తిరుపతి పోలీసులు వెటకారమాడారు
రూ.2 లక్షలు ఇస్తారు.. సెటిల్‌మెంట్ చేసుకోవాలంటూ ఒత్తిడి చేస్తున్నారు
మీడియా ఎదుట బాధితురాలి ఆవేదన
ఎట్టకేలకు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
తిరుపతి క్రైం/తిరుపతి కల్చరల్: మానవత్వం మరిచి పెంపుడు కుక్కను రాక్షసంగా వేట కొడవళ్లతో నరికి చంపిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తే.. కుక్క తల్లిదండ్రుల పేర్లు చెప్పాలంటూ తిరుపతి పోలీసులు వెటకారంగా మాట్లాడారని తిరుపతికి చెందిన లావణ్య ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు.
ఈ నెల 6వ తేదీ సాయంత్రం తమ పెంపుడు కుక్క(టావీు)ను ఇద్దరు వ్యక్తులు దారుణంగా నరికి చంపేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు.. తమతో వెటకారంగా మాట్లాడుతూ చులకనగా వ్యవహరించారని లావణ్య వాపోయారు.
కుక్కను చంపిన వారికి వత్తాసు పలుకుతూ.. రూ.2 లక్షలు ఇస్తారు సెటిల్‌మెంట్ చేసుకోవాలంటూ ఒత్తిడి చేశారని చెప్పారు. తానే రూ.2 లక్షలు ఇస్తానని నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటారా అని పోలీసులను లావణ్య ప్రశ్నించారు. ఈ సమావేశంలో హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ యానిమల్స్ చైర్మన్ దివ్యారెడ్డి పాల్గొన్నారు.
ఇద్దరు నిందితుల అరెస్టు..
టామీ హత్యకు సంబంధించి ఇద్దరు నిందితులను తిరుపతి ఈస్ట్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఈ వివరాలను ఈస్ట్ పోలీస్‌స్టేషన్ ఇన్‌చార్జ్ సీఐ రామకృష్ణ మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు.. శంకర్ కాలనీకి చెందిన లావణ్య ఈనెల 6న బయటకు వెళ్తూ తన కుమార్తె గ్రీష్మతో పాటు టామీని స్కావెంజర్స్ కాలనీలోని తన మామయ్య ఆనందయ్య ఇంట్లో వదిలి వెళ్లారు.
అదేరోజు సాయంత్రం 5.30 గంటల సమయంలో కుమార్తె గ్రీష్మ.. లావణ్యకు ఫోన్ చేసి తాతయ్య ఎదురింట్లో ఉన్న శివకుమార్, సాయికుమార్ టామీని చంపేశారని తెలిపింది. శివకుమార్ ఇంటి వైపు టామీ చూసి అరుస్తుండడంతో.. సాయికుమార్ రాయితో కొట్టాడని.. ఆ వెంటనే శివకుమార్ కత్తితో టామీని నరికి చంపేశాడు. లావణ్య ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment