Traditional clothing
-
రిలయన్స్ చీరలు కూడా వచ్చేస్తున్నాయ్...
సంప్రదాయ దుస్తులు, చీరల విభాగంలో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ (ఏబీఎఫ్ఆర్ఎల్), టాటా గ్రూప్‌నకు చెందిన తనిష్క్ తదితర సంస్థలకు పోటీగా రిలయన్స్ రిటైల్ కూడా రంగంలోకి దిగుతోంది. కొత్తగా అవంత్రా పేరిట స్టోర్స్ చెయిన్‌ను ప్రారంభించనుంది. ప్రైవేట్ లేబుల్స్‌ను విక్రయించడంతో పాటు ప్రాంతీయంగా వీవర్ క్లస్టర్లతో పాటు నల్లి సిల్క్స్ .. పోతీస్ వంటి థర్డ్ పార్టీ బ్రాండ్లతో కూడా అవంత్రా జట్టుకట్టనుంది. ఆభరణాలు, యాక్సెసరీలు, టైలరింగ్ సరీ్వసులు కూడా అందించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. తొలి స్టోరు బెంగళూరులో ఏర్పాటవుతుందని, ఆ తర్వాత కర్ణాటకలోని మిగతా ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించవచ్చని వివరించాయి. ఆభరణాల బ్రాండ్ అయిన తనిష్క్ సంప్రదాయ దుస్తుల్లోకి అడుగుపెట్టడం, ఏబీఎఫ్ఆర్ఎల్ కూడా సవ్యసాచి, తరుణ్ తహిలియాని వంటి దేశీ డిజైనర్ వేర్ బ్రాండ్స్‌లో వాటాలు కొనుగోలు చేసిన నేపథ్యంలో రిలయన్స్ అవంత్రా స్టోర్స్ ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. -
సంప్రదాయాల సందడి
దుండిగల్: విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో సందడి చేశారు.. ర్యాంప్ వాక్‌తో ఆహుతులను ఉర్రూతలూగించారు..కుత్బుల్లాపూర్ మండలం దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( ఎంఎల్ఆర్ఐటి) కళాశాలలో గురువారం ట్రెడిషనల్ డే ఘనంగా జరిగింది. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్‌రెడ్డి, సెక్రటరీ మర్రి రాజశేఖర్‌రెడ్డి, కోశాధికారి మమతరెడ్డి, ప్రిన్సిపాల్ కె.భాస్కరారెడ్డి, రాధికదేవి, పరంకుశం, ఫ్యాకల్టీ, విద్యార్థులు పాల్గొన్నారు. -
సంప్రదాయ దుస్తులు తప్పనిసరి
సంప్రదాయ దుస్తులతోనే ఆలయాల ప్రవేశం 1వ తేదీ నుంచి అమలు చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆలయాల సందర్శన సమయంలో భక్తులు విధిగా సంప్రదాయ దుస్తులు ధరింపజేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది. ఈమేరకు దేవాదాయశాఖ శనివారం ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడులో పారంపర్య, ఆచారాలు, అలవాట్లతో కూడిన ఆలయాలు ఉన్నాయి. విదేశీ పర్యాటకులు భారతదేశ పర్యటనలో వచ్చినపుడు ఆలయాల సందర్శనకే అధిక ప్రాధాన్యత నిస్తారు. ఈ సమయంలో విదేశీ నాగరికతను ప్రతిబింబించే దుస్తులను పక్కన పెట్టి పంచె, చీరలు వంటి హిందూ సంప్రదాయ దుస్తులను ధరిస్తుంటారు. అయితే పలు స్వదేశీ భక్తులు మాత్రం జీన్స్, టీ షర్ట్, టాప్, లెగింగ్స్ వంటి విదేశీ సంప్రదాయ దుస్తులతో వస్తున్నారు. స్వామి, అమ్మవార్ల దర్శనార్థం వస్తున్న కొందరు భక్తులకు ఫ్యాషన్ దుస్తులు ఇబ్బందికరంగా భావించగా, ఒక సామాజిక కార్యకర్త మదురై హైకోర్టు శాఖలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దాఖలు చేశాడు. ఈ వ్యాజ్యాన్ని అనుసరించి కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర దేవాదాయ శాఖ అన్ని ఆలయాలకు ఆదేశాలు జారీచేసింది. ఆలయాలకు వచ్చే భక్తులు హిందూ సంప్రదాయం ప్రకారం మగవారు పంచె, చొక్కా, పైజామా, కుర్తా ధరించాలి. అలాగే మహిళలు చీర, పవిట, పావడా ధరించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. సంప్రదాయ దుస్తుల ఉత్తర్వులను అన్ని ఆలయాల్లో బోర్డులపై ప్రదర్శించాలని సూచించారు. ఈ ఉత్తర్వులను జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని స్పష్టం చేశారు. సంప్రదాయ దుస్తుల నిబంధనను స్వాగతించిన చెన్నై ట్రిప్లికేన్ పార్థసారధి ఆలయ నిర్వాహకులు వెంటనే బోర్డు పెట్టేశారు. దేవాదాయశాఖకు చెందిన ఒక అధికారి మాట్లాడుతూ, ఆలయాల పవిత్రను ఇనుమడింప జేయడం భక్తుల కర్తవ్యమని అన్నారు. కొందరు భక్తులు ఆలయానికి వచ్చినపుడు సైతం ఏదో తమ ఇంటిలో ఉన్నట్లుగానే భావిస్తూ సంప్రదాయ కట్టుబొట్టును కాలరాస్తున్నారని చెప్పారు. దేశమంతా కీర్తింపబడుతున్న తమిళుల సంస్కృతి, సంప్రదాయాలు ఇక ఆలయాల్లో ప్రతిబింబిస్తాయని చెప్పారు. -
లాంగ్ లవ్లీ
పాదాలు కనిపించీ కనిపించకుండా, నేలపై పారాడే డ్రెస్‌ను వేసుకున్నప్పుడు ఎక్కడలేని రాజసం వచ్చేస్తుంది. లాంగ్ కుర్తా ధరించినా అంతే! సంప్రదాయాన్ని, అత్యాధునికతను ఏక కాలంలో ఇష్టపడే మహిళలు వేరే ఆలోచన లేకుండా వీటిని ధరించవచ్చు. ఇటీవల సంప్రదాయ దుస్తుల జాబితాలో ముందు వరసలో ఉంటోన్న డ్రెస్... లాంగ్ కుర్తా! నిన్నటి సల్వార్ కమీజ్‌కు కొత్త సొబగులు అద్ది, సంప్రదాయంగానూ, ఆధునికత ఉట్టిపడేలానూ లాంగ్ కుర్తాను తీర్చిదిద్దుతున్నారు నేటి ఫ్యాషన్ డిజైనర్లు. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించే ప్యాటర్న్స్ సందర్భానికి తగ్గట్టుగా ఈ డ్రెస్‌లో ఒదిగిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు మనవాళ్లు నైటీలను ఇంటికీ లాంగ్ గౌనులను పాశ్చాత్య ప్రపంచానికి పరిమితం చేశారు. అయితే ఈ రెండింటి నుంచి వచ్చిన లాంగ్ కుర్తీలు... పాశ్చాత్య పార్టీలలోనే కాదు, మన సంప్రదాయపు వివాహ వేడుకల్లోనూ హైలైట్ కావచ్చు అని నిరూపిస్తున్నాయి. స్లిమ్‌గా చూపిస్తుంది లాంగ్ కుర్తా సౌకర్యాన్ని ఇవ్వడంతో పాటు ఆధునికంగానూ కనిపించేలా చేస్తుంది. పొట్ట, నడుము కింది భాగం ఎక్కువగా ఉన్నా కూడా స్లిమ్‌గా చూపిస్తుంది. కుర్తా స్లీవ్స్ 3/4కు ఇప్పుడు బాగా డిమాండ్ ఉంది. ఇందులో స్లీవ్‌లెస్, షార్ట్ స్లీవ్స్ కూడా నడుస్తున్నాయి. వీటిలోనే నెక్ ప్యాటర్న్స్ ఎన్నో భిన్న మోడళ్లలో లభిస్తున్నాయి. కుర్తీస్‌ను కాటన్, సిల్క్, షిఫాన్, జార్జెట్, నెట్.. ఇలా అన్ని రకాల మెటీరియల్స్‌తో తయారుచేసుకోవచ్చు. అయితే లావుగా ఉన్న వారు సిల్క్, మల్ మల్ వంటి ఫ్యాబ్రిక్స్‌ను ఎంచుకోవడం మేలు. యాంకిల్ లెంగ్త్, 3/4 లెంగ్త్ ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచాన్ని ఏలుతున్నాయి. ట్రయల్ కట్, సి-కట్, అనార్కలీ స్టైల్, ఎ-లైన్ కుర్తీలు ఈ రోజుల్లో బాగా పాప్యులర్ జాబితాలో ఉన్నాయి. - షబ్నమ్ షిక్కా, ఫ్యాషన్ డిజైనర్, అడార్న్ ఫ్యాషన్ స్టూడియో అదనంగా ఎంబ్రాయిడరీ! ఎంబ్రాయిడరీతో హెవీ వర్క్ ఉన్న కుర్తీలు వేడుకలో ఇప్పుడు ప్రధాన ఆక ర్షణగా మారిపోతున్నాయి. అందుకని సాధారణంగా ఉండే పొడవాటి కుర్తాను ఎంచుకొని ఎంబ్రాయిడరీ, ప్రింట్లతో మెరిపించవచ్చు. సంప్రదాయ వేడుకలలో ఎంబ్రాయిడరీ చేసినవి, వృత్తిరీత్యా కార్యాలయాల్లో జరిగే వేడుకలకు ప్లెయిన్, ప్రింట్లు ఉన్నవి ధరించి మీదైన స్టైల్‌ని చూపించవచ్చు. మార్పులు చేర్పులు రోజూ ధరించే బోరింగ్ సల్వార్ కమీజ్లను కూడా కొద్దిపాటి మార్పులతో కాలిమడమల వరకు పొడిగించుకోవచ్చు. ఇందుకోసం మార్కెట్లో పెద్ద పెద్ద అంచులు, ఎంబ్రాయిడరీ పీసులు, లేసులు లభిస్తున్నాయి. వాటిని ఇప్పటికే ఉన్న కుర్తాకు జత చేసి, బాటమ్‌గా లెగ్గింగ్ వేసుకుంటే చాలు. ఆధునికం, సంప్రదాయ వేషధారణతో వేడుకలో ఇట్టే ఆకట్టుకోవచ్చు. సౌకర్యాన్ని బట్టి... లెగ్గింగ్, జెగ్గింగ్, పటియాలా, చుడీదార్.. వీటిలో తమ సౌకర్యాన్ని బట్టి లాంగ్ కుర్తీస్కు బాటమ్‌గా ఎంపిక చేసుకోవచ్చు. దుపట్టా వేసుకోవాలనే నిబంధన ఏమీ లేదు. అవసరాన్ని బట్టి స్టోల్, స్కార్ఫ్, దుపట్టాలనూ ఎంచుకోవచ్చు. -
గ్రామీణ శ్రీలంకకు ప్రతీక
కొలంబో: కొలంబో సంపన్న, ప్రముఖ కుటుంబాలకు అపరిచితుడు. రైతు నేస్తం. గ్రామీణ శ్రీలంకకు ప్రతీక. పేరున్న స్కూళ్లలో చదువుకోని, ఇంగ్లీష్‌లో మాట్లాడని సామాన్యుడు. ఎల్లప్పుడూ సంప్రదాయ దుస్తులనే ధరించే జాతీయవాది. దేశంలో రాజ్యాంగ, ప్రజాస్వామ్య సంస్కరణలకు గట్టి మద్దతుదారు. శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు స్వీకరించబోతున్న మైత్రిపాల సిరిసేన(63) వ్యక్తిత్వాన్ని వివరించేందుకు ఈ పదాలు చాలు. శ్రీలంక ఉత్తర మధ్య రాష్ట్రానికి చెందిన మధ్యతరగతి కుటుంబంలో 1951లో సిరిసేన జన్మించారు. 1971లోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు ప్రయత్నిస్తున్నాడన్న ఆరోపణలపై రెండేళ్లు జైలుశిక్ష అనుభవించారు. 1989లో శ్రీలంక ఫ్రీడం పార్టీలో చేరి క్రియాశీల రాజకీయాల్లో అడుగిడి, అదే ఏడాది ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి వరుసగా 1994, 2000, 2001 ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. పలు ప్రభుత్వాల్లో ఆరోగ్యశాఖ, రక్షణశాఖలకు మంత్రిగా పనిచేశారు. ఆయనను హతమార్చేందుకు ఎల్టీటీఈ ఐదుసార్లు విఫలయత్నం చేసింది. 2008లో ఎల్టీటీఈ ఆత్మాహుతి దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. సిరిసేన తండ్రి రెండో ప్రపంచయుద్ధంలో సైనికుడిగా పనిచేశారు. ఐక్య ప్రతిపక్ష కూటమి అభ్యర్థి.. ఇప్పటివరకు రెండుసార్లు వరుసగా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన మహీంద రాజపక్సకు సిరిసేన మంత్రివర్గ సహచరుడు. రాజపక్స నుంచి విడివడి ఐక్య ప్రతిపక్ష కూటమి అభ్యర్థిగా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. మొదట్లో సిరిసేనను రాజపక్సకు బలమైన ప్రత్యర్థిగా ఎవరూ భావించలేదు. రైతు నేపథ్యం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో సిరిసేనకు లభించిన భారీ మద్దతు, పట్టణాల్లో ప్రధాన ప్రతిపక్షం యునెటైడ్ నేషనల్ పార్టీ(యూఎన్‌పీ)కున్న పట్టు, రాజపక్సపై అవినీతి ఆరోపణలు, ఆయన కుటుంబ పాలనపై వ్యతిరేకత.. ఇవన్నీ కలసివచ్చి ఎన్నికల్లో సిరిసేనను విజయ పథంలో నిలిపాయి. మరోవైపు, సిరిసేనకే మద్దతివ్వాలంటూ మాజీ అధ్యక్షురాలు చంద్రిక కుమారతుంగ కూడా తన మద్దతుదారులకు పిలుపునివ్వడం, అలాగే బౌద్ధుల్లో ప్రజాదరణ ఉన్న బుద్ధిస్ట్ నేషనలిస్ట్ హెరిటేజ్ పార్టీ కూడా మద్దతివ్వడం ఆయనకు కలిసొచ్చింది. అధ్యక్ష అధికారాల కుదింపు.. తన ప్రచారంలో కూడా రాజపక్స కుటుంబ పాలనను అంతం పలకాల్సిన అవసరం ఉందని, రాజపక్స పాలనలో దేశం నియంతృత్వం వైపు సాగుతోందని సిరిసేన ప్రధానంగా ప్రస్తావించారు. రాజపక్స పాలనలో దేశంలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం పెచ్చుమీరాయని విమర్శించారు. తాను గెలిస్తే వంద రోజుల్లోగా కార్యనిర్వాహక అధ్యక్షతను రద్దు చేస్తానని, అధ్యక్షుడి అధికారాలను తగ్గించేందుకు రాజ్యాంగ సవరణలను తీసుకువస్తానని, యూఎన్‌పీ నేత, మాజీ ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘేను మళ్లీ ప్రధానిగా నియమిస్తానని హామీ ఇచ్చారు. ఎన్నిసార్లైనా అధ్యక్ష ఎన్నికలకు పోటీ పడేందుకు అవకాశం కల్పించే రాజ్యాంగంలోని వివాదాస్పద 18వ సవరణను తొలగించి, 17వ సవరణను మళ్లీ రాజ్యాంగంలో పొందుపరుస్తానన్నారు. -
ఆ ఒక్కటే కాదు..!
సంప్రదాయ దుస్తుల్లో బిగ్స్క్రీన్పై మురిపించే మలయాళ తార జ్యోతికృష్ణా... తనపై ఉన్న ఆ ముద్రను చెరిపేసుకోవాలనుకొంటున్నట్టుంది. ఆ విషయాన్ని స్ట్రయిట్‌గా చెప్పట్లేదు గానీ.. ‘మోడర్న్ అవుట్‌ఫిట్స్ నాకు సూటవ్వవని సన్నిహితులు చెబుతుంటారు. ఇప్పటివరకు వచ్చిన క్యారెక్టర్లు నాపై అలా ట్రెడిషనల్ గాళ్ ముద్ర వేశాయి. కానీ వాటికే పరిమితమవ్వాలనుకోవడం లేదు. నాకూ మోడర్న్ డ్రెస్సులు సరిపోతాయని చెప్పడానికి ఓ ఫొటో సూట్ కూడా చేశా’ అంటూ తనకు తానే బ్రాండింగ్ చేసుకొంటోందీ సుందరి.