వెయ్యి రోజుల యుద్ధం | Russia-Ukraine War Marks 1000th Day Today, 21st Century's Deadliest Conflict | Sakshi
Sakshi News home page

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి వెయ్యి రోజులు

Published Tue, Nov 19 2024 9:43 AM | Last Updated on Tue, Nov 19 2024 11:15 AM

Russia-Ukraine War Marks 1000th Day Today, 21st Century's Deadliest Conflict
  • రష్యా దండయాత్ర కారణంగా ఉక్రెయిన్‌లో వేలాది మంది పౌరుల మరణం
  • వివిధ దేశాల్లో శరణార్థులుగా జీవనం సాగిస్తున్న 60 లక్షల మంది ప్రజలు
  • ఉక్రెయిన్‌లో 25 శాతం జనాభా తుడిచిపెట్టుకుపోయినట్లుగా అంచనా

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి నేటికి వెయ్యి రోజులు పూర్తయ్యాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన ఈ యుద్ధం ఐరోపాలో అత్యంత ఘోరమైన సంఘర్షణగా రూపుదిద్దుకుంది. పలు నివేదికలలోని వివరాల ప్రకారం ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఒక మిలియన్(10 లక్షలు)కు పైగా జనం మరణించడమో, తీవ్రంగా గాయపడటమో జరిగింది.

2022లో ప్రారంభమైన 21వ శతాబ్దపు ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌లోని నగరాలు, పట్టణాలు, గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రాణనష్టం, ఆస్తి నష్టం  అంతకంతకూ పెరుగుతూనే ఉంది. యుద్ధంలో దెబ్బతిన్న దేశం నుంచి నిరంతరం హృదయాన్ని కదిలించే వార్తలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి కంటే ఇప్పుడు ఆ దేశం ఎంతో బలహీనంగామారింది.

వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం యుద్ధంలో 80 వేల మంది ఉక్రేనియన్ సైనికులు మరణించారు. నాలుగు లక్షల మందికి పైగా సైనికులు గాయపడ్డారు. పాశ్చాత్య ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అందించిన వివరాల ప్రకారం రష్యన్ సైనికుల మరణాల గణాంకాలు భిన్నంగా ఉన్నాయి. కొన్ని నివేదికలలో మరణించిన సైనికుల సంఖ్య సుమారు రెండు లక్షలు, గాయపడిన వారి సంఖ్య దాదాపు నాలుగు లక్షలుగా పేర్కొన్నారు. రెండు దేశాల జనాభా ఇప్పటికే క్షీణించింది. యుద్ధానికి ముందే  ఇరు దేశాలు ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. యుద్ధం కారణంగా సంభవించిన భారీ మరణాల ప్రభావం ఇరు దేశాల జనాభా గణాంకాలపై కనిపిస్తోంది.

మరణించిన సైనికుల డేటా గోప్యం?
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మిషన్ తెలిపిన వివరాల ప్రకారం ఉక్రెయిన్‌లో ఆగస్టు 2024 నాటికి 11,743 మంది పౌరులు మరణించారు. 24,614 మంది గాయపడ్డారు. ముఖ్యంగా మారియుపోల్ వంటి రష్యన్ నియంత్రణలో ఉన్న ప్రాంతాలలో ఈ మరణాలు సంభవించాయి. ఇదేకాకుండా ఉక్రెయిన్‌లో ఇప్పటివరకు 589 మంది చిన్నారులు కూడా మరణించారు.  యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలు, గ్రౌండ్ దళాలు నిరంతరం దాడులు చేస్తున్నాయి. జాతీయ భద్రత కోసం యుద్ధంలో మరణించిన తమ సైనికుల డేటాను ఇరుపక్షాలు గోప్యంగా ఉంచాయని, పాశ్చాత్య దేశాల ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా ఇచ్చిన అంచనాలలో చాలా తేడా ఉందని ఒక ఈ మీడియా నివేదిక పేర్కొంది. సైనిక ప్రాణనష్టం విషయంలో కూడా రష్యాకు భారీ నష్టం వాటిల్లిందనే అంచనాలున్నాయి ఈ భీకర యుద్ధంలో ఒక్క రోజులో వెయ్యి మందికి పైగా రష్యన్ సైనికులు మరణించారు. ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ 2024, ఫిబ్రవరిలో  31 వేలకు పైగా ఉక్రేనియన్ సైనికులు  మృతిచెందారని తెలిపారు.

ఉక్రెయిన్ జనాభాలో 25 శాతం మృతి
యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో జననాల రేటు రెండున్నరేళ్ల క్రితం ఉన్న దానికంటే ఇప్పుడు మూడో వంతుకు పడిపోయింది. ఉక్రెయిన్‌లో దాదాపు నాలుగు మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు. ఆరు మిలియన్లకు పైగా ఉక్రేనియన్ పౌరులు విదేశాల్లో ఆశ్రయం పొందారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ జనాభా 10 మిలియన్లకు పైగా తగ్గింది. ఇది  అక్కడి జనాభాలో నాలుగింట ఒక వంతు. అంటే ఉక్రెయిన్ జనాభాలో 25 శాతం తుడిచిపెట్టుకుపోయింది. యుక్రేనియన్ ప్రభుత్వం యుద్ధంలో రోజువారీ ఖర్చు 140 మిలియన్ అమెరికన్‌ డాలర్ల కంటే ఎక్కువ అని అంచనా వేసింది. ఉక్రెయిన్ 2025 ప్రతిపాదిత బడ్జెట్‌లో రక్షణ కోసం 26 శాతం అంటే 53.3 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం
యుద్ధం కారణంగా ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ 2022లో 33 శాతం క్షీణించింది. 2023లో ఈ పరిస్థితి కాస్త మెరుగుపడి నష్టం 22 శాతానికి పరిమితమైంది. హౌసింగ్, రవాణా, వాణిజ్యం, పరిశ్రమలు, ఇంధనం, వ్యవసాయ రంగాలు యుద్ధానికి అమితంగా ప్రభావితమయ్యాయి. ఉక్రెయిన్‌లోని రిమోట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను రష్యా లక్ష్యంగా చేసుకోవడంతో ఉక్రెయిన్ ఇంధన రంగం తీవ్రంగా దెబ్బతింది.

ఉక్రెయిన్‌లో కొంతభాగం రష్యా స్వాధీనం
రాయిటర్స్ నివేదిక ప్రకారం ఉక్రెయిన్‌లో ఐదవ వంతును రష్యా స్వాధీనం చేసుకుంది. ఆ ప్రాంతాలను తన అదుపులో ఉంచుకుంది. ఈ భాగం గ్రీస్ దేశ పరిమాణంతో సమానం. రష్యన్ దళాలు 2022 ప్రారంభంలో ఉక్రెయిన్‌లోని ఉత్తర, తూర్పు, దక్షిణ భాగాలలో దాడి చేసి, ఉత్తరాన కీవ్ శివార్లకు చేరుకుని, దక్షిణాన డ్నిప్రో నదిని దాటాయి. రష్యా దాదాపు ఉక్రెయిన్‌లోని తూర్పు డాన్‌బాస్ ప్రాంతాన్ని, దక్షిణాన అజోవ్ సముద్ర తీరాన్ని స్వాధీనం చేసుకుంది.

పుతిన్‌కు గిట్టని ఉక్రేనియన్ గుర్తింపు 
ఉక్రెయిన్ ఒకప్పుడు రష్యన్ సామ్రాజ్యంలో భాగం. తరువాత సోవియట్ యూనియన్‌లో భాగమైంది. ఉక్రెయిన్‌ను మళ్లీ రష్యాలో విలీనం చేయడమే తన లక్ష్యమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పలు సందర్భాల్లో చెప్పారు. పుతిన్ ఉక్రేనియన్ రాష్ట్ర హోదాను, గుర్తింపును తిరస్కరించారు. ఉక్రేనియన్లు నిజానికి రష్యన్లేనని పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం లక్షలాది మంది ప్రాణాలను బలిగొనడమే కాకుండా  ఇరు దేశాల జనాభా, ఆర్థిక వ్యవస్థ, సామాజిక నిర్మాణాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ యుద్ధం  ప్రపంచ సంక్షోభానికి కూడా దారితీసింది. 

ఇది కూడా చదవండి: భారత్‌ దౌత్య విజయం.. ఏకాభిప్రాయం అమలుకు చైనా సిద్ధం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement