తప్పించుకున్నాడు.. ధన్యుడు కాలేదు..! | British Commando operations during the Second World War | Sakshi
Sakshi News home page

తప్పించుకున్నాడు.. ధన్యుడు కాలేదు..!

Published Thu, Dec 1 2016 5:01 AM | Last Updated on Mon, Sep 4 2017 9:32 PM

తప్పించుకున్నాడు.. ధన్యుడు కాలేదు..!

తప్పించుకున్నాడు.. ధన్యుడు కాలేదు..!

హిమ సంద్రంలో ఈత కొట్టాడు.. పీకల్లోతు మంచులో కూరుకుపోయాడు. శత్రువులు తరుముకొస్తుంటే.. మొరారుుస్తున్న తుపాకీతో తంటాలు పడ్డాడు. ఎలాగో ఒకడిని కాల్చాడు. ప్రాణాలు నిలబెట్టుకున్నాడు. ఏ వైపు నుంచి ఎవడు ఎప్పుడొస్తాడో తెలియని స్థితిలో వారాల పాటు మంచు గుహల్లో తలదాచుకున్నాడు. ఎముకలు కొరికే చలిబారి నుంచి.. అంతకంటే భయంకరమైన శత్రువు దృష్టి నుంచి ఎట్టకేలకు తప్పించుకున్నాడు. ‘‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడే’’ కావాలి. కానీ, ‘జాన్ బాల్‌సడ్’ మాత్రం కొందరి దృష్టిలో హీరో కాలేకపోయాడు. అతడి వీరోచిత పోరాటాన్ని నార్వేజియన్లు తప్పుగా అర్థం చేసుకున్నారు..!

1943, మార్చి 29.. పదకొండు మంది కమాండోలు, సిబ్బందితో కలిసి నార్వేలోని ఉత్తర జార్‌‌డ్స లోకి ప్రవేశించాడు జాన్ బాల్‌సడ్. రెండో ప్రపంచయుద్ధంలో భాగంగా తమ దేశాన్ని ఆక్రమించుకున్న జర్మన్ సేనల తాట తీయాలనేదే అతడి ఆశయం. ఆ మాటకొస్తే.. భయంకరమైన జార్‌‌డ్స లో అతడితో పాటు ప్రయాణిస్తున్న అందరి లక్ష్యమూ అదే. చేపల వేటకు అనువుగా ఉండే ఆ బోట్‌లో కొంత దూరం బాగానే ప్రయాణించారు జాన్, అతడి బృందం. ఆ క్షణంలోనే అతడికి పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చారుు.

 మూడేళ్ల క్రితం స్వీడన్‌కు పారిపోయాడు జాన్. నాజీ సేనల అకృత్యాలను భరించలేక నార్వేను విడిచి వెళ్లిపోయాడు. కానీ, తన దేశాన్ని అలాగే విడిచిపెట్టేయాలని అతడు భావించలేదు. తనలాంటి భావాలున్న మరికొందరు యువకుల్ని స్వీడన్‌లో కలిశాడు. వీరందరికీ మిత్రరాజ్య సేనలు సహకారం అందించారుు. జర్మనీ సేనలపై ఎదురుదాడి చేసేలా యుద్ధ విద్యల్లో శిక్షణ ఇచ్చారుు. అలా శిక్షణ పూర్తి చేసుకున్నాక, ఒక్కొక్కరూ ఒక్కో బాధ్యతను నెత్తిన వేసుకున్నారు. జాన్ బాల్‌సడ్ బృందానికి అప్పగించిన పని.. జర్మన్ ఎరుుర్ కంట్రోల్ టవర్‌ను పేల్చేయడం! తద్వారా నాజీలకు ఆకాశ మార్గంలో యుద్ధం చేసే అవకాశాలను తగ్గించాలని బలంగా నిర్ణరుుంచుకున్నారు జాన్ బృంద సభ్యులు.


దీనికోసం 8 టన్నుల బరువుండే పేలుడు పదార్థాలను తమతో పాటు తీసుకెళ్లారు. టవర్ సమీపంలోకి చేరుకోగానే మంచు కిందిభాగంలోని నీటిలో ఈదుకుంటూ పేలుడు పదార్థాలను అమర్చి, తర్వాత పేల్చేయాలి. అన్నీ సవ్యంగా జరిగితే ఇదే జరిగి ఉండేది. కానీ, జాన్ బృందం చేసిన ఓ పొరపాటు ఆ మిషన్ స్వరూపాన్నే మార్చేసింది. బోట్ సముద్రజలాల్లోకి బయలుదేరే ముందు వారు ఓ వ్యక్తిని కలవాల్సి ఉంది. అరుుతే, అతడి పేరుతోనే ఉన్న మరో వ్యక్తిని పొరపాటున కలిసి, తమ ప్లాన్ మొత్తాన్నీ అతడికి వివరించారు. నాజీలకు వీరవిధేయుడైన ఆ వ్యక్తి.. ఈ మొత్తం పన్నాగాన్ని వెంటనే వారికి చేరవేశాడు.

 అంతే.. ప్లాన్ మొత్తం నాశనమైపోరుుంది. జర్మన్ సేనలు యుద్ధ నౌకల్లో బోట్‌ను వెంబడించారుు. నలువైపుల నుంచీ కాల్పులు మొదలుపెట్టారుు. దీంతో ఏ దిక్కుకు వెళ్లాలో బోట్‌లోని వారికి అర్థం కాలేదు. అందరూ మంచు నీళ్లలోకి దూకారు. జాన్ దాదాపు 60 మీటర్లు ఈదుకుంటూ ఒడ్డుకు చేరాడు. అరుుతే, తుపాకుల మోత మాత్రం అతడిని వెంటాడుతూనే ఉంది. పరుగు లంకించుకున్నాడు. తన సహచరులు ఒక్కొక్కరే తుపాకీ గుళ్లకు బలైపోవడం అతడికి తెలుస్తూనే ఉంది. చివరకు తానొక్కడే మిగిలాడు. కళ్లెదురుగా కనిపించిన చిన్నపాటి మంచు ప్రవాహాన్ని ఈది.. అవతలి వైపు మంచు కొండ మీదికి ఎక్కి, బండరాళ్ల చాటున దాక్కున్నాడు. ఈదే క్రమంలో అతడి కాలి బూటు ఒకటి ఊడిపోరుుంది.

 ఆ మంచుకొండపై బూటులేని పాదంతో చాలా సేపు అలాగే ఉండాల్సివచ్చింది. నాలుగు దిక్కులూ గాలిస్తోన్న శత్రువులు జాన్‌ను పసిగట్టారు. అతడు తలదాచుకున్న కొండ మీదికి ఎక్కుతున్నారు. వారిని కాల్చిపడేసేందుకు ఎంతగానో ప్రయత్నించాడు ఈ నార్వేజియన్. అరుుతే, మంచుదెబ్బకి తుపాకీ మూగబోరుుంది. శత్రువులు దగ్గరకు వస్తోన్న కొద్దీ అతడిలో ఉత్కంఠ మరింత పెరగసాగింది. చిట్టచివరి నిమిషంలో ఎలాగో పేలింది తుపాకీ.. రివ్వున దూసుకొచ్చిన బుల్లెట్ల ధాటికి ఒక జర్మన్ సైనికుడు కొండమీది నుంచి పడి మరణించాడు. ఇంకొకడు గాయపడ్డాడు.

 అలా తప్పించుకునే అవకాశం అనూహ్యంగా దొరకడంతో మంచు సరస్సు మీది నుంచి పరుగు లంకించాడు జాన్. అక్కడికి దగ్గర్లోని ఓ మంచు గుహలోకి ప్రవేశించాడు. అక్కడే ప్రమాదవశాత్తూ గోతిలో పడ్డాడు. బయటకు రాలేక, అందులోనే నాలుగురోజుల పాటు ఉండిపోయాడు. తర్వాత ఎలాగో బయటపడ్డా.. నాజీలు అక్కడే గస్తీ కాయడంతో గుహ నుంచి బయటకు రాలేకపోయాడు. అలా దాదాపు తొమ్మిది వారాలు గడపాల్సి వచ్చింది. ఈ క్రమంలో బూటు లేని కాలు పూర్తిగా మంచు దెబ్బకు గడ్డకట్టుకుపోరుుంది. దాన్ని అలాగే ఉంచితే తన ప్రాణాలకే ప్రమాదం అని గ్రహించిన జాన్..  వెంట తెచ్చుకున్న కత్తితో కాలి వేళ్లను స్వయంగా నరుక్కున్నాడు. అలా ప్రాణాలు కాపాడుకున్నాడు.

 అరుుతే, మరోవైపు మంచు తీవ్రత పెరిగిపోవడంతో కళ్లు దెబ్బతిన్నారుు. దాదాపు గుడ్డివాడైపోయాడు. ఈ క్రమంలో ఓ చిన్నపాటి పడవపై ఎక్కి ప్రయాణం మొదలుపెట్టాడు. తీరం చేరే నాటికి పూర్తిగా సృ్పహ కోల్పోయాడు. తీరంలో అతడిని గుర్తించిన స్థానికులు.. అతడికి వైద్య సహాయం అందించి, నాజీ సేనల కంట పడకుండా తిరిగి స్వీడన్‌కు పంపించారు. అలా అప్పటి భయంకర పరిస్థితుల నుంచి బయటపడ్డ ఒకే ఒక్కడిగా నిలిచాడు. అరుుతే, జర్మన్‌లను దెబ్బ కొట్టే ప్లాన్‌ను సక్రమంగా అమలు చేయలేకపోయారని చాలామంది జాన్‌ను విమర్శించారు. అతడి సాహసయాత్రను గుర్తించేందుకు కొందరు ఇష్టపడలేదు. చివరకు జాన్ బాల్‌సడ్ కూడా కొన్నాళ్లు తన ముఖం చూపేందుకు ఇష్టపడలేదంటే.. అతడు అనుభవించిన వేదన తెలుస్తుంది. ఏదేమైనా ఈ నార్వే వీరుడి దేశభక్తిని మాత్రం ఎవ్వరూ శంకించలేరు..!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement