బతుకు చితికి.. గూడు చెదిరి... వలస బాట | 12 crore Refugees persons worldwide | Sakshi
Sakshi News home page

బతుకు చితికి.. గూడు చెదిరి... వలస బాట

Published Fri, Jun 28 2024 4:13 AM | Last Updated on Fri, Jun 28 2024 4:13 AM

12 crore Refugees persons worldwide

ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల మంది శరణార్థులు

40 శాతం పొట్ట చేత పట్టుకుని విదేశాలకు

ఉక్రెయిన్, గాజా యుద్ధాలతో పెరిగిన శరణార్థుల సంఖ్య

యుద్ధం, హింసతో చితుకుతున్న బతుకులు

పుట్టిన నేల.. పెరిగిన ఊరు.. ఇవే మనిషి అస్తిత్వం. కానీ యుద్ధం, హింస ప్రజలను నిరాశ్రయులను చేస్తోంది. అధికార దాహం, అహంకార ధోరణి కోట్ల మందిని సొంత నేలకే పరాయివాళ్లుగా మారుస్తోంది. గత పదేళ్లలో ప్రపంచ జనాభాలో ప్రతి 69 మందిలో ఒకరు చొప్పున ఏకంగా 12 కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. వీరిలో చాలామంది తలదాచుకునేందుకు కూడా దిక్కులేక శరణార్థులుగా మారాల్సి వస్తోంది. ప్రాణాలను చేతబట్టుకుని విదేశాల బాట పట్టాల్సిన దుస్థితి దాపురిస్తోంది...!            – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

సంఘర్షణ, హింస, మానవ హక్కుల ఉల్లంఘనల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 11.7 కోట్ల మందికి పైగా నిరాశ్రయులైనట్టు ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషన్‌ (యూఎన్‌హెచ్‌సీఆర్‌) వెల్లడించింది. వీరిలో 6.83 కోట్ల మంది సంఘర్షణలు, ఇతర సంక్షోభాల కారణంగా సొంత దేశాల్లోనే ఇతర ప్రాంతాలకు చెదిరిపోయారు. దాదాపు 4.5 కోట్ల మంది పొట్ట చేత పట్టుకుని శరణార్థులుగా విదేశాలకు వలస వెళ్లారు. 2024 తొలి నాలుగు నెలల్లో ఇది మరింత పెరిగింది.

పదేళ్లకోసారి రెట్టింపు..  
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1951లో ఐరోపాలోని శరణార్థుల హక్కులను పరిరక్షించేందుకు ఐక్యరాజ్యసమితి శరణార్థుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. 1967లో శరణార్థుల కన్వెన్షన్‌ ఆవిర్భవించినప్పుడు 20 లక్షల మంది శరణార్థులున్నారు. 
⇒ 1980 నాటికి కోటికి చేరిన శరణార్థులు 
⇒ 1990 నాటికి రెండు కోట్లకు చేరిన సంఖ్య
⇒  2021 చివరి నాటికి 3 కోట్లను మించిన శరణార్థులు
⇒ తాజాగా 11 కోట్లు దాటేసిన వైనం

2020 నుంచి వేగంగా...
⇒ 2022లో రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం మొదలయ్యాక 2023 చివరి నాటికి 60 లక్షల మంది ఉక్రేనియన్లు నిరాశ్రయులయ్యారు. వీరిలో చాలామంది దేశం విడిచి వెళ్లారు. 
⇒ 2023లో సుడాన్‌లో సైన్యం, ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్సెస్‌ మధ్య ఘర్షణలు శరణార్థుల సంఖ్యను 10.5 లక్షలు పెంచాయి. 
⇒ ఇక ఇజ్రాయెల్‌ దాడులతో గాజాలో గతేడాది చివరి మూడు నెలల్లో 10.7 లక్షల మంది నిరాశ్రయులై వలస వెళ్లారు.

ఎక్కడి నుంచి వస్తున్నారు?
⇒ ప్రపంచవ్యాప్తంగా నమోదైన దాదాపు 4.5 కోట్ల మంది శరణార్థులలో దాదాపు మూడొంతులు (72 శాతం) ఐదు దేశాల నుంచే వచ్చారు.

అఫ్గానిస్తాన్‌     64 లక్షలు 
సిరియా     64 లక్షలు 
వెనెజులా     61 లక్షలు 
ఉక్రెయిన్‌     60 లక్షలు 
పాలస్తీనా     60 లక్షలు

ఆశ్రయమిస్తున్న దేశాలు?
⇒ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 శాతం మంది శరణార్థులు తమ స మీప పొరుగు దేశాల్లోనే బతుకీడుస్తున్నారు. 
⇒ ఇరాన్, పాకిస్తాన్లోని శరణార్థులందరూ అఫ్గాన్లే. 
⇒ టర్కీలో ఎక్కువ మంది శరణార్థులు సిరియన్లు.

దేశం          శరణార్థులు 
ఇరాన్‌    38 లక్షలు 
తుర్కియే    33 లక్షలు 
కొలంబియా     29 లక్షలు 
జర్మనీ    26 లక్షలు 
పాకిస్తాన్‌    20 లక్షలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement