ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు
ఇబ్రహీంపట్నం రూరల్: ఆక్టోపస్ పోలీసుల మాక్‌డ్రిల్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న వాహనాన్ని వెనుక నుంచి ఛేదించే క్రమంలో ప్రమాదం జరిగింది. కమాండోలు ప్రయాణిస్తున్న కారు ముందుగా వెళ్తున్న బస్సును ఢీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. బొంగ్లూర్ నుంచి తుక్కుగూడ వెళ్లే ఔటర్ రింగ్ రోడ్డు బైపాస్ టీసీఎస్ వెనుక మంగళవారం ఉదయం ఆక్టోపస్ కమాండోలు బస్సు, కారుతో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. డ్రిల్‌లో అతివేగంగా వెళ్తున్న బస్సును కారులో ప్రయాణిస్తున్న వారు వెళ్లి పట్టుకునే సన్నివేశాన్ని ప్రదర్శిస్తున్నారు.
అందులో భాగంగా ముందు కమాండోల బస్సు వెళ్తుంటే వెనుక నుంచి టాటా ఇండికా కమాండోల కారు వెళ్లి వారిని ఆపాలి. అయితే ప్రమాదవశాత్తు వెనుక కారు ముందుగా వెళ్తున్న కమాండోల బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సురేశ్, లక్పతి, రాహుల్ భవానీసింగ్, చెన్నకేశవరెడ్డి, శేఖర్‌లకు గాయాలయ్యాయి. వెంటనే వీరిని బస్సులో నగరంలోని కామినేని ఆస్పత్రిలో చేర్పించారు. కారు నడిపిన లక్పతి అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మిగతా నలుగురికీ స్వల్ప గాయాలయ్యాయని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ఆక్టోపస్ ఐజీలతో పాటు సివిల్ పోలీసు లు ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment