ఏళ్లుగా చూస్తోంది ప్రపంచం ఈ పోస్టర్‌ని. హోవర్ట్ మిల్లర్ అనే ఆర్టిస్టు ఈ పెయింటింగ్‌ని వేశాడు. ఎప్పుడూ.. 1940లలో! రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న టైమ్‌లో! తలకు ఎరుపు, తెలుపు పోల్కా చుక్కల ‘బందన’ కట్టుకుని వర్కింగ్ కోట్‌తో కాలిఫోర్నియాలోని నేవల్ ఎయిర్ స్టేషన్‌లో పని చేస్తూ ఉన్న ఓ ఇరవై ఏళ్ల యువతి ఫోటోను న్యూస్‌పేపర్లలో, మ్యాగజీన్స్‌లో చూసి, ఇన్‌స్పైర్ అయ్యి, ఈ చిత్రాన్ని గీశాడు హోవర్ట్. ఒక ఆడపిల్ల.. మగ ప్రపంచంలోకి వచ్చి జాబ్ చెయ్యడం ఎంత పెద్ద అమెరికాలో అయినా అప్పట్లో అపురూపమే. ఆమె ఫొటోను ఎవరు తీసి, ఎవరు పత్రికలకు ఇచ్చారో తెలీదు. ఆ ఫొటోలోని పోలికల్ని తీసుకుని, పిడికిలి బిగించి చెయ్యెత్తి బలాన్ని చూపిస్తున్న బొమ్మను గీశాడు హోవర్ట్. ఒరిజినల్ ఫొటో కన్నా కూడా, (అందులో ఆ యువతి తన పనిలో లీనమై ఉంటుంది) ఆ ఫొటోను చూసి గీసిన ‘పిడికిలి’ బొమ్మ అమెరికా అంతటా బాగా పాపురల్ అయింది. దాన్ని అమెరికా ప్రభుత్వం తీసుకుంది! ఫ్యాక్టరీల్లోకి, షిప్‌యార్డుల్లోకి, ఇంకా కష్టమైన పనుల్లోకి మహిళల్ని రప్పించేందుకు దానినొక ఇన్‌స్పైరింగ్ పోస్టర్‌గా వాడుకుంది. పోస్టర్‌లోని అమ్మాయికి ‘రోజీ ది రివెటర్’ అనే పేరు పెట్టి, ‘వియ్ కెన్ డు ఇట్’ అనే క్యాప్షన్ టైటిల్‌తో పోస్టర్లు ప్రింట్ చేయించి, గోడలపై అంటించి, యుద్ధ విధుల్లోకి కూడా అమ్మాయిల్ని ఆహ్వానించింది! అమెరికన్ జానపద గాథల్లోని వర్కింగ్ క్లాస్ విమనే రోజీ!
ప్రపంచ యుద్ధం ముగిశాక కూడా ఆ పోస్టర్ ప్రాధాన్యం తగ్గలేదు. అమ్మాయిల మనోబలానికి ‘వియ్ ఎన్ డు ఇట్’ పోస్టర్ ఒక ప్రతీకగా నిలిచిపోయింది. కాలం గడిచింది. ఇంతకీ పోల్కా చుక్కల ఆ అమ్మాయి ఎవరు అన్న ప్రశ్న వచ్చింది. 1980లో గెరాల్డిన్ హోఫ్ డోయల్ అనే మహిళ అది తన ఫొటోనేనని ప్రకటించింది. ప్రపంచం కూడా అది గెరాల్డిన్ ఫోటోనేనని నమ్ముతూ వచ్చింది. అయితే 2009తో సడెన్‌గా నవోమీ పార్కర్ ఫ్రేలే సీన్‌లోకి వచ్చారు! ‘వరల్డ్ వార్ 2 హోమ్ ఫ్రంట్ నేషనల్ హిస్టారిక్ పార్క్’లో ఒరిజినల్ ఫొటో చూసి, ఆనందంతో కెవ్వున అరిచినంత పనిచేశారు నవోమీ. అది తన ఫొటోనే! అయితే ఫొటో కింద గెరాల్డిన్ డోయల్ అనే పేరు ఉండడం చూసి షాక్ తిన్నారు. అది నా ఫొటోనే.. నా ఫొటోనే అన్నారు కానీ ఎవరు నమ్ముతారు? రుజువేమిటి? రుజువు చెయ్యడానికి 2016 వరకు నవోమీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ ప్రయత్నంలో జేమ్స్ కింబ్లే అనే యూనివర్శిటీ ప్రొఫెసర్ ఆమెకు సహాయం చేస్తూ వచ్చారు. చివరికి నవోమీనే ‘రోజీ ది రివెటర్’ అని రూడీ అయింది. ‘రెటోరిక్ అండ్ పబ్లిక్ ఎఫైర్స్’ మ్యాగజీన్‌లో జ్ఞాపకాలు, గుర్తులు, ఆనవాళ్లతో సహా నవోమీ కథ వచ్చింది. నవోమీ ఎంతో సంతోషించారు. వాషింగ్టన్‌లో ఉంటున్న 97 ఏళ్ల నవోమీ పార్కర్ ఫ్రేలే మొన్న జనవరి 20న కన్ను మూసేవరకు ఆ సంతోషం ఆమె వెంటే ఉంది.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిమా మూర్తులైన స్త్రీలు కొందరు ప్రతి దేశానికీ కావాలి. అమెరికన్‌లు నన్ను ఒక ప్రతిమగా భావించడం నాకు సంతోషంగా ఉంది.
– నవోమీ పార్కర్ ఫ్రేలే (1916)
Comments
Please login to add a commentAdd a comment