2 విల్లాల్లో 1.48 కిలోల బంగారం అపహరణ
హైసెక్యూరిటీని దాటుకుని మరీ దుండగులు ప్రవేశించడంపై పోలీసుల విస్మయం
తిరుపతి రూరల్: తిరుపతి శివారు తిరుచానూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. మొత్తం నాలుగు విల్లాల్లోకి చొరబడిన దుండగులు రెండు విల్లాల్లోంచి దాదాపు 1.48 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లినట్టు సమాచారం. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘటన తిరుపతి నగరంతో పాటు శివారు ప్రాంతాల వారిని భయాందోళనకు గురిచేసింది. సీపీఆర్ విల్లాల సముదాయంలో 30కి పైగా విల్లాలున్నాయి. వాటి ప్రధాన ద్వారం వద్ద హై సెక్యూరిటీతో పాటు చుట్టూ సోలార్ ఫెన్షింగ్, అక్కడక్కడా హై రెజల్యూషన్ సీసీ కెమెరాలున్నా.. దొంగలు చాకచక్యంగా లోనికి చొరబడ్డారు.
ఆ రెండు విల్లాల్లో ఏమీ దొరకలేదు..
81వ నంబర్ విల్లా యజమాని మేఘనాథరెడ్డి పైఅంతస్తులో నిద్రిస్తుండగా.. కింది అంతస్తులో కేజీ బంగారు ఆభరణాలను దోచుకున్నారు. 82వ నంబర్ గల విల్లా యజమాని కేశవులనాయుడు కుమారుడు జగదీష్ ఇంటి నుంచి 48 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒకటిన్నర కేజీల వెండి వస్తువులను చోరీ చేశారు. ఇక 80, 83 నంబర్లు గల విల్లాల యజమానులు వాటిని కేవలం గెస్ట్ హౌస్‌లుగా మాత్రమే వినియోగించుకుంటున్నారు. వాటి తలుపులను కూడా బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులకు అక్కడ విలువైన వస్తువులేమీ దొరకలేదు. ఉదయాన్నే చోరీ విషయాన్ని గమనించిన యజమానులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, తిరుపతి అదనపు ఎస్పీ రవి మనోహరాచారి కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. భద్రతాపరంగా పటిష్టంగా ఉన్న సీపీఆర్ విల్లాలోకి దొంగలు ప్రవేశించడాన్ని పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment