పలుచోట్ల నిబంధనలు పట్టించుకోని టీడీపీ నేతలు
యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘన
తిరుపతి జిల్లాలో కానిస్టేబుల్, చిత్తూరులో ఏఎన్‌ఎం సస్పెన్షన్
ప్రొద్దుటూరు/ చిత్తూరు అర్బన్/ కొమ్మాది(విశాఖ)/ పాలకొల్లు (సెంట్రల్)/భాకరాపేట(తిరుపతి జిల్లా)/హిందూపురం అర్బన్: ఈసీ ఆదేశాలను టీడీపీ నేతలు పట్టించుకోవడం లేదు. యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. కోడ్‌కు విరుద్ధంగా అనుమతులు లేకుండానే సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. దేవాలయాలను సైతం ప్రచారానికి వినియోగిస్తున్నారు. మరికొన్ని చోట్ల ఓటర్లకు చీరలు, ఇతర సామగ్రి పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు.
ప్రొద్దుటూరులో..
వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘించి స్థానిక టీడీపీ నేతలు సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొత్తపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని టీచర్స్ కాలనీలో మంగళవారం సాయంత్రం టీచర్స్ కాలనీలో సమావేశానికి టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డి హాజరై ప్రసంగించారు. బుధవారం ఉదయం గోపవరం గ్రామంలో 22వ వార్డు కౌన్సిలర్ మహ్మద్‌గౌస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి వరదరాజులరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్యతోపాటు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
ఈ సమావేశంలో వరదరాజులురెడ్డి ప్రసంగించారు. విషయం తెలుసుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి హైమావతి సంఘటన స్థలానికి వెళ్లి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని చెప్పినా పట్టించుకోలేదు. దీనిపై ఎన్నికల కోడ్‌కు సంబంధం లేదంటూ అధికారితో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు.
ఆమె ఫిర్యాదుతో వన్‌టౌన్ పోలీసులు వరదరాజులరెడ్డితోపాటు మహ్మద్ గౌస్‌పై కేసు నమోదు చేశారు. అయినప్పటికీ వరదరాజులురెడ్డి బుధవారం సాయంత్రం గోపవరం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన సమావేశానికి సైతం హాజరవడం గమనార్హం. రెండు రోజుల్లో నాలుగు సమావేశాలు ఏర్పాటు చేయగా ఇప్పటి వరకు వరదపై ఒక్క కేసు మాత్రమే నమోదైంది.
వైద్యం పేరుతో వల
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన నాయకులు వైద్యం పేరుతో ఓటర్లకు వల వేస్తున్నారు. విశాఖ నగరం 8వ వార్డు గొల్లల ఎండాడలో బసవతారకం, గీతం ఆస్పత్రులు సంయుక్తంగా బుధవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని టీడీపీ, జనసేన నాయకులు ప్రారంభించారు. ఇది వైద్య శిబిరంలా కాకుండా పార్టీ ప్రచార కార్యక్రమంలా సాగింది. ఇటీవల 39వ వార్డు లక్ష్మీటాకీస్ ప్రాంతంలో బసవతారకం ఆస్పత్రి, గీతం ఆస్పత్రి సంయుక్తంగా వైద్య శిబిరాన్ని నిర్వహించాయి. టీడీపీ విశాఖ పార్లమెంట్ ఇన్‌చార్జి భరత్, జనసేన నాయకుడు వంశీకృష్ణ శ్రీనివాస్ హాజరై.. ఓటర్లను ప్రభావితంచేసేలా కార్యక్రమం చేపట్టారు.
పార్టీ గుర్తుతో పూజలు
ఎన్నికల నియమావళి ప్రకారం ఆలయాల్లో రాజకీయ ప్రచారాలు చేయకూడదు. చిత్తూరు టీడీపీ అభ్యర్థి గురజాల జగన్‌మోహన్ నాయుడు సైకిల్ గుర్తును చొక్కాకు పెట్టుకుని ప్రభుత్వ ఆసుపత్రి పక్కనున్న ఈశ్వరుని ఆలయంలో పూజలు చేశారు. అదేరీతిలో బుధవారం రాత్రి చిత్తూరు కట్టమంచి వద్ద ఉన్న శ్రీ సాయిబాబా ఆలయంలోనూ టీడీపీ కండువా ధరించి పూజలు నిర్వహించారు.
తొలగించని టీడీపీ పోస్టర్లు
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో ఇంకా తెలుగుదేశం పార్టీకి చెందిన వాల్ పోస్టర్లు, ట్రీ గార్డులపై పేర్లు తొలగించలేదు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా టీడీపీ వాల్‌పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. అధికార పక్షానికి చెందిన పోస్టర్లు, బ్యానర్లు తొలగించిన అధికారులు టీడీపీకి చెందిన వాల్‌పోస్టర్ల జోలికి వెళ్లకపోవడం విశేషం.
టీడీపీ ప్రచారంలో కానిస్టేబుల్, ఏఎన్‌ఎం
టీడీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దిశ కానిస్టేబుల్ సాకిరి రాజశేఖర్‌పై భాకరాపేట పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. మంగళవారం అన్నమయ్య జిల్లా రాయచోటికి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వెళుతుండగా తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటలో టీడీపీ శ్రేణులు మార్గమధ్యలో స్వాగతం పలికారు.
దిశ కానిస్టేబుల్ టీడీపీ నాయకులతో కలసి పూలమాలలు వేయడం, భాకరాపేటలో పార్టీ కరపత్రాలు పంచుతూ టీడీపీకి ఓటు వేయమని అభ్యర్థించడం, వాటర్ బాటిళ్లపై సైతం టీడీపీ నాయకుల ఫొటోలు వేయించుకోవడం చర్చనీయాంశమైంది. బుధవారం రాత్రి ఆ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పడాల్ ఉత్తర్వులిచ్చారు. అలాగే టీడీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చిత్తూరు జిల్లా చౌడేపల్లి సచివాలయ గ్రేడ్ 3 ఏఎన్‌ఎం లతను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు.
హిందూపురంలో ప్రలోభాలు
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో టీడీపీ ప్రలోభాలకు తెరలేపింది. యథేచ్ఛగా చీరల పంపిణీ చేపడుతోంది. బుధవారం రాత్రి హిందూపురం పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో టీడీపీ వర్గీయులు ఓటర్ల జాబితా చేతబట్టుకుని ఇంటింటికీ చీరలు పంపిణీ చేస్తుండగా అధికారులు కొన్ని చీరలు, ఓటర్ల జాబితాను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment