
చిల్లకూరు మండలం నల్లాయగారిపాళెం వద్ద ప్రైవేట్ చెక్‌పోస్టు
మామూలుగా రోడ్లపై ప్రభుత్వం చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడం చూశాం. పోలీసు, అటవీ, గనులు, వ్యవసాయ శాఖలతో పాటు రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు కనిపిస్తుంటాయి. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే వారి నుంచి ఫైన్లు వసూలు చేస్తుంటాయి. అయితే తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం నల్లాయగారిపాళెం గ్రామ సమీపంలోని రహదారి వద్ద కూటమి నేతలు ‘మా ప్రభుత్వం.. మా ఇష్టం..’ అంటూ ఒక చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు.
రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ భూమిలో కన్వర్షన్ కూడా చేయకుండానే పక్కా భవనం నిర్మించి, కాటా కూడా ఏర్పాటు చేశారు. రోడ్డుపై డ్రమ్ములు అడ్డంగా పెట్టి.. వాహనాల రాకపోకలను అడ్డుకుంటున్నారు. సిలికా లీజుదారులు, గనులు, యార్డులు పొందిన వారిని గుప్పెట్లో పెట్టుకోవడానికి ఇలా వ్యూహం పన్నారు. ప్రధానంగా ‘సిలికా’ రవాణాదారుల నుంచి మామూళ్లు దండుకునేందుకేనని స్పష్టమవుతోంది.