బూట్ల కంపెనీ కొత్త యూనిట్ వద్ద అధికార పార్టీ నాయకుల హడావుడి
ప్రారంబోత్సవాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం
తిరుపతి జిల్లాలో ఓ ప్రజాప్రతినిధి వైఖరితో కంగుతిన్న కంపెనీ ప్రతినిధులు
సాక్షి, టాస్క్ పోర్సు: ‘మీరు కొత్త యూనిట్‌లు పెడితే మాకేంటి ఉపయోగం...? స్థానికంగా ఉన్న మా నేతలకు ఏమిటి ప్రయోజనం..?’ అంటూ తిరుపతి జిల్లాకు చెందిన అధికార కూటమి ప్రజాప్రతినిధి ఒకరు ప్రముఖ కంపెనీ ప్రతినిధులను నిలదీయడంతో వారు కంగుతిన్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం ముత్యాలపాడు పంచాయతీలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అపెక్స్ బూట్ల పరిశ్రమ ఏర్పాటు చేశారు. సుమారు 1,800 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు.
ఈ కంపెనీ సూళ్లూరుపేటలోని అపాచీకి అనుబంధంగా ఉంది. కంపెనీ పనితీరు బాగుండటంతో యాజమాన్యం అక్కడే రెండవ యూనిట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రెండేళ్ల కిందట ‘తుడా’ వద్ద అనుమతులు తీసుకుని పనులు చేపట్టింది. పనులన్నీ పూర్తి చేసుకుని శుక్రవారం కొత్త యూనిట్‌ను ప్రారంభించేందుకు కంపెనీ ప్రతినిధులు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న నియోజకవర్గ ప్రజాప్రతినిధి... పరిశ్రమ యాజమాన్యం నుంచి తనుకు ఎలాంటి పిలుపు రాలేదని ఆగ్రహించారు.
ఆ పంచాయతీ సర్పంచ్‌తోపాటు స్థానిక అధికార పార్టీ నాయకులను కంపెనీ వద్దకు పంపి నానాయాగీ చేయించారు. పంచాయతీ అనుమతులు లేకుండా పరిశ్రమను ఎలా ప్రారంభిస్తారని వాగ్వాదానికి దిగారు. అలాగే పరిశ్రమలో పనిచేసే వారిని బయటకు వెళ్లాలని రచ్చరచ్చ చేశారు. దీంతో కంపెనీ హెచ్‌ఆర్ శరవణ్ వారికి నచ్చ చెప్పి తమకు తుడా అనుమతులు ఉన్నాయని, ఒక రోజు సమయం ఇస్తే వాటిని తీసుకువచ్చి పంచాయతీకి అందిస్తామని చెప్పారు. ఆ తర్వాత యూనిట్‌ను ప్రారంభించుకున్నారు.
మీరు పని చేసుకుంటూ వెళితే స్థానిక నాయకుల పరిస్థితి ఏమిటి?
అనంతరం అపెక్స్ బూట్ల కంపెనీ ప్రతినిధులు స్థానిక ముఖ్య ప్రజాప్రతినిధి వెళ్లి సర్పంచ్, స్థానిక నాయకులు చేసిన గొడవ గురించి వివరించారు. దీంతో ఆ ప్రజాప్రతినిధి స్పందిస్తూ... ‘కంపెనీ పెట్టి మీరు పనులు చేసుకుంటూ పోతే స్థానికంగా ఉండే నాయకుల పరిస్థితి ఏమిటీ..?’ అని ఎదురు ప్రశ్న వేయడంతో కంపెనీ ప్రతినిధులు అవాక్కయ్యారు. విదేశాలకు చెందిన కంపెనీ కావడంతో తాము ఏమి చేయగలమని వారు చెప్పడంతో సదరు ప్రజాప్రతినిధి గట్టిగానే స్పందించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment