Howard
-
వేల కోట్లకు అధిపతి.. విమానంలో దిక్కులేని చావు..
కొంతమంది గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా ఏదో మిగిలే ఉంటుంది. చాలా మంది ఒకటి రెండు విషయాల్లో రాణిస్తేనే కాలరెగరేస్తారు. చాలా తక్కువ మంది మాత్రం ఇంకా ఏదో సాధించాలని తపిస్తారు ఎంత సాధించినా ఇంకా దాహంతోనే ఉంటారు. ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకోగలిగిన స్థాయికి ఎదిగి.. దిక్కుమాలిన శవంగా మిగిలి.. మరణానంతరం కోట్లాది డాలర్ల సామాజిక సేవలో చిరంజీవిగా ఉన్న ఓ సంపన్నుడి కథే ఇవ్వాల్టి సీక్రెట్. 1976 ఏప్రిల్ 5 మెక్సికో నుంచి హోస్టన్ వచ్చిన ఓ ప్రయివేట్ ఎయిర్ క్రాఫ్ట్ లో ఓ గుర్తు తెలీని వ్యక్తి మరణించి ఉన్నాడు. ఏళ్ల తరబడి తైల సంస్కారం లేకుండా పొడుగ్గా పెరిగిన జుట్టు.... అంతే కాలంగా పెరుగుతూ వచ్చిన చేతి.. కాలి గోళ్లు... నెలల తరబడి ఏమీ తినలేదేమో అన్నట్లు చిక్కి శల్యమైన శరీరం. ఆరడుగుల రెండంగుళాల పొడగరి అయినా శరీరంలో మాంసమే లేనట్లు 41కిలోలు మాత్రమే తూగిన మృతదేహం. ఎవరూ బాడీని గుర్తించే పరిస్థితే లేదు. ఎఫ్.బి.ఐ. రంగంలోకి దిగింది. అటాప్సీ చేసిన వైద్యులు కిడ్నీ ఫెయిల్యూర్ కావడం వల్లనే చనిపోయాడని తేల్చారు. మాల్ న్యూట్రిషన్ వల్ల దేహమంతా డొల్లయ్యిందని విశ్లేషించారు. అంత తినడానికి కూడా గతి లేని ఈ మనిషి విమానంలో ఎలా వచ్చాడు? ఈ అనుమానమే ఎఫ్. బి. ఐ. ని మరింత లోతుగా దర్యాప్తుచేసేలా చేసింది. ఇతని ఫింగర్ ప్రింట్స్ సేకరించి ఇన్వెస్టిగేషన్ మొదలెట్టింది. అతనెవరో తెలిశాక అందరూ కళ్లు తేలేశారు. సరైన ఆహారం లేక బక్కచిక్కిన ఈ మనిషి అల్లా టప్పా మనిషి కానే కాదు. మొత్తం ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడితను. ఇతనే ద గ్రేట్ హోవర్డ్ రాబర్డ్ హ్యూగ్స్. ఇతని దగ్గరున్న సంపదతో ప్రపంచంలోని కొన్ని దేశాలను కొనేయగలడు. ఇతను కనుసైగ చేస్తే చాలు ఏం కావాలంటే అది వచ్చి ఒళ్లో వాలుతుంది. ఇంతటి రిచెస్ట్ పెర్సన్ కి ఇంత దిక్కులేని చావేంటి? అదే మానవ జీవితంలోని ఐరనీ. అగ్రరాజ్యం అమెరికానే శాసించగల హ్యూగ్స్ మృత దేహాన్ని గ్లెన్ వుడ్ స్మశాన వాటికలో ఖననం చేశారు. మల్టీ బిలియనీర్ అయిన హ్యూగ్స్ ఇక్కడ శాస్వతంగా నిద్రపోతున్నాడు. ఇంతకీ హ్యూగ్స్ ఏం చేసేవాడో అంత గొప్పవాడిగా ఎదిగే క్రమంలో ఎంత కఠోర శ్రమ చేశాడో అతని జీవితంలో ఎన్ని మజిలీలున్నాయో తెలుసుకోవాలంటే అతని ఆటోబయోగ్రఫీని ఓ సారి తెరవాలి. హోవర్డ్ రాబర్డ్ హ్యూగ్స్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది అమెరికన్ ఏవియేటర్. విమానంలో అత్యంత వేగంగా ప్రపంచాన్ని చుట్టి వచ్చిన వీరుడిగా హ్యూగ్స్ రికార్డ్ సృష్టించాడు. కేవలం నాలుగు రోజుల వ్యవథిలోనే లోకాన్ని చుట్టి పారేశాడు. ఆ తర్వాత తన రికార్డును తానే తిరగరాశాడు. ఈ సారి మూడు రోజుల్లోనే ప్రపంచాన్ని చుట్టి వచ్చాడు. హ్యూగ్స్ అంటే ఇంతేనా అనకండి. ఇంకా చాలా ఉంది. హ్యూగ్స్ మంచి ఏవియేటరే కాదు.....ప్రపంచంలోనే అత్యంత పెద్ద విమాన తయారీ కంపెనీకి ఓనర్ కూడా. ఔను .. అమెరికాలో హ్యూగ్స్ ఎయిర్ లైన్స్ నంబర్ వన్ ప్రయివేట్ కంపెనీ. ఎయిర్ క్రాఫ్ట్ లంటే హ్యూగ్స్ కి ఆరో ప్రాణం. ఆ మాటకొస్తే అసలదే మొదటి ప్రాణం కూడా. ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీరే కాదు ఎఫిషియంట్ పైలట్ గానూ హ్యూగ్స్ కు పేరుంది. కొన్ని ఎయిర్ క్రాఫ్ట్ లను అతనే స్వయంగా డిజైన్ చేశాడు. తండ్రి ఇచ్చిన హ్యూగ్స్ టూల్ కంపెనీ ని శాఖోప శాఖలుగా విస్తరించాడు హ్యూగ్స్ జూనియర్. ముందుగా ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీని ఫ్లోట్ చేశాడు. 1932 లో కాలిఫోర్నియాలో ఓ రెంటల్ కార్నర్ లో దీన్ని స్టార్ట్ చేశాడు. కొంత మంది ఆలోచనలు కూడా భారీగానే ఉంటాయి. అందరూ నేలపై చూపులు పెడితే వీళ్లు మాత్రం ఆకాశంలో చుక్కలపైనే దృష్టి సారిస్తారు. 27 ఏళ్ల వయసులో ఓ ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీకి ఓనరయ్యాడు. ఏడేళ్లలోనే ఈ సంస్థ నంబర్ వన్ గా అవతరించింది. గంటకు 352కిమీ రికార్డు.. 1939 లో ట్రాన్స్ ఇంటర్నేషనల్ వెస్ట్ ఎయిర్ లైన్స్ -T.W.I. లో మేజర్ షేర్ ను హ్యూగ్స్ కొనుగోలు చేశాడు. అతని దృష్టిలో విమానాల తయారీ..ఎయిర్ లైన్స్ యాక్టివిటీస్ కేవలం వ్యాపారాలు కావు. ఈ రెండూ హ్యూగ్స్ కి ప్రొఫెషనల్ పేషన్సే. T.W.I. పై పూర్తి కంట్రోల్ రావడంతోనే హ్యూగ్స్ వైమానిక రంగానికి రారాజైపోయాడు. అతన్నిలాగే వదిలేస్తే ఇక తమ వ్యాపారాలు మూసుకోవలసిందేనని పాన్ అమెరికన్ ఎయిర్ లైన్స్ సంస్థ ఓనర్ ట్రిప్ కు భయం పట్టుకుంది. అతని భయానికి తగ్గట్టే హ్యూగ్స్ ఎయిర్ లైన్స్ లో దూసుకుపోతున్నాడు. స్వతహాగా పైలట్ కూడా అయిన హ్యూగ్స్ H1 రేసర్ టెస్ట్ రన్ లోనే గంటకు 352 కిలోమీటర్ల వేగంతో నడిపి రికార్డు సృష్టించాడు. రాజకీయంగా పాన్ అమెరికన్ ఎయిర్ లైన్స్ వేధింపులు- ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ ఘటనలతో హ్యూగ్స్ మానసికంగా బాగా దెబ్బతిన్నాడు. మానసిక పరిస్థితి దెబ్బతింది. అబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్ అనే మానసిక రుగ్మత మొదలైంది. ఒక్కోసారి ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలిసేది కాదు. ఒకే మాటను అదే పనిగా రిపీట్ చేసేవాడు. ఓ దశలో కొంతకాలం పాటు ఓ గదిలో తలుపులు వేసుకుని ఉండిపోయేవాడు. తాను తీసిన సినిమాలతో పాటు తనకు నచ్చిన సినిమాలను చూస్తూ గడిపేవాడు. ఓ కుర్చీలో నగ్నంగా కూర్చుని పిచ్చిపిచ్చిగా సినిమాలు చూసేవాడు. సన్నిహితుల సమాచారం ప్రకారం ఒక్కోసారి రోజుల తరబడి స్నానం చేసేవాడు కాదు. చాకొలెట్ బార్స్- పాలే ఆహారం. అవిలేకపోతే ఏమీ తినకుండా అలాగే ఉండిపోయేవాడు. కాలిగోళ్లు చేతి గోళ్లు బాగా పెరిగిపోయినా పట్టించుకునేవాడు కాదు. జుట్టు పెరిగిపోయి తైల సంస్కారం లేకుండా రోజుల తరబడి అలాగే ఉండిపోయేవాడు. చూడ్డానికి భయంకరంగా కనిపించేవాడు. హోటల్ బిల్లు రూ.కోట్లు.. అప్పటికే ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో ఒకడిగానే ఉన్నాడు. చివరి దశలో మెక్సికోలో ఓ హోటల్లో కాలక్షేపం చేశాడు. ఆ హోటల్ బిల్లే కొన్ని కోట్లు పే చేశాడు. సరిగ్గా తినక పోవడం వల్ల ఒళ్లంతా గుల్లయింది. 42 కిలోల బరువుకు పడిపోయాడు. కిడ్నీలు ఇక పనిచేయలేమని మొరాయించాయి. ఈ టైమ్ లోనే తాను పుట్టిన హోస్టన్ నగరానికి ఓ స్నేహితుని విమానంలో బయలుదేరాడు. చివరికి అందులోనే చివరి శ్వాస విడిచాడు. ఏ విమానాలనైతే జీవితాంతం ప్రేమించాడో ఏ విమానాల తయారీ కోసం తన మేథస్సునూ డబ్బునూ ఖర్చు చేశాడో ఆ విమానంలోనే అంతిమయాత్ర చేశాడు. హ్యూగ్స్ మరణానంతరం అతని విల్లు ప్రకారం ఆస్తిలో 75శాతం మొత్తాన్ని ఈ ఇన్ స్టిట్యూట్ కే అప్పగించారు. ఇప్పటికీ ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద మెడికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ గా ఇది చెలామణీ అవుతోంది. ఈ ఇన్ స్టిట్యూట్ ద్వారా ఇప్పటికీ జన హృదయాల్లో బతికే ఉన్నాడు హ్యూగ్స్. అమెరికాలో హ్యూగ్స్ ను ఇప్పటికీ ఒక ఐకాన్ గానే కొలుస్తారు. మనసున్న మారాజని జనం నీరాజనాలు పడతారు. చచ్చీ కూడా బతికుండడమంటే ఇదే. అందుకే హ్యూగ్స్ ఎప్పటికీ చిరంజీవే. -
చివర్లో ఉత్కంఠ... షూటౌట్లో మరింత
భువనేశ్వర్: ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో ఆస్ట్రేలియా ‘హ్యాట్రిక్’ ఆశలు సెమీస్‌లో షూటౌటయ్యాయి. ఆఖరి క్షణాల్లో ఉత్కంఠరేపిన ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ‘సడెన్ డెత్’లో 4–3తో విజేతగా నిలిచింది. గత ప్రపంచకప్‌లో తమ సొంతగడ్డపై ఫైనల్లో (1–6తో) ఎదురైన పరాభవానికి నెదర్లాండ్స్ బదులు తీర్చుకుంది. అక్కడ టైటిల్‌ను దూరం చేసిన కంగారూ జట్టును ఇక్కడ సెమీస్‌లోనే కసిదీరా ఓడించి ఇంటిదారి పట్టించింది. 2–1తో ఆధిక్యంలో ఉన్న ‘డచ్’ జట్టు విజయానికి అర నిమిషం దూరంలోనే ఉంది. కానీ ఈ అర నిమిషమే మ్యాచ్ గతిని మార్చేసింది. 26 సెకన్లలో మ్యాచ్ ముగుస్తుందనగా ఆస్ట్రేలియా గోల్ చేసింది. అంతే 2–2తో స్కోరు సమమైంది. నెదర్లాండ్స్ జట్టులో గ్లెన్ షుర్మన్ (9వ ని.), సీవ్ వాన్ అస్ (20వ ని.) చెరో గోల్ చేయగా, ఆసీస్ తరఫున టిమ్ హోవర్డ్ (45వ ని.), ఎడ్డి ఒకెండన్ (60వ ని.) ఒక్కో గోల్ సాధించారు. దీంతో ఫలితాన్ని తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. నిర్ణీత 5 షాట్ల తర్వాత ఇక్కడ కూడా ఇరు జట్ల స్కోరు 3–3తో సమమైంది. ఆస్ట్రేలియా తరఫున డానియెల్ బీల్, టామ్ క్రెయిగ్, వెటన్... ‘డచ్’ జట్టులో జిరోన్ హెర్ట్బెర్గెర్, వాన్ అస్, తిజ్స్ వాన్ డామ్ స్కోరు చేశారు. ఇరు జట్లలో ఇద్దరు చొప్పున విఫలమయ్యారు. ఇక సడెన్ డెత్‌లో ముందుగా నెదర్లాండ్స్ ఆటగాడు హెర్ట్బెర్గెర్ గోల్ కొట్టగా... డానియెల్ బీల్ ఆస్ట్రేలియాను నిరాశపరిచాడు. ‘డచ్’ గోల్ కీపర్ పిర్మిన్ బ్లాక్ చాకచక్యంగా బంతిని వేగంగా లయ తప్పించగా బిత్తరపోవడం బీల్ వంతయింది. నెదర్లాండ్స్ మాత్రం సంబరాల్లో మునిగిపోయింది. అంతకుముందు జరిగిన తొలి సెమీస్‌లో బెల్జియం 6–0తో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి మొదటిసారి ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరింది. -
వియ్ కెన్ డు ఇట్
ఏళ్లుగా చూస్తోంది ప్రపంచం ఈ పోస్టర్ని. హోవర్ట్ మిల్లర్ అనే ఆర్టిస్టు ఈ పెయింటింగ్‌ని వేశాడు. ఎప్పుడూ.. 1940లలో! రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న టైమ్‌లో! తలకు ఎరుపు, తెలుపు పోల్కా చుక్కల ‘బందన’ కట్టుకుని వర్కింగ్ కోట్తో కాలిఫోర్నియాలోని నేవల్ ఎయిర్ స్టేషన్లో పని చేస్తూ ఉన్న ఓ ఇరవై ఏళ్ల యువతి ఫోటోను న్యూస్పేపర్లలో, మ్యాగజీన్స్‌లో చూసి, ఇన్స్పైర్ అయ్యి, ఈ చిత్రాన్ని గీశాడు హోవర్ట్. ఒక ఆడపిల్ల.. మగ ప్రపంచంలోకి వచ్చి జాబ్ చెయ్యడం ఎంత పెద్ద అమెరికాలో అయినా అప్పట్లో అపురూపమే. ఆమె ఫొటోను ఎవరు తీసి, ఎవరు పత్రికలకు ఇచ్చారో తెలీదు. ఆ ఫొటోలోని పోలికల్ని తీసుకుని, పిడికిలి బిగించి చెయ్యెత్తి బలాన్ని చూపిస్తున్న బొమ్మను గీశాడు హోవర్ట్. ఒరిజినల్ ఫొటో కన్నా కూడా, (అందులో ఆ యువతి తన పనిలో లీనమై ఉంటుంది) ఆ ఫొటోను చూసి గీసిన ‘పిడికిలి’ బొమ్మ అమెరికా అంతటా బాగా పాపురల్ అయింది. దాన్ని అమెరికా ప్రభుత్వం తీసుకుంది! ఫ్యాక్టరీల్లోకి, షిప్యార్డుల్లోకి, ఇంకా కష్టమైన పనుల్లోకి మహిళల్ని రప్పించేందుకు దానినొక ఇన్స్పైరింగ్ పోస్టర్‌గా వాడుకుంది. పోస్టర్‌లోని అమ్మాయికి ‘రోజీ ది రివెటర్’ అనే పేరు పెట్టి, ‘వియ్ కెన్ డు ఇట్’ అనే క్యాప్షన్ టైటిల్‌తో పోస్టర్లు ప్రింట్ చేయించి, గోడలపై అంటించి, యుద్ధ విధుల్లోకి కూడా అమ్మాయిల్ని ఆహ్వానించింది! అమెరికన్ జానపద గాథల్లోని వర్కింగ్ క్లాస్ విమనే రోజీ! ప్రపంచ యుద్ధం ముగిశాక కూడా ఆ పోస్టర్ ప్రాధాన్యం తగ్గలేదు. అమ్మాయిల మనోబలానికి ‘వియ్ ఎన్ డు ఇట్’ పోస్టర్ ఒక ప్రతీకగా నిలిచిపోయింది. కాలం గడిచింది. ఇంతకీ పోల్కా చుక్కల ఆ అమ్మాయి ఎవరు అన్న ప్రశ్న వచ్చింది. 1980లో గెరాల్డిన్ హోఫ్ డోయల్ అనే మహిళ అది తన ఫొటోనేనని ప్రకటించింది. ప్రపంచం కూడా అది గెరాల్డిన్ ఫోటోనేనని నమ్ముతూ వచ్చింది. అయితే 2009తో సడెన్‌గా నవోమీ పార్కర్ ఫ్రేలే సీన్లోకి వచ్చారు! ‘వరల్డ్ వార్ 2 హోమ్ ఫ్రంట్ నేషనల్ హిస్టారిక్ పార్క్’లో ఒరిజినల్ ఫొటో చూసి, ఆనందంతో కెవ్వున అరిచినంత పనిచేశారు నవోమీ. అది తన ఫొటోనే! అయితే ఫొటో కింద గెరాల్డిన్ డోయల్ అనే పేరు ఉండడం చూసి షాక్ తిన్నారు. అది నా ఫొటోనే.. నా ఫొటోనే అన్నారు కానీ ఎవరు నమ్ముతారు? రుజువేమిటి? రుజువు చెయ్యడానికి 2016 వరకు నవోమీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ ప్రయత్నంలో జేమ్స్ కింబ్లే అనే యూనివర్శిటీ ప్రొఫెసర్ ఆమెకు సహాయం చేస్తూ వచ్చారు. చివరికి నవోమీనే ‘రోజీ ది రివెటర్’ అని రూడీ అయింది. ‘రెటోరిక్ అండ్ పబ్లిక్ ఎఫైర్స్’ మ్యాగజీన్లో జ్ఞాపకాలు, గుర్తులు, ఆనవాళ్లతో సహా నవోమీ కథ వచ్చింది. నవోమీ ఎంతో సంతోషించారు. వాషింగ్టన్లో ఉంటున్న 97 ఏళ్ల నవోమీ పార్కర్ ఫ్రేలే మొన్న జనవరి 20న కన్ను మూసేవరకు ఆ సంతోషం ఆమె వెంటే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిమా మూర్తులైన స్త్రీలు కొందరు ప్రతి దేశానికీ కావాలి. అమెరికన్లు నన్ను ఒక ప్రతిమగా భావించడం నాకు సంతోషంగా ఉంది. – నవోమీ పార్కర్ ఫ్రేలే (1916) -
వారి ప్రేమ... 62 ఏళ్లకు ఫలించింది!
హృదయం: ప్రేమించడం గొప్ప కాదు. ఆ ప్రేమను చెప్పడం గొప్ప అంటారు. అయితే చాలామందికి ఆ ప్రేమను చెప్పే ధైర్యం ఉండదు. ఆ ప్రేమను అలాగే గుండెల్లోనే దాచుకుని కొత్త జీవితం ఆరంభిస్తారు. కొత్త భాగస్వామితో జీవనం సాగిస్తారు. పిల్లలు పుడతారు. పెద్దవాళ్లైపోతారు. దశాబ్దాలు గడిచిపోతాయి. జీవితం చరమాంకానికి వచ్చేస్తుంది. కానీ అప్పటికి కూడా గుండె పొరల్లో ఆ ప్రేమ అలాగే గూడు కట్టుకుని ఉండిపోతే..? నిదుర పట్టనివ్వకపోతే..? అప్పుడేం చేయాలి? అమెరికాకు చెందిన హోవర్డ్ ఆటీబరీ, సింథియా రిగ్స్లను అడిగితే సరిగ్గా ఏం చేయాలో చక్కగా సమాధానం చెబుతారు. వీళ్ల కథేంటో తెలుసుకుందాం రండి. మార్తాస్ విన్యార్డ్... అమెరికాలోని ప్రముఖ దీవి. ఇక్కడ పుట్టిన సింథియా... 1950లో తనకు 18 ఏళ్లప్పుడు వేసవి సెలవుల్లో పార్ట్ టైమ్ జాబ్ చేయడం కోసం కాలిఫోర్నియాలోని శాన్డీగోకు వచ్చి మెరైన్ జియాలజీ ల్యాబ్‌లో అసిస్టెంట్‌గా చేరింది. అక్కడే హోవర్డ్ మైక్రో బయాలజిస్ట్‌గా ఉండేవాడు. అందగత్తె అయిన సింథియాను చూసి మిగతావాళ్లంతా టీజ్ చేస్తుంటే, హోవర్డ్ మాత్రం ఆమెను ఆరాధించాడు. సింథియాకు కూడా అతనిష్టమే. దీంతో మిగతా వాళ్లకు అర్థం కాకుండా వీళ్లిద్దరూ కోడ్ భాషలో సంభాషించుకునేవాళ్లు. హోవర్డ్‌కు స్వతహాగానే కోడ్ భాష తెలుసు. సింథియా కూడా ఆర్మీలో పనిచేసిన తండ్రి నుంచి కోడ్ భాష నేర్చుకుంది. ఇలా అక్కడున్న రెణ్నెళ్లలో ఇద్దరి బంధం బలపడింది. చూస్తుండగానే, సెలవులైపోయాయి. సింథియా ఇంటికి బయల్దేరాల్సి వచ్చింది. కానీ బయటపడలేదు. భయం వల్లో, కుటుంబ పరిస్థితుల వల్లో ఇద్దరూ తమ ప్రేమను మనసులోనే దాచుకున్నారు. హోవర్డ్ స్వయంగా సింథియాను ఎయిర్‌పోర్ట్‌లో దింపాడు. వెళ్లిపోగానే బోరుమన్నాడు. సింథియా కూడా బాధగా ఇంటికి చేరుకుంది. ఆ తర్వాత ఎవరి జీవితాలు వారివి. మైక్రో బయాలజిస్ట్‌గా మరింత పెద్ద స్థాయికి చేరుకున్న హోవర్డ్, పెళ్లి చేసుకున్నాడు. బాగా సంపాదించాడు. తొలి వివాహం విఫలమవడంతో విడాకులిచ్చేసి, మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నలుగురు పిల్లల్ని కన్నాడు. భార్య చనిపోయింది. పిల్లలు స్థిరపడ్డారు. హోవర్డ్ ఒంటరివాడయ్యాడు. మరోవైపు సింథియా కూడా పెళ్లి చేసుకుంది. ఐదుగురు పిల్లల్ని కంది. జర్నలిస్టుగా పనిచేసిన తర్వాత రచయిత్రిగా స్థిరపడింది. పుస్తకాలు రాసింది. పిల్లలు ఎదిగే వయసులోనే భర్తకు విడాకులిచ్చేసింది. తనే పిల్లల్ని పోషించింది. వాళ్లు స్థిరపడేలా చేసింది. చరమాంకంలో పుస్తకాలు రాసుకుంటూ కాలం గడపసాగింది. ఒంటరిగా బతకలేక బాధపడుతున్న తరుణంలో హోవర్డ్‌కు తన తొలి ప్రేయసి గుర్తుకొచ్చింది. ఆమె ఏమైందో, ఎలా ఉందో తెలుసుకోవాలనిపించింది. ఎలాగోలా ఆమె చిరునామా సంపాదించాడు. ఒకప్పుడు తమ మధ్య సాగిన సంభాషణ తరహాలోనే కోడ్ భాషతో ఆమెకో ఉత్తరం రాశాడు. అది చదివి సింథియా సంభ్రమాశ్చర్యాలకు గురైంది. తను కూడా బదులిచ్చింది. తర్వాతి ఇద్దరి మధ్య మెయిల్స్ సాగాయి. ఇలాగే కొన్ని నెలలు గడిచాయి. ఇద్దరూ ఒంటరే. దీంతో ముందుగా హోవర్డే బయటపడ్డాడు. సింథియాను కలవాలన్నాడు. అయితే తాను ప్రయాణం చేసే స్థితిలో లేనన్నాడు. దీంతో తన మిత్రుల్ని వెంటబెట్టుకుని సింథియా శాన్డీగోకు బయల్దేరింది. ఆరు దశాబ్దాల కిందట తన కళ్లలో నిలిచిపోయిన 18 ఏళ్ల సింథియానే హోవర్డ్‌కు పదే పదే గుర్తుకొస్తున్నా, ఇప్పుడామె ఎలా ఉంటుందా అని అతనిలో ఉత్కంఠ. ఆమె కోసం వేయి కళ్లతో ఎయిర్‌పోర్ట్‌లో ఎదురుచూశాడు. ఆ మధుర క్షణాలు రానే వచ్చాయి. సింథియా, హోవర్డ్ కలిశారు. ఇద్దరి కళ్లూ చెమర్చాయి. ఇద్దరూ ఒకరినొకరు హత్తుకున్నారు. వారి ఉద్వేగం చూసి చుట్టూ ఉన్నవారి కళ్లూ వర్షించాయి. పెళ్లికి ఏర్పాట్లు చేసేశారు. గతేడాది వారి పెళ్లి ఓ చర్చిలో జరిగింది. ఎంతో మురిపెంగా సింథియాకు రింగు తొడిగి ముద్దాడాడు హోవర్డ్. మామూలుగా అమ్మాయి, అబ్బాయి ఇంటికి వెళ్తుంది. కానీ సింథియా కోసం తనే తన నగరం వదిలి వచ్చేశాడు. సింథియా ఇంటికే మకాం మార్చాడు. 62 ఏళ్ల తర్వాత ఫలించిన తమ ప్రేమను ఆస్వాదిస్తూ చరమాంకాన్ని సంతోషంగా గడిపేస్తోంది ఈ వృద్ధ జంట.