Commandos
-
AU Vizag-Mock Drill: ఆంధ్ర విశ్వవిద్యాలయంలోకి ఉగ్రవాదులు!
విశాఖపట్నం: మంగళవారం రాత్రి 9 గంటలు.. ఆయుధాలు ధరించిన ఐదుగురు ఉగ్రవాదులు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోకి చొరబడ్డారు. జిహాద్ అంటూ మెయిన్‌గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డ్‌పై దాడి చేసి లోపలకు ప్రవేశించారు. సెక్యూరిటీ గార్డ్ అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. ఉగ్రవాదులు ఏయూ రిజిస్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన విద్యార్థులు భయాందోళనకు గురై.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఆక్టోపస్ బృందానికి సమాచారం చేరవేశారు. ఆక్టోపస్ బృందాలు వెంటనే అప్రమత్తమై.. ఏయూ ప్రాంగణానికి చేరుకున్నాయి. ఆక్టోపస్ బృంద సభ్యులు కొంత సేపు సమాలోచనలు జరిపారు. ఉగ్రవాదులు చొరబడిన ప్రాంతం, భవనం పరిసరాలు, లోపలకు వెళ్లే మార్గాలు, లోపల పరిస్థితులు తదితర అంశాలపై ప్రాథమికంగా అవగాహన ఏర్పరుచుకుని.. ఐదుగు రు సభ్యులు ఒక బృందంగా ఏర్పడ్డారు. ఏయూ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. కొంత మంది ఆక్టోపస్ స్నైపర్ సభ్యులు భవనాలపైకి చేరుకుని మాటువేశారు. మరోవైపు ఆక్టోపస్ బృందాలు లోపలకు ప్రవేశించి ప్రతీ గదిని తనిఖీ చేశారు. ఉగ్రవాదులు ఎవరినైనా బంధించారా లేదా పరిశీలించారు. బాంబులను నిరీ్వర్యం చేసే బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. ఈ ఆపరేషన్ అర్ధరాత్రి దాటి సాగింది. చివరకు ఇరువర్గాల మధ్య దాడుల అనంతరం ఆక్టోపస్ ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ ఆపరేషన్‌లో ఆక్టోపస్ బృందాలు అత్యాధునిక ఆయుధాలు వినియోగించారు. ఇదంతా నిజమే అనుకుంటే పొరపాటే! విపత్కర సమయాల్లో రక్షణ వ్యవస్థను అప్రమత్తం చేయడానికి ఆక్టోపస్ నిర్వహించిన మాక్‌డ్రిల్ ఇది. ఆపరేషన్ పైతాన్ పేరుతో స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన మాక్‌డ్రిల్ విజయవంతంగా ముగిసింది. -
వీలుంటే నాలుగైదు తీవ్రవాద సంస్థలను చేర్చుకుంటే బలం కూడా పెరుగుతుంది సార్!
వీలుంటే నాలుగైదు తీవ్రవాద సంస్థలను చేర్చుకుంటే బలం కూడా పెరుగుతుంది సార్! -
బ్లాక్‌క్యాట్, బీఎస్ఎఫ్ జవాన్, మార్షల్స్‌తో ఎంపీకి పటిష్ట భద్రత
సాక్షి, నిజామాబాద్: తన జిల్లా పర్యటనలో ప్రతిసారి టీఆర్ఎస్ శ్రేణులు ఆటంకాలు కలిగించడం.. వాగ్వివాదాలు, ఘర్షణలు చోటు చేసుకోవడంతో బీజేపీ ఎంపీ అర్వింద్ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసుకున్నారు. కేంద్ర హోంశాఖ కార్యాలయం సూచనల మేరకు వీఆర్ఎస్ తీసుకున్న బ్లాక్‌క్యాట్, బీఎస్ఎఫ్ జవాన్‌తో పాటు నలుగురు మార్షల్స్‌తో ఎంపీ సొంత డబ్బులతో భద్రత కల్పించుకున్నారు. కాగా రాజకీయ చైతన్యం ఎక్కువ ఉన్న జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య ముక్కో ణపు పోటీ నడుస్తోంది. గత ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరపున ధర్మపురి అర్వింద్, కల్వకుంట్ల కవితపై అనూహ్యంగా విజయం సాధించారు. అప్పటి నుంచి బీజేపీ, టీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఘర్షణల దాకా వెళ్లింది. డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఇతర అంశాలపై బీజేపీ ఆందోళ నలు చేస్తే, ప్రతిగా టీఆర్ఎస్ శ్రేణులు పసుపు బోర్డు విషయంలో ఆందోళనలు చేస్తూ ఎంపీ అర్వింద్‌ను అ డ్డుకుంటూ వచ్చాయి. ఈ క్రమంలో ఆరు నెలల కా లంలో ఇరుపార్టీల శ్రేణుల మధ్య పలుసార్లు ఘర్షణలు సైతం చోటు చేసుకున్నాయి. కొన్ని నెలలుగా ఎంపీ పర్యటన చేసిన ప్రతిసారి టీఆర్ఎస్ శ్రేణు లు మోహరిస్తుండడంతో ని యంత్రించడం పోలీసులకు కష్టసాధ్యమైపోతోంది. రెండు సందర్భాల్లో పోలీసులు సైతం తీవ్రంగా గాయపడడం గమనార్హం. చదవండి: (ఎంపీ అర్వింద్ ఇప్పటికీ మభ్యపెడుతూనే ఉన్నాడు: ఎమ్మెల్సీ కవిత) ఇటీవల కాలంలో ఎంపీ అర్వింద్ పలుచోట్ల పర్యటనలు, ప్రారంభో త్సవాలు చేసేందుకు, మరి కొన్నిచోట్ల ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాలు ఆవిష్కరించేందుకు వచ్చిన సందర్భంలో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వరుసగా ఇందల్వాయి మండలం గన్నారం, ధర్పల్లి మండల కేంద్రంలో, భీంగల్ మండలం బాబాపూర్‌లో ఉపాధ్యాయురాలు మరణించిన సందర్భంలో, ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి ప్రాంతంలో ఎంపీ అర్వింద్ పర్యటన నేపథ్యంలో రెండు పార్టీల మధ్య ఘర్షణ లు చోటుచేసుకుని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా యి. ఇరు పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలో ఉండడంతో పోటాపోటీ నెలకొంది. ఎంపీ అర్వింద్ ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి పర్యటన నేపథ్యంలో చోటుచేసుకున్న ఘర్షణలో పలువురు గాయపడ్డారు. ఈ విషయంలో పోలీసు లు టీఆర్ఎస్కు సహకరించి తన భద్రతకు సహకరించలేదంటూ ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా నిజామాబాద్ పోలీసు కమిషనర్‌పై పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఎంపీ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారు. అధికారికంగా హోంశాఖ నుంచి భద్రత కల్పించే విషయంలో ఆలస్యం అయ్యే నేపథ్యంలో అమిత్‌షా కార్యాలయం సూచనల మేరకు ఎంపీ అర్వింద్ వీఆర్ఎస్ తీసుకున్న బ్లాక్‌క్యాట్ కమెండో, బీఎస్ఎఫ్ జవాన్‌తో పాటు నలుగురు మార్షల్స్‌ను తన భద్రతా వలయంగా నియమించుకున్నారు. అలాగే కిలోమీటర్ రేడియస్‌లో పనిచేసే విధంగా 5 వాకీటాకీలు, మూడు ప్రత్యేక వాహనాలు, అడ్వాన్స్డ్ వెపన్స్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఈసారి తన పర్యటనలో దాడులకు పాల్పడితే టీఆర్ఎస్ వాళ్లకు తూటాలు దిగుతాయని ఎంపీ అర్వింద్ తాజాగా వ్యాఖ్యానించడం గమనార్హం. -
సరిహద్దుల్లో ఉద్రిక్తత.. సై అంటే సై!
న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరుపక్షాలు తమదైన రీతిలో పోటీకి సిద్ధమవుతున్నాయి. చైనా సరిహద్దు దళాలకు శిక్షణ ఇచ్చేందుకు 20 మంది మార్షల్ ఆర్ట్స్ శిక్షకులను రంగంలోకి దించగా.. దీనికి దీటుగా భారత్ తన ‘ఘాతక్’ కమాండోలను సరిహద్దుల్లో మోహరించేందుకు సిద్ధమవుతోంది. ఒకవేళ చైనా కయ్యానికి కాలుదువ్వితే వేగంగా స్పందించేందుకు భారత వాయుసేనను అప్రమత్తం చేసింది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో 8 నిమిషాల్లోనే ప్రతిదాడులు చేసేలా వాయుసేన సన్నద్ధంగా ఉన్నట్లు సమాచారం. సముద్రమార్గంలోనూ చైనా కదలికలపై నిఘా ఉంచేందుకు నావికాదళం అప్రమత్తమైంది. అమెరికా, జపాన్ వంటి మిత్రదేశాల సహకారం తీసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది. (చైనాతో తాడోపేడో.. గ్యాస్ సిలిండర్లు నిల్వ చేసుకోండి) హిందూ మహా సముద్ర ప్రాంతంలో భారత్, జపాన్‌లు రెండు రోజుల క్రితమే నావికా విన్యాసాలను పూర్తి చేయగా ఇందులో పాల్గొన్న ఐఎన్ఎస్ రాణా, ఐఎన్ఎస్ కులిష్, జపాన్ నౌకలు జేఎస్ కషిమా, జేఎస్ షిమయూకిలు చైనాపై ఓ కన్నేసి ఉంచినట్లు సమాచారం. సరిహద్దుల వెంబడి ఉన్న మూడు వాయుసేన స్థావరాలతో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని స్కర్దు కేంద్రాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునేం దుకు, యుద్ధానికి సన్నద్ధం చేసేందుకు చైనా ప్రయత్నాలు చేస్తూండగా ఆకాశ్ క్షిపణి వ్యవస్థను రంగంలోకి దించడం ద్వారా భారత్ సై అంటోంది. ఆకాశ్ క్షిపణులు శత్రువుల యుద్ధవిమానాలతోపాటు డ్రోన్లు సంధించే క్షిపణులను ధ్వంసం చేయగలవు. సరిహద్దుల్లోని మూడు వాయుసేన స్థావరాల్లో చైనా జే–11, జే–8 యుద్ధ విమానాలు, బాంబర్ విమానాలు, ఏవాక్స్ను మోహరించినట్లు సమాచారం. అయితే పర్వతసానువుల్లో యుద్ధానికి సంబంధించి భారత్‌కు ఉన్నంత అనుభవం చైనాకు లేదు. లద్దాఖ్ లాంటి ప్రాంతాల్లో యుద్ధమంటూ వస్తే సుఖోయ్, మిరాజ్, జాగ్వార్ వంటి భారత యుద్ధవిమానాలు చైనీయులపై ఆధిపత్యం చెలాయిస్తాయని అంచనా. రాటుదేలిన ఘాతక్ కమాండోలు సరిహద్దుల్లో చైనీయులను ఎదుర్కొనేందుకు భారత మిలిటరీ వర్గాలు రంగంలోకి దింపనున్న ఘాతక్ కమాండోలు కఠోరమైన శిక్షణతో రాటుదేలారు. కర్ణాటకలోని బెళగావిలో 43 రోజుల పాటు వీరికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. శిక్షణలో ఒక్కో కమాండో తన భుజాలపై 35 కేజీల బరువులు మోస్తూ రోజుకు 40 కి.మీ.ల దూరం ఏకబిగిన పరుగెత్తాల్సి ఉంటుంది. యుద్ధం లేదా ఘర్షణలాంటి పరిస్థితులు వస్తే పెద్ద ఎత్తున ఆయుధాలతో శత్రుమూకల్లోకి చొరబడి మెరుపుదాడులు చేయడం ఘాతక్ కమాండోల ప్రత్యేకత. పదాతిదళంలో భాగమైన ఘాతక్ కమాండోలు ఒట్టి చేతులతో శత్రువును మట్టికరిపించేలా శిక్షణ పొందారు. పర్వత ప్రాంతాల్లో యుద్ధం చేయడం, కొండలను, గుట్టలను అతి సునాయాసంగా దాటగలగడం, శత్రు స్థావరాల్లో విధ్వంసం సృష్టించడం ఘాతక్ కమాండోల ప్రత్యేకత. బెళగావి శిక్షణ కేంద్రంలో కమాండోలకు ఇచ్చే శిక్షణ ప్రపంచంలోనే అత్యంత కఠినమైందిగా గుర్తింపు పొందింది. పాకిస్థాన్‌పై భారత్ చేసిన సర్జికల్ దాడుల్లో పాల్గొన్నది ఘాతక్ ప్లటూన్ కమాండోలే. (పథకం ప్రకారమే డ్రాగన్ దాడి!) భారత్, చైనా నేడు చర్చలు తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించుకోవడమే లక్ష్యంగా భారత్, చైనాల లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల మధ్య మంగళవారం మరో దఫా భేటీ జరగనుంది. వాస్తవ నియంత్రణ రేఖకు దగ్గరలో భారత్ వైపునున్న చిషుల్ సెక్టార్లో ఉదయం 10.30 గంటలకు వీరు చర్చలు ప్రారంభిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సున్నితమైన ప్రాంతాల నుంచి రెండు దేశాల బలగాల ఉపసంహరణకు సంబంధించిన విధి విధానాలను వీరు ఖరారు చేస్తారని వెల్లడించాయి. జూన్ 6, 22వ తేదీల్లో చైనా భూభాగంలోని మోల్డోలో జరిగిన సంభాషణల్లో రెండు దేశాలు పరస్పరం ఏకాభిప్రాయం ఆధారంగా వివాదాస్పద ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలంటూ అంగీకారానికి వచ్చాయి. దీనిని ఏ విధంగా అమలు చేయాలనే అంశంపై సైనికాధికారులు ఖరారు చేయనున్నారు. భారత బృందానికి 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్, చైనా తరఫున టిబెట్ మిలటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ నేతృత్వం వహిస్తారు. 15న రెండు దేశాల సైనికుల ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు వీర మరణం పొందడం తెల్సిందే. -
రైల్వే భద్రతకు ‘కోరాస్’
న్యూఢిల్లీ: రైళ్ల భద్రత కోసం ఇకపై కమాండోలు రంగంలోకి దిగనున్నారు. కమాండోస్ ఫర్ రైల్వే సేఫ్టీ (కోరాస్) యూనిట్‌ను రైల్వే మంత్రి గోయల్ బుధవారం ప్రారంభించారు. కోరాస్ కమెండోలకు అంతర్జాతీయ శిక్షణ ఇవ్వాల్సిందిగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్)కు సూచించినట్లు తెలిపారు. కోరాస్ యూనిట్‌ను మొదట ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో మోహరించనున్నట్లు వెల్లడించారు. కశ్మీర్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలు, తీవ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా ఉండే ఛత్తీస్‌గఢ్, ఒడిశా, బెంగాల్, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కమాండోలు భవిష్యత్‌లో సేవలు అందించనున్నట్లు తెలిపారు. రైల్వేలకు నష్టం, అంతరాయం, రైళ్లపై దాడి, హైజాక్, విపత్తులకు సంబంధించిన ఏ పరిస్థితుల్లో అయినా కమాండోలు సేవలు అందిస్తారని ఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ అరుణ్‌కుమార్ తెలిపారు. -
కవాతు దర్శన్
దేశానికి సైనికుడిని చూపిన సీరియల్ అది. సైనిక శిబిరాలలో జీవితం ఎలా ఉంటుందో కళ్లకు కట్టిన కథ అది. కొత్తగా సైన్యంలో చేరిన జవాన్ల శిక్షణ ఈ సీరియల్లోనే జనం చూశారు. వారు నవ్వితే నవ్వారు వారు కవాతు చేస్తే ఉత్సాహపరిచారు దూరదర్శన్ తొలి సైనిక సీరియల్ ‘ఫౌజి’ విశేషాలివి.. అది ఇండియన్ ఆర్మీ. సైనికుల కవాతు, కమాండోల కఠోర శిక్షణ, వైమానికదళ విన్యాసాలు, యుద్ధ ట్యాంకుల మోతలు.. చూసే కళ్లల్లో స్థైర్యాన్ని, గుండెల్లో ధైర్యాన్ని నింపుతున్నాయి. ఆ ఆర్మీ ట్రెయినింగ్ స్కూల్‌కి కొత్తగా ఎనిమిది మంది కమాండోలు సెలక్టయ్యారు. వీరంతా సైన్యాన్ని నడిపించే నాయకులుగా ఎదగాలి. అందుకే ఆ ఎనిమిది మందికి సుశిక్షితులైన ఆఫీసర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణా సమయాన్ని కేటాయించారు. రన్నింగ్, రేసింగ్, కరాటే, బాక్సింగ్, జంపింగ్, షూటింగ్, క్లైంబింగ్.. వంటివెన్నో అత్యంత కఠినమైన ప్రక్రియలతో శిక్షణ ఇస్తున్నారు. అత్యవసర పరిస్థితిలో యుద్ధవిమానాల నుంచి నేర్పుగా బయటపడటం, ప్యారాచూట్లను ఉపయోగించడంతోపాటు గన్షూట్స్, స్మోక్బాంబ్స్.. వంటివి శిక్షణలో భాగం చేశారు. ఎనిమిది మంది ప్రతీచోటా తమ ప్రతిభను చూపుతూనే ఉన్నారు. యుద్ధ సమయంలో ఎదురయ్యే సమస్యను ఎలా సవాల్‌గా ఎదుర్కోవాలో వివరిస్తున్నారు ఆఫీసర్లు. ఇదంతా బుల్లితెర పై చూస్తున్నవారికి కొత్తగా ఉంది. దేశ సరిహద్దుల్లో రక్షణగా ఉండే ఆర్మీ వాతావరణం ఇంట్లో కూర్చోబెట్టి ప్రతి పౌరుడికి పాఠం చెబుతున్నట్టుగా ఉంది. అప్పటి వరకు హీరో హీరోయిన్ల డాన్సులు, కుటుంబ డ్రామాలు, శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు, పౌరాణిక కథలతో నిండిపోయిన చిన్నతెర ‘ఫౌజి’ పేరుతో సైనికులు వచ్చి కవాతు చేయడం ఆసక్తిదాయకమైంది. 1989 జనవరిలో ప్రసారమైన ఫౌజీ దేశభక్తికి సంబంధించిన అంశంగా ముందు ఎవరూ అనుకోలేదు. ఒక యదార్థ సెటప్ చిన్న తెరమీద అనుకోకుండానే సెట్ అవ్వడం అంతటా చర్చనీయాంశమైంది. కమాండోలు... కఠోర శిక్షణ ఎనిమిది మంది కమాండో టీమ్‌లో లెఫ్టినెంట్ అభిమన్యుది ప్రధాన పాత్ర. అభిమన్యుతో పాటు మరో ముగ్గురు కమాండోలు తమ తమ కాలేజీలలో ఒక్కో క్రీడలో ఛాంపియన్స్మని ఆఫీసర్స్‌తో గర్వంగా చెప్పుకుంటారు. అయితే, మేజర్ విక్రమ్రాయ్తో తలపడలేక వాళ్లు ఓడిపోవడంతో గిల్టీగా పీలవుతారు. విక్రమ్‌రాయ్ మాట్లాడుతూ– ‘మీరు క్రీడా మైదానంలో ఆడినవి ఆటలు మాత్రమే. ఇక్కడ ఇది పోరాటం. ప్రతీ క్షణం సవాలే’ అని హెచ్చరిస్తాడు. టీమ్ అంతా రాత్రుళ్లు కూర్చొని ఆ రోజు జరిగిన కఠిన శిక్షణ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. శిక్షణను తట్టుకోలేక ఆర్మీ నుంచి పారిపోతే బాగుండు అనే ఆలోచన కూడా వారిలో వస్తుంది. కానీ, ఆ మరుక్షణమే తాము దేశరక్షణ కోసం ఏ విధంగా ఆర్మీలో చేరామో గుర్తుకు తెచ్చుకుని తర్వాతి పరీక్షకు సిద్ధం అవుతుంటారు. మేజర్ విక్రమ్‌రాయ్–అభిమన్యురాయ్ పేర్లకు దగ్గర పోలిక ఉందని టీమ్ సభ్యులు అంటే ‘విక్రమ్‌రాయ్ మా పెద్దన్న’ అని అభిమన్యు చెప్పడంతో అప్పటి వరకు ఈ విషయం ఎవరికీ తెలియని టీమ్ ఆశ్చర్యపోతుంది. నిజానికి లెఫ్టినెంట్ అభిమన్యురాయ్ గతంలో చాలా సరదా సరదాగా గడిపే ప్లే బోయ్ తరహాకి చెందిన వాడై ఉంటాడు. కమాండో స్కూల్ నుంచి ఆర్మీలో చేరి కఠినశిక్షణలతో దేశరక్షణలో భాగస్తుడు అవుతాడు. ఆర్మీలో ఒంటరిగా ఉన్న సందర్భాల్లో అభిమన్యుకి పదే పదే ఇల్లు గుర్తుకు వస్తుంటుంది. తండ్రితో ఆడిన చెస్, తను గెలవడం కోసం తండ్రి ఓడిపోయిన విధానం, చిన్నతనంలో అన్నదమ్ములు చేసిన అల్లరిని గుర్తుకు తెచ్చుకుంటుంటాడు. అభిమన్యు పాత్ర ద్వారా ఆర్మీలో ఉన్న మిగతా జవాన్ల మానసిక స్థితి కళ్లకు కడుతుంది. సైనికుల ప్రేమలు – పెళ్ళిళ్లు కరకుగా ఉండే సైనికుల గుండెల్లో మృదువైన ప్రేమ హృదయాలూ ఉన్నాయని ఈ షో ద్వారా చూపించారు దర్శకులు. రోజంతా శిక్షణ సమయంలో ఏర్పడిన ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ఒక దగ్గర చేరే ఈ టీమ్‌కి క్యాంటిన్, చెట్లు, తమ గదులు ప్రధాన ప్లేసులై ఉంటాయి. కాస్త వీలు చిక్కితే సరదా కబుర్లతో ఒకరినొకరు కామెంట్ చేసుకునే ఈ టీమ్‌లోని మెంబర్స్ ప్రేమకు సంబంధించిన విషయాలను తరచూ చర్చిస్తుంటారు. వరుణ్ అనే కమాండో క్యాంటీన్ ఓనర్ కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అభిమన్యురాయ్ ఆర్మీ డాక్టర్ మధు రాథోడ్‌ని ప్రేమిస్తాడు. మేజర్ విక్రమ్రాయ్కి జర్నలిస్ట్ కిరణ్ పరిచయం అవుతుంది. లెఫ్టినెంట్ కల్యాణ్‌సింగ్ సాహసాల గురించి జర్నలిస్ట్ కిరణ్‌కి విక్రమ్‌రాయ్ చెబుతుంటాడు. కల్యాణ్‌సింగ్ చనిపోవడం గురించి అతని కుటుంబానికి ఆ వార్త చేరవేసే పరిస్థితి తనకు ఎంత బాధాకరమైందో చెబుతూనే తాను తిరిగి వచ్చే సమయంలో కళ్యాణ్‌సింగ్ కొడుకు చేసిన సెల్యూట్ గురించి గొప్పగా వివరిస్తాడు. ఒకానొక సందర్భంలో జర్నలిస్ట్ కిరణ్‌కి యాక్సిడెంట్ అవడంతో అభిమన్యు రక్తదానం చేసి ఆమెని కాపాడతాడు. పదమూడు ఎపిసోడ్లు ఉన్న ఈ సీరియల్లో పది ఎపిసోడ్ల వరకు కమాండోల మధ్య ఉండే స్నేహం, ఇన్‌స్ట్రక్టర్స్‌తో రిలేషన్షిప్, ప్రేమలను చూపుతుంది. సైనికుల అంతరంగాలను అతి దగ్గరగా పరిశీలిస్తున్నట్టు ఉంటుంది ఈ సీరియల్. యుద్ధ సమయం పదకొండవ ఎపిసోడ్లో శిక్షణ తీసుకున్న ఈ కమాండోలను స్పెషల్ వార్ మిషన్కి సెలక్ట్ చేస్తారు ఆఫీసర్లు. ఈ మిషన్‌లో పాల్గొన్న ఎనిమిది మందిలో ముగ్గురు కమాండోలు చనిపోతారు. లెఫ్టినెంట్ అభిమన్యు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరుతాడు. మరణించిన వారికి భారత ప్రభుత్వం జోహార్లు అర్పిస్తుంది. కోలుకున్న అభిమన్యు అతని స్నేహ బృందం తిరిగి డ్యూటీలో చేరడంతో సీరియల్ ముగుస్తుంది. మొదటిసారి మిల్ట్రీ శిక్షణ ఇండియన్ ఆర్మీ కమాండోల శిక్షణ కథే ఫౌజి. డిఫెన్స్ అకాడమీ మిలటరీ శిక్షణ ఇస్తున్న విధానాన్ని మొదటి సారి కళ్లకు కట్టింది బుల్లితెర. ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ కల్నల్ ఆర్కే శర్మ రాసుకున్న కథ ఇది. ఆర్మీ ఆఫీసర్ అయినప్పటికీ అతని అభిరుచి కథలు, నాటకాలు రాయడం. ఇండియన్ ఆర్మీలో ఏం జరుగుతుందో, వారి జీవన విధానం ఎలా ఉంటుందో బయటవారికి తెలియజెప్పాలన్న తపనతో రాసుకున్న నోట్‌ను అతను కథగా డెవలప్ చేసుకున్నాడు. తను ఆర్మీ నుంచి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్‌తో కలిసి ఆ కథను టీవీ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ కథ పూర్తిగా యధార్థ సంఘటనల ఆధారంగానే రూపొందించడంతో విశేష ఆదరణ పొందింది. ఇండియన్ ఆర్మీలో బాంబే శాపర్స్ టీమ్‌కి అత్యున్నత ఆఫీసర్‌గా నియమింపబడిన కల్నల్ సంజయ్బెనర్జీ కథను స్ఫూర్తిగా తీసుకొని లెఫ్టినెంట్ అభిమన్యురాయ్ పాత్రను అందంగా మలిచారు శర్మ.ఇప్పటికీ ఈ తరహా సీరియల్ బుల్లితెర మీద రాలేదు. అంటే మూడు దశాబ్దాల క్రితమే ప్రేక్షకుల నాడిని పట్టుకోవడానికి టీవీ ఓ కొత్త ఎఫర్ట్ పెట్టిందని చెప్పవచ్చు. ∙కమాండోల లిస్ట్‌లో షారూఖ్ ఖాన్‌తో పాటు ప్రముఖ దర్శకుడు/నటుడు విక్రమ్చోప్రా, బాలీవుడ్ నటుడు విశ్వజీత్ ప్రధాన్ లూ ఉన్నారు. ∙లాయ్ మెండోన్సా ఈ సీరియల్‌కి సంగీతాన్నందించారు. ∙1995లో ఫౌజి పేరుతో హిందీ సినిమా వచ్చింది. దీని దర్శకుడు లారెన్స్ డి–సౌజ, నటులు ధర్మేంద్ర, రాజ్‌బబ్బర్, కిరణ్‌కుమార్‌లు. షారూఖ్ ఖాన్ ∙ఈ సీరియల్లో లెఫ్టినెంట్ అభిమన్యురాయ్ పాత్రను షారూఖ్ ఖాన్ పోషించారు. అక్కడి నుంచి సర్కస్ వైపుగా మరో అడుగు వేసి అటు నుంచి బిగ్‌స్క్రీన్‌ను ఆక్యుపై చేశారు. టీవీ షో డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఆర్కే కపూర్ ఆడిషన్ టెస్టుల ద్వారా షారూఖ్‌ని ఎంపిక చేశారట. ఈ ఎంపికకు ముందు షారూఖ్‌కి ఫిజికల్, స్టామీనా టెస్టులు కూడా చేశారట. షారూఖ్ లీడ్ రోల్ అయినప్పటికీ మొదటి–చివరి ఎపిసోడ్లలో మాత్రమే అతని పాత్ర ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. మిగతా అంతా కమాండోలలో ఒకడిగా కనిపిస్తారు. ∙ఫౌజీ కన్నా ముందు ‘దిల్ దారియా’లో 1988లో షారూఖ్ ప్రధాన పాత్రతో షూటింగ్ మొదలైంది. అదే టైమ్‌లో గ్రామీణ నేప«థ్యం ఉన్న ‘కేవల్’ అనే సీరియల్లోనూ షారూఖ్ నటించారు. అయితే ‘ఫౌజి’ సీరియల్ షారూఖ్‌ని నిలబెట్టింది. 90ల కాలం యంగ్‌స్టర్స్‌ని తన వైపుకు తిప్పుకునేలా చేసింది ఈ సీరియల్. తర్వాత షారూఖ్ బాలీవుడ్ కింగ్ అయ్యారు. – నిర్మలారెడ్డి -
కశ్మీర్ లోయలో మహిళా కమాండోలు
-
లే‘ఢీ’ కమాండోలు !
భద్రాచలం : తెలంగాణ – ఛత్తీస్‌గ«ఢ్ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులకు చెక్ పెట్టేందుకు పోలీసులు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ముల్లును ముల్లుతోనే తీయాలనే ఉద్దేశంతో నిరుద్యోగ గిరిజన యువతలో చైతన్యం తీసుకొచ్చి, వారితోనే మావోయిస్టుల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేలా పావులు కదుపుతున్నారు. ఛత్తీస్‌గఢ్ తరహాలో తెలంగాణలో కూడా మహిళా కమాండోలను నియమించేందుకు పోలీసు శాఖ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. లొంగిపోయిన మహిళా మావోయిస్టులకు పోలీసు శాఖలో ఉద్యోగాలు కల్పించి, వారి సేవలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వినియోగించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో గల గిరిజన యువతను కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాల్లోకి తీసుకునేందుకు అవసరమైన శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ రూపొందించారు. కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు గిరిజన యువత ఎంపికయ్యేలా భద్రాచలంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. త్వరలో జరిగే వివిధ రకాల రిక్రూట్మెంట్లలో ఉద్యోగాలు సాధించేలా 100 మందిని ఎంపిక చేసి.. వారిని పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. పోటీ పరీక్షల్లో నెగ్గేలా నిష్ణాతులైన ఉపాధ్యాయులతో శిక్షణ ఇప్పించడంతో పాటు ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సరిహద్దున ఉన్న ఏజెన్సీ గ్రామాల్లో గల నిరుద్యోగ గిరిజన యువతకు కూడా ఈ విధంగానే శిక్షణ ఇప్పించేలా మిగతా జిల్లాల్లో కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రంగంలోకి మహిళా పోలీసు కమాండోలు... ఛత్తీస్‌గఢ్‌లో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులు విధ్వంసాలకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉన్న ప్రాంతంపై పట్టు సాధించేందుకు మహిళా కమాండోలను భద్రతా దళంలోకి పంపించారు. లొంగిపోయిన మహిళా మావోయిస్టులకు పునరావాసం కల్పించే క్రమంలో పోలీసు శాఖలో ఉద్యోగాలిచ్చి, వారిని ఈ ప్రాంతాల్లో పనిచేయించేలా ఏర్పాట్లు వేగవంతం చేశారు. లొంగిపోయిన మహిళలతో పాటు, పోలీసు శాఖలో ఇప్పటికే పనిచేస్తున్న కొంతమంది మహిళా అధికారులు, సిబ్బందితో ఓ దళాన్ని ఏర్పాటు చేసి, వీరికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇలా 60 మందిని ఎంపిక చేయగా, వీరిలో ఇప్పటికే 25 మంది మహిళా కమాండోలు అధునాతన తుపాకులతో రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇదే రీతిన మన రాష్ట్రంలో కూడా గిరిజన యువతకు ఉద్యోగాలు కల్పించి, సరిహద్దు ప్రాంతంపై పట్టు సాధించేందుకు పోలీసుశాఖ వ్యూహం రచిస్తోంది. నష్ట నివారణకు సరికొత్త వ్యూహం... పోలీసు బలగాలు దండకారణ్యంలోకి దూసుకుపోయి, మావోయిస్టు కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రధానంగా రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు గ్రామాలను కలుపుతూ అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున రహదారులు నిర్మిస్తున్నారు. మావోయిస్టులు ప్రెషర్ బాంబులు అమర్చుతూ ఆటంకం కలిగిస్తున్నా.. ప్రత్యేక బలగాల బందోబస్తు మధ్య రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తున్నారు. వాకీటాకీలతో పాటు, గ్లోబల్ పొజిషన్ సిస్టమ్(జీపీఎస్) ద్వారా కూంబింగ్‌లో దూసుకెళ్తున్నారు. అత్యవసర సమయాల్లో సంఘటన స్థలం నుంచే సమాచారం చేరవేసేందుకు శాటిలైట్ ఫోన్ల వినియోగానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ ప్రాంతాలే కీలకం... ఛత్తీస్‌గఢ్‌లోని దట్టమైన అటవీ ప్రాంతాన్ని అడ్డాగా చేసుకుని మావోయిస్టులు మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో విస్తృతంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా, బీజాపూర్, దంతెవాడ జిల్లాల్లో మావోయిస్టుల విధ్వంసాలు రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాలపై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని గొల్లపల్లి, కిష్టారం, పామేడు, ఆవుపల్లి, ఊసూరు పోలీసు స్టేషన్ల పరధిలో తరచూ ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది. మావోయిస్టులపై పై చేయి సాధించే క్రమంలో అటవీ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్న క్రమంలో ప్రతిదాడులు సైతం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్థి నష్టం వాటిల్లుతోంది. ఈ ప్రాంతాల్లోనే మావోయిస్టులు తరచుగా మందుపాతర్లు అమర్చడం పోలీసులను కలవరపెడుతోంది. అమాయక గిరిజనులు సైతం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఛత్తీస్‌గఢ్‌తో పాటు, మన రాష్ట్రంలో కూడా ఈ ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతం నివురుగప్పిన నిప్పులా మారింది. మావోయిస్టుల చర్యలను అరికట్టేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు సత్ఫలితాలిస్తాయో వేచి చూడాలి. -
ఆక్టోపస్ ఆపరేషన్‌లో అపశ్రుతి
ఇబ్రహీంపట్నం రూరల్: ఆక్టోపస్ పోలీసుల మాక్‌డ్రిల్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న వాహనాన్ని వెనుక నుంచి ఛేదించే క్రమంలో ప్రమాదం జరిగింది. కమాండోలు ప్రయాణిస్తున్న కారు ముందుగా వెళ్తున్న బస్సును ఢీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. బొంగ్లూర్ నుంచి తుక్కుగూడ వెళ్లే ఔటర్ రింగ్ రోడ్డు బైపాస్ టీసీఎస్ వెనుక మంగళవారం ఉదయం ఆక్టోపస్ కమాండోలు బస్సు, కారుతో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. డ్రిల్‌లో అతివేగంగా వెళ్తున్న బస్సును కారులో ప్రయాణిస్తున్న వారు వెళ్లి పట్టుకునే సన్నివేశాన్ని ప్రదర్శిస్తున్నారు. అందులో భాగంగా ముందు కమాండోల బస్సు వెళ్తుంటే వెనుక నుంచి టాటా ఇండికా కమాండోల కారు వెళ్లి వారిని ఆపాలి. అయితే ప్రమాదవశాత్తు వెనుక కారు ముందుగా వెళ్తున్న కమాండోల బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సురేశ్, లక్పతి, రాహుల్ భవానీసింగ్, చెన్నకేశవరెడ్డి, శేఖర్‌లకు గాయాలయ్యాయి. వెంటనే వీరిని బస్సులో నగరంలోని కామినేని ఆస్పత్రిలో చేర్పించారు. కారు నడిపిన లక్పతి అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మిగతా నలుగురికీ స్వల్ప గాయాలయ్యాయని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ఆక్టోపస్ ఐజీలతో పాటు సివిల్ పోలీసు లు ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. -
తప్పించుకున్నాడు.. ధన్యుడు కాలేదు..!
హిమ సంద్రంలో ఈత కొట్టాడు.. పీకల్లోతు మంచులో కూరుకుపోయాడు. శత్రువులు తరుముకొస్తుంటే.. మొరారుుస్తున్న తుపాకీతో తంటాలు పడ్డాడు. ఎలాగో ఒకడిని కాల్చాడు. ప్రాణాలు నిలబెట్టుకున్నాడు. ఏ వైపు నుంచి ఎవడు ఎప్పుడొస్తాడో తెలియని స్థితిలో వారాల పాటు మంచు గుహల్లో తలదాచుకున్నాడు. ఎముకలు కొరికే చలిబారి నుంచి.. అంతకంటే భయంకరమైన శత్రువు దృష్టి నుంచి ఎట్టకేలకు తప్పించుకున్నాడు. ‘‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడే’’ కావాలి. కానీ, ‘జాన్ బాల్‌సడ్’ మాత్రం కొందరి దృష్టిలో హీరో కాలేకపోయాడు. అతడి వీరోచిత పోరాటాన్ని నార్వేజియన్లు తప్పుగా అర్థం చేసుకున్నారు..! 1943, మార్చి 29.. పదకొండు మంది కమాండోలు, సిబ్బందితో కలిసి నార్వేలోని ఉత్తర జార్డ్స లోకి ప్రవేశించాడు జాన్ బాల్‌సడ్. రెండో ప్రపంచయుద్ధంలో భాగంగా తమ దేశాన్ని ఆక్రమించుకున్న జర్మన్ సేనల తాట తీయాలనేదే అతడి ఆశయం. ఆ మాటకొస్తే.. భయంకరమైన జార్డ్స లో అతడితో పాటు ప్రయాణిస్తున్న అందరి లక్ష్యమూ అదే. చేపల వేటకు అనువుగా ఉండే ఆ బోట్లో కొంత దూరం బాగానే ప్రయాణించారు జాన్, అతడి బృందం. ఆ క్షణంలోనే అతడికి పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చారుు. మూడేళ్ల క్రితం స్వీడన్‌కు పారిపోయాడు జాన్. నాజీ సేనల అకృత్యాలను భరించలేక నార్వేను విడిచి వెళ్లిపోయాడు. కానీ, తన దేశాన్ని అలాగే విడిచిపెట్టేయాలని అతడు భావించలేదు. తనలాంటి భావాలున్న మరికొందరు యువకుల్ని స్వీడన్లో కలిశాడు. వీరందరికీ మిత్రరాజ్య సేనలు సహకారం అందించారుు. జర్మనీ సేనలపై ఎదురుదాడి చేసేలా యుద్ధ విద్యల్లో శిక్షణ ఇచ్చారుు. అలా శిక్షణ పూర్తి చేసుకున్నాక, ఒక్కొక్కరూ ఒక్కో బాధ్యతను నెత్తిన వేసుకున్నారు. జాన్ బాల్‌సడ్ బృందానికి అప్పగించిన పని.. జర్మన్ ఎరుుర్ కంట్రోల్ టవర్‌ను పేల్చేయడం! తద్వారా నాజీలకు ఆకాశ మార్గంలో యుద్ధం చేసే అవకాశాలను తగ్గించాలని బలంగా నిర్ణరుుంచుకున్నారు జాన్ బృంద సభ్యులు. దీనికోసం 8 టన్నుల బరువుండే పేలుడు పదార్థాలను తమతో పాటు తీసుకెళ్లారు. టవర్ సమీపంలోకి చేరుకోగానే మంచు కిందిభాగంలోని నీటిలో ఈదుకుంటూ పేలుడు పదార్థాలను అమర్చి, తర్వాత పేల్చేయాలి. అన్నీ సవ్యంగా జరిగితే ఇదే జరిగి ఉండేది. కానీ, జాన్ బృందం చేసిన ఓ పొరపాటు ఆ మిషన్ స్వరూపాన్నే మార్చేసింది. బోట్ సముద్రజలాల్లోకి బయలుదేరే ముందు వారు ఓ వ్యక్తిని కలవాల్సి ఉంది. అరుుతే, అతడి పేరుతోనే ఉన్న మరో వ్యక్తిని పొరపాటున కలిసి, తమ ప్లాన్ మొత్తాన్నీ అతడికి వివరించారు. నాజీలకు వీరవిధేయుడైన ఆ వ్యక్తి.. ఈ మొత్తం పన్నాగాన్ని వెంటనే వారికి చేరవేశాడు. అంతే.. ప్లాన్ మొత్తం నాశనమైపోరుుంది. జర్మన్ సేనలు యుద్ధ నౌకల్లో బోట్‌ను వెంబడించారుు. నలువైపుల నుంచీ కాల్పులు మొదలుపెట్టారుు. దీంతో ఏ దిక్కుకు వెళ్లాలో బోట్లోని వారికి అర్థం కాలేదు. అందరూ మంచు నీళ్లలోకి దూకారు. జాన్ దాదాపు 60 మీటర్లు ఈదుకుంటూ ఒడ్డుకు చేరాడు. అరుుతే, తుపాకుల మోత మాత్రం అతడిని వెంటాడుతూనే ఉంది. పరుగు లంకించుకున్నాడు. తన సహచరులు ఒక్కొక్కరే తుపాకీ గుళ్లకు బలైపోవడం అతడికి తెలుస్తూనే ఉంది. చివరకు తానొక్కడే మిగిలాడు. కళ్లెదురుగా కనిపించిన చిన్నపాటి మంచు ప్రవాహాన్ని ఈది.. అవతలి వైపు మంచు కొండ మీదికి ఎక్కి, బండరాళ్ల చాటున దాక్కున్నాడు. ఈదే క్రమంలో అతడి కాలి బూటు ఒకటి ఊడిపోరుుంది. ఆ మంచుకొండపై బూటులేని పాదంతో చాలా సేపు అలాగే ఉండాల్సివచ్చింది. నాలుగు దిక్కులూ గాలిస్తోన్న శత్రువులు జాన్‌ను పసిగట్టారు. అతడు తలదాచుకున్న కొండ మీదికి ఎక్కుతున్నారు. వారిని కాల్చిపడేసేందుకు ఎంతగానో ప్రయత్నించాడు ఈ నార్వేజియన్. అరుుతే, మంచుదెబ్బకి తుపాకీ మూగబోరుుంది. శత్రువులు దగ్గరకు వస్తోన్న కొద్దీ అతడిలో ఉత్కంఠ మరింత పెరగసాగింది. చిట్టచివరి నిమిషంలో ఎలాగో పేలింది తుపాకీ.. రివ్వున దూసుకొచ్చిన బుల్లెట్ల ధాటికి ఒక జర్మన్ సైనికుడు కొండమీది నుంచి పడి మరణించాడు. ఇంకొకడు గాయపడ్డాడు. అలా తప్పించుకునే అవకాశం అనూహ్యంగా దొరకడంతో మంచు సరస్సు మీది నుంచి పరుగు లంకించాడు జాన్. అక్కడికి దగ్గర్లోని ఓ మంచు గుహలోకి ప్రవేశించాడు. అక్కడే ప్రమాదవశాత్తూ గోతిలో పడ్డాడు. బయటకు రాలేక, అందులోనే నాలుగురోజుల పాటు ఉండిపోయాడు. తర్వాత ఎలాగో బయటపడ్డా.. నాజీలు అక్కడే గస్తీ కాయడంతో గుహ నుంచి బయటకు రాలేకపోయాడు. అలా దాదాపు తొమ్మిది వారాలు గడపాల్సి వచ్చింది. ఈ క్రమంలో బూటు లేని కాలు పూర్తిగా మంచు దెబ్బకు గడ్డకట్టుకుపోరుుంది. దాన్ని అలాగే ఉంచితే తన ప్రాణాలకే ప్రమాదం అని గ్రహించిన జాన్.. వెంట తెచ్చుకున్న కత్తితో కాలి వేళ్లను స్వయంగా నరుక్కున్నాడు. అలా ప్రాణాలు కాపాడుకున్నాడు. అరుుతే, మరోవైపు మంచు తీవ్రత పెరిగిపోవడంతో కళ్లు దెబ్బతిన్నారుు. దాదాపు గుడ్డివాడైపోయాడు. ఈ క్రమంలో ఓ చిన్నపాటి పడవపై ఎక్కి ప్రయాణం మొదలుపెట్టాడు. తీరం చేరే నాటికి పూర్తిగా సృ్పహ కోల్పోయాడు. తీరంలో అతడిని గుర్తించిన స్థానికులు.. అతడికి వైద్య సహాయం అందించి, నాజీ సేనల కంట పడకుండా తిరిగి స్వీడన్‌కు పంపించారు. అలా అప్పటి భయంకర పరిస్థితుల నుంచి బయటపడ్డ ఒకే ఒక్కడిగా నిలిచాడు. అరుుతే, జర్మన్లను దెబ్బ కొట్టే ప్లాన్‌ను సక్రమంగా అమలు చేయలేకపోయారని చాలామంది జాన్‌ను విమర్శించారు. అతడి సాహసయాత్రను గుర్తించేందుకు కొందరు ఇష్టపడలేదు. చివరకు జాన్ బాల్‌సడ్ కూడా కొన్నాళ్లు తన ముఖం చూపేందుకు ఇష్టపడలేదంటే.. అతడు అనుభవించిన వేదన తెలుస్తుంది. ఏదేమైనా ఈ నార్వే వీరుడి దేశభక్తిని మాత్రం ఎవ్వరూ శంకించలేరు..! -
మన్యం మళ్లీ వణుకు
గడిమామిడి ఎన్‌కౌంటర్‌తో ఉలిక్కిపడిన గిరిజనం చనిపోయిన ఇద్దరు మావోలూ సెంట్రీలే తప్పించుకున్న అగ్రనేతలు! పుట్టకోట ప్రాంతాన్ని జల్లెడపట్టిన గ్రేహౌండ్స్ కమెండోలు రెండు నెలలుగా ప్రశాంతంగా ఉన్న మన్యం గడిమామిడి ఎన్‌కౌంటర్‌తో మళ్లీ భయం గుప్పెట్లోకి వెళ్లింది. ఈ ఏడాది ప్రారంభంలో మొదటి ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఇటీవల చింతపల్లి మండలం రాళ్లగెడ్డ కొత్తూరులో పోలీసు అవుట్‌పోస్టు పెట్టేందుకు నిర్ణయం తీసుకోవడంతో పాటు ఎక్కువ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. దీనిపై చర్చించేందుకు మావోయిస్టు నేతలు వారికి సురక్షితంగా ఉన్న పుట్టకోట ప్రాంతంలో సమావేశం ఏర్పాటుకు ప్రయత్నించినట్టి తెలిసింది. ఈ సమాచారం అందుకొని గాలింపు చేపట్టిన గ్రేహౌండ్స్ కమెండోల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. దీనికి ప్రతీకారంగా మావోయిస్టులు విధ్వంసాలు సృష్టించే అవకాశం ఉందని గడిమామిడి చుట్టూ ఉన్న పది గ్రామాల గిరిజనులు భయంతో వణుకుతున్నాయి. కొయ్యూరు: పుట్టకోట అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు పెరిగాయన్న సమాచారం పోలీసు అధికారులకు చే రడంతో మూడు రోజుల నుంచి గ్రేహౌం డ్స్ కమెండోలు కూంబింగ్ చేపట్టారు. గాలికొండ ఏరియా కమిటీకి చెందిన ఆజాద్, ఈస్టు డివిజన్ కమిటీ కార్యదర్శి చలపతి, రవిలతో పాటు మరికొందరు నేతలు గడిమామిడి అటవీ ప్రాంతంలో సమావేశం ఏర్పాటుకు ప్రయత్నించినట్టు తెలిసింది. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఆదివారం మధ్యాహ్నం కొందరు మావోలు ఎదురు కావడంతో రెండు వైపులా కాల్పులు జరిగాయి. ఈ కాల్పు ల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. మృతులిద్దరూ సెంట్రీలుగా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మిగిలిన వారు తప్పించుకున్నారు. కొందరు గాయపడి ఉండే అవకాశం ఉంది. ఆ ప్రాంతమంతా పోలీసు బలగాలతో నిండిపోయింది. తప్పించుకున్న వారిని పట్టుకునేందుకు నలువైపుల నుంచి కూంబింగ్ ఉధృతం చేశారు. ఇటు ఎన్కౌంటర్నుంచి తప్పించుకున్న మావోయిస్టులు పోలీసులపై దాడులకు పాల్పడే అవకాశం ఉంది. దీంతో మరణించిన ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను వెంటనే బయటకు తీసుకురావడం కష్టమని, వాటిని సోమవారం తీసుకు వచ్చే అవకాశం ఉందని పోలీసు అధికారి ఒకరు చెప్పారు సురక్షిత ప్రాంతంలో ఎదురుదెబ్బ మావోయిస్టులకు దట్టమైన అడవితో ఉన్న పుట్టకోట ప్రాంతం ఒకప్పుడు సురక్షితమైనది. ఇప్పుడు సేప్‌జోన్‌ను కోల్పోయింది. గత ఏడాది మావోయిస్టు కేంద్ర మిలటరీ కమిషన్ ఇన్చార్జీ నంబళ్ల కేశవరావు పుట్టకోట ప్రాంతంలో కొందరు మావోయిస్టులకు శిక్షణ ఇచ్చినట్టు పోలీసులకు సమాచారం చేరడంతో అప్రమత్తమయ్యారు. దీంతో తరచూ పోలీసులు ఈ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. 2005లో మావోయిస్టు అగ్రనేత కైలాసం పుట్టకోట అడవిలో ఎన్కౌంటర్లో మరణించారు. అతని మృతదేహాన్ని తీసుకువస్తున్న దారిలో పోలీసులపై రెండుసార్లు మందుపాతర్లు పేల్చారు. గడిమామిడి ఎన్కౌంటర్లో సహచరులను కోల్పోయిన మావోయిస్టులు అధికారపార్టీ నేతలపై దాడులకు పాల్పడే అవకాశం ఉంది. దీంతో పోలీసులు హిట్‌లిస్టులో ఉన్న నేతలను అప్రమత్తం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్కౌంటర్ సమాచారం తెలిసిన వెంటనే మంప ఎస్ఐ మదుసూధన్ వై.రామవరం వెళ్లారు. -
వీవీఐపీ భద్రత నుంచి కమాండోల ఉపసంహరణ
న్యూఢిల్లీ: ఉగ్రవాద నిరోధక చర్యల్లో జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) కమెండోలు మరింతగా పాలుపంచుకునే దిశగా.. 600 మంది కమాండోలను వీవీఐపీల భద్రత యూనిట్ నుంచి ఎన్ఎస్జీ తప్పించింది. ప్రముఖులకు భద్రత నిర్వహిస్తున్న ఎన్ఎస్జీ కమాండోల్ని వెనక్కు రప్పించాలని రెండేళ్లుగా ప్రణాళిక రూపొందిస్తున్నా అది కార్యరూపం దాల్చలేదు. అయితే పఠాన్‌కోట్ ఘటన నేపథ్యంలో ఎన్ఎస్జీ సిబ్బందిని ఇకమీదట కచ్చితంగా ఉగ్రవాద చర్యల్ని ఎదుర్కొనేందుకే వినియోగించాలన్న భావనకు వచ్చారు. తాజాగా రూపొందించిన ప్రణాళిక ప్రకారం 11వ ప్రత్యేక రేంజర్స్ గ్రూప్(ఎస్ఆర్జీ)లోని మూడు బృందాల్లో రెండింటిని వీవీఐపీ భద్రత కార్యకలాపాల నుంచి ఉపసంహరించాలని భావిస్తున్నారు. వీరిని స్పెషల్ యాక్షన్ గ్రూప్(ఎస్ఏజీ)తో కలసి ఉగ్రవాద మూకలపై పోరాడేందుకు సిద్ధం చేయాలనుకుంటున్నారు. ఎన్ఎస్జీ కమాండో బృందాలు ప్రస్తుతం ఐదు ప్రాథమిక యూనిట్లుగా ఉంది.