కొణిజర్ల మండలంలోని అటవీ భూమి
సాక్షి, ఖమ్మం: జిల్లాలో 60,300 హెక్టార్ల అటవీ విస్తీర్ణం ఉంది. ఇందులో ఖమ్మం డివిజన్ పరిధిలో 12వేల హెక్టార్లు, సత్తుపల్లి డివిజన్‌లో 48,300 హెక్టార్లు ఉంది. ఈ భూమిని పూర్తిస్థాయిలో సంరక్షించేందుకు అటవీ శాఖాధికారులు సమాయత్తమవుతున్నారు. అయితే కొందరు గిరిజనులు పోడు కొట్టి వ్యవసాయం చేస్తుండగా.. గిరిజనేతరులు కూడా అటవీ భూమిని ఆక్రమిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
గతంలో కొట్టిన పోడు కాకుండా.. కొత్తగా ఎవరు పోడు కొట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోడు వివాదాలు నెలకొన్నా.. ఈ సమస్య కొన్నేళ్లుగా అలాగే కొనసాగుతోంది. అటవీ శాఖాధికారులు మాత్రం అటవీ భూములను ఆక్రమిస్తున్నారని ఆరోపిస్తుండగా.. తాము కొన్నేళ్లుగా పోడు కొట్టి వ్యవసాయం చేసుకుంటున్నామని గిరిజనులు వాదిస్తున్నారు.
గతంలో పట్టాలు..
అటవీ భూమిని ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్న గిరిజనులకు గతంలో ప్రభుత్వం ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు అందజేసింది. మొత్తం 5,694 మంది గిరిజనులకు 16,740 ఎకరాలు కేటాయించింది. పట్టాలు పంపిణీ చేసిన సమయంలో తమకు కేటాయించిన భూమిలో మాత్రమే వ్యవసాయం చేయడంతోపాటు తమ పక్కన ఉన్న అటవీ భూమిని ఎవరూ ఆక్రమించకుండా చూడాలని అటవీ శాఖాధికారులు వారిని కోరారు.
అయినప్పటికీ అటవీ భూమి ఆక్రమణకు గురవుతోందని అటవీ అధికారులు చెబుతున్నారు. దాదాపు మరో 10వేల ఎకరాల వరకు ఆక్రమించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అక్కడక్కడ వివాదాలు చెలరేగుతున్నాయంటున్నారు. అయితే అటవీ భూముల్లో గిరిజనులే కాకుండా గిరిజనేతరులు కూడా సాగు చేస్తున్నారని పేర్కొంటున్నారు. అత్యంత విలువైన అటవీ భూమి అన్యాక్రాంతమవుతోందని, ఆ భూములను సంరక్షించేందుకు పోడు వ్యవసాయాన్ని అడ్డుకుంటున్నట్లు చెబుతున్నారు.
సర్వే దిశగా..
జిల్లాలో పోడు వివాదాలను పరిష్కరించేందుకు అటవీ భూమిని సర్వే చేయడం ఒక్కటే మార్గమని ప్రభుత్వం భావిస్తోంది. అసలు అటవీ విస్తీర్ణం ఎంత ఉంది? ఆక్రమణకు ఎంత గురైంది? ఏ మేరకు గిరిజనులకు పట్టాలు ఇచ్చారనే అంశాలను సమగ్రంగా తేల్చితే.. ఆ తర్వాత చర్యలు చేపట్టడం సులభమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
దీంతో సర్వే బాధ్యతలను అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖలకు అప్పగించారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు ఎన్ని ఎకరాలకు ఇచ్చారు? ఇప్పుడు ఆయా రైతుల ఆధీనంలో ఎంత ఉంది? గిరిజనులకు సంబంధించిన హక్కులేమిటి? గిరిజనేతరుల ఆధీనంలో అటవీ భూమి ఎంత ఉందనే దానిపై సర్వే చేయనున్నారు. సర్వే పూర్తి వివరాలను ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందజేస్తారు. దానిని అధ్యయనం చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలకు ఆదేశించనున్నది.
Comments
Please login to add a commentAdd a comment