సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన
ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్
ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు...పలువురి అరెస్ట్
అనంతపురం అర్బన్/తిరుపతి అర్బన్/పార్వతీపురం టౌన్/సాక్షి, అమరావతి: విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున బుధవారం ఉద్యమించారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టరేట్‌ల మందు ర్యాలీ చేపట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని, ఇంటర్ విద్యార్థులకూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, వర్సిటీల్లో అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని..ఇలా సమస్యలను ప్రస్తావిస్తూ...వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.
విద్యార్థులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. పలువురిని అరెస్ట్ చేశారు. అనంతపురంలోని కేఎస్‌ఆర్ కళాశాల నుంచి విద్యార్థులు ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అక్కడ బైఠాయించి ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అ«ధ్యక్షుడు ప్రసన్న ఇతర నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారికి నోటీసులిచ్చి పంపించారు.
విద్యార్థులు మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వని కారణంగా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని, ఫీజుల కోసం విద్యార్థులను కళాశాలల యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నాయన్నారు. ఇంటర్ విద్యార్థులకూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, తిరుపతిలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. డిగ్రీలో మేజర్, మైనర్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఉన్నత విద్యను దూరం చేసే జీవో 77ను రద్దు చేయా లని డిమాండ్ చేశారు. తల్లికి వందనం కింద రూ.15,000ను ఈ ఏడాది నుంచే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అనంతరం కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్‌కు వినతిపత్రాన్ని అందించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. తక్షణమే పెండింగ్‌లో ఉన్న విద్యా, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరారు. ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్‌ఎంలను నియమించాలని కోరుతూ ఆర్టీసీ కాంపెక్స్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ను ముట్టడించారు. సమస్యల పరిష్కారంపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కె. ప్రసన్నకుమార్, కార్యదర్శి ఎ.అశోక్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment