- రాజులేలిన గడ్డపై జరిగే జాతరకు రాష్ట్ర ప్రభుత్వం విశిష్ట స్థానం కల్పించింది. భక్తులు, స్థానికుల మనోభావాలకు అధిక ప్రాధాన్యమిచ్చింది. వెంకటగిరి రాజాల ఆకాంక్షను నెరవేర్చింది. పోలేరమ్మ తల్లి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు మెండుగా ఉండాలని సంకల్పించింది. ఈమేరకు నేతన్న నేస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటగిరి పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగా ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
వెంకటగిరి(తిరుపతి జిల్లా): వెంకటగిరి పోలేరమ్మ తల్లి జాతరకు శతాబ్దాల చరిత్ర ఉంది. ఏడాది కొకసారి జరిగే జాతరలో పోలేరమ్మను దర్శించుకుంటే కోర్కెలు తీరుతాయన్న నమ్మకం భక్తుల్లో బలంగా ఉంది. వెంకటగిరి సంస్థాన రాజులు ఏలుతున్న రోజులవి. 1917లో వెంకటగిరిలో కలరా మహమ్మారి వందలాది మందిని బలితీసుకుంది. ఈ క్రమంలో వెంకటగిరి సంస్థానాధీశులు భారీ ఎత్తున శీతలయాగం నిర్వహించారు. మరోవైపు వెంకటగిరి నలువైపులా పొలిమేరలో గ్రామశిలలను ఏర్పాటు చేసి క్రమం తప్పకుండా జాతర నిర్వహించారు. అప్పటి నుంచి వెంకటగిరి జాతర జరుగుతూనే వస్తోంది. వెంకటగిరి సంస్థానాధీశుల ఆధీనంలో జరుగుతున్న పోలేరమ్మజాతర 1992 నుంచి దేవదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
అరుదైన వేదిక
వెంకటగిరి పోలేరమ్మజాతర నిమ్నవర్గాలతోపాటు జానపద కళారూపాల ప్రదర్శనకు అరుదైన వేదికగా నిలుస్తోంది. మతాలకు అతీతంగా వెంకటగిరీయులు నిర్వహించుకుంటారు. ఈ జాతరలో నిమ్నవర్గాలకు చెందిన వ్యక్తులు ముందుండి జాతరను నిర్వహిస్తారు. రాష్ట్రంలోనే ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ జాతరకు దేశవిదేశాల్లో ఉన్న వెంకటగిరీయులే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తుంటారు. జాతరకు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే ఆ ఏడాది అంతా పోలేరమ్మతల్లి ఆశీస్సులు ఉంటాయని భక్తుల విశ్వాసం.
నెరవేరిన కల
వెంకటగిరి పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగా నిర్వహించాలనే స్థానికుల కల నెరవేరింది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంకటగిరిలో నేతన్ననేస్తం ఐదో విడత ప్రారంభోత్సవ కార్యక్రమంలో పోలేరమ్మ జాతరను వెంకటగిరీయుల ఆకాంక్ష మేరకు రాష్ట్ర పండుగగా గుర్తించేందుకు జీవో విడుదల చేస్తామని ప్రటించారు.
Comments
Please login to add a commentAdd a comment