కవాతు దర్శన్‌ | Great Indian Serials-5 | Sakshi
Sakshi News home page

కవాతు దర్శన్‌

Published Wed, Feb 27 2019 12:50 AM | Last Updated on Wed, Feb 27 2019 12:50 AM

Great Indian Serials-5 - Sakshi

దేశానికి సైనికుడిని చూపిన సీరియల్‌ అది. సైనిక శిబిరాలలో జీవితం ఎలా ఉంటుందో కళ్లకు కట్టిన కథ అది. కొత్తగా సైన్యంలో చేరిన జవాన్ల శిక్షణ  ఈ సీరియల్‌లోనే జనం చూశారు. వారు నవ్వితే నవ్వారు
వారు కవాతు చేస్తే ఉత్సాహపరిచారు దూరదర్శన్‌ తొలి సైనిక సీరియల్‌ ‘ఫౌజి’ విశేషాలివి..

అది ఇండియన్‌ ఆర్మీ. సైనికుల కవాతు, కమాండోల కఠోర శిక్షణ, వైమానికదళ విన్యాసాలు, యుద్ధ ట్యాంకుల మోతలు.. చూసే కళ్లల్లో స్థైర్యాన్ని, గుండెల్లో ధైర్యాన్ని నింపుతున్నాయి. ఆ ఆర్మీ ట్రెయినింగ్‌ స్కూల్‌కి కొత్తగా ఎనిమిది మంది కమాండోలు సెలక్టయ్యారు. వీరంతా సైన్యాన్ని నడిపించే నాయకులుగా ఎదగాలి. అందుకే ఆ ఎనిమిది మందికి సుశిక్షితులైన ఆఫీసర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణా సమయాన్ని కేటాయించారు. రన్నింగ్, రేసింగ్, కరాటే, బాక్సింగ్, జంపింగ్, షూటింగ్, క్లైంబింగ్‌.. వంటివెన్నో అత్యంత కఠినమైన ప్రక్రియలతో శిక్షణ ఇస్తున్నారు. అత్యవసర పరిస్థితిలో యుద్ధవిమానాల నుంచి నేర్పుగా బయటపడటం, ప్యారాచూట్‌లను ఉపయోగించడంతోపాటు గన్‌షూట్స్, స్మోక్‌బాంబ్స్‌.. వంటివి శిక్షణలో భాగం చేశారు. ఎనిమిది మంది ప్రతీచోటా తమ ప్రతిభను చూపుతూనే ఉన్నారు. యుద్ధ సమయంలో ఎదురయ్యే సమస్యను ఎలా సవాల్‌గా ఎదుర్కోవాలో వివరిస్తున్నారు ఆఫీసర్లు. ఇదంతా బుల్లితెర పై చూస్తున్నవారికి కొత్తగా ఉంది. దేశ సరిహద్దుల్లో రక్షణగా ఉండే ఆర్మీ వాతావరణం ఇంట్లో కూర్చోబెట్టి ప్రతి పౌరుడికి పాఠం చెబుతున్నట్టుగా ఉంది. అప్పటి వరకు హీరో హీరోయిన్ల డాన్సులు, కుటుంబ డ్రామాలు, శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు, పౌరాణిక కథలతో నిండిపోయిన చిన్నతెర ‘ఫౌజి’ పేరుతో సైనికులు వచ్చి కవాతు చేయడం ఆసక్తిదాయకమైంది. 1989 జనవరిలో ప్రసారమైన ఫౌజీ దేశభక్తికి సంబంధించిన అంశంగా ముందు ఎవరూ అనుకోలేదు. ఒక యదార్థ సెటప్‌ చిన్న తెరమీద అనుకోకుండానే సెట్‌ అవ్వడం అంతటా చర్చనీయాంశమైంది.

కమాండోలు... కఠోర శిక్షణ
ఎనిమిది మంది కమాండో టీమ్‌లో లెఫ్టినెంట్‌ అభిమన్యుది ప్రధాన పాత్ర. అభిమన్యుతో పాటు మరో ముగ్గురు కమాండోలు తమ తమ కాలేజీలలో ఒక్కో క్రీడలో ఛాంపియన్స్‌మని ఆఫీసర్స్‌తో గర్వంగా చెప్పుకుంటారు. అయితే, మేజర్‌ విక్రమ్‌రాయ్‌తో తలపడలేక వాళ్లు ఓడిపోవడంతో గిల్టీగా పీలవుతారు. విక్రమ్‌రాయ్‌ మాట్లాడుతూ– ‘మీరు క్రీడా మైదానంలో ఆడినవి ఆటలు మాత్రమే. ఇక్కడ ఇది పోరాటం. ప్రతీ క్షణం సవాలే’ అని హెచ్చరిస్తాడు. టీమ్‌ అంతా రాత్రుళ్లు కూర్చొని ఆ రోజు జరిగిన కఠిన శిక్షణ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. శిక్షణను తట్టుకోలేక ఆర్మీ నుంచి పారిపోతే బాగుండు అనే ఆలోచన కూడా వారిలో వస్తుంది. కానీ, ఆ మరుక్షణమే తాము దేశరక్షణ కోసం ఏ విధంగా ఆర్మీలో చేరామో గుర్తుకు తెచ్చుకుని తర్వాతి పరీక్షకు సిద్ధం అవుతుంటారు. మేజర్‌ విక్రమ్‌రాయ్‌–అభిమన్యురాయ్‌ పేర్లకు దగ్గర పోలిక ఉందని టీమ్‌ సభ్యులు అంటే ‘విక్రమ్‌రాయ్‌ మా పెద్దన్న’ అని అభిమన్యు చెప్పడంతో అప్పటి వరకు ఈ విషయం ఎవరికీ తెలియని టీమ్‌ ఆశ్చర్యపోతుంది. నిజానికి లెఫ్టినెంట్‌ అభిమన్యురాయ్‌ గతంలో చాలా సరదా సరదాగా గడిపే ప్లే బోయ్‌ తరహాకి చెందిన వాడై ఉంటాడు. కమాండో స్కూల్‌ నుంచి ఆర్మీలో చేరి కఠినశిక్షణలతో దేశరక్షణలో భాగస్తుడు అవుతాడు. ఆర్మీలో ఒంటరిగా ఉన్న సందర్భాల్లో అభిమన్యుకి పదే పదే ఇల్లు గుర్తుకు వస్తుంటుంది. తండ్రితో ఆడిన చెస్, తను గెలవడం కోసం తండ్రి ఓడిపోయిన విధానం, చిన్నతనంలో అన్నదమ్ములు  చేసిన అల్లరిని గుర్తుకు తెచ్చుకుంటుంటాడు. అభిమన్యు పాత్ర ద్వారా ఆర్మీలో ఉన్న మిగతా జవాన్ల మానసిక స్థితి కళ్లకు కడుతుంది. 

సైనికుల ప్రేమలు – పెళ్ళిళ్లు
కరకుగా ఉండే సైనికుల గుండెల్లో మృదువైన ప్రేమ హృదయాలూ ఉన్నాయని ఈ షో ద్వారా చూపించారు దర్శకులు. రోజంతా శిక్షణ సమయంలో ఏర్పడిన  ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ఒక దగ్గర చేరే ఈ టీమ్‌కి  క్యాంటిన్, చెట్లు, తమ గదులు ప్రధాన ప్లేసులై ఉంటాయి. కాస్త వీలు చిక్కితే సరదా కబుర్లతో ఒకరినొకరు కామెంట్‌ చేసుకునే ఈ టీమ్‌లోని మెంబర్స్‌ ప్రేమకు సంబంధించిన విషయాలను తరచూ చర్చిస్తుంటారు. వరుణ్‌ అనే కమాండో క్యాంటీన్‌ ఓనర్‌ కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అభిమన్యురాయ్‌ ఆర్మీ డాక్టర్‌ మధు రాథోడ్‌ని ప్రేమిస్తాడు. మేజర్‌ విక్రమ్‌రాయ్‌కి జర్నలిస్ట్‌ కిరణ్‌ పరిచయం అవుతుంది. లెఫ్టినెంట్‌ కల్యాణ్‌సింగ్‌ సాహసాల గురించి జర్నలిస్ట్‌ కిరణ్‌కి విక్రమ్‌రాయ్‌ చెబుతుంటాడు. కల్యాణ్‌సింగ్‌ చనిపోవడం గురించి అతని కుటుంబానికి ఆ వార్త చేరవేసే పరిస్థితి తనకు ఎంత బాధాకరమైందో చెబుతూనే తాను తిరిగి వచ్చే సమయంలో కళ్యాణ్‌సింగ్‌ కొడుకు చేసిన సెల్యూట్‌ గురించి గొప్పగా వివరిస్తాడు. ఒకానొక సందర్భంలో జర్నలిస్ట్‌ కిరణ్‌కి యాక్సిడెంట్‌ అవడంతో అభిమన్యు రక్తదానం చేసి ఆమెని కాపాడతాడు. పదమూడు ఎపిసోడ్లు ఉన్న ఈ సీరియల్‌లో పది ఎపిసోడ్ల వరకు కమాండోల మధ్య ఉండే స్నేహం, ఇన్‌స్ట్రక్టర్స్‌తో రిలేషన్‌షిప్, ప్రేమలను చూపుతుంది. సైనికుల అంతరంగాలను అతి దగ్గరగా పరిశీలిస్తున్నట్టు ఉంటుంది ఈ సీరియల్‌.

యుద్ధ సమయం
పదకొండవ ఎపిసోడ్‌లో శిక్షణ తీసుకున్న ఈ కమాండోలను స్పెషల్‌ వార్‌ మిషన్‌కి సెలక్ట్‌ చేస్తారు ఆఫీసర్లు. ఈ మిషన్‌లో పాల్గొన్న ఎనిమిది మందిలో ముగ్గురు కమాండోలు చనిపోతారు. లెఫ్టినెంట్‌ అభిమన్యు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరుతాడు. మరణించిన వారికి భారత ప్రభుత్వం జోహార్లు అర్పిస్తుంది. కోలుకున్న అభిమన్యు అతని స్నేహ బృందం తిరిగి డ్యూటీలో చేరడంతో సీరియల్‌ ముగుస్తుంది.

మొదటిసారి మిల్ట్రీ శిక్షణ
ఇండియన్‌ ఆర్మీ కమాండోల శిక్షణ కథే ఫౌజి. డిఫెన్స్‌ అకాడమీ మిలటరీ శిక్షణ ఇస్తున్న విధానాన్ని మొదటి సారి కళ్లకు కట్టింది బుల్లితెర. ఇండియన్‌ ఆర్మీ ఆఫీసర్‌ కల్నల్‌ ఆర్కే శర్మ రాసుకున్న కథ ఇది. ఆర్మీ ఆఫీసర్‌ అయినప్పటికీ అతని అభిరుచి కథలు, నాటకాలు రాయడం. ఇండియన్‌ ఆర్మీలో ఏం జరుగుతుందో, వారి జీవన విధానం ఎలా ఉంటుందో బయటవారికి తెలియజెప్పాలన్న తపనతో రాసుకున్న నోట్‌ను అతను కథగా డెవలప్‌ చేసుకున్నాడు. తను ఆర్మీ నుంచి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్‌తో కలిసి ఆ కథను టీవీ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ కథ పూర్తిగా యధార్థ సంఘటనల ఆధారంగానే రూపొందించడంతో విశేష ఆదరణ పొందింది. ఇండియన్‌ ఆర్మీలో బాంబే శాపర్స్‌ టీమ్‌కి అత్యున్నత ఆఫీసర్‌గా నియమింపబడిన కల్నల్‌ సంజయ్‌బెనర్జీ కథను స్ఫూర్తిగా తీసుకొని లెఫ్టినెంట్‌ అభిమన్యురాయ్‌ పాత్రను అందంగా మలిచారు శర్మ.ఇప్పటికీ ఈ తరహా సీరియల్‌ బుల్లితెర మీద రాలేదు. అంటే మూడు దశాబ్దాల క్రితమే  ప్రేక్షకుల నాడిని పట్టుకోవడానికి టీవీ ఓ కొత్త ఎఫర్ట్‌ పెట్టిందని చెప్పవచ్చు.             

∙కమాండోల లిస్ట్‌లో షారూఖ్‌ ఖాన్‌తో పాటు ప్రముఖ దర్శకుడు/నటుడు విక్రమ్‌చోప్రా, బాలీవుడ్‌ నటుడు విశ్వజీత్‌ ప్రధాన్‌ లూ ఉన్నారు. 
∙లాయ్‌ మెండోన్సా ఈ సీరియల్‌కి  సంగీతాన్నందించారు. 
∙1995లో ఫౌజి పేరుతో హిందీ సినిమా వచ్చింది. దీని దర్శకుడు లారెన్స్‌ డి–సౌజ, నటులు ధర్మేంద్ర, రాజ్‌బబ్బర్, కిరణ్‌కుమార్‌లు.

షారూఖ్‌ ఖాన్‌
∙ఈ సీరియల్‌లో లెఫ్టినెంట్‌ అభిమన్యురాయ్‌ పాత్రను షారూఖ్‌ ఖాన్‌ పోషించారు. అక్కడి నుంచి సర్కస్‌ వైపుగా మరో అడుగు వేసి అటు నుంచి బిగ్‌స్క్రీన్‌ను ఆక్యుపై చేశారు. టీవీ షో డైరెక్టర్, ప్రొడ్యూసర్‌ ఆర్కే కపూర్‌ ఆడిషన్‌ టెస్టుల ద్వారా షారూఖ్‌ని ఎంపిక చేశారట. ఈ ఎంపికకు ముందు షారూఖ్‌కి ఫిజికల్, స్టామీనా టెస్టులు కూడా చేశారట. షారూఖ్‌ లీడ్‌ రోల్‌ అయినప్పటికీ మొదటి–చివరి ఎపిసోడ్లలో మాత్రమే అతని పాత్ర ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. మిగతా అంతా కమాండోలలో ఒకడిగా కనిపిస్తారు.
∙ఫౌజీ కన్నా ముందు ‘దిల్‌ దారియా’లో 1988లో షారూఖ్‌ ప్రధాన పాత్రతో షూటింగ్‌ మొదలైంది. అదే టైమ్‌లో గ్రామీణ నేప«థ్యం ఉన్న ‘కేవల్‌’ అనే  సీరియల్‌లోనూ షారూఖ్‌ నటించారు. అయితే ‘ఫౌజి’ సీరియల్‌ షారూఖ్‌ని నిలబెట్టింది. 90ల కాలం యంగ్‌స్టర్స్‌ని తన వైపుకు తిప్పుకునేలా చేసింది ఈ సీరియల్‌. తర్వాత షారూఖ్‌ బాలీవుడ్‌ కింగ్‌ అయ్యారు.  
 – నిర్మలారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement