దౌర్జన్యం, రౌడీయిజంతో గెలుపు ఓ గెలుపేనా..?
డిప్యూటీ మేయర్ పదవి కోసం ఎమ్మెల్సీని కిడ్నాప్ చేసిన చరిత్ర కూటమిదే
వారం రోజులుగా తిరుపతి నగరాన్ని భయభ్రాంతులకు గురిచేశారు
వైఎస్సార్‌సీపీదే నైతిక విజయం
కూటమి అరాచకాలపై భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం
తిరుపతి మంగళం: ‘మంగళ మేళాలతో ప్రశాంతంగా నిద్రలేవాల్సిన ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో గత వారం రోజులుగా జరుగుతున్న విధ్వంసకాండను చూసి క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైనది టీడీపీ నేతృత్వంలోని కూటమి అని ప్రజలకు అర్థమైంది. ఎన్నికల్లో రౌడీయిజం, దౌర్జన్యాలతో గెలవడం కూడా ఒక గెలుపేనా..? డిప్యూటీ మేయర్ పదవి కోసం ఎమ్మెల్సీని కిడ్నాప్ చేయడం దేశంలోనే తొలిసారి తిరుపతిలో జరిగింది.’ అని వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అ«ధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. తిరుపతి పద్మావతిపురంలోని తన నివాసంలో భూమన మంగళవారం మీడియాతో మాట్లాడారు.
డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా సార్వత్రిక ఎన్నికలను తలదన్నే విధంగా కూటమి కుట్రలకు పాల్పడిందన్నారు. ‘ఈ ఎన్నిక ప్రక్రియలో మేము ఓడినా.. పోరాడే శక్తినిచ్చింది. వాస్తవానికి వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లదే నైతిక విజయం. కూటమికి బలం లేకపోయినా కేవలం ఒకే ఒక్క కార్పొరేటర్‌ను పెట్టుకుని దురాలోచనతో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను అత్యంత దారుణంగా బెదిరించి, భయపెట్టి లోబరుచుకున్నారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం శాసనమండలి సభ్యుడు డాక్టర్ సిపాయి సుబ్రమణ్యంను కిడ్నాప్ చేసి బెదిరించి ఓటింగ్‌కు రాకుండా చేసిన ఘనత చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌కే దక్కుతుంది.
తిరుపతిలో వారం రోజులుగా జరుగుతున్న విధ్వంసకాండతో పిల్లలు, పెద్దలు భయభ్రాంతులకు గురయ్యారు. శ్రీవారి పాదాల చెంత ఇంత అరాచకం జరగడం గతంలో ఎన్నడూ చూడలేదు. ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్లను పశువులుగా భావించిన కూటమి నేతలను సమాజం క్షమించదు. వారికి కాలమే సమాధానం చెబుతుంది.’ అని భూమన ఆగ్రహం వ్యక్తంచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్‌సీపీకి చెందిన మేయర్ డాక్టర్ శిరీషను తమవైపు తిప్పుకొనేందుకు ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేశారని భూమన చెప్పారు.
కానీ, కూటమి నేతల బెదిరింపులకు బెదరకుండా వీరోచితంగా పోరాటం చేసిన మేయర్ అభినందనీయులని పేర్కొన్నారు. తమ పార్టీ మహిళా కార్పొరేటర్లు సైతం డిప్యూటీ మేయర్ ఎన్నికలో చూపిన తెగువ చాలా గొప్పదని ఆయన ప్రశంసించారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి కార్పొరేటర్లకు అండగా నిలిచి ధైర్యం చెప్పిన తీరు హర్షణీయమని అన్నారు. ఎంపీ గురుమూర్తి, మేయర్ శిరీష, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment