కూతురి సాయంతోనే భార్య మృతదేహం తరలింపు..? | wife 's body moved with the Daughter help ..? | Sakshi
Sakshi News home page

కూతురి సాయంతోనే భార్య మృతదేహం తరలింపు..?

Published Tue, Jul 5 2016 6:42 PM | Last Updated on Mon, Sep 4 2017 4:11 AM

wife 's body moved with the Daughter help ..?

దారుణ హత్య విషయం వెలుగు చూసిన గచ్చిబౌలిలోని జైన్ శిల్ప సైబర్‌సిటీ వ్యూ అపార్ట్‌మెంట్‌లో మంగళవారం విషాద ఛాయలు అలుముకున్నాయి. శంషాబాద్‌లోని మదనపల్లిలో భార్య శరీర భాగాలను కాల్చివేసి పట్టుబడిన రూపేష్ కుమార్ అపార్ట్‌మెంట్‌లో ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవాడు కాదని తెలిసింది. తెలుగు, హిందీ రాకపోవటంతో అతని భార్య సింథియా కూడా బయటకు వచ్చేదికాదని సమాచారం.

 

జైన్ శిల్ప సైబర్‌సిటీ అపార్ట్‌మెంట్‌లోని రమణారావుకు చెందిన గ్రౌండ్ ఫ్లోర్‌లోని జి ఫ్లాట్‌ను అద్దెకు తీసుకొని రెండేళ్లుగా రూపేష్ కుమార్, సింథియాతో పాటు కూతురు సానియా, సింథియా సోదరుడు నివాసం ఉంటున్నారు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే రూపేష్ రోజూ ఉదయం 10 గంటల బయటకు వెళ్లి సాయంత్రం 7 గంటలకు ఇంటికి తిరిగి వచ్చేవాడు. అతని బావమరిది బీటెక్ చేస్తున్నాడు. ఆదివారం ఉదయం ఫంక్షన్‌కు కలిసి వెళ్లిన రూపేష్, సింథియా, సానియా తిరిగి రాగా సింథియా సోదరుడు స్నేహితుల వద్దకు వెళ్లాడు.

 

తన సోదరి హత్య విషయం తెలియని సింథియా సోదరుడు యథావిధిగా సోమవారం రాత్రి 12 గంటల సమయంలో ఫ్లాట్‌కు వచ్చాడు. తాళం చెవి లేకపోవడంతో అపార్ట్‌మెంట్‌లోనే తచ్చాడాడు. మీడియా ప్రతినిధులను చూసి విషయం తెలియటంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రూపేష్, సింథియా గొడవ పడ్డట్లు తాము ఎప్పుడూ గమనించలేదని ఇరుగుపొరుగు వారు చెప్పారు. సింథియా ఫ్లాట్ నుంచి బయటకు వచ్చేది కాదని, రూపేష్ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడే వాడు కాదని తెలిపారు. సింథియా సోదరుడే ఇంటి పనులు చేసేవాడని పేర్కొన్నారు.


గుట్టుచప్పుడు కాకుండా హత్య
అపార్ట్‌మెంట్‌లో ఎవరికి అనుమానం రాకుండా భార్య శరీరాన్ని ముక్కలుగా నరికి సూట్‌కేస్‌లో గుట్టుచప్పుడు కాకుండా అపార్ట్‌మెంట్ నుంచి కారులో వెళ్లి ఉంటాడని అపార్ట్‌మెంట్ వాసులు భావిస్తున్నారు. రూపేష్ ఫ్లాట్ పక్కనే లిఫ్ట్ ఉంది. కారు లిఫ్ట్ దగ్గరికి వచ్చే వీలుంది. కూతురుకు చెత్త అని చెప్పి ఆమె సాయంతోనే సూట్‌కేస్‌ను కారులో పెట్టుకొని వెళ్లి ఉంటాడని భావిస్తున్నారు. అపార్ట్‌మెంట్‌లో సీసీ కెమెరాలు లేకపోవడంతో కారులో ఏ సమయంలో బయటకు వెళ్లాడో తెలియని పరిస్థితి నెలకొంది.


సింథియా ఎవరితోనూ మాట్లాడేది కాదు
రూపేష్ పని మనుషులనెవరిని పెట్టుకోలేదు. సింథియా ఎప్పడైనా బయటకు వచ్చినా ఎవరితోనూ మాట్లాడేది కాదు. తెలుగు, హిందీ రాకపోవడంతో ఇరుగుపొరుగు వారితోను మాట్లాడేది కాదు. కూతురును ప్రతి రోజు స్కూల్ బస్సులో ఎక్కించేది.


అపార్టుమెంట్‌లో భద్రత కరువు
గచ్చిబౌలిలోని శిల్పాలేవుట్‌లో విసిరేసినట్లుగా ఉండే ఏకైక అపార్ట్‌మెంట్ జైన్ శిల్ప సైబర్‌సిటీ వ్యూ. 54 ఫ్లాట్లలో ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు నివాసం ఉంటున్నారు. అపార్ట్‌మెంట్‌కు రెండు ద్వారాలున్నప్పటికీ సీసీ కెమెరా ఒక్కటీ లేదు. రాత్రి, పగలు విధులు నిర్వహించేందుకు ఇద్దరే సెక్యూరిటీ గార్డులు ఉండటం గమనార్హం. రాయదుర్గం ఎస్‌ఐ రాజశేఖర్ మంగళవారం అపార్ట్‌మెంట్‌కు వచ్చారు. రూపేష్ ఫ్లాట్ యజమాని ఎవరని అక్కడి సూరప్‌వైజర్ శరణప్పను ఆరా తీశారు. సీసీ కెమెరాలను ఎన్ని ఉన్నాయని అడగగా ఒక్కటి కూడా లేదని చెప్పారు. తక్షణమే సీసీ కెమెరాలు అమర్చాలని అపార్ట్‌మెంట్ అసోసియేషన్‌కు నోటీసులు జారీ చేస్తామని ఎస్‌ఐ తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement