Cynthia
-
కూతురి సాయంతోనే భార్య మృతదేహం తరలింపు..?
దారుణ హత్య విషయం వెలుగు చూసిన గచ్చిబౌలిలోని జైన్ శిల్ప సైబర్‌సిటీ వ్యూ అపార్ట్మెంట్లో మంగళవారం విషాద ఛాయలు అలుముకున్నాయి. శంషాబాద్‌లోని మదనపల్లిలో భార్య శరీర భాగాలను కాల్చివేసి పట్టుబడిన రూపేష్ కుమార్ అపార్ట్మెంట్లో ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవాడు కాదని తెలిసింది. తెలుగు, హిందీ రాకపోవటంతో అతని భార్య సింథియా కూడా బయటకు వచ్చేదికాదని సమాచారం. జైన్ శిల్ప సైబర్‌సిటీ అపార్ట్మెంట్లోని రమణారావుకు చెందిన గ్రౌండ్ ఫ్లోర్‌లోని జి ఫ్లాట్‌ను అద్దెకు తీసుకొని రెండేళ్లుగా రూపేష్ కుమార్, సింథియాతో పాటు కూతురు సానియా, సింథియా సోదరుడు నివాసం ఉంటున్నారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే రూపేష్ రోజూ ఉదయం 10 గంటల బయటకు వెళ్లి సాయంత్రం 7 గంటలకు ఇంటికి తిరిగి వచ్చేవాడు. అతని బావమరిది బీటెక్ చేస్తున్నాడు. ఆదివారం ఉదయం ఫంక్షన్‌కు కలిసి వెళ్లిన రూపేష్, సింథియా, సానియా తిరిగి రాగా సింథియా సోదరుడు స్నేహితుల వద్దకు వెళ్లాడు. తన సోదరి హత్య విషయం తెలియని సింథియా సోదరుడు యథావిధిగా సోమవారం రాత్రి 12 గంటల సమయంలో ఫ్లాట్‌కు వచ్చాడు. తాళం చెవి లేకపోవడంతో అపార్ట్మెంట్లోనే తచ్చాడాడు. మీడియా ప్రతినిధులను చూసి విషయం తెలియటంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రూపేష్, సింథియా గొడవ పడ్డట్లు తాము ఎప్పుడూ గమనించలేదని ఇరుగుపొరుగు వారు చెప్పారు. సింథియా ఫ్లాట్ నుంచి బయటకు వచ్చేది కాదని, రూపేష్ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడే వాడు కాదని తెలిపారు. సింథియా సోదరుడే ఇంటి పనులు చేసేవాడని పేర్కొన్నారు. గుట్టుచప్పుడు కాకుండా హత్య అపార్ట్మెంట్లో ఎవరికి అనుమానం రాకుండా భార్య శరీరాన్ని ముక్కలుగా నరికి సూట్‌కేస్‌లో గుట్టుచప్పుడు కాకుండా అపార్ట్మెంట్ నుంచి కారులో వెళ్లి ఉంటాడని అపార్ట్మెంట్ వాసులు భావిస్తున్నారు. రూపేష్ ఫ్లాట్ పక్కనే లిఫ్ట్ ఉంది. కారు లిఫ్ట్ దగ్గరికి వచ్చే వీలుంది. కూతురుకు చెత్త అని చెప్పి ఆమె సాయంతోనే సూట్‌కేస్‌ను కారులో పెట్టుకొని వెళ్లి ఉంటాడని భావిస్తున్నారు. అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో కారులో ఏ సమయంలో బయటకు వెళ్లాడో తెలియని పరిస్థితి నెలకొంది. సింథియా ఎవరితోనూ మాట్లాడేది కాదు రూపేష్ పని మనుషులనెవరిని పెట్టుకోలేదు. సింథియా ఎప్పడైనా బయటకు వచ్చినా ఎవరితోనూ మాట్లాడేది కాదు. తెలుగు, హిందీ రాకపోవడంతో ఇరుగుపొరుగు వారితోను మాట్లాడేది కాదు. కూతురును ప్రతి రోజు స్కూల్ బస్సులో ఎక్కించేది. అపార్టుమెంట్లో భద్రత కరువు గచ్చిబౌలిలోని శిల్పాలేవుట్‌లో విసిరేసినట్లుగా ఉండే ఏకైక అపార్ట్మెంట్ జైన్ శిల్ప సైబర్‌సిటీ వ్యూ. 54 ఫ్లాట్లలో ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నివాసం ఉంటున్నారు. అపార్ట్‌మెంట్‌కు రెండు ద్వారాలున్నప్పటికీ సీసీ కెమెరా ఒక్కటీ లేదు. రాత్రి, పగలు విధులు నిర్వహించేందుకు ఇద్దరే సెక్యూరిటీ గార్డులు ఉండటం గమనార్హం. రాయదుర్గం ఎస్ఐ రాజశేఖర్ మంగళవారం అపార్ట్‌మెంట్‌కు వచ్చారు. రూపేష్ ఫ్లాట్ యజమాని ఎవరని అక్కడి సూరప్‌వైజర్ శరణప్పను ఆరా తీశారు. సీసీ కెమెరాలను ఎన్ని ఉన్నాయని అడగగా ఒక్కటి కూడా లేదని చెప్పారు. తక్షణమే సీసీ కెమెరాలు అమర్చాలని అపార్ట్మెంట్ అసోసియేషన్‌కు నోటీసులు జారీ చేస్తామని ఎస్ఐ తెలిపారు. -
సానియాను తీసుకువెళ్తుందనే...హత్య
హైదరాబాద్ : భార్యను అతి కిరాతకంగా హతమార్చిన ఘటనలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. (భార్యను ముక్కలు చేసి...కాల్చేసి...) భార్య సింతియా విడాకులు కోరినందుకే రూపేశ్ కుమార్ అగర్వాల్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. గతంలో దక్షిణాఫ్రికాలో పని చేసిన రూపేశ్ కుమార్‌కు కాంగో దేశస్తురాలు అయిన సింతియాతో పరిచయం అయింది. అనంతరం వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి కాపురం11ఏళ్లు పాటు సజావుగా కొనసాగింది. అయితే రూపేశ్, సింతియాల మధ్య కొన్నాళ్లుగా విబేధాలు తలెత్తాయి. ఫ్రాన్స్‌కు చెందిన ఓ వ్యక్తితో సింతియాకు ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. ఈ విషయాన్ని గమనించిన రూపేశ్ పలుమార్లు భార్యతో గొడవ పడ్డాడు. అయితే భర్తపై విడాకులకు ఒత్తిడి తెచ్చిన సింతియా, కుమార్తె సానియతో కలిసి ఫ్రాన్స్‌కు వెళ్లాలని నిర్ణయించుకుంది. దీనిపై రూపేశ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో భార్యా,భర్తల మధ్య తీవ్రస్థాయిలో వివాదం జరిగి, అది సింతియా హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది. కాగా సింతియా వీసా మంజూరుకు ఫ్రాన్స్ వ్యక్తి సహకారం అందించటంతో పాటు, పెళ్లి చేసుకున్నట్లుగా మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా పంపించినట్లు సమాచారం. ఒక్కదానివే వెళ్లాలని, పాపను ఇచ్చేది లేదని అతడు తేల్చి చెప్పాడు. అయితే కుమార్తెతో కలిసి సింతియా ఫ్రాన్స్ వెళ్లేందుకు సిద్ధం అవుతున్న తరుణంలో రూపేశ్... గచ్చిబౌలిలోని తన నివాసంలో భార్య గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం సింతియా శవాన్ని 10 ముక్కలుగా చేసి ఓ పెద్ద బ్యాగ్‌లో ప్యాక్ చేశారు. శంషాబాద్ మండలం మదనపల్లె సమీపంలో చెట్ల పొదల్లో బ్యాగుపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ క్రమంలో రూపేశ్ వాహనం బురదలో కూరుకుపోవటం, స్థానికులు అతడిని ప్రశ్నించడం, అందుకు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల విచారణలో రూషేశ్ ఈ వివరాలు వెల్లడించినట్లు సమచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భార్యను ముక్కలు చేసి.. కాల్చేసి..
- తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులకు చిక్కిన భర్త - రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మదన్‌పల్లి సమీపంలో ఘటన - ఇంట్లో చంపి.. శవాన్ని బ్యాగులో కుక్కి.. - చెత్త పడేద్దామంటూ కూతురును కారులో వెంట తీసుకెళ్లిన రూపేశ్ - ఆమెను కొద్ది దూరంలోనే దించేసి.. శవాన్ని పెట్రోల్ పోసి కాల్చేసిన వైనం - తిరిగి వస్తుండగా వాహనం బురదలో ఇరుక్కోవడంతో చిక్కిన రూపేశ్ శంషాబాద్ రూరల్: భార్యను ఓ భర్త అతి కిరాతకంగా హత్య చేశాడు. మృతదేహాన్ని ముక్కలు చేసి పెట్రోలు పోసి నిప్పంటించాడు. తప్పించుకునే క్రమంలో పోలీసులకు పట్టుబడ్డాడు. సోమవారం రాత్రి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మదన్‌పల్లి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్‌లోని పద్మారావునగర్ ప్రాంతానికి చెందిన రూపేశ్‌కుమార్ షేర్ మార్కెట్లో బాగా నష్టపోయాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి భార్య సింతియా(30)తో గొడవ పడ్డాడు. ఆగ్రహంతో ఆమె గొంతునులిమి చంపాడు. శవాన్ని ముక్కలుగా చేసి ఓ పెద్ద బ్యాగులో ఉంచాడు. కూతురు సానియా(8)కు అనుమానం రాకుండా సోమవారం ఉదయం పాఠశాలలో విడిచిపెట్టాడు. సాయంత్రం స్కూలు నుంచి వచ్చాక బ్యాగులోని చెత్తను కాల్చేసి వద్దామంటూ కూతురుతో కలసి శంషాబాద్ శివారులోని మదన్‌పల్లికి రాత్రి ఏడు గంటల సమయంలో ఫోర్డ్ కారులో వచ్చాడు. బెంగళూరు జాతీయ రహదారి సమీపంలో ఉన్న గ్రీన్‌సిటీ వెంచరులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కారు ఆపాడు. కూతురును కొద్ది దూరంలోనే దించేసి కారును ముందుకు తీసుకెళ్లి అందులోని బ్యాగును కిందకు దించాడు. బ్యాగులోని భార్య మృతదేహాన్ని బయటకు తీసి, వెంట తెచ్చుకున్న పెట్రోలు పోసి తగులబెట్టాడు. అక్కడికి వచ్చిన దారిలో కాకుండా వేరే మార్గంలో వెళ్లడానికి బయలుదేరాడు. మదన్‌పల్లి శివారులోకి వెళ్లగానే అక్కడ బురదలో కారు ఇరుక్కుపోయింది. గమనించిన స్థానికులు అక్కడకు వెళ్లి ఆరా తీయగా.. కంగారులో ఉన్న రూపేశ్‌కుమార్ పొంతన లేని సమాధానాలు చెప్పడం, దూరంగా మంటలు కనిపిస్తుండడంతో స్థానికులు వెంటనే శంషాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ భాస్కర్ ఘటనా స్థలానికి చేరుకొని కాలిపోతున్న మృతదేహాన్ని గుర్తించారు. దీంతో నిందితుడితోపాటు అతడి కూతురును ఠాణాకు తరలించారు. అనంతరం శంషాబాద్ ఏసీపీ అనురాధ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఏం జరిగిందో.. ? భార్యను అత్యంత దారుణంగా నరికి చంపడం వెనుక బలమైన కారణం ఏంటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పోలీసులు విచారించే క్రమంలో అతను తన కూతురు ముందు హత్య విషయాలు చెప్పడానికి నిరాకరించినట్లు తెలిసింది. పోలీసులు వచ్చేంత వరకు కూడా ఈ విషయాన్ని కూతురుకు తెలియకుండా దాచిపెట్టడం, ఇంట్లోనే భార్యను హత్య చేసి ఇక్కడికి తీసుకురావడం అన్నీ పథకం ప్రకారం చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వారి ప్రేమ... 62 ఏళ్లకు ఫలించింది!
హృదయం: ప్రేమించడం గొప్ప కాదు. ఆ ప్రేమను చెప్పడం గొప్ప అంటారు. అయితే చాలామందికి ఆ ప్రేమను చెప్పే ధైర్యం ఉండదు. ఆ ప్రేమను అలాగే గుండెల్లోనే దాచుకుని కొత్త జీవితం ఆరంభిస్తారు. కొత్త భాగస్వామితో జీవనం సాగిస్తారు. పిల్లలు పుడతారు. పెద్దవాళ్లైపోతారు. దశాబ్దాలు గడిచిపోతాయి. జీవితం చరమాంకానికి వచ్చేస్తుంది. కానీ అప్పటికి కూడా గుండె పొరల్లో ఆ ప్రేమ అలాగే గూడు కట్టుకుని ఉండిపోతే..? నిదుర పట్టనివ్వకపోతే..? అప్పుడేం చేయాలి? అమెరికాకు చెందిన హోవర్డ్ ఆటీబరీ, సింథియా రిగ్స్లను అడిగితే సరిగ్గా ఏం చేయాలో చక్కగా సమాధానం చెబుతారు. వీళ్ల కథేంటో తెలుసుకుందాం రండి. మార్తాస్ విన్యార్డ్... అమెరికాలోని ప్రముఖ దీవి. ఇక్కడ పుట్టిన సింథియా... 1950లో తనకు 18 ఏళ్లప్పుడు వేసవి సెలవుల్లో పార్ట్ టైమ్ జాబ్ చేయడం కోసం కాలిఫోర్నియాలోని శాన్డీగోకు వచ్చి మెరైన్ జియాలజీ ల్యాబ్‌లో అసిస్టెంట్‌గా చేరింది. అక్కడే హోవర్డ్ మైక్రో బయాలజిస్ట్‌గా ఉండేవాడు. అందగత్తె అయిన సింథియాను చూసి మిగతావాళ్లంతా టీజ్ చేస్తుంటే, హోవర్డ్ మాత్రం ఆమెను ఆరాధించాడు. సింథియాకు కూడా అతనిష్టమే. దీంతో మిగతా వాళ్లకు అర్థం కాకుండా వీళ్లిద్దరూ కోడ్ భాషలో సంభాషించుకునేవాళ్లు. హోవర్డ్‌కు స్వతహాగానే కోడ్ భాష తెలుసు. సింథియా కూడా ఆర్మీలో పనిచేసిన తండ్రి నుంచి కోడ్ భాష నేర్చుకుంది. ఇలా అక్కడున్న రెణ్నెళ్లలో ఇద్దరి బంధం బలపడింది. చూస్తుండగానే, సెలవులైపోయాయి. సింథియా ఇంటికి బయల్దేరాల్సి వచ్చింది. కానీ బయటపడలేదు. భయం వల్లో, కుటుంబ పరిస్థితుల వల్లో ఇద్దరూ తమ ప్రేమను మనసులోనే దాచుకున్నారు. హోవర్డ్ స్వయంగా సింథియాను ఎయిర్‌పోర్ట్‌లో దింపాడు. వెళ్లిపోగానే బోరుమన్నాడు. సింథియా కూడా బాధగా ఇంటికి చేరుకుంది. ఆ తర్వాత ఎవరి జీవితాలు వారివి. మైక్రో బయాలజిస్ట్‌గా మరింత పెద్ద స్థాయికి చేరుకున్న హోవర్డ్, పెళ్లి చేసుకున్నాడు. బాగా సంపాదించాడు. తొలి వివాహం విఫలమవడంతో విడాకులిచ్చేసి, మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నలుగురు పిల్లల్ని కన్నాడు. భార్య చనిపోయింది. పిల్లలు స్థిరపడ్డారు. హోవర్డ్ ఒంటరివాడయ్యాడు. మరోవైపు సింథియా కూడా పెళ్లి చేసుకుంది. ఐదుగురు పిల్లల్ని కంది. జర్నలిస్టుగా పనిచేసిన తర్వాత రచయిత్రిగా స్థిరపడింది. పుస్తకాలు రాసింది. పిల్లలు ఎదిగే వయసులోనే భర్తకు విడాకులిచ్చేసింది. తనే పిల్లల్ని పోషించింది. వాళ్లు స్థిరపడేలా చేసింది. చరమాంకంలో పుస్తకాలు రాసుకుంటూ కాలం గడపసాగింది. ఒంటరిగా బతకలేక బాధపడుతున్న తరుణంలో హోవర్డ్‌కు తన తొలి ప్రేయసి గుర్తుకొచ్చింది. ఆమె ఏమైందో, ఎలా ఉందో తెలుసుకోవాలనిపించింది. ఎలాగోలా ఆమె చిరునామా సంపాదించాడు. ఒకప్పుడు తమ మధ్య సాగిన సంభాషణ తరహాలోనే కోడ్ భాషతో ఆమెకో ఉత్తరం రాశాడు. అది చదివి సింథియా సంభ్రమాశ్చర్యాలకు గురైంది. తను కూడా బదులిచ్చింది. తర్వాతి ఇద్దరి మధ్య మెయిల్స్ సాగాయి. ఇలాగే కొన్ని నెలలు గడిచాయి. ఇద్దరూ ఒంటరే. దీంతో ముందుగా హోవర్డే బయటపడ్డాడు. సింథియాను కలవాలన్నాడు. అయితే తాను ప్రయాణం చేసే స్థితిలో లేనన్నాడు. దీంతో తన మిత్రుల్ని వెంటబెట్టుకుని సింథియా శాన్డీగోకు బయల్దేరింది. ఆరు దశాబ్దాల కిందట తన కళ్లలో నిలిచిపోయిన 18 ఏళ్ల సింథియానే హోవర్డ్‌కు పదే పదే గుర్తుకొస్తున్నా, ఇప్పుడామె ఎలా ఉంటుందా అని అతనిలో ఉత్కంఠ. ఆమె కోసం వేయి కళ్లతో ఎయిర్‌పోర్ట్‌లో ఎదురుచూశాడు. ఆ మధుర క్షణాలు రానే వచ్చాయి. సింథియా, హోవర్డ్ కలిశారు. ఇద్దరి కళ్లూ చెమర్చాయి. ఇద్దరూ ఒకరినొకరు హత్తుకున్నారు. వారి ఉద్వేగం చూసి చుట్టూ ఉన్నవారి కళ్లూ వర్షించాయి. పెళ్లికి ఏర్పాట్లు చేసేశారు. గతేడాది వారి పెళ్లి ఓ చర్చిలో జరిగింది. ఎంతో మురిపెంగా సింథియాకు రింగు తొడిగి ముద్దాడాడు హోవర్డ్. మామూలుగా అమ్మాయి, అబ్బాయి ఇంటికి వెళ్తుంది. కానీ సింథియా కోసం తనే తన నగరం వదిలి వచ్చేశాడు. సింథియా ఇంటికే మకాం మార్చాడు. 62 ఏళ్ల తర్వాత ఫలించిన తమ ప్రేమను ఆస్వాదిస్తూ చరమాంకాన్ని సంతోషంగా గడిపేస్తోంది ఈ వృద్ధ జంట.