లాంగ్ లవ్లీ | special design Long Kurta | Sakshi
Sakshi News home page

లాంగ్ లవ్లీ

Published Wed, Feb 25 2015 10:29 PM | Last Updated on Sat, Sep 2 2017 9:54 PM

లాంగ్ లవ్లీ

లాంగ్ లవ్లీ

పాదాలు కనిపించీ కనిపించకుండా, నేలపై పారాడే డ్రెస్‌ను వేసుకున్నప్పుడు ఎక్కడలేని రాజసం వచ్చేస్తుంది. లాంగ్ కుర్తా ధరించినా అంతే! సంప్రదాయాన్ని, అత్యాధునికతను ఏక కాలంలో ఇష్టపడే మహిళలు వేరే ఆలోచన లేకుండా వీటిని ధరించవచ్చు.
 
ఇటీవల సంప్రదాయ దుస్తుల జాబితాలో ముందు వరసలో ఉంటోన్న డ్రెస్... లాంగ్ కుర్తా! నిన్నటి సల్వార్ కమీజ్‌కు కొత్త సొబగులు అద్ది, సంప్రదాయంగానూ, ఆధునికత ఉట్టిపడేలానూ లాంగ్ కుర్తాను తీర్చిదిద్దుతున్నారు నేటి ఫ్యాషన్ డిజైనర్లు. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించే ప్యాటర్న్స్ సందర్భానికి తగ్గట్టుగా ఈ డ్రెస్‌లో ఒదిగిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు మనవాళ్లు నైటీలను ఇంటికీ లాంగ్ గౌనులను పాశ్చాత్య ప్రపంచానికి పరిమితం చేశారు. అయితే ఈ రెండింటి నుంచి వచ్చిన లాంగ్ కుర్తీలు... పాశ్చాత్య పార్టీలలోనే కాదు, మన సంప్రదాయపు వివాహ వేడుకల్లోనూ హైలైట్ కావచ్చు అని నిరూపిస్తున్నాయి.
 
స్లిమ్‌గా చూపిస్తుంది

లాంగ్ కుర్తా సౌకర్యాన్ని ఇవ్వడంతో పాటు ఆధునికంగానూ కనిపించేలా చేస్తుంది. పొట్ట, నడుము కింది భాగం ఎక్కువగా ఉన్నా కూడా స్లిమ్‌గా చూపిస్తుంది. కుర్తా స్లీవ్స్ 3/4కు ఇప్పుడు బాగా డిమాండ్ ఉంది. ఇందులో స్లీవ్‌లెస్, షార్ట్ స్లీవ్స్ కూడా నడుస్తున్నాయి. వీటిలోనే నెక్ ప్యాటర్న్స్ ఎన్నో భిన్న మోడళ్లలో లభిస్తున్నాయి. కుర్తీస్‌ను కాటన్, సిల్క్, షిఫాన్, జార్జెట్, నెట్.. ఇలా అన్ని రకాల మెటీరియల్స్‌తో తయారుచేసుకోవచ్చు. అయితే లావుగా ఉన్న వారు సిల్క్, మల్ మల్ వంటి ఫ్యాబ్రిక్స్‌ను ఎంచుకోవడం మేలు. యాంకిల్ లెంగ్త్, 3/4 లెంగ్త్ ప్రస్తుతం  ఫ్యాషన్ ప్రపంచాన్ని ఏలుతున్నాయి. ట్రయల్ కట్, సి-కట్, అనార్కలీ స్టైల్, ఎ-లైన్ కుర్తీలు ఈ రోజుల్లో బాగా పాప్యులర్ జాబితాలో ఉన్నాయి.
 - షబ్నమ్ షిక్కా, ఫ్యాషన్ డిజైనర్,
 అడార్న్ ఫ్యాషన్ స్టూడియో
 
అదనంగా ఎంబ్రాయిడరీ!

ఎంబ్రాయిడరీతో హెవీ వర్క్ ఉన్న కుర్తీలు వేడుకలో ఇప్పుడు ప్రధాన ఆక ర్షణగా మారిపోతున్నాయి. అందుకని సాధారణంగా ఉండే పొడవాటి కుర్తాను ఎంచుకొని ఎంబ్రాయిడరీ, ప్రింట్లతో మెరిపించవచ్చు. సంప్రదాయ వేడుకలలో ఎంబ్రాయిడరీ చేసినవి, వృత్తిరీత్యా కార్యాలయాల్లో జరిగే వేడుకలకు ప్లెయిన్, ప్రింట్లు ఉన్నవి ధరించి మీదైన స్టైల్‌ని చూపించవచ్చు.
 
మార్పులు చేర్పులు

రోజూ ధరించే బోరింగ్ సల్వార్ కమీజ్‌లను కూడా కొద్దిపాటి మార్పులతో కాలిమడమల వరకు పొడిగించుకోవచ్చు. ఇందుకోసం మార్కెట్లో పెద్ద పెద్ద అంచులు, ఎంబ్రాయిడరీ పీసులు, లేసులు లభిస్తున్నాయి. వాటిని ఇప్పటికే ఉన్న కుర్తాకు జత చేసి, బాటమ్‌గా లెగ్గింగ్ వేసుకుంటే చాలు. ఆధునికం, సంప్రదాయ వేషధారణతో వేడుకలో ఇట్టే ఆకట్టుకోవచ్చు.
 
సౌకర్యాన్ని బట్టి...

లెగ్గింగ్, జెగ్గింగ్, పటియాలా, చుడీదార్.. వీటిలో తమ సౌకర్యాన్ని బట్టి లాంగ్ కుర్తీస్‌కు బాటమ్‌గా ఎంపిక చేసుకోవచ్చు. దుపట్టా వేసుకోవాలనే నిబంధన ఏమీ లేదు. అవసరాన్ని బట్టి స్టోల్, స్కార్ఫ్, దుపట్టాలనూ ఎంచుకోవచ్చు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement