భద్రాచలం : తెలంగాణ – ఛత్తీస్‌గ«ఢ్ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులకు చెక్ పెట్టేందుకు పోలీసులు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ముల్లును ముల్లుతోనే తీయాలనే ఉద్దేశంతో నిరుద్యోగ గిరిజన యువతలో చైతన్యం తీసుకొచ్చి, వారితోనే మావోయిస్టుల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేలా పావులు కదుపుతున్నారు. ఛత్తీస్‌గఢ్ తరహాలో తెలంగాణలో కూడా మహిళా కమాండోలను నియమించేందుకు పోలీసు శాఖ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. లొంగిపోయిన మహిళా మావోయిస్టులకు పోలీసు శాఖలో ఉద్యోగాలు కల్పించి, వారి సేవలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వినియోగించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో గల గిరిజన యువతను కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాల్లోకి తీసుకునేందుకు అవసరమైన శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ రూపొందించారు. కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు గిరిజన యువత ఎంపికయ్యేలా భద్రాచలంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. త్వరలో జరిగే వివిధ రకాల రిక్రూట్‌మెంట్‌లలో ఉద్యోగాలు సాధించేలా 100 మందిని ఎంపిక చేసి.. వారిని పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. పోటీ పరీక్షల్లో నెగ్గేలా నిష్ణాతులైన ఉపాధ్యాయులతో శిక్షణ ఇప్పించడంతో పాటు ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సరిహద్దున ఉన్న ఏజెన్సీ గ్రామాల్లో గల నిరుద్యోగ గిరిజన యువతకు కూడా ఈ విధంగానే శిక్షణ ఇప్పించేలా మిగతా జిల్లాల్లో కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
రంగంలోకి మహిళా పోలీసు కమాండోలు...
ఛత్తీస్‌గఢ్‌లో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులు విధ్వంసాలకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉన్న ప్రాంతంపై పట్టు సాధించేందుకు మహిళా కమాండోలను భద్రతా దళంలోకి పంపించారు. లొంగిపోయిన మహిళా మావోయిస్టులకు పునరావాసం కల్పించే క్రమంలో పోలీసు శాఖలో ఉద్యోగాలిచ్చి, వారిని ఈ ప్రాంతాల్లో పనిచేయించేలా ఏర్పాట్లు వేగవంతం చేశారు. లొంగిపోయిన మహిళలతో పాటు, పోలీసు శాఖలో ఇప్పటికే పనిచేస్తున్న కొంతమంది మహిళా అధికారులు, సిబ్బందితో ఓ దళాన్ని ఏర్పాటు చేసి, వీరికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇలా 60 మందిని ఎంపిక చేయగా, వీరిలో ఇప్పటికే 25 మంది మహిళా కమాండోలు అధునాతన తుపాకులతో రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇదే రీతిన మన రాష్ట్రంలో కూడా గిరిజన యువతకు ఉద్యోగాలు కల్పించి, సరిహద్దు ప్రాంతంపై పట్టు సాధించేందుకు పోలీసుశాఖ వ్యూహం రచిస్తోంది.
నష్ట నివారణకు సరికొత్త వ్యూహం...
పోలీసు బలగాలు దండకారణ్యంలోకి దూసుకుపోయి, మావోయిస్టు కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రధానంగా రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు గ్రామాలను కలుపుతూ అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున రహదారులు నిర్మిస్తున్నారు. మావోయిస్టులు ప్రెషర్ బాంబులు అమర్చుతూ ఆటంకం కలిగిస్తున్నా.. ప్రత్యేక బలగాల బందోబస్తు మధ్య రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తున్నారు. వాకీటాకీలతో పాటు, గ్లోబల్ పొజిషన్ సిస్టమ్(జీపీఎస్) ద్వారా కూంబింగ్‌లో దూసుకెళ్తున్నారు. అత్యవసర సమయాల్లో సంఘటన స్థలం నుంచే సమాచారం చేరవేసేందుకు శాటిలైట్ ఫోన్‌ల వినియోగానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఆ ప్రాంతాలే కీలకం...
ఛత్తీస్‌గఢ్‌లోని దట్టమైన అటవీ ప్రాంతాన్ని అడ్డాగా చేసుకుని మావోయిస్టులు మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో విస్తృతంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా, బీజాపూర్, దంతెవాడ జిల్లాల్లో మావోయిస్టుల విధ్వంసాలు రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాలపై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని గొల్లపల్లి, కిష్టారం, పామేడు, ఆవుపల్లి, ఊసూరు పోలీసు స్టేషన్‌ల పరధిలో తరచూ ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది. మావోయిస్టులపై పై చేయి సాధించే క్రమంలో అటవీ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్న క్రమంలో ప్రతిదాడులు సైతం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్థి నష్టం వాటిల్లుతోంది. ఈ ప్రాంతాల్లోనే మావోయిస్టులు తరచుగా మందుపాతర్లు అమర్చడం పోలీసులను కలవరపెడుతోంది. అమాయక గిరిజనులు సైతం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఛత్తీస్‌గఢ్‌తో పాటు, మన రాష్ట్రంలో కూడా ఈ ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతం నివురుగప్పిన నిప్పులా మారింది. మావోయిస్టుల చర్యలను అరికట్టేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు సత్ఫలితాలిస్తాయో వేచి చూడాలి.
లే‘ఢీ’ కమాండోలు !
Published Mon, Feb 5 2018 2:52 PM | Last Updated on Tue, Oct 9 2018 2:53 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment