bhadradhri
-
అంతా మీ ఇష్టమైపోయింది.. పిలవని కార్యక్రమానికి రాలేను..
సాక్షి,ఇల్లెందు( భద్రాద్రి): అంతా మీ ఇష్టమైపోయింది.. ఎంపీడీఓ కార్యాలయంలో ఏ కార్యక్రమానికీ సమాచారం ఇవ్వడం లేదు.. అలాంటప్పుడు గాంధీ జయంతికి నేను ఎందుకు రావాలి... మీరే చేసుకోండి’ అంటూ ఇల్లెందు ఎంపీపీ చీమల నాగరత్నమ్మ అధికారులపై మండిపడ్డారు. ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయగా ఎంపీపీ నాగరత్నమ్మ హాజరయ్యారు. ఇదే సమయంలో గాంధీ జయంతి వేడుక నిర్వహిస్తుండగా రావాలని అధికారులు ఆహ్వానించారు. అయితే, ఇతర కార్యక్రమానికి వస్తే గాంధీ జయంతికి ఆహ్వానిస్తారా.. అసలు ఈ కార్యక్రమం ఉందని తనకు సమాచారమే ఇవ్వలేదని చెప్పారు. దీంతో ఎంపీడీఓ అప్పారావు ఆమెకు నచ్చజెప్పారు. సమాచారం ఇవ్వాలని యూడీసీకి చెప్పామని, ఆయన మరిచిపోయి ఉంటారని, ఈ విషయంలో యూడీసీకి మెమో ఇస్తామని చెప్పినా ససేమిరా అనడంతో.. చివరకు జెడ్పీటీసీ ఉమ, వైస్ ఎంపీపీ ప్రమోద్ తదితరులు నచ్చ జెప్పడంతో చివరకు ఎంపీపీ గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: నలభై లక్షల ప్యాకేజీ వద్దనుకున్నా.. ఇప్పుడు సంతోషంగానే ఉన్నా! -
సుపారీ ఇచ్చి చంపించారు
సాక్షి, చర్ల: దుమ్ముగూడెం మండలంలోని లచ్చిగూడెంలో ఈ నెల 10న అర్ధరాత్రి భూవివాదంలో ఓ వ్యక్తిని గొంతుకోసి హతమార్చిన ఘటనలో పోలీసులు 8 మందిని అరెస్టు చేశారు. శనివారం దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ రాజేష్‌చంద్ర వివరాలు వెల్లడించారు. లచ్చిగూడేనికి చెందిన తండ్రి కొడుకులు సోంది ముద్దరాజు, రవిబాబులతో అదే గ్రామానికి చెందిన హత్యకు గురైన కారం రామకృష్ణకు మధ్య కొంతకాలంగా భూవివాదం నడుస్తుంది. ఈ క్రమంలో తహసీల్దార్ ఆ భూ వ్యవహరంపై విచారణ నిర్వహించి, భూమి ముద్దరాజు కుటుంబీకులకే చెందుతుందని తెలియజేయడంతో ఆ నాటి నుంచి హత్యకు గురైన రామకృష్ణ కుటుంబం వివాదాస్పద భూమి నుంచి వైదొలిగింది. కాగా భూవివాదం కొనసాగుతున్న సందర్భంలో గ్రామంలో పంచాయితీ చేసిన పెద్దల్లో ఇద్దరు పెనుబల్లి భద్రయ్య, సోంది అర్జున్ అతడ్ని చంపితేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పడంతో రామకృష్ణను చంపాలని ముద్దరాజు కుటుంబీకులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కుంట సమీపంలో గల మైతా గ్రామానికి చెందిన పొడియం నగేష్, పొడియం లచ్చు, పొడియం భద్రయ్యలతో రూ.40వేలకు రామకృష్ణను చంపేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. హత్యకు సంబంధించి సుపారీ తీసుకున్న వారు జాప్యం చేస్తుండడంతో ముద్దరాజుకు బంధువైన రాళ్లగూడేనికి చెందిన పాయం సతీష్ ఈ నెల 7న మైతాకు వెళ్లి వారితో మాట్లాడి రూ.2 వేలు చెల్లించి వచ్చాడు. 9న రాత్రి వచ్చిన మైతా గ్రామస్తులు రవిబాబుకు ఫోన్ చేయగా ముద్దరాజు, మడకం సతీష్ లతో కలిసి గుర్రాలబైలు సమీపంలో వారిని కలుసుకుని ఎలా హత్య చేయాలనే దానిపై చర్చించుకున్నారు. రాత్రి 12.30 గంటలకు రామకృష్ణ ఇంటికి చేరుకోగా, ముద్దరాజు, సతీష్, పొడియం భద్రయ్య ఇంటి సమీపంలో మాటు వేశారు. రవిబాబు, లచ్చు, నగేష్ ఇంటిలోకి ప్రవేశించి నిద్రలో ఉన్న రామకృష్ణను హతమార్చారు. రవిబాబు, నగేష్ కాళ్లు, చేతులు పటుకోగా, లచ్చు కత్తితో గొంతు కోశాడు. ఈ సందర్భంగా నిద్రలో నుంచి మేల్కొన్న మృతుడి భార్య తులసీ అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమెను కూడా హతమార్చేందుకు నిందితులు యత్నించడంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. ఈ క్రమంలో తులసీని గొడ్డలితో కొట్టి, కత్తితో పొడిచేందుకు యత్నించారు. ఆమె చేయి అడ్డుపెట్టకోవడంతో చేతికి గాయమైంది. తులసీ పోలీసులకు ఫిర్యాదు చేయగా సీఐ వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు ఎస్ఐ రితీష్ విచారణ చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం గంగోలు సమీపంలో తనిఖీలు నిర్వహిస్తున్న సందర్భంగా రెండు బైకులపై వస్తున్న రవిబాబు, ముద్దరాజు, నగేష్, లచ్చు, భద్రయ్య, సతీష్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు గ్రామపెద్దలు అర్జున్, పెనుబల్లి భద్రయ్యలను కూడా అరెస్ట్ చేసి, విచారించడంతో నేరం అంగీకరించినట్లు ఏఎస్పీ తెలిపారు. వీరిందరిపై హత్య కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు ఆయన వివరించారు. -
అడవికి అండగా..
సాక్షి, ఖమ్మం: జిల్లాలో 60,300 హెక్టార్ల అటవీ విస్తీర్ణం ఉంది. ఇందులో ఖమ్మం డివిజన్ పరిధిలో 12వేల హెక్టార్లు, సత్తుపల్లి డివిజన్లో 48,300 హెక్టార్లు ఉంది. ఈ భూమిని పూర్తిస్థాయిలో సంరక్షించేందుకు అటవీ శాఖాధికారులు సమాయత్తమవుతున్నారు. అయితే కొందరు గిరిజనులు పోడు కొట్టి వ్యవసాయం చేస్తుండగా.. గిరిజనేతరులు కూడా అటవీ భూమిని ఆక్రమిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కొట్టిన పోడు కాకుండా.. కొత్తగా ఎవరు పోడు కొట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోడు వివాదాలు నెలకొన్నా.. ఈ సమస్య కొన్నేళ్లుగా అలాగే కొనసాగుతోంది. అటవీ శాఖాధికారులు మాత్రం అటవీ భూములను ఆక్రమిస్తున్నారని ఆరోపిస్తుండగా.. తాము కొన్నేళ్లుగా పోడు కొట్టి వ్యవసాయం చేసుకుంటున్నామని గిరిజనులు వాదిస్తున్నారు. గతంలో పట్టాలు.. అటవీ భూమిని ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్న గిరిజనులకు గతంలో ప్రభుత్వం ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు అందజేసింది. మొత్తం 5,694 మంది గిరిజనులకు 16,740 ఎకరాలు కేటాయించింది. పట్టాలు పంపిణీ చేసిన సమయంలో తమకు కేటాయించిన భూమిలో మాత్రమే వ్యవసాయం చేయడంతోపాటు తమ పక్కన ఉన్న అటవీ భూమిని ఎవరూ ఆక్రమించకుండా చూడాలని అటవీ శాఖాధికారులు వారిని కోరారు. అయినప్పటికీ అటవీ భూమి ఆక్రమణకు గురవుతోందని అటవీ అధికారులు చెబుతున్నారు. దాదాపు మరో 10వేల ఎకరాల వరకు ఆక్రమించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అక్కడక్కడ వివాదాలు చెలరేగుతున్నాయంటున్నారు. అయితే అటవీ భూముల్లో గిరిజనులే కాకుండా గిరిజనేతరులు కూడా సాగు చేస్తున్నారని పేర్కొంటున్నారు. అత్యంత విలువైన అటవీ భూమి అన్యాక్రాంతమవుతోందని, ఆ భూములను సంరక్షించేందుకు పోడు వ్యవసాయాన్ని అడ్డుకుంటున్నట్లు చెబుతున్నారు. సర్వే దిశగా.. జిల్లాలో పోడు వివాదాలను పరిష్కరించేందుకు అటవీ భూమిని సర్వే చేయడం ఒక్కటే మార్గమని ప్రభుత్వం భావిస్తోంది. అసలు అటవీ విస్తీర్ణం ఎంత ఉంది? ఆక్రమణకు ఎంత గురైంది? ఏ మేరకు గిరిజనులకు పట్టాలు ఇచ్చారనే అంశాలను సమగ్రంగా తేల్చితే.. ఆ తర్వాత చర్యలు చేపట్టడం సులభమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో సర్వే బాధ్యతలను అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖలకు అప్పగించారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఎన్ని ఎకరాలకు ఇచ్చారు? ఇప్పుడు ఆయా రైతుల ఆధీనంలో ఎంత ఉంది? గిరిజనులకు సంబంధించిన హక్కులేమిటి? గిరిజనేతరుల ఆధీనంలో అటవీ భూమి ఎంత ఉందనే దానిపై సర్వే చేయనున్నారు. సర్వే పూర్తి వివరాలను ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందజేస్తారు. దానిని అధ్యయనం చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలకు ఆదేశించనున్నది. -
లే‘ఢీ’ కమాండోలు !
భద్రాచలం : తెలంగాణ – ఛత్తీస్‌గ«ఢ్ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులకు చెక్ పెట్టేందుకు పోలీసులు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ముల్లును ముల్లుతోనే తీయాలనే ఉద్దేశంతో నిరుద్యోగ గిరిజన యువతలో చైతన్యం తీసుకొచ్చి, వారితోనే మావోయిస్టుల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేలా పావులు కదుపుతున్నారు. ఛత్తీస్‌గఢ్ తరహాలో తెలంగాణలో కూడా మహిళా కమాండోలను నియమించేందుకు పోలీసు శాఖ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. లొంగిపోయిన మహిళా మావోయిస్టులకు పోలీసు శాఖలో ఉద్యోగాలు కల్పించి, వారి సేవలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వినియోగించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో గల గిరిజన యువతను కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాల్లోకి తీసుకునేందుకు అవసరమైన శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ రూపొందించారు. కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు గిరిజన యువత ఎంపికయ్యేలా భద్రాచలంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. త్వరలో జరిగే వివిధ రకాల రిక్రూట్మెంట్లలో ఉద్యోగాలు సాధించేలా 100 మందిని ఎంపిక చేసి.. వారిని పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. పోటీ పరీక్షల్లో నెగ్గేలా నిష్ణాతులైన ఉపాధ్యాయులతో శిక్షణ ఇప్పించడంతో పాటు ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సరిహద్దున ఉన్న ఏజెన్సీ గ్రామాల్లో గల నిరుద్యోగ గిరిజన యువతకు కూడా ఈ విధంగానే శిక్షణ ఇప్పించేలా మిగతా జిల్లాల్లో కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రంగంలోకి మహిళా పోలీసు కమాండోలు... ఛత్తీస్‌గఢ్‌లో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులు విధ్వంసాలకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉన్న ప్రాంతంపై పట్టు సాధించేందుకు మహిళా కమాండోలను భద్రతా దళంలోకి పంపించారు. లొంగిపోయిన మహిళా మావోయిస్టులకు పునరావాసం కల్పించే క్రమంలో పోలీసు శాఖలో ఉద్యోగాలిచ్చి, వారిని ఈ ప్రాంతాల్లో పనిచేయించేలా ఏర్పాట్లు వేగవంతం చేశారు. లొంగిపోయిన మహిళలతో పాటు, పోలీసు శాఖలో ఇప్పటికే పనిచేస్తున్న కొంతమంది మహిళా అధికారులు, సిబ్బందితో ఓ దళాన్ని ఏర్పాటు చేసి, వీరికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇలా 60 మందిని ఎంపిక చేయగా, వీరిలో ఇప్పటికే 25 మంది మహిళా కమాండోలు అధునాతన తుపాకులతో రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇదే రీతిన మన రాష్ట్రంలో కూడా గిరిజన యువతకు ఉద్యోగాలు కల్పించి, సరిహద్దు ప్రాంతంపై పట్టు సాధించేందుకు పోలీసుశాఖ వ్యూహం రచిస్తోంది. నష్ట నివారణకు సరికొత్త వ్యూహం... పోలీసు బలగాలు దండకారణ్యంలోకి దూసుకుపోయి, మావోయిస్టు కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రధానంగా రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు గ్రామాలను కలుపుతూ అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున రహదారులు నిర్మిస్తున్నారు. మావోయిస్టులు ప్రెషర్ బాంబులు అమర్చుతూ ఆటంకం కలిగిస్తున్నా.. ప్రత్యేక బలగాల బందోబస్తు మధ్య రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తున్నారు. వాకీటాకీలతో పాటు, గ్లోబల్ పొజిషన్ సిస్టమ్(జీపీఎస్) ద్వారా కూంబింగ్‌లో దూసుకెళ్తున్నారు. అత్యవసర సమయాల్లో సంఘటన స్థలం నుంచే సమాచారం చేరవేసేందుకు శాటిలైట్ ఫోన్ల వినియోగానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ ప్రాంతాలే కీలకం... ఛత్తీస్‌గఢ్‌లోని దట్టమైన అటవీ ప్రాంతాన్ని అడ్డాగా చేసుకుని మావోయిస్టులు మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో విస్తృతంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా, బీజాపూర్, దంతెవాడ జిల్లాల్లో మావోయిస్టుల విధ్వంసాలు రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాలపై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని గొల్లపల్లి, కిష్టారం, పామేడు, ఆవుపల్లి, ఊసూరు పోలీసు స్టేషన్ల పరధిలో తరచూ ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది. మావోయిస్టులపై పై చేయి సాధించే క్రమంలో అటవీ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్న క్రమంలో ప్రతిదాడులు సైతం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్థి నష్టం వాటిల్లుతోంది. ఈ ప్రాంతాల్లోనే మావోయిస్టులు తరచుగా మందుపాతర్లు అమర్చడం పోలీసులను కలవరపెడుతోంది. అమాయక గిరిజనులు సైతం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఛత్తీస్‌గఢ్‌తో పాటు, మన రాష్ట్రంలో కూడా ఈ ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతం నివురుగప్పిన నిప్పులా మారింది. మావోయిస్టుల చర్యలను అరికట్టేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు సత్ఫలితాలిస్తాయో వేచి చూడాలి. -
అందరి బంధువయా.. భద్రాచల రామయ్యా!
రాష్ట్ర సరిహద్దుల్లో మొదలైన రాములోరి పెళ్లి సందడి విద్యుదీపకాంతులీనుతున్న భద్రాద్రి రామాలయం రేపే సీతారాముల కల్యాణం 6నశ్రీరామ పట్టాభిషేకం స్వామివారి కల్యాణానికి సర్వం సిద్ధం నెల్లిపాక : రాష్ట్ర సరిహద్దున ఉన్న భద్రాద్రిలో శ్రీసీతారాములవారి పెళ్లి సందడి నెలకొంది. ఈనెల ఐదో తేదీన శ్రీరామనవమి రోజున స్వామి వారి కల్యాణం, 6న శ్రీరామ మహాపట్టాభిషేక మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదిగో భద్రాద్రి.. గౌతమి అదిగో చూడండి...అంటూ శ్రీరామదాసు పిలుపునందుకుని శ్రీసీతారాముల కల్యాణానికి భక్తులు తరలిరానున్నారు. శ్రీరామనవమి అంటే చాలు భక్తిపారవశ్యంతో పులకించే ఉభయగోదావరి జిల్లాల నుంచే వేలాది మంది భక్తులు భద్రాద్రికి ఏటా వస్తుంటారు. రామయ్య పెళ్లి వేడుకల్లో అన్నీ తామై ముందుంటారు. గోటితో వలిచిన తలంబ్రాల తయారీ, పెండ్లి తంతులో ఉపయోగించే కొబ్బరి బొండాలు భద్రాద్రి శ్రీసీతారాముల కల్యాణానికి భక్తులు ఉభయగోదావరి జిల్లాల నుంచే తీసుకొస్తుంటారు. సర్వాంగసుందరంగా భద్రాచలం.. ఈ ఏడాది జరిగే వేడుకలకు భద్రాచలం పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. స్వామివారి కల్యాణానికి లక్షకు పైగా భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. మిథిలా స్టేడియాన్ని సుందరంగ అలంకరించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం తెలుగు రాష్ట్రాల్లో వందలాది ప్రత్యేక బస్సులను నడపనుంది. ఇప్పటికే వందలాది మంది భక్తులు పాదయాత్రతో భద్రాద్రి చేరుకున్నారు. వేగంగా లడ్డూ ప్రసాద తయారీ శ్రీరామనవవిుకు 1.50 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని భావించి వారందరికీ మూడు లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు గాను లడ్డూల తయారీ స్థానిక చిత్రకూట మండపంలో వేగంగా జరుగుతోంది. శ్రీరామనవమి నాటికి మూడు లక్షల లడ్డూలతో పాటు ముత్యాల తలంబ్రాలను తయారీను అధికారులు వేగవంతం చేశారు. లడ్డూలు, తలంబ్రాలకు ప్రత్యేక కౌంటర్లు ఈ ఏడాది భద్రాచలం వచ్చిన ప్రతి భక్తునికీ లడ్డూలతో పాటు స్వామి వారి తలంబ్రాలను అందించాలని ఆ రాష్ట్ర మంత్రి తుమ్మల, జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రత్యేక తలంబ్రాల కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. కోర్టు ప్రాంగణం, కాపా లక్ష్మమ్మ సొసైటీ స్థలంతో పాటు పలు చోట్ల ఈ కౌంటర్లను ఇప్పటికే ఏర్పాటు చేశారు.