వారి ప్రేమ... 62 ఏళ్లకు ఫలించింది!
హృదయం: ప్రేమించడం గొప్ప కాదు. ఆ ప్రేమను చెప్పడం గొప్ప అంటారు. అయితే చాలామందికి ఆ ప్రేమను చెప్పే ధైర్యం ఉండదు. ఆ ప్రేమను అలాగే గుండెల్లోనే దాచుకుని కొత్త జీవితం ఆరంభిస్తారు. కొత్త భాగస్వామితో జీవనం సాగిస్తారు. పిల్లలు పుడతారు. పెద్దవాళ్లైపోతారు. దశాబ్దాలు గడిచిపోతాయి. జీవితం చరమాంకానికి వచ్చేస్తుంది. కానీ అప్పటికి కూడా గుండె పొరల్లో ఆ ప్రేమ అలాగే గూడు కట్టుకుని ఉండిపోతే..? నిదుర పట్టనివ్వకపోతే..? అప్పుడేం చేయాలి? అమెరికాకు చెందిన హోవర్డ్ ఆటీబరీ, సింథియా రిగ్స్‌లను అడిగితే సరిగ్గా ఏం చేయాలో చక్కగా సమాధానం చెబుతారు. వీళ్ల కథేంటో తెలుసుకుందాం రండి.
మార్తాస్ విన్‌యార్డ్... అమెరికాలోని ప్రముఖ దీవి. ఇక్కడ పుట్టిన సింథియా... 1950లో తనకు 18 ఏళ్లప్పుడు వేసవి సెలవుల్లో పార్ట్ టైమ్ జాబ్ చేయడం కోసం కాలిఫోర్నియాలోని శాన్‌డీగోకు వచ్చి మెరైన్ జియాలజీ ల్యాబ్‌లో అసిస్టెంట్‌గా చేరింది. అక్కడే హోవర్డ్ మైక్రో బయాలజిస్ట్‌గా ఉండేవాడు. అందగత్తె అయిన సింథియాను చూసి మిగతావాళ్లంతా టీజ్ చేస్తుంటే, హోవర్డ్ మాత్రం ఆమెను ఆరాధించాడు. సింథియాకు కూడా అతనిష్టమే. దీంతో మిగతా వాళ్లకు అర్థం కాకుండా వీళ్లిద్దరూ కోడ్ భాషలో సంభాషించుకునేవాళ్లు. హోవర్డ్‌కు స్వతహాగానే కోడ్ భాష తెలుసు. సింథియా కూడా ఆర్మీలో పనిచేసిన తండ్రి నుంచి కోడ్ భాష నేర్చుకుంది. ఇలా అక్కడున్న రెణ్నెళ్లలో ఇద్దరి బంధం బలపడింది. చూస్తుండగానే, సెలవులైపోయాయి. సింథియా ఇంటికి బయల్దేరాల్సి వచ్చింది. కానీ బయటపడలేదు. భయం వల్లో, కుటుంబ పరిస్థితుల వల్లో ఇద్దరూ తమ ప్రేమను మనసులోనే దాచుకున్నారు. హోవర్డ్ స్వయంగా సింథియాను ఎయిర్‌పోర్ట్‌లో దింపాడు. వెళ్లిపోగానే బోరుమన్నాడు. సింథియా కూడా బాధగా ఇంటికి చేరుకుంది.
ఆ తర్వాత ఎవరి జీవితాలు వారివి. మైక్రో బయాలజిస్ట్‌గా మరింత పెద్ద స్థాయికి చేరుకున్న హోవర్డ్, పెళ్లి చేసుకున్నాడు. బాగా సంపాదించాడు. తొలి వివాహం విఫలమవడంతో విడాకులిచ్చేసి, మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నలుగురు పిల్లల్ని కన్నాడు. భార్య చనిపోయింది. పిల్లలు స్థిరపడ్డారు. హోవర్డ్ ఒంటరివాడయ్యాడు.
మరోవైపు సింథియా కూడా పెళ్లి చేసుకుంది. ఐదుగురు పిల్లల్ని కంది. జర్నలిస్టుగా పనిచేసిన తర్వాత రచయిత్రిగా స్థిరపడింది. పుస్తకాలు రాసింది. పిల్లలు ఎదిగే వయసులోనే భర్తకు విడాకులిచ్చేసింది. తనే పిల్లల్ని పోషించింది. వాళ్లు స్థిరపడేలా చేసింది. చరమాంకంలో పుస్తకాలు రాసుకుంటూ కాలం గడపసాగింది.
ఒంటరిగా బతకలేక బాధపడుతున్న తరుణంలో హోవర్డ్‌కు తన తొలి ప్రేయసి గుర్తుకొచ్చింది. ఆమె ఏమైందో, ఎలా ఉందో తెలుసుకోవాలనిపించింది. ఎలాగోలా ఆమె చిరునామా సంపాదించాడు. ఒకప్పుడు తమ మధ్య సాగిన సంభాషణ తరహాలోనే కోడ్ భాషతో ఆమెకో ఉత్తరం రాశాడు. అది చదివి సింథియా సంభ్రమాశ్చర్యాలకు గురైంది. తను కూడా బదులిచ్చింది. తర్వాతి ఇద్దరి మధ్య మెయిల్స్ సాగాయి. ఇలాగే కొన్ని నెలలు గడిచాయి.
ఇద్దరూ ఒంటరే. దీంతో ముందుగా హోవర్డే బయటపడ్డాడు. సింథియాను కలవాలన్నాడు. అయితే తాను ప్రయాణం చేసే స్థితిలో లేనన్నాడు. దీంతో తన మిత్రుల్ని వెంటబెట్టుకుని సింథియా శాన్‌డీగోకు బయల్దేరింది. ఆరు దశాబ్దాల కిందట తన కళ్లలో నిలిచిపోయిన 18 ఏళ్ల సింథియానే హోవర్డ్‌కు పదే పదే గుర్తుకొస్తున్నా, ఇప్పుడామె ఎలా ఉంటుందా అని అతనిలో ఉత్కంఠ. ఆమె కోసం వేయి కళ్లతో ఎయిర్‌పోర్ట్‌లో ఎదురుచూశాడు. ఆ మధుర క్షణాలు రానే వచ్చాయి. సింథియా, హోవర్డ్ కలిశారు. ఇద్దరి కళ్లూ చెమర్చాయి. ఇద్దరూ ఒకరినొకరు హత్తుకున్నారు. వారి ఉద్వేగం చూసి చుట్టూ ఉన్నవారి కళ్లూ వర్షించాయి. పెళ్లికి ఏర్పాట్లు చేసేశారు.
గతేడాది వారి పెళ్లి ఓ చర్చిలో జరిగింది. ఎంతో మురిపెంగా సింథియాకు రింగు తొడిగి ముద్దాడాడు హోవర్డ్. మామూలుగా అమ్మాయి, అబ్బాయి ఇంటికి వెళ్తుంది. కానీ సింథియా కోసం తనే తన నగరం వదిలి వచ్చేశాడు. సింథియా ఇంటికే మకాం మార్చాడు. 62 ఏళ్ల తర్వాత ఫలించిన తమ ప్రేమను ఆస్వాదిస్తూ చరమాంకాన్ని సంతోషంగా గడిపేస్తోంది ఈ వృద్ధ జంట.