ప్రియురాలిని, ఆమె తల్లిని కిరాతకంగా హత్యచేసిన ప్రియుడు | Shocking incident in rajamahendravaram | Sakshi
Sakshi News home page

ప్రియురాలిని, ఆమె తల్లిని కిరాతకంగా హత్యచేసిన ప్రియుడు

Mar 24 2025 5:44 AM | Updated on Mar 24 2025 10:21 AM

Shocking incident in rajamahendravaram

వేరొకరితో చాటింగ్‌ చేస్తోందని ఘాతుకం

ఇద్దరికీ మెడమీద బలంగా కత్తిపోట్లు

ఇంటికి తాళం వేసి పరార్‌

పోలీసుల అదుపులో నిందితుడు

రాజమహేంద్రవరం రూరల్‌: ఆమెకు 16.. అతడికి 20.. ఇద్దరి మనస్సులూ కలిశాయి. ఆరు నెలలుగా గాఢంగా ప్రేమించుకుంటున్నారు. ఇంతలోనే కొద్దిరోజులుగా ప్రియురాలు వేరొకరితో చాటింగ్‌ చేస్తోందనే అనుమానంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో.. ప్రియు­రాలిని, ఆమె తల్లిని ప్రియుడు కూరలు కోసే కత్తితో కిరాతకంగా హత్యచేసి, ఇంటికి తాళంవేసి, పరారయ్యాడు. రాజమహేంద్రవరంలో ఆదివారం తెల్లవారు­జామున ఈ సంఘటన చోటుచేసుకుంది. 

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఏలూరు ఏఎస్‌ఆర్‌ స్టేడియం ప్రాంతానికి చెందిన మహ్మద్‌ సల్మా (38), ఆమె కుమార్తె మహ్మద్‌ సానియా ఎలియాస్‌ సానా (16) మూడునెలలుగా రాజమహేంద్రవరంలోని హుకుంపేటలో ఉంటున్నారు. స్థానిక జాంపేట ప్రాంతానికి చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ మజీద్‌కు సల్మా రెండో భార్య. ఆయన మూడేళ్ల క్రితం మృతిచెందాడు. ఆయన మొదటి భార్యకు ముగ్గురు కుమారు­లు. వారు జాంపేటలో నివసి­స్తున్నారు. మహ్మద్‌ సానియా ఈవెంట్లకు యాంకర్‌గా వెళ్తుంటుంది. 

సల్మా, సానియాలకు తోడుగా వారి ఇంట్లో మజీద్‌ మొదటి భార్య చిన్న కుమారుడు ఉమర్‌ ఉంటున్నాడు. ఆరునెలల క్రితం కాకినాడ జిల్లా పిఠాపురంలో ఓ ఈవెంట్‌కు వెళ్లిన సమ­యంలో ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న శ్రీకాకుళం జిల్లా వాసి పల్లి శివకుమార్‌ లైట్‌­బాయ్‌గా అక్కడకొచ్చాడు. ఆ సమయంలో వీరి­ద్దరి మధ్య ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. 

ఫోన్‌లో ఎవరితోనో చాటింగ్‌ చేస్తోందని..
ఈ నేపథ్యంలో.. వారం రోజుల క్రితం హైదరాబాద్‌ నుంచి శివకుమార్‌ సానియా ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో సానియా ఎవరితోనో ఫోన్‌లో చాటింగ్‌ చేస్తోందని గమనించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. శనివారం రాత్రి కూడా ఇద్దరూ గొడవ పడుతుంటే మొదటి భార్య కుమారులైన మహ్మద్‌ ఆలీ, ఉమర్‌లు శివకుమార్‌తో మాట్లాడి వెళ్లారు. తిరిగి ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఇంటికి కూర పట్టుకుని ఉమర్‌ వచ్చాడు. 

తాళం వేసి ఉండటంతో కిటికీలో నుంచి చూడగా సల్మా, సానియా రక్తపు మడుగులో కనిపించారు. వెంటనే 100 నంబర్‌కు ఫోన్‌చేసి పోలీసులకు విషయం చెప్పాడు. బొమ్మూరు ఇన్‌స్పెక్టర్‌ కాశీ విశ్వనాథ్, తన సిబ్బందితో తాళాలు పగులగొట్టి లోపల పరిశీలించారు. మెడమీదే బలమైన కత్తిపోటు గాయాలుండడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందినట్లు నిర్ధారించారు. 

సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్, శాంతిభద్రతల ఏఎస్పీ ఏవీ సుబ్బరాజు, డీఎస్పీలు బి. విద్య, శ్రీకాంత్‌ పరిశీలించారు. ఉమర్‌ను ఎస్పీ వివరాలడిగి తెలుసుకున్నారు. మహ్మద్‌ ఆలీ ఫిర్యాదు మేరకు ఇన్‌స్పెక్టర్‌ కాశీ విశ్వనాథ్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. పరారైన నిందితుడు శివకుమార్‌ను ఆదివారం మధ్యాహ్నం కొవ్వూరు ప్రాంతంలో కొవ్వూరు రూరల్‌ ఎస్సై శ్రీహరి పట్టుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement