పోనివ్వని నవ్వు | I really believe that a lot of good people. | Sakshi
Sakshi News home page

పోనివ్వని నవ్వు

Published Sun, Dec 18 2016 11:13 PM | Last Updated on Mon, Apr 8 2019 7:51 PM

పోనివ్వని నవ్వు - Sakshi

పోనివ్వని నవ్వు

సందర్భం
నమ్మకం


పైకి ఎలా ఉన్నా, లోలోపల మనుషులంతా నిజంగా చాలా మంచివాళ్లని నా నమ్మకం. యాన్‌ ఫ్రాంక్‌ డైరీలోని ఒక వాక్యం! ఆ వాక్యం చదివి యాన్‌ తండ్రి పెద్దగా ఏడ్చేశాడు. అంతకు ముందే అతడికో ఉత్తరం వచ్చింది. బెర్జెన్‌  ల్సన్‌ నిర్బంధ శిబిరంలో యాన్‌ ఫ్రాంక్‌కు పరిచయం అయిన ఒక నర్సు నుంచి వచ్చిన ఉత్తరం అది. యాన్‌ చనిపోయిందని! అప్పుడు రాలేదు యాన్‌ తండ్రికి అంత ఏడుపు. యాన్‌ డైరీలో ఈ వాక్యం చదివాక, గుండె పగిలి కళ్లలోంచి దుఃఖం ఎగజిమ్మినట్టుగా ఏడ్చేశాడు. యాన్‌ డైరీలను గుండెకు హత్తుకున్నాడు. ‘‘కూతుర్ని పొదవి పట్టుకున్నట్టు ఆయన ఆమె డైరీలను పట్టుకున్నారు. కూతురి తల నిమిరినట్టుగా ఆ డైరీల పేజీలను తిప్పారు. కూతురు చదువుతుంటే వింటున్నట్టుగా కళ్లు మూసుకున్నారు. డైరీలను ముఖానికి తాకించుకున్నారు. డైరీలు తెరిచి ఒక్కో పేరా చదవడం మొదలుపెట్టారు. చదువుతున్నారు. ఏడుస్తున్నారు. చదువుతున్నారు ఏడుస్తున్నారు. చదువుతూ చదువుతూ ఒకచోట పెద్దగా బద్దలైపోయారు’’ అని మీప్‌ కీస్‌ ఓ ఇంటర్వూ్యలో బహిర్గతం చేశారు.

మీప్‌ కీస్‌ యాన్‌ ఫ్రాంక్‌కు సన్నిహితురాలు. యాన్‌ కన్నా ఇరవై ఏళ్లు పెద్ద. యాన్‌ తండ్రి దగ్గర టైపిస్టు. యాన్‌ డైరీలను భద్రపరిచిన వ్యక్తిగా, నాజీల నుంచి యాన్‌ కుటుంబాన్ని దాచిన మానవతామూర్తిగా చరిత్రలో నిలిచిపోయారు. 2010లో తన నూరేళ్ల వయసులో చనిపోయారు. చనిపోడానికి కొన్ని సంవత్సరాల ముందు, నాటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ, కూతురు డైరీలను ప్రేమగా స్పృశిస్తూ ఆ తండ్రి ఎంతగా విలపించిందీ మీప్‌ కీస్‌ లోకానికి చెప్పారు.

‘‘నా కూతురు.. నా కూతురు.. ఏం రాసిందో చూడు మీప్‌’’ అని డైరీని ఆమె చేతికి ఇచ్చారు యాన్‌ తండ్రి. ముఖాన్ని చేతుల్లో దాచుకుని మనిషంతా కదిలిపోయి, కుమిలి కుమిలి చాలాసేపు.. చాలాసేపు... ఏడుస్తూ ఉండిపోయారు. డైరీలో ఆయన వేలు పెట్టి చూపించిన వాక్యంపై మీప్‌ కీస్‌ కళ్లు ఆగాయి. ‘... పైకి ఎలా ఉన్నా, లోలోపల మనుషులంతా నిజంగా చాలా మంచివాళ్లు అని నా నమ్మకం’. ఈ వాక్యం చదివి మీప్‌ కీస్‌కి కూడా దుఃఖం ఆగలేదు. యుద్ధం ముగిసేనాటి ఆ కుటుంబంలో మిగిలి ఉన్నది యాన్‌ తండ్రి ఒక్కరే. ఆయన భార్య, ఆయన పెద్ద కూతురు, ఆయన చిన్న కూతురు యాన్‌ ఫ్రాంక్‌.. శిబిరంలోనే అక్కడి అమానుష పరిస్థితులకు తట్టుకోలేక అనారోగ్యంతో చనిపోయారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసి, మానవ దేహాల గుట్టల్లోంచి ఆవిర్లుగా ప్రాణాలు పైకి లేస్తున్నప్పుడు.. 1945 జనవరి 27 న రష్యన్‌ దళాలు జర్మనీలోని నాజీల శిబిరాలను బద్దలు కొట్టాయి. అలా.. కొనఊపిరితో ఓ శిబిరం నుంచి బయట పడ్డారు యాన్‌ తండ్రి. ఆయన్ని ఎలాగో కలుసుకుని కూతురి డైరీలను భద్రంగా ఆయనకు ఇచ్చారు మీప్‌ కీస్‌.

యాన్‌ ఫ్రాంక్‌ 15 ఏళ్ల వయసులో చనిపోయింది. అయితే ఆమె డైరీలు ఇప్పటికీ బతికి ఉన్నాయి. ఎంతో మందిని బతికిస్తున్నాయి! యాన్‌ డైరీల నిండా మనుషులపై ప్రేమ ఉంది. మనుషుల మంచితనంపై నమ్మకం ఉంది. రెండు యుద్ధాల తర్వాత కూడా ప్రపంచం మానవత్వంపై నమ్మకం కోల్పోలేదంటే యాన్‌ డైరీలూ ఒక కారణం. రెండో ప్రపంచ యుద్ధం లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. యాన్‌ డైరీలు కోట్ల మందిని మానవ విద్వేషం నుంచి బయటపడేస్తున్నాయి. యుద్ధం ఒక మనిషి అయితే, ఆ మనిషికి యాన్‌ డైరీలోని పై వాక్యాన్ని చదవడానికి ఇస్తే.. ఆ యుద్ధం కూడా యాన్‌ తండ్రిలా వలవల ఏడ్చేస్తుంది.

ఇవాళ యాన్‌ ఫ్రాంక్‌ పుట్టిన రోజు కాదు. జూన్‌ 12, 1929 తను పుట్టింది. ఇవాళ యాన్‌ ఫ్రాంక్‌ చనిపోయిన రోజు కూడా కాదు. 1945 ఫిబ్రవరిలో, మార్చిలోనో చనిపోయి ఉండొచ్చని మాత్రమే రికార్డులలో ఉంది.  ఇవాళ యాన్‌ ఫ్రాంక్‌ను నాజీలు బందీగా పట్టుకెళ్లిన రోజు కూడా కాదు. 1944 ఆగస్టు 4న ఆమెను తీసుకెళ్లారు. ఇప్పుడు ఈ చిన్నారి మాట ఎందుకు వచ్చిందంటే.. నమ్మకద్రోహులు ఎవరో ఆ రోజున ఆమెను, ఆమె కుటుంబాన్ని జర్మనీ పోలీసులకు పట్టించి ఉంటారన్న అనుమానం ఒకటి చరిత్రలో ఉంది. అయితే నమ్మకద్రోహం జరిగిందనేదానికి ఆధారాలేమీ కనిపించడం లేదని, అనుకోకుండా ఆమె పోలీసులకు కనిపించి ఉండొచ్చని ఆమ్‌స్టర్‌డామ్‌ (నెదర్లాండ్స్‌) లోని ‘యాన్‌ ఫ్రాంక్‌ హౌస్‌’ మ్యూజియం పరిశోధకులు మొన్న శనివారం నాడు ప్రకటించారు.

ఒకవేళ నిజంగానే నమ్మకద్రోహం జరిగి ఉన్నా యాన్‌ ఫ్రాంక్‌ ఆత్మ ఆ ద్రోహుల్ని క్షమించేస్తుంది. మనుషుల మీద, మానవత్వం మీద అంత నమ్మకం ఆ అమ్మాయికి!   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement