపు, సిరిసేనకే మద్దతివ్వాలంటూ మాజీ అధ్యక్షురాలు చంద్రిక కుమారతుంగ కూడా తన మద్దతుదారులకు పిలుపునివ్వడం, అలాగే బౌద్ధుల్లో ప్రజాదరణ ఉన్న బుద్ధిస్ట్ నేషనలిస్ట్ హెరిటేజ్ పార్టీ కూడా మద్దతివ్వడం ఆయనకు కలిసొచ్చింది.
అధ్యక్ష అధికారాల కుదింపు.. తన ప్రచారంలో కూడా రాజపక్స కుటుంబ పాలనను అంతం పలకాల్సిన అవసరం ఉందని, రాజపక్స పాలనలో దేశం నియంతృత్వం వైపు సాగుతోందని సిరిసేన ప్రధానంగా ప్రస్తావించారు. రాజపక్స పాలనలో దేశంలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం పెచ్చుమీరాయని విమర్శించారు. తాను గెలిస్తే వంద రోజుల్లోగా కార్యనిర్వాహక అధ్యక్షతను రద్దు చేస్తానని, అధ్యక్షుడి అధికారాలను తగ్గించేందుకు రాజ్యాంగ సవరణలను తీసుకువస్తానని, యూఎన్‌పీ నేత, మాజీ ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘేను మళ్లీ ప్రధానిగా నియమిస్తానని హామీ ఇచ్చారు. ఎన్నిసార్లైనా అధ్యక్ష ఎన్నికలకు పోటీ పడేందుకు అవకాశం కల్పించే రాజ్యాంగంలోని వివాదాస్పద 18వ సవరణను తొలగించి, 17వ సవరణను మళ్లీ రాజ్యాంగంలో పొందుపరుస్తానన్నారు.