సత్యనారాయణపురంలో బస్టాండ్ ఎదుట వెలసిన కరపత్రాలు
చర్ల : ‘మావోయిస్టు ఉద్యమంపై మహిళల మనోవేదన’ పేరుతో చర్ల మండలం సత్యనారాయణపురంలో బుధవారం అర్ధరాత్రి కరపత్రాలు వెలిశాయి. అందులోని వివరాలిలా ఉన్నాయి.. ‘మావోయిస్టు అగ్రనాయకులారా.. మీరు అభం శుభం తెలియని, దిక్కు మొక్కూ లేని అనాథ, అమాయక ఆదివాసీ బాలికలను, ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుంటూ మావోయిస్టులు పార్టీలోకి బలవంతంగా చేర్చుకుంటున్నారు.. వారి వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటున్నారు.. వారి చావులకు కారణమవుతున్నారు.. ఇదేనా మీరు చేసే ప్రజాయుద్ధం.. నేటికీ మారుమూల అటవీ ప్రాంతాల్లో ఎంతో మంది ఆదివాసీ మహిళలు, బాలికలు సరైన వైద్య సదుపాయాలు అందక ప్రాణాలు కోల్పోతున్నారనే విషయం మీకు తెలియదా ? నరహంతక ముఠాగా మారిన మీరు పెట్టే మందు పాతరల బారిన అటవీ ఉత్పత్తుల కోసం వెళ్లిన ఎందరో ఆదివాసీ మహిళలు పడి అర్ధంతరంగా చనిపోతున్నారు.
గతంలో కుంట గ్రామంలోని హాస్టల్ నుంచి ఇంటికి వెళ్తున్న ఓ బాలిక మీ మందు పాతరకు బలై రెండు ముక్కలైంది. అగ్రనాయకులమనే అహంకారంతో ఎంతో మంది ఆదివాసీ మహిళలను బెదిరించి లొంగదీసుకోవడం, అక్రమ సంబంధం పెట్టుకోవడం, ఎదురు తిరిగిన మహిళా మావోయిస్టులపై చెడు ప్రచారం చేయడం.. ఇదేనా మీరు చేసే ప్రజా ఉద్యమం.. మహిళా హక్కుల సాధనకు మీరు పోరాడిన దాఖలాలు ఉన్నాయా? పోలీసుల ఎదురుకాల్పుల్లో అమాయక ఆదివాసీ మహిళలను అడ్డుపెట్టుకొని పారిపోవడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా ?’ అని ఘాటుగా ప్రశ్నించింది.
‘మీరు ఉద్యమకారులు కాదు.. నరహంతకులు.. మీకు ప్రజలే బుద్ధి చెపుతారు’ అంటూ హెచ్చరించింది. ఈ కరపత్రాలపై మండలంలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఏ బాధిత మహిళ ఇంత ధైర్యం చేసి కరపత్రాలు ముద్రించిందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది పోలీసుల పనే అయి ఉండవచ్చునే ఆరోపణలు సైతం వ్యక్తమవుతున్నాయి. పోలీసులపై వస్తున్న ఆరోణల నేపథ్యంలో చర్ల ఎస్సై రాజువర్మ, సీఐ తాళ్లపల్లి సత్యనారాయణలను వివరణ కోరేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులో లేరు.
Comments
Please login to add a commentAdd a comment