ఓటుతో మోసగాళ్లకు వేటు: సీఎం వైఎస్‌ జగన్‌ | CM YS Jagan Comments On Chandrababu In Election Campaign | Sakshi
Sakshi News home page

ఓటుతో మోసగాళ్లకు వేటు: సీఎం వైఎస్‌ జగన్‌

Published Mon, Apr 29 2024 3:55 AM | Last Updated on Mon, Apr 29 2024 3:55 AM

CM YS Jagan Comments On Chandrababu In Election Campaign

తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు ఎన్నికల సభల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

నా 58 నెలల పాలనలో ఏం చేశానో చెబుతా.. నీ 14 ఏళ్ల పాలనలో చేసిందేమిటో చెప్పగలవా బాబూ? 

నీలా బడాయిలు చెప్పకుండా నా ప్రోగ్రెస్‌ రిపోర్టు ప్రజలకే అందజేశా

నేను రూపాయిస్తే నువ్వు రెండు రూపాయిలిస్తానంటావా?

నువ్వేం చేశావో చెప్పుకోలేక నా పథకాల గురించి మాట్లాడతావ్‌ ఏమిటయ్యా? 

జన్మభూమి కమిటీలను మళ్లీ తెస్తానని చెప్పే ధైర్యముందా? 

జగన్‌ తెచ్చిన స్కీమ్‌లను రద్దు చేస్తానని చెప్పే ధైర్యం ఉందా?  

చంద్రబాబుది అబద్ధాలు, మోసాల ఫ్యాక్టరీ.. ఆయన్ను నమ్మటం అంటే.. పులినోట్లో తల దూర్చటమే 

డబ్బులు మీ ఖాతాల్లోకి పంపితే అది జగన్‌ పాలన  

బాబుకు ఓటేస్తే ఆయన స్నేహితులకే డబ్బులు ట్రాన్స్‌ఫర్‌

డబ్బులు మీ అకౌంట్లోకి, మీ చేతికే పంపితే అది జగన్‌ పాలన! అదే డబ్బులు తన అకౌంట్లోకి, తన జేబులోకి, తన పెత్తందారీ స్నేహితుల జేబుల్లోకి వేసుకుంటే అది బాబు పాలన! చంద్రబాబుకు ఓటు వేస్తే ప్యాకేజీ స్టార్‌కు, రామోజీరావుకు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు, టీవీ 5 నాయుడికి, వదినమ్మకి మనీ ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. బాబుది ఈనాడు, ఈటీవీ,  ఆంధ్రజ్యోతి, టీవీ 5లో మాత్రమే కనిపించే గ్రాఫిక్స్, మోసాల పాలన.     

రాష్ట్రాన్ని విడగొట్టిన వాళ్లు.. ఇంటింటి అభివృద్ధిని చెడగొట్టిన వాళ్లు.. అబద్ధాలే పునాదులుగా, మోసాలే అలవాటుగా, కుట్రలు, వెన్నుపోట్లు నైజంగా, గుంపులు గుంపులుగా జెండాలు జత కట్టి వస్తున్నారు. ఈ పేదల వ్యతిరేకులు, మోసగాళ్లకు ఓటుతో పోలింగ్‌ బూత్‌లో బుద్ధి చెప్పేందుకు మీరంతా సిద్ధమేనా?
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  

సాక్షి ప్రతినిధి, అనంతపురం/సాక్షి, తిరుపతి/సాక్షి ప్రతినిధి, నెల్లూరు
కుట్రలు, వెన్నుపోట్లతో కూటమి కట్టి, జెండాలు జతకట్టి వస్తున్న మోసగాళ్లకు ఓటుతో బుద్ధి చెప్పాలని ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ‘58 నెలల కాలంలో నేను ఏం చేశానో చెబుతా. నీ 14 ఏళ్ల పాలనలో ఏం మంచి చేశావో చెప్పగలవా చంద్రబాబూ? నీ పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క పథకమైనా ఉందా? జగన్‌ తెచ్చిన స్కీమ్‌లను రద్దు చేస్తానని చెప్పే ధైర్యం ఉందా? జన్మభూమి కమిటీలను మళ్లీ తెస్తానని చెప్పగలవా? నేను తెచ్చిన పథకాల గురించి మాట్లాడతావ్‌ ఏమిటయ్యా బాబూ? నేను రూపాయి ఇస్తే.. నువ్వు రెండు రూపాయలు ఇస్తానంటావ్‌ 
ఏంటయ్యా చంద్రబాబూ?’ అంటూ ధ్వజమెత్తారు. 

ఒక్కటంటే ఒక్క పథకం పేరు కూడా గుర్తుకురాని ఆ మనిషిని నమ్మగలమా? అని సూటిగా ప్రశ్నించారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో ఆదివారం ఉదయం అనంతపురం జిల్లా తాడిపత్రిలో నిర్వహించిన తొలి ఎన్నికల సభతో మలి విడత ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారు. మిట్ట మధ్యాహ్నం వేళ తిరుపతి జిల్లా వెంకటగిరిలో, సాయంత్రం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో పోటెత్తిన ఎన్నికల ప్రచార సభల్లో సీఎం జగన్‌ ప్రసంగించారు. ఆయా సభల్లో ఆయన ఏమన్నారంటే...

బాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపినట్లే!
మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి కాదు. ఇవి వచ్చే ఐదేళ్ల పాటు మన ఇంటింటి అభివృద్ధి, పేద కుటుంబాల భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు. జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ యథాతథంగా కొనసాగుతాయి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికి ముగింపు, మళ్లీ మోసపోవటమే. ఇది చంద్ర బాబు గురించి చరిత్ర చెప్పిన సత్యం. 

చంద్రబాబు సాధ్యం కాని హామీలతో మీ ముందుకు వస్తున్నాడు.  బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. బాబును నమ్మటం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే. వదల బొమ్మాళీ.. వదలా.. అంటూ ప్రతి పేదవాడి ఇంటికి వచ్చి తలుపు తట్టి రక్తం తాగేందుకు వచ్చే ఆ పసుపు పతిని ఆహ్వానించడమే.

మీ బిడ్డ 130 సార్లు బటన్‌ నొక్కాడు
నాకు వీరిలా జెండాల పొత్తులు లేవు. నాకు ఉన్న పొత్తు మంచి చేసిన ప్రజలతోనే. నా నమ్మకం ఆ దేవుడి దయపైనే. మేనిఫెస్టో హామీలను నూటికి 99 శాతం అమలు చేసిన తర్వాతనే మీ బిడ్డ మీ దగ్గరకు వచ్చి మీ దీవెనలు, ఆశీస్సులు కోరుతున్నాడు. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఏకంగా 130సార్లు మీ బిడ్డ బటన్‌ నొక్కాడు. రూ.2.70 లక్షల కోట్లు డీబీటీతో అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పారదర్శకంగా జమ చేశాడు. ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా ఇంటింటికీ అందాయి. 

సచివాలయాల్లో నా తమ్ముళ్లు, చెల్లెళ్లు
దశాబ్దాలుగా మన దగ్గర గవర్నమెంట్‌ ఉద్యోగాలు 4 లక్షలు మాత్రమే ఉంటే మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలో ఇచ్చింది ఏకంగా 2.31 లక్షల ఉద్యోగాలు. నా తమ్ముళ్లు, చెల్లెళ్లంతా ఈరోజు గ్రామ సచివాలయాల్లో కనిపిస్తున్నారు. మెరుగు­పడిన ఆస్పత్రులు,  బడుల్లో సేవలందిస్తున్నారు. ప్రతి సందర్భంలోనూ నేను ‘‘నా..’’ అని ఆప్యాయంగా పిలిచే సామాజికవర్గాలకు ఇందులో ఏకంగా 80 శాతం ఉద్యోగాలు దక్కాయి.

పౌర సేవలు.. విప్లవాత్మక వ్యవస్థలు 
ప్రజలకు అందించే సేవల డెలివరీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. ఎప్పుడూ జరగని విధంగా పౌర సేవలు, పథకాలను నేరుగా ఇంటికే డోర్‌ డెలివరీ చేశాం. నాడు – నేడుతో బాగుపడ్డ బడులు, ఇంగ్లీషు మీడియం చదువులు కనిపిస్తున్నాయి. మన గ్రామంలోనే విలేజ్‌ క్లినిక్‌లు కనిపిస్తున్నాయి. ఇంటింటినీ జల్లెడ పడుతూ ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రతి ఇంటికీ వస్తోంది. 

గ్రామాల్లోనే ఫ్యామిలీ డాక్టర్‌ కనిపిస్తున్నాడు. మన గ్రామంలోనే మహిళా పోలీసు కనిపిస్తోంది. రైతన్నచేయి పట్టుకుని నడిపించే రైతు భరోసా కేంద్రం కనిపిస్తోంది. నిర్మాణంలో ఉన్న డిజిటల్‌ లైబ్రరీలు కనిపిస్తున్నాయి. గ్రామానికే వచ్చిన ఫైబర్‌ గ్రిడ్‌ కనిపిస్తోంది. ఇలాంటి వ్యవస్థలన్నీ మీ బిడ్డ  58 నెలల కాలంలోనే తెచ్చి మరోసారి మీ ఆశీస్సులు కోరుతున్నాడు.

పేదల ఆత్మగౌరవం కాపాడుతూ..
పేదల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఇంటికే రూ.3 వేలు పింఛన్, రేషన్‌ అందజేస్తున్నాం. ఈరోజు ఇంటి వద్దకే క్యాస్ట్‌ సర్టిఫికెట్, బర్త్‌ సర్టిఫికెట్‌ వస్తోంది. ఏది కావాలన్నా గడప వద్దకే వస్తున్న పరిస్థితులు మీరే చూస్తున్నారు. ఈ విప్లవాత్మక మార్పులను ఎవరైనా ఊహించారా? గవర్నమెంట్‌ డబ్బులు లంచాలు, వివక్ష లేకుండా అందుతాయని గతంలో ఎవరైనా చెబితే నమ్మేవారా? మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని చేసి చూపించాం.

విద్యా విప్లవం..
పేదింటి పిల్లల చదువుకునే ప్రభుత్వ బడుల్లో చదువులు, ఆహారం అత్యుత్తమంగా ఉండేలా చర్యలు తీసుకున్నాం. పిల్లలు ధరించే యూనిఫాం మొదలు పుస్తకాల దాకా అన్నీ సమకూరుస్తున్నాం. క్లాస్‌ రూముల్లో డిజిటల్‌ బోధన, ఐఎఫ్‌పీ ప్యానెల్స్, ట్యాబ్‌లు, మారిన కరిక్యులమ్‌తో విద్యా విప్లవాన్ని తెచ్చాం. ఇదే పాలన మరో పదేళ్లు కొనసాగితే ఇప్పుడు ఒకటో తరగతిలో ఉన్న మీ పిల్లలు 2035 నాటికి టెన్త్‌ పరీక్ష ఐబీలో పూర్తి చేసి ఐబీ సర్టిఫికెట్‌తో అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఎప్పుడూ చూడని విధంగా హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్, ఎంఐటీ లాంటి ప్రఖ్యాత వర్సిటీలు అందించే ఆన్‌లైన్‌ కోర్సులు మన డిగ్రీలతో అనుసంధానమవుతున్నాయి. 

మహిళా సాధికారతకు దన్నుగా
‘అమ్మ ఒడి’ అనే కార్యక్రమం గతంలో ఎప్పుడైనా విన్నారా? ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, పూర్తి ఫీజులు చెల్లిస్తూ విద్యాదీవెన, ఖర్చుల కోసం వసతి దీవెన, పేదలకు 31 లక్షల ఇళ్ల స్థలాలు, 22 లక్షల గృహ నిర్మాణాలు లాంటివి గతంలో ఎప్పుడైనా జరిగాయా? దిశ యాప్, అక్కచెల్లెమ్మలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టం చేయడం లాంటివి గతంలో విన్నారా?

రైతన్నకు అండగా..
రైతన్నకు పెట్టుబడి సాయంగా పంట వేసే సమయంలో రైతు భరోసా అందించడం గతంలో ఎప్పుడైనా చూశారా?. గ్రామాల్లోనే ఆర్బీకేలు, సున్నా వడ్డీకే పంట రుణాలు, 9 గంటలు పగటిపూటే ఉచిత విద్యుత్, ఇన్‌ పుట్‌ సబ్సిడీ, ఉచిత పంటల బీమా, దళారీలు లేకుండా పంటల కొనుగోలు, ఎంఎస్పీ లేని పంటలు సైతం కొనుగోలు లాంటివన్నీ చేసి ఈరోజు మీ బిడ్డ ప్రతి రైతన్ననూ మరోసారి ఆశీర్వదించాలని కోరుతున్నాడు.

100 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే
మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయానికి మీ బిడ్డ అర్థం చెప్పాడు. చేతల్లో  చూపించాడు. నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు డీబీటీ, నాన్‌ డీబీటీలో ఏకంగా 75 శాతం పైచిలుకు లబ్ధి చేకూరింది. నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టం చేశాం. 68 శాతం మంత్రి పదవులు ఆ వర్గాలకే ఇవ్వడం ఓ చరిత్ర.  

175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలు కలిపి మొత్తం 200 స్థానాలకు గానూ ఏకంగా 50 శాతం అంటే 100 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే   కేటాయించిన చరిత్ర గతంలో ఏ రాజకీయ పార్టీకైనా ఉందా? వలంటీర్లు మళ్లీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లల చదువులు, బడులు బాగుండాలన్నా, వ్యవసాయం, ఆస్పత్రులు మెరుగ్గా ఉండాలన్నా ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తుపై రెండు బటన్లు నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ, 25కు 25 ఎంపీ స్థానాల్లో ఒక్కటి కూడా తగ్గకుండా గెలిపించాలి. మంచి చేసిన ఫ్యాను మీ ఇంట్లో ఉండాలి. చెడు చేసిన సైకిల్‌ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్‌ సింక్‌లో ఉండాలి.

జన్మభూమి కమిటీలు మళ్లీ తెస్తానని చెప్పగలవా?
చంద్రబాబు జన్మభూమి కమిటీలను తీసుకొస్తే మీ జగన్‌ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థలను తెచ్చాడు. నువ్వు పెట్టిన జన్మభూమి కమిటీల వ్యవస్థ మీద నీకు నమ్మకం, విశ్వాసం ఉంటే మళ్లీ వాటిని తీసుకొస్తానని చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబు? ఆ విషయం చెప్పే ధైర్యం లేక నేను తెచ్చిన వలంటీర్లు, సచివాలయాల వ్యవస్థలను కొనసాగిస్తానంటావేమిటి? నువ్వు వస్తే వలంటీర్లకు జీతం పెంచుతానంటావేమిటి? 

జగన్‌ స్కీమ్‌లను రద్దు చేస్తాననే ధైర్యముందా?
అయ్యా చంద్రబాబూ.. నువ్వు 14 ఏళ్లు పరిపాలించావ్‌! నేను 58 నెలలే పరిపాలన చేశా. జగన్‌ అమ్మఒడి తీసుకొస్తే నువ్వు అంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నావు. జగన్‌ చేయూత ప్రవేశపెడితే నువ్వు ఇంకా ఎక్కువమందికి ఇస్తానంటున్నావు. జగన్‌ రూపాయి ఇస్తే నువ్వు రెండు రూపాయలు  ఇస్తానంటావ్‌! జగన్‌ తెచ్చిన స్కీమ్‌లను రద్దు చేస్తానని చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబూ? జగన్‌ తెచ్చిన వలంటీర్, సచివాలయాల వ్యవస్థలను రద్దు చేస్తానని చెప్పే ధైర్యం ఉందా? జగన్‌ తెచ్చిన రైతుభరోసా కేంద్రాలను తీసేస్తానని చెప్పే ధైర్యం ఉందా? రైతు భరోసా సొమ్ము రద్దు చేసే ధైర్యం బాబుకు ఉందా?

మోసాల బాబు విఫల హామీలు
2014లో ఇదే చంద్రబాబు తాను సంతకం చేసి ప్రధాని మోదీ, దత్తపుత్రుడి ఫొటోలతో ముఖ్యమైన హామీలంటూ ప్రతి ఇంటికీ పంపిన పాంప్లెట్‌ గుర్తుందా? ఎల్లో మీడియాలో ప్రకటనలతో ఊదరగొట్టారు. మంగళ సూత్రం తెంపుతున్న చేతిని అడ్డుకుంటూ మరో చెయ్యి వస్తుంది. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం మీ ఇంటికి రావాలంటే బాబు రావాలన్న అడ్వర్‌టైజ్‌మెంట్లు గుర్తున్నాయా? 
⇒ రైతులకు రూ.87,612 కోట్ల రుణాలను మాఫీ చేశాడా? 
⇒ రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా? 
⇒ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేస్తామన్నాడు. ఎవరికైనా ఒక్క రూపాయి డిపాజిట్‌ చేశాడా? 
⇒ ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. ఐదేళ్లలో రూ.1.20 లక్షల నిరుద్యోగ భృతి ఎవరికైనా ఇచ్చాడా?
⇒ అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు అన్నాడు. కనీసం 
ఒక్కరికైనా ఒక్క సెంటు స్థలం ఇచ్చాడా? 
⇒ రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ ప్లాన్, చేనేత, పవర్‌ లూమ్స్‌ రుణాలన్నీ మాఫీ అన్నాడు. మరి అయ్యాయా? 
⇒ ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేశాడా? 
⇒ సింగపూర్‌కు మించి అభివృద్ధి, ప్రతి నగరంలో హైటెక్‌ సిటీ నిర్మిస్తామన్నాడు. తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరులో ఎక్కడైనా కనిపిస్తోందా? 
⇒ పోనీ ప్రత్యేక హోదా తెచ్చాడా? 
⇒ అవే మూడు పార్టీలు మరోసారి కూటమిగా ఏర్పడి సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్‌ కార్లు అంటూ మరోసారి మోసాలకు తయారయ్యాయి.

మన అభ్యర్థులను దీవించండి
అనంతపురం ఎంపీ అభ్యర్థి శంకరణారాయణ, తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దారెడ్డి, తిరుపతి ఎంపీ అభ్యర్థి ఎం. గురుమూర్తి, వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, నెల్లూరు ఎంపీ అభ్యర్ధి వై.విజయసాయిరెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్‌ను మీరంతా ఆశీర్వదించి గొప్ప మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నా.

మనం చేసిన మంచిలో మచ్చుకు కొన్ని..
⇒ ఇంటి వద్దకే రూ.3 వేల పెన్షన్‌ అనగానే గుర్తుకొచ్చేది మీ జగన్‌. పూర్తి ఫీజులు చెల్లిస్తూ విద్యాదీవెన, ఖర్చులకు ఇబ్బంది పడకుండా వసతి దీవెన అంటే గుర్తుకొచ్చేది మీ జగన్‌. అమ్మఒడి అంటే మీ జగన్‌. అక్క చెల్లెమ్మలకు తోడుగా చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఆసరా, సున్నా వడ్డీ, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల గృహ నిర్మాణాలు, మహిళా సాధికారత, రైతు భరోసా, ఆర్బీకేలు, విస్తరించిన ఆరోగ్యశ్రీ, జీవనభృతికి ఇబ్బంది లేకుండా విశ్రాంతి సమయంలో ఆరోగ్య ఆసరా, పేదవాడికి మందులు, టెస్టులు అందిస్తూ ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్, విలేజ్‌ క్లినిక్స్‌ అంటే గుర్తుకొచ్చేది మీ జగన్‌.

⇒ స్వయం ఉపాధికి ఊతమిస్తూ మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం, వాహనమిత్ర, చేదోడు, తోడు, లా నేస్తం అంటే గుర్తుకొచ్చేది మీ జగన్‌. ప్రతి గ్రామంలో సచివాలయం, ప్రతి 60–70 ఇళ్లకు ఒక వలంటీర్, ఇంటికే పౌరసేవలు, పథకాలు చూస్తే గుర్తుకొచ్చేది మీ జగన్‌. నాడు–నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్‌ మీడియం బడులు, గవర్నమెంట్‌ హాస్పిటళ్లు చూస్తే గుర్తుకువచ్చేది మీ జగన్‌. గ్రామంలోనే మహిళా పోలీస్, ప్రతి అక్కచెల్లెమ్మ ఫోన్‌లో దిశ యాప్‌ చూస్తే గుర్తుకొచ్చేది మీ జగన్‌.

తాడిపత్రిలో అగ్రికల్చర్‌ కాలేజీ
ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దారెడ్డి అన్న, ఎంపీ అభ్యర్థి శంకరన్నపై మీ చల్లని దీవెనలు ఉంచాలని సవినయంగా కోరుతున్నా. కాసేపటి క్రితం పెద్దారెడ్డి అన్న తాడిపత్రి నియోజకవర్గంలో అగ్రికల్చర్‌ కాలేజీ గురించి  ప్రస్తావించాడు. తాడిపత్రిలో అగ్రికల్చర్‌ కాలేజీని మళ్లీ మన ప్రభుత్వం రాగానే కచ్చితంగా ఏర్పాటు చేస్తామని మాట ఇస్తున్నా. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి మరికొన్ని కూడా ప్రస్తావించారు. అవన్నీ పెద్దారెడ్డి అన్నతో దగ్గరుండి మీకు మంచి చేస్తామని హామీ ఇస్తున్నా.

ఇవన్నీ కొనసాగాలంటే మన పార్టీకి ఓటేయండి...
నేను చంద్రబాబు మాదిరిగా సెల్‌ఫోన్‌ కనిపెట్టానంటూ బడాయిలు చెప్పడం లేదు. ఈ 58 నెలల పాలన ప్రోగ్రెస్‌ రిపోర్టు మీ ముందు ఉంచి మీరే మార్కులు వేయాలని మీ బిడ్డ అడుగుతున్నాడు. మీ జగన్‌కు మీరు అధికారం ఇవ్వడం వల్లే ప్రతి గ్రామం, ప్రతి పట్టణంలో కనీసం ఆరేడు విప్లవాత్మక కొత్త వ్యవస్థలు ఏర్పాటు చేయగలిగాడు. ఈ వ్యవస్థలన్నీ మీవద్ద ఉన్నాయో లేదో మీరే ఆలోచన చేయండి. అవన్నీ ఇలాగే  కొనసాగాలంటే, మన పాలన బాగుందనుకుంటే మన పార్టీకి ఓటు వేయండని మీ బిడ్డ అడుగుతున్నాడు. 

అమ్మఒడి లాంటి పథకాల ద్వారా పిల్లల్ని ఇలాగే చక్కగా చదివించాలనుకుంటే మళ్లీ మీ అన్నకు అధికారం ఇవ్వండి. పిల్లలు ఇలాగే ఇంగ్లీషు మీడియంలో చదువుకుంటూ ఈ మార్పులు కొనసాగాలంటే మీ బిడ్డకే, ఫ్యాన్‌కు ఓటు వేయాలి. నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు పథకాలు సజావుగా కొనసాగాలంటే ఫ్యాన్‌ గుర్తుపై రెండు బటన్లు నొక్కి మీ బిడ్డకు తోడుగా ఉండాలి. చంద్రబాబు మార్కు దోపిడీ, జన్మభూమి కమిటీల రాజ్యం మళ్లీ రాకూడదంటే ఫ్యాన్‌ గుర్తుపై రెండు ఓట్లు వేసి మరోసారి ఆశీర్వదించాలి.

మీ బిడ్డ ఎలా చేయగలిగాడు? 
నాడూ నేడూ ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్‌. అప్పులు కూడా అప్పటి కంటే ఇప్పుడే గ్రోత్‌ రేటు తక్కువ. మరి మీ బిడ్డ ఎలా బటన్లు నొక్కగలిగాడు? కనీ వినీ ఎరుగని స్కీములు ఎలా ఇవ్వగలిగాడు? అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు ఎలా పంపించగలిగాడు? అనేది ఆలోచన చేయమని కోరుతున్నా. ఈ డబ్బంతా చంద్రబాబు పాలనలో ఎవరి జేబుల్లోకి వెళ్లిందో ఆలోచన చేయండి. మన రాష్టానికి వచ్చిన పొత్తుల నాయకులను చూస్తుంటే సుమతీ శతకం ‘‘తెప్పలుగ చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు కదరా సుమతీ’’ గుర్తుకొస్తోంది. 

ఇప్పుడు రాష్ట్రంలో తిరుగుతున్న చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ, ఈనాడు రామోజీ, ఏబీఎన్‌ రాధాకృష్ణ, టీవీ 5 నాయుడు వీళ్లలో ఎవరైనా ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడైనా నివాసం ఉంటున్నారా? ఎన్నికలు వచ్చాయి కాబట్టే వీరంతా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. ఓడిన వెంటనే వీళ్లంతా మళ్లీ హైదరాబాద్‌కు వెళ్లిపోతారు. ఇదీ వాళ్లకు మన రాష్ట్రంతో ఉన్న అనుబంధం. 

ఈ నాన్‌ లోకల్‌ కిట్టీ  పార్టీలకు, వాటి సభ్యులకు, నయా ఈస్ట్‌ ఇండియా కంపెనీ సభ్యులకు మన రాష్ట్రం, మన ప్రజలంటే కేవలం దోచుకునేందుకు.. దోచుకునేది పంచుకునే వనరుల లాంటివి. వీరిలో ఏ ఒక్కరికీ మన రాష్ట్ర ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేదు. మేం చేసిన మంచి చూసి మాకు ఓట్లేయాలని అడిగే ధైర్యం లేదు. చంద్రబాబుది అబద్ధాలు, మోసాల ఫ్యాక్టరీ అయితే, ఇంటింటికి చేసిన మంచిని సగర్వంగా చెబుతున్న పార్టీ మనది. ఐదేళ్ల పాలనలో ప్రతి ఇంటికీ చేసిన మంచి ఇదీ అని మీ బిడ్డ సగర్వంగా చెబుతున్నాడు. మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే తోడుగా, సైనికులుగా నిలవాలని కోరుతున్నా. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement