
తిరుపతి మెటర్నిటీ ఆస్పత్రిలో మదర్ మిల్క్ బ్యాంక్
నవజాత శిశువులకు వరంలా విశిష్ట సేవలు
పాల వితరణకు స్వచ్ఛందంగా వస్తున్న తల్లులు
సృష్టిలో అమ్మ స్థానం అత్యున్నతం. అమ్మ గొప్పతనం వర్ణనాతీతం.. అమ్మ త్యాగం అనన్యసామాన్యం.. పురిటి నొప్పులను సైతం పంటి బిగువున భరిస్తూ బిడ్డకు జన్మనిస్తుంది. కంటికి రెప్పలా కాపాడుకునేందుకు ప్రాణం పెట్టేస్తుంది. అందుకే అమ్మను మించిన దైవం ఉండదు అంటారు. అయితే కొంతమంది తల్లులు అనివార్యకారణాలతో శిశువుకు ముర్రెపాలు అందించలేక తల్లడిల్లిపోతున్నారు.
అలాంటి సమయంలో బిడ్డ ఆకలి తీర్చడమే కాకుండా రోగనిరోధకశక్తిని పెంచే తల్లిపాలను అందించేందుకు కొందరు అమ్మలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. అమ్మతనానికి మరింత వన్నె తీసుకువస్తున్నారు. ఈ ప్రక్రియకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో హ్యూమన్ మిల్క్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నారు.
తిరుపతి తుడా : తల్లి పాలు అవసరం ఉన్న నవజాత శిశువులకు అవసరమైన పాలను మదర్ మిల్క్ బ్యాంకు అందిస్తుంది. అమ్మపాలు శిశువు ఎదుగుదలకు, సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో కీలకం, తల్లి పాల ప్రాధాన్యత తెలియకపోవడంతో కొందరు పిల్లలకు పాలిస్తే తమ శరీర ఆకృతి పాడైపోతుందని ఆవు, గేదె పాలను, మిల్క్ పౌడర్‌ను బాటిల్స్‌తో పట్టిస్తుంటారు. మరికొందరు బాలింతల విషయంలో శిశువుకు తగినంత పాలు లేకపోవడం, తల్లి అనారోగ్యం కారణంగా పాల వృద్ధి క్షీణిస్తుంది. ఇటువంటి వారికోసం మదర్ మిల్క్ కేంద్రం ఓ వరంగా పనిచేస్తోంది.
247లీటర్ల సేకరణ
తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలోని తల్లి పాల కేంద్రంలో ఏడాదిగా సుమారు 247లీటర్ల పాలను సేకరించి సుమారు 3,475మంది శిశువులకు అందించారు. ప్రతి నెల సుమారు 23 నుంచి 25 లీటర్ల పాలను డోనర్స్ నుంచి సేకరిస్తున్నారు. పాలు డొనేట్ చేసిన తల్లులకు సుమారు 6రకాల డ్రైఫ్రూట్స్ అందించి ప్రోత్సహిస్తున్నారు. మదర్ మిల్క్ కావలసిన వారు, డోనర్స్ 8919469744 నంబర్‌లో సంప్రదించవచ్చు.
ఎలాంటి శిశువులకు అందిస్తారంటే...
డెలివరీ అయిన వెంటనే తల్లి చనిపోయిన శిశువులకు, 2కేజీల కంటే బరువు తక్కువగా పుట్టిన పిల్లలకు, తల్లి ఆరోగ్యంగా ఉండి చనుపాల ద్వారం (నిప్పిల్స్) మూసుకుపోయిన పాలు రాని పరిస్థితి ఏర్పడిన శిశువులకు, తల్లిపాలు పడని బిడ్డలకు, దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్న బాలింతల పిల్లలకు పాలు అందిస్తున్నారు. ఒక్కో ఫీడింగ్‌కు 30ఎమ్‌ఎల్ చొప్పున రోజుకు 12సార్లు పాలు ఇస్తారు. ఇలా ఒకటి నుంచి 6నెలల వరకు శిశువుకు పాలు అందిస్తారు.
సేకరణ ఇలా...
స్వచ్ఛందంగా వచ్చే డోనర్స్ నుంచి తల్లి వయసు, డెలివరీ, ఆధార్‌కార్డుతో పూర్తి వివరాలను దరఖాస్తు రూపంలో నమోదు చేసుకుంటారు. అనంతరం తల్లి ఆరోగ్య సమాచారం సేకరించి అన్ని రకాల రక్త పరీక్షలు నిర్వహిస్తారు. తల్లి శరీరంపై టాటూస్ (పచ్చ»ొట్టులు) ఉన్నా, బ్రెస్ట్ సమీపంలో మచ్చలు, ఇన్‌ఫెక్షన్స్ ఉన్నా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న బాలింతల నుంచి పాలు సేకరించరు.

సంపూర్ణ ఆరోగ్యవంతులైన తల్లుల నుంచి మాత్రమే పాల సేకరణ చేస్తున్నారు. ప్రధానంగా హెచ్‌ఐవీ, హెచ్‌సీవీ, హెచ్‌బీఎస్‌ఏజీ, వీడీఆర్‌ఎల్ పరీక్షలు ప్రతి తల్లికీ తప్పని సరిగా చేసి నెగటివ్ రిపోర్టు ఉంటేనే పాల డొనేషన్‌కు అనుమతిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలింతలు తమ బిడ్డకు సరిపోగా మిగులు పాలను మాత్రమే డొనేట్ చేయాల్సి ఉంటుంది.
స్టోరేజ్ ఇలా...
ఆరోగ్యవంతులైన తల్లుల నుంచి సుమారు 200ఎమ్‌ఎల్‌కు పైబడి ఒక సిట్టింగ్‌లో పాలు సేకరిస్తారు. ఇందులో 10ఎమ్‌ఎల్ శాంపిల్ పాలను పరీక్షల నిమిత్తం మైక్రోబయోలజీ విభాగానికి పంపుతారు. మిగిలిన పాలను మిక్స్ చేసి రిఫ్రిజిరేటర్‌లో భద్రపరుస్తారు.

అనంతరం యూవీ రేస్‌లో ఉంచి పూలింగ్ ప్రక్రియ కొనసాగిస్తారు. సుమారు 3గంటల పాటు శుద్ధి చేసి 62.4 టెంపరేచర్‌లో వేడి చేస్తారు. అనంతరం సుమారు అరగంట పాటు కూలింగ్ ప్రాసెసర్‌లో ఉంచుతారు. సుమారు ఆరు నెలలపాటు పాలు సురక్షితంగా ఉండేందుకు మిల్క్ బ్యాంకు అధికారులు. సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
శిశు మరణాల నివారణకే..
శిశు మరణాలను తగ్గించాలనే సంకల్పంతోనే హ్యూమన్ మిల్క్ బ్యాంకుకు శ్రీకారం చుట్టాం. సుమారు రూ.35లక్షల వ్యయంతో ఏర్పాటు చేశాం. చాలా మంచి స్పందన వస్తోంది. ఇప్పటి వరకు 3,475 మంది పసికందుల గొంతు తడిపాం. వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేశాం . – టి.దామోదరం,మిల్క్ బ్యాంక్ ప్రాజెక్ట్ చైర్మన్, తిరుపతి
తల్లిపాలే తొలి వ్యాక్సిన్
నవజాత శిశువుకు తొలి వ్యాక్సిన్ తల్లి పాలే. గైనకాలజిస్టా్గ తల్లిపాల శ్రేష్టతపై స్పష్టమైన అవగాహన ఉంది. నేను ఇప్పటివరకు 34 లీటర్లకు పైగా పాలను మిల్క్ బ్యాంకుకు అందించా. బాలింతలు తమ మిగులు పాలను ఇచ్చేందుకు ముందుకు రావాలి. పసికందుల ప్రాణరక్షణకు సహకారం అందించాలి. – డాక్టర్ సోనా తేజస్వి, గైనకాలజిస్ట్