
తిరుపతి: మండల కేంద్రమైన సైదాపురంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గురువారం సైదాపురం–తిప్పవరపాడు మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సైదాపురానికి చెందిన దొడ్డగా మునెయ్య, భార్య జ్యోతి అక్కడికక్కడే మృతిచెందారు. కుమార్తె వైష్ణవి రక్తగాయాలతో బయటపడింది. ఈ క్రమంలో శుక్రవారం సైదాపురంలో మృతదేహాలకు అంతిమ వీడ్కోలు పలికారు.
కంటతడి పెట్టించిన కుమార్తెల మాటలు
కళ్లెదుటే తల్లిదండ్రులు విగత జీవులుగా పడి ఉండడంతో ఆ పసి హృదయాలు తల్లడిల్లిపోయాయి. ‘అమ్మా..నాన్నా.. ఒక్కసారి మాట్లాడండి’ అంటూ వారిపై పడి గుండెలు బాదుకోవడం అక్కడి వారిని కలచివేసింది. గాయపడిన వైష్ణవి చివరగా తల్లిదండ్రుల అంతిమయాత్రలో టాటా చెప్పడం స్థానికులకు కన్నీళ్లు తెప్పించింది.
గోకుల బృందావనంలో పుట్టి..
మండల కేంద్రమైన సైదాపురం సమీపంలోనే ఉన్న గోకుల బృందావనం గ్రామంలో దొడ్డగ మునెయ్య జన్మించారు. ఆయనకు అన్నలు భాస్కర్, చంద్రయ్య ఉన్నారు. వారంతా గోకులబృందావనం గ్రామం వీడి సైదాపురానికి చేరుకుని అక్కడే స్థిరపడ్డారు. మునెయ్యకు పెళ్లి చేసి సైదాపురంలోనే ఇల్లు కటించి బాగోగులు చూసుకునే వారు. ఈ క్రమంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మునెయ్యతోపాటు భార్య జ్యోతి మరణించడంతో విషాదంలో మునిగిపోయారు. ముక్కుపచ్చలారని పసిబిడ్డలను వదిలివెళ్తున్నారా..! అంటూ కన్నీరుమున్నీరయ్యారు. మృతుని కుటుంబాన్ని వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ మన్నారపు రవికుమార్ పరామర్శించారు. మృతుని కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
‘అమ్మా..నాన్నా మమ్మల్ని వదిలి వెళ్లిపోయారా..!