విశాఖపట్నం: మంగళవారం రాత్రి 9 గంటలు.. ఆయుధాలు ధరించిన ఐదుగురు ఉగ్రవాదులు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోకి చొరబడ్డారు. జిహాద్ అంటూ మెయిన్‌గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డ్‌పై దాడి చేసి లోపలకు ప్రవేశించారు. సెక్యూరిటీ గార్డ్ అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. ఉగ్రవాదులు ఏయూ రిజిస్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన విద్యార్థులు భయాందోళనకు గురై.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఆక్టోపస్ బృందానికి సమాచారం చేరవేశారు.
ఆక్టోపస్ బృందాలు వెంటనే అప్రమత్తమై.. ఏయూ ప్రాంగణానికి చేరుకున్నాయి. ఆక్టోపస్ బృంద సభ్యులు కొంత సేపు సమాలోచనలు జరిపారు. ఉగ్రవాదులు చొరబడిన ప్రాంతం, భవనం పరిసరాలు, లోపలకు వెళ్లే మార్గాలు, లోపల పరిస్థితులు తదితర అంశాలపై ప్రాథమికంగా అవగాహన ఏర్పరుచుకుని.. ఐదుగు రు సభ్యులు ఒక బృందంగా ఏర్పడ్డారు. ఏయూ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు.
కొంత మంది ఆక్టోపస్ స్నైపర్ సభ్యులు భవనాలపైకి చేరుకుని మాటువేశారు. మరోవైపు ఆక్టోపస్ బృందాలు లోపలకు ప్రవేశించి ప్రతీ గదిని తనిఖీ చేశారు. ఉగ్రవాదులు ఎవరినైనా బంధించారా లేదా పరిశీలించారు. బాంబులను నిరీ్వర్యం చేసే బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. ఈ ఆపరేషన్ అర్ధరాత్రి దాటి సాగింది. చివరకు ఇరువర్గాల మధ్య దాడుల అనంతరం ఆక్టోపస్ ఉగ్రవాదులను మట్టుబెట్టింది.
ఈ ఆపరేషన్‌లో ఆక్టోపస్ బృందాలు అత్యాధునిక ఆయుధాలు వినియోగించారు. ఇదంతా నిజమే అనుకుంటే పొరపాటే! విపత్కర సమయాల్లో రక్షణ వ్యవస్థను అప్రమత్తం చేయడానికి ఆక్టోపస్ నిర్వహించిన మాక్‌డ్రిల్ ఇది. ఆపరేషన్ పైతాన్ పేరుతో స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన మాక్‌డ్రిల్ విజయవంతంగా ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment