అనంతపురం, తిరుపతి జిల్లాల్లో ఘోర ప్రమాదాలు
బుక్కరాయసముద్రం/చిల్లకూరు: రాష్ట్రంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. అనంతపురం జిల్లాలో జరిగిన ప్రమాదంలో నలుగురు మృతిచెందగా, తిరుపతి జిల్లాలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు విడిచారు. అనంతపురం నగరంలోని స్టాలిన్ నగర్‌కు చెందిన బలిజ పవన్(24) బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. నెల కిందటే ఉద్యోగం వచి్చంది. చాకలి పవన్(22), ముస్తాక్(23)లు వడ్రంగి పని చేస్తుంటారు. శ్రీనివాసులు(24) డ్రైవర్. వీరంతా స్నేహితులు. ముస్తాక్ పుట్టిన రోజు కావడంతో శనివారం రాత్రి నగరంలో పార్టీ చేసుకున్నారు.
తర్వాత మరో స్నేహితుడి నుంచి ఇన్నోవా కారు తీసుకుని ఎక్కడెక్కడో తిరిగి సుమారు రెండు గంటల ప్రాంతంలో నార్పలలో ఉంటున్న పవన్ నానమ్మను చూడడానికంటూ బయలుదేరారు. అతివేగంగా వెళుతూ బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట దాటగానే నార్పల వైపు నుంచి వేరుశనగ విత్తన బస్తాల లోడుతో అనంతపురం వస్తున్న లారీని ఢీకొట్టారు. లారీ కిందకి కారు దూసుకెళ్లి నుజ్జు నుజ్జయింది. చాకలి పవన్, శ్రీనివాసులు, ముస్తాక్, బలిజ పవన్ అక్కడికక్కడే మృతిచెందారు.
లారీ డ్రైవర్ తాతయ్యకు గాయాలయ్యాయి. అదేవిధంగా నెల్లూరు సమీపంలోని కాకుపల్లి, వనంతోపునకు చెందిన రెండు కుటుంబాల వారు అరుణాచలం వెళ్లి తిరిగి కారులో ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతి జిల్లా చిల్లకూరు సమీపంలో రోడ్డు పక్కన నిలిపి ఉన్న కంటైనర్‌ను కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్‌తో పాటు 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స అందించేలోగా వెన్నెల మేఘన (8), జగదీష్(50), బాబు(48) మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment