Mother milk bank
-
అమ్మ కాని ‘అమ్మ’
పసిబిడ్డకు తల్లిపాలే అమృతం. కానీ అమ్మతనం అందివచ్చినా పిల్లలకు పాలు ఇవ్వలేని స్థితికొందరు తల్లులది. ఆ తల్లుల పాలిట ఆపద్బాంధవిలా, శిశువులకు తల్లిలా నిలుస్తోంది ఖమ్మం జిల్లా ప్రధాన ఆస్పత్రిలోని సమగ్ర తల్లిపాల సేకరణ కేంద్రం. ఏడాదిలో 599 మంది తల్లుల నుంచి సేకరించిన పాలను 626 మంది శిశువులకు అందజేసి ఆకలి తీర్చింది. శిశు మరణాలు తగ్గించడం, వారిని ఆరోగ్యవంతులను చేయడమే లక్ష్యంగా నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా దేశంలోని బెంగళూరు, కేరళ, ఢిల్లీ, చెన్నై తర్వాత ఐదో పెద్ద కేంద్రాన్ని ఖమ్మం ఆస్పత్రిలో గత ఏడాది ఏప్రిల్ 30న ఏర్పాటుచేశారు. హైదరాబాద్‌లోని నిలోఫర్, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రుల్లో మినీ మిల్క్ బ్యాంకులు ఉండగా ఖమ్మంలో మాత్రం ‘అమృతం’ పేరిట మెగా మదర్ మిల్క్ బ్యాంక్ అందుబాటులోకి వచ్చింది. – సాక్షిప్రతినిధి, ఖమ్మం ప్రసవాలే ప్రాధాన్యతగా.. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోజుకు సగటున 30 నుంచి 40 వరకు ప్రసవాలు జరుగుతుంటాయి. ఇక్కడ కంగారూ మదర్ కేర్ సెంటర్ ఉండటంతో బరువు తక్కువగా పుట్టిన శిశువులను తీసుకొస్తారు. వీరిలో తల్లి పాలు అందని పిల్లలు ఎక్కువగా ఉంటుండడంతో నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో సమగ్ర చనుబాల నిర్వహణ కేంద్రం(ఎస్ఎల్ఎంసీ) ఇక్కడ ఏర్పాటు చేశారు. రూ.42 లక్షల వ్యయంతో కేంద్రం.. భవన నిర్మాణానికి మరో రూ.73.39 లక్షలు వెచ్చించారు. ఇక్కడ తల్లుల నుంచి సేకరించిన చనుబాల బాటిళ్లను 400 నుంచి 600 వరకు నిల్వ సామర్థ్యం కలిగిన యంత్రాలున్నాయి. తల్లుల నుంచి సేకరించిన పాలను మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో భద్రపరుస్తుండడంతో ఆరునెలల పాటు వినియోగించే అవకాశం ఉంటుంది. కేజీన్నర లోపు బరువుతో పుట్టిన పిల్లలకే కాక, తల్లికి సరిపడా పాలు రాని సందర్భాల్లో పిల్లలకు ఈ పాలు పట్టిస్తారు. ఫలితంగా తల్లిపాలు అందక జరిగే శిశు మరణాలను అరికట్టడం సాధ్యమవుతోంది. ఆస్పత్రికి ప్రసవాల కోసం వచ్చే వారికి ఈ విషయమై అవగాహన కల్పించడంతో ఇప్పటివరకు 599 మంది తల్లుల నుంచి 2,14,100 మి.లీ. పాలను సేకరించి 626 మంది శిశువులకు అందజేశారు. ఇక్కడ తల్లిపాలు సేకరించేందుకు ఆరు బ్రెస్ట్ పంప్స్ ఏర్పాటు చేశారు. నిల్వ చేసుకునేందుకు వీలుగా.. ఆస్పత్రిలో డెలివరీ అయిన శిశువులు అనారోగ్యం పాలైతే ఇంక్యుబేటర్‌లో మూడు, నాలుగు రోజులు ఉంచాల్సి ఉంటుంది. దీంతో వారి తల్లులు తమ పాలను నిల్వ చేసుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. బ్రెస్ట్ పంప్స్ ద్వారా పాలు సేకరించి నిల్వ చేశాక, మళ్లీ శిశువులకు అవసరమైనప్పుడు అవే పాలు పడుతున్నారు. ఇలా 1,274 మంది తల్లులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. అంతేకాకుండా శిశుగృహాలు, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రసవం జరిగి పాలు లేని శిశువులకు కూడా ఈ కేంద్రం ద్వారా పాలు అందజేస్తున్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రితోపాటు ఏరియా ఆస్పత్రులు, అర్బన్ హెల్త్ సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అవసరమైన శిశువులకు పాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. శిశువులకు వరం ఆస్పత్రిలోని ఎస్ఎల్ఎంసీ పాలు అందని శిశువులకు ఇది వరం లాంటిది. పాలు ఎక్కువగా ఉన్న తల్లులు ఈ బ్యాంకుకు అందజేసేలా అవగాహన కల్పిస్తున్నాం. శిక్షణ తీసుకున్న స్టాఫ్ నర్సుల పర్యవేక్షణలో పాల సేకరణ, నిల్వ, పంపిణీ కొనసాగుతోంది. – డాక్టర్ బి.వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్, ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి తల్లులు ముందుకొస్తున్నారు ఈ అంశాలపై 14 రోజుల పాటు నీలోఫర్‌లో శిక్షణ పొందాం. ఆస్పత్రిలో ప్రసవించే తల్లులకు పాలు ఎక్కువగా ఉంటే ఈ కేంద్రంలో ఇవ్వాలని అవగాహన కల్పిస్తున్నాం. పాలు ఉండి పిల్లలకు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నవారికి కూడా ఫీడింగ్ విధానం గురించి వివరిస్తున్నాం. చాలా మంది తల్లులు పాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. – కృష్ణవేణి, స్టాఫ్ నర్స్, ఎస్ఎల్ఎంసీ, ఖమ్మం పిల్లలు ఏడవడం చూడలేక.. జిల్లా ఆస్పత్రిలోనే నాకు డెలివరీ జరిగింది. నేను ఉంటున్న వార్డులో కొందరు తల్లుల వద్ద పాలు సరిపోక పిల్లలు ఏడుస్తుండడం చూశా. అది చూడలేక.. నా దగ్గర మా పాపకు సరిపోను పాల కన్నా ఎక్కువే ఉండటంతో కేంద్రంలో ఇచ్చా. ఆ పిల్లలకు ఈ పాలు ఇస్తుండటం ఆనందాన్ని కలిగించింది. – గుగులోతు అనిత, పెద్దతండా, ఖమ్మం -
బిడ్డ కడుపు నిండగా..
సాక్షి, సిటీబ్యూరో: నెలలు నిండకముందే తక్కువ బరువుతో జన్మించి, తల్లికి దూరంగా ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న నిరుపేద శిశువుల పాలిట ‘ధాత్రి– తల్లిపాల నిధి’ ఓ వరంగా మారింది. ఆస్పత్రిలో ప్రసవించి పాలు సంమృద్ధిగా ఉన్న తల్లుల నుంచి ముర్రుపాలు సేకరించి, ఆకలితో బాధపడుతున్న శిశువులకు సరఫరా చేసేందుకు నిలోఫర్ ఆస్పత్రిలో మదర్స్ మిల్క్ బ్యాంకు ఏర్పాటు చేశారు. ఇది పిల్లల ఆకలి తీర్చడమే కాకుండా పరోక్షంగా తల్లుల ఆరోగ్యాన్నీ కాపాడుతోంది. ధాత్రి ఫౌండేషన్, ప్రభుత్వం సంయుక్తంగా రూ.కోటితో గతేడాది నిలోఫర్ నవజాత శిశువుల ఆరోగ్య కేంద్రంలో మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను నెలకొల్పింది. ఈ ఆస్పత్రిలో నిత్యం వెయ్యి మందికిపైగా శిశువులు చికిత్స పొందుతుండగా, వీరిలో సగానికిపైగా నెలలు నిండకముందు, తక్కువ బరువుతో జన్మించిన వారే ఉంటున్నారు. వీరిలో చాలా మంది రోజుల తరబడి తల్లికి దూరంగా చికిత్స పొందుతుంటారు. ఇలా తల్లికి దూరంగా ఉన్న.., వైద్యులు సిఫార్సు చేసిన 1.5 కేజీల లోపు శిశువులకు మదర్స్ మిల్క్ బ్యాంకు ముర్రు పాలు సరఫరా చేస్తుంది. ఇలా నెలకు సగటున 400 మంది పిల్లల ఆకలి తీర్చతుండటం విశేషం. ఆగస్టు ఒకటి నుంచి ఏడు వరకు తల్లిపాల వారోత్సవాల సందర్భంగా నిలోఫర్ మదర్స్ మిల్క్ బ్యాంక్ సేవలపై ప్రత్యేక కథనం. తల్లుల ఆరోగ్యానికి భరోసా ఆస్పత్రిలో రోజుకు సగటున 25 ప్రసవాలు జరుగుతుండగా, వీరిలో చాలా మందికి ప్రసవం తర్వాత రెండు మూడురోజుల వరకు పాలు పడటం లేదు. పాలు పడని తల్లులే కాకుం డా పాలు సమృద్ధిగా లభించే తల్లుల పాలి ట ఈ కేంద్రం ఓ వరం గా మారింది. పాలు పడని తల్లులకు కౌన్సి లింగ్ ఇవ్వడంతో పా టు అవసరమైన వైద్య సేవలు అందజేస్తుంది. తల్లి వద్ద సమృద్ధిగా పాలు ఉన్నప్పటికీ..శిశువు అనారోగ్యంతో బాధపడుతుండటంతో తాత్కాలికంగా ఫీడింగ్ నిలిపి వేయాల్సి ఉంటుంది. ఇలాంటి వారంతా స్వచ్ఛందంగా తల్లిపాల నిధికి చేరుకుని తమ పాలను దానం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో వీరు రొమ్ము కేన్సర్ బారి నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇలా రోజుకు 15 నుంచి 20 మంది వరకు ఈ కేంద్రానికి వస్తుండటం విశేషం. ఇక్కడ రోజుకు 450 మంది పిల్లలకు సరిపడా పాలను నిల్వ చేసే సౌలభ్యం ఉంది. అత్యంత భద్రంగా నిల్వ పాల సేకరణకు ముందే వీరికి హెచ్ఐవీ, వీడీఆర్ఎల్, హెచ్ఎస్బీసీ వంటి వైద్య పరీక్షలు చేసి, ఎలాంటి వ్యాధులు లేవని నిర్ధారించుకున్న తర్వాతే పాలను సేకరిస్తున్నారు. ఇలా వీరి నుంచి సేకరించిన పాలను ప్రాసెస్ చేసి మైనస్ 20 డిగ్రీల వద్ద భద్రపరుస్తున్నారు. వీటిని ఆరు మాసాల వరకు వాడుకునే అవకాశం ఉంది. ఇక్కడ దేశంలోనే అత్యధికంగా మూడు వేల లీటర్ల పాలు నిల్వ చేసే సామర్థ్యం ఉండటం విశేషం. తల్లిపాలలో రోగనిరోధక శక్తిని పెంపొందించే ప్రొటీన్లతో పాటు శారీరక, మానసిక, ఆరోగ్య వికాసానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల తల్లిపాలలో 65 కిలో కేలరీల శక్తినిస్తాయి. ఇందులో విటమిన్ ఎ సహా థయామిన్, రైబోఫ్లెవిన్, బి12, బి6, సెనథోనిక్ ఆమ్లం, బయో టిక్, ఫోలిక్ ఆమ్లం, సీ,డీ,ఇ విటమిన్లు, క్యాల్షియం, ఇనుము, మెగ్నీషియం, వంటి ఖనిజ లవ ణాలు లభిస్తాయి. బిడ్డకు రోజుకు కనీసం 8 నుంచి 10 సార్లు పాలు తాగించాల్సి ఉంది. ఇలా కనీసం ఆరు మాసాల పాటు తల్లి పాలే అందించాలి. -
తల్లిపాలకు ఓ బ్యాంక్
గౌరీ మీనా... ఏడో నెలలోనే బిడ్డకు జన్మనిచ్చింది. భారతదేశంలోని ఎడారి ప్రాంతం అయిన రాజస్థాన్‌లోని ఒక చిన్న గ్రామంలో ఆవిడ ప్రసవించింది. జన్మించిన శిశువు...ఉండవలసిన బరువులో సగం కంటె తక్కువ ఉన్నాడు. దాంతో ఆ తల్లిదండ్రులు... బిడ్డ బతుకుతాడా? లేదా? అని భయపడ్డారు. స్థానిక వైద్యుడి దగ్గర సలహా తీసుకుని, మందంగా ఉన్న ఒక దుప్పటిలో బిడ్డను చుట్టి, 130 కి.మీ.దూరంలో ఉన్న గవర్నమెంటు హాస్పిటల్‌కి బస్‌లో తీసుకువెళ్లారు. అక్కడి ఆసుపత్రివారు ‘బిడ్డ బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి’ అని చెప్పారు. నిరోధక శక్తి వ్యవస్థ చాలా బలహీనంగా ఉండండం, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉండడం వల్ల బతకడం కష్టమని చెప్పారు. అయినప్పటికీ బిడ్డను బతికించడం కోసం యాంటీబయాటిక్స్ మొదలుపెట్టారు. వీటితోపాటు తల్లి పాలు చాలా అవసరమనీ, ఆ పాల ద్వారానే నిరోధక శక్తి పెరుగుతుందనీ డాక్టర్లు చెప్పారు. అయితే ఇరవై రెండు సంవత్సరాల వయసున్న మీనా తగినంత పోషకాలు తీసుకోకపోవడం, దానికి తోడు మానసిక ఒత్తిడి... ఈ రెండు కారణాల కారణంగా, చంటి పిల్లలకు సరిపడేన్ని పాలు ఆమె దగ్గర లేకపోయాయి. ఆమె అదృష్టమో ఏమో కానీ, ద్రవ రూపంలో ఉన్న బంగారం ద్వారా ఆమెకు సహాయం లభించింది. ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి తల్లి పాల బ్యాంకును ఒక ఎన్జీవో స్థాపించింది. కిందటి సంవత్సరం ఏప్రిల్ మాసం నుంచి, ఈ సంస్థ ‘తల్లి పాల’ను అవసరమైన వారికి ఉచితంగా అందిస్తోంది. నిపుణులు ఈ పాలను ‘లిక్విడ్ గోల్డ్’ అని ప్రశంసిస్తున్నారు. ఒక గవర్నమెంట్ హాస్పిటల్‌లోని, చిన్న ప్రదేశంలో అత్యంత ఆధునిక పరికరాలతో ఈ సంస్థను స్థాపించారు. తల్లుల దగ్గర నుంచి అధికంగా ఉత్పత్తి అవుతున్న తల్లిపాలను సేకరిస్తారు ఈ సంస్థ నిర్వాహకులు. అయితే ఆ పాలను తీసుకునే ముందే, పాలిచ్చే తల్లులకు గొట్టం ద్వారా హెఐవి, హెపటైటిస్ వంటి అనేక రకాల పరీక్షలు నిర్వహించి, ఆ తరువాతే పాలను సేకరిస్తారు. వెంటనే ఆ పాలను పాశ్చరైజ్ చేసి, ఆ తరువాత వాటిని ఫ్రోజెన్ చేసి నిల్వ చేస్తారు. ఈ పాలు నాలుగు నెలల వరకు నిల్వ ఉంటాయి. దగ్గరలో ఉన్న తల్లుల నుంచి... పరిసరాలలో ఉన్న తల్లుల దగ్గరకు వెళ్లి, వారి దగ్గర అధికంగా ఉన్న తల్లిపాలను ఈ సంస్థవారు అడిగి తీసుకువస్తారు. బ్యాంకు ప్రారంభమయ్యాక ఇప్పటివరకు 660 మందికి పైగా తల్లులకు స్వచ్ఛందంగా పాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అలా వారి నుంచి సేకరించిన పాలను 450 మంది పిల్లలకు అందచేయగలిగారు. ముఖ్యంగా ఉదయ్‌పూర్‌లోని ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్న పసికందులకు (మీనా బిడ్డలాంటి వారికి) ఈ పాలను అందచేశారు.ఙఞ్చట‘‘మా అబ్బాయి చాలా వేగంగా కోలుకొంటున్నాడు’’ అంటారు మీనా భర్త. బిడ్డను ఇంటెన్సివ్ కే ర్లో ఉంచిన ఆరు రోజులకో ‘లిక్విడ్ గోల్డ్’ వల్ల ఆ పసికందులో ఎంతో మార్పు కనిపించింది. నెల రోజుల తర్వాత మీనా తన బిడ్డను తీసుకుని ఎంతో ఆనందంగా ఇంటికి చేరుకుంది. రకరకాల అనారోగ్యాల కారణంగా 2001 - 2012 మధ్య కాలంలో ఐదు సంవత్సరాల లోపు వయసున్న 2.3 మిలియన్ల పిల్లలు మర ణించారు. భారతదేశంలో నేటికీ 20 శాతం శిశు మరణాలు నమోదవుతున్నాయి. మరణించిన వారిలో 28 రోజుల పసికందుల సంఖ్య సగానికి పైగా ఉంటోంది. ఈ మరణాలకు కారణం ముఖ్యంగా రకరకాల ఇన్ఫెక్షన్లు, తక్కువ బరువుతో పుట్టడం, మొదటి నెలలోనే ఏదో ఒక అనారోగ్యం కలగడం, విరేచనాలు, నిమోనియా మొదలైనవి అంటున్నారు డాక్టర్లు. పోషకాహారం... శిశు మరణాలను ఆపడంలో భాగంగా ఈ సంస్థ చేపట్టినదే ‘లిక్విడ్ గోల్డ్’ బ్యాంక్. అప్పుడే పుట్టిన పసికందులకు తల్లి పాలను మించిన పోషకాహారం లేదు. ఎన్నో వ్యాధులు రాకుండా కాపాడగలిగే శక్తి తల్లి పాలకి మాత్రమే ఉంది. ముఖ్యంగా బిడ్డ జన్మించగానే తల్లి పాలు పట్టిస్తే అది అమృతంతో సమానం. కనీసం బిడ్డకు ఆరు నెలలు వచ్చేవరకైనా తల్లి పాలు తప్పనిసరిగా పట్టించాలి. ప్రపంచం ఆరోగ్య సంస్థ, యునిసెఫ్ సంస్థలు ఈ విషయాన్ని సంపూర్ణంగా అంగీకరించాయి. అనేక రాష్ట్రాలలోని ఎన్జివోలు... తల్లి పాలను సేకరించే బ్యాంకులను స్థాపించడానికి నడుం బిగిస్తున్నాయి. అనేకమంది ఆరోగ్య నిపుణులు ఈ సేవలను స్వాగతిస్తున్నారు. అయితే ఇందుకోసం బాగా కృషి చేయాలని మాత్రం చెబుతున్నారు. ‘‘పాలను సేకరించడం, సేకరించిన పాలను అవసరంలో ఉన్న వారికి వినియోగించడం చాలా కష్టం. ఎందుకంటే తల్లి పాల వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయనే విషయంలో చాలా మందికి నమ్మకం లేదు’’ అంటారు డా. ఆర్మిడా ఫెర్నాండెజ్. 1989లో ముంబై లో మొట్టమొదటి తల్లి పాల బ్యాంకును స్థాపించారు ఈయన. పోస్ట్‌మ్యాన్... ఢిల్లీలో లాభాపేక్ష లేకుండా స్థాపించిన తల్లి పాల కేంద్రం గురించి, విస్తృతంగా ప్రచారం చేస్తున్న అరుణాగుప్తా, ‘తల్లి పాల వల్ల శిశు మరణాలను తగ్గించవచ్చు’ అని పూర్తిగా నమ్ముతున్నారు. ద క్షిణ అమెరికాలో ప్రపంచంలో ఎక్కడా లేనన్ని తల్లి పాల కేంద్రాలు ఉన్నాయి. అక్కడ ఈ కేంద్రాల సంఖ్య 200 పై మాటే. బ్రెజిల్ దేశంలో తల్లి పాలను సేకరించడానికి, తల్లి పాలు అవసరమైన వారికి ఈ పాల గురించి వివరించడానికి తపాలా బంట్రోతులను ఉపయోగించుకుంటున్నారు. ఎక్కడ తల్లి పాలు అధికంగా లభిస్తాయో పోస్ట్ మ్యాన్ చెబితే చాలు అక్కడకు వెళ్లి బ్యాంకు వారు పాలను తీసుకువస్తారు. అలాగే ఎక్కడైనా కన్నతల్లి... బిడ్డకు పాలిచ్చే స్థితిలో లేదని సదరు పోస్ట్‌మ్యాన్ చెప్పగానే, వారికి ఈ పాలను అందచేస్తున్నారు. ఈ విధానం వల్ల బ్రెజిల్లో శిశు మరణాల సంఖ్య 73 శాతం తగ్గింది. బ్రెజిల్లో ఇప్పుడు ఐదు సంవత్సరాల లోపు వయసు శిశు మరణాల సంఖ్య వెయ్యికి పద్నాలుగు మంది మాత్రమే అని యునిసెఫ్ చెబుతోంది. భారతదేశంలో ఈ సంఖ్య నాలుగు రెట్లు ఎక్కువగా ప్రతి వెయ్యి మందికి 56 మంది శిశువులు మరణిస్తున్నారని ఆ సంస్థ చెబుతోంది. ఏది ఏమైనా తల్లి పాల సేకరణ, వినియోగం విషయంలో బ్రెజిల్ మొదటిస్థానంలో ఉంది. డా. అగర్వాల్‌కి మాత్రంకి ఒక పెద్ద కల ఉంది. ‘ఎప్పటికైనా తల్లి పాలను పాల పొడిగా మార్చి సరుకుల దుకాణాలలో అందరికీ అందుబాటులో లభ్యమయ్యేలా చూడాలి’ అని. పశువుల పాలు పొడి రూపంలో దొరుకుతున్నప్పుడు, తల్లి పాలు మాత్రం ఆ రూపంలో ఎందుకు తయారుచేయలేం... అంటున్నారు అగర్వాల్. -
అమృతాన్ని పంచే అమ్మలు!
తల్లిప్రేమకు సాటి మరేదీ రాదు. అలాగే తల్లిపాలకు కూడా. తల్లిపాలకు ప్రత్యామ్నాయం లేదు. అమ్మ పాలు అంటే అమృతమే... ఆ అమృతాన్ని పంచగలిగింది అమ్మలే!! మరి పురిటిలోనే తల్లికి దూరమైన బిడ్డకు? మరో తల్లి పెద్ద మనసుతో తన బిడ్డతోపాటు తల్లిలేని బిడ్డకూ పాలివ్వడం ఒక్కటే మార్గం. అందుకు ముందుకు వచ్చే వాళ్లెంతమంది? ఆ ప్రశ్నకు సమాధానంగా ‘నేనున్నాను’ అన్నారు లక్ష్మి. అలా ముందుకొచ్చే లక్ష్మిలాంటి ఎంతోమంది నుంచి పాలను సేకరించి, చంటి పాపలకు ఆ అమృతాన్ని అందించేందుకు ఇప్పుడు ఓ ‘అమ్మ పాల బ్యాంకు’ ప్రయత్నం జరుగుతోంది. లక్ష్మి తొమ్మిదవ నెల గర్భిణి. ప్రసవం అయిన తర్వాత తన బిడ్డతోపాటు మరో బిడ్డకు కూడా తన పాలనిచ్చి ఆ బిడ్డకు తల్లిపాల లోటును భర్తీ చేస్తానంటూ ‘అమ్మ పాల బ్యాంకు’కు పాలను దానమిచ్చే తొలి దాత అయ్యారు. తన సంకల్పానికి భగవంతుడు సహకరించి తగినన్ని పాలను ప్రసాదించాలని ప్రార్థిస్తున్నారామె. అమ్మ పాలను నిల్వ చేయడం, దానమివ్వడమనే ఆలోచన ఇప్పుడు ‘అమ్మ పాల బ్యాంకు’గా హైదరాబాద్‌లో ఆచరణలోకి వస్తోంది. తల్లిదండ్రులకు దూరమైన బిడ్డలు, తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యానికి బలైపోయి చెత్తకుప్పలోకి విసిరివేతకు లోనయిన చంటిబిడ్డలకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తోంది. వారిని పెంచి పెద్ద చేసి పిల్లల్లేని వారికి దత్తతనిస్తోంది కూడా. అలాంటి పిల్లలు హైదరాబాద్‌లోని ఒక్క శిశువిహార్‌లోనే వందల్లో ఉంటున్నారు. సరాసరిన రోజుకు పదహారు మంది చంటిబిడ్డలు కొత్తగా వచ్చి చేరుతూనే ఉన్నారు. కొందరిని పెంపకానికి తీసుకునే వాళ్లు తీసుకెళ్లే ప్రక్రియ కొనసాగుతూ ఉండగా... ఏడాదిలోపు పిల్లలు దాదాపు 80 మంది వరకు ఉంటున్నారు. వారందరినీ ప్రభుత్వం పోతపాలతో పోషిస్తోంది. వైద్యం అందిస్తోంది. తల్లిపాలు అందకపోతే అంటువ్యాధులు సులభంగా దాడిచేస్తాయి. పుట్టిన ప్రతి ఐదుగురిలో ఒక బిడ్డ మొదటి పుట్టిన రోజును చూడకనే కన్నుమూస్తోందని, పిల్లలకు తల్లిపాలతోనే ఆరోగ్యకరమైన భావితరం తయారవుతుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఎ.పి బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనూరాధారావు అనాథ పిల్లలకు తల్లిపాలను అందించడానికి ‘అమ్మ పాల బ్యాంకు’ను ఏర్పాటు చేశారు. పాలను దానం చేయాలనుకునే తల్లులను గుర్తించడం, పాలను సేకరించడం, నిల్వ చేయడం, ఆ పాలను అవసరమైన పిల్లలకు చేర్చడం ఈ ప్రక్రియకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రపంచ పిల్లల దినోత్సవం సందర్భంగా ఈ నెల ఒకటో తేదీన ప్రారంభించారు. ప్రస్తుతం హైదరాబాద్‌కే పరిమితమైన ఈ ప్రయత్నంలో పేరు నమోదు చేసుకున్న తల్లుల దగ్గరకు ‘అమ్మపాల బ్యాంకు’ కార్యకర్తలు రోజుకొకసారి వెళ్లి పాలను సేకరిస్తారు. తమతోపాటు సక్కర్, చల్లదనాన్ని నిలిపి ఉంచే ఫ్లాస్కు తీసుకెళ్తారు. ఆ పాలను స్థానిక లోటస్ హాస్పిటల్‌లోని ఫ్రీజర్‌లో ఉంచడానికి హాస్పిటల్ నిర్వాహకులు అంగీకరించారు. ఆ పాలను చంటిబిడ్డలకు చేర్చడం కూడా కార్యకర్తలే చేస్తారు. పాల సేకరణ పనిలో మహిళలే ఉంటారు. మరో బిడ్డకు ప్రాణదానం చేసిన సంతృప్తి! పాల దానం చేయడం ద్వారా మరో బిడ్డకు ప్రాణం పోసిన తల్లిగా సంతృప్తిని పొందవచ్చు. అయితే ‘‘నీ ఉదారత చాటుకోవడం కోసం కన్న బిడ్డను అర్ధాకలితో ఉంచుతావా’’ అని భర్త, అమ్మానాన్నలు, అత్తమామలు ప్రశ్నించడం సహజమే. సంగతిని వివరించి వాళ్లను సమాధానపరచడం చాలా ముఖ్యం. ఈ సందేహాలను నిపుణులు నివృత్తి చేస్తారు. పాలను దానం చేసే తల్లులు క్యాల్షియం లోపం రాకుండా, రక్తహీనతకు లోనుకాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటే చాలు... ఇద్దరు బిడ్డలకు పాలివ్వడం కష్టమేమీ కాదు. తల్లిపాలదానం అనే జ్యోతిని లక్ష్మి ఉదాత్తమైన మనసుతో అందుకున్నారు. ఆమె నుంచి ఈ జ్యోతిని అందుకుంటూ ప్రస్థానాన్ని కొనసాగించడానికి మరెందరో తల్లులు ముందుకు వస్తారు. ఇందుకు నిదర్శనం ప్రారంభోత్సవం రోజునే హైదరాబాద్‌లోని మదీనాగూడలోని సత్యవేణి మురుగన్ నుంచి వచ్చిన ఫోన్‌కాలే!. బిడ్డ కోసం తల్లి ఏం చేయడానికైనా సిద్ధమవుతుంది. తల్లి మనసు... తల్లి లేని బిడ్డకు తల్లి ప్రేమను పంచడానికి ఏ మాత్రం సంశయించదు. తల్లి పాలు లేని బిడ్డను కూడా ఆదరించగలుగుతుంది. అందుకే ప్రపంచంలో అన్నింటికంటే తల్లి గొప్పది, తల్లి మనసు ఇంకా గొప్పది. అచ్చం తల్లిపాలలాగే. - వాకా మంజులారెడ్డి ఫొటో: ఠాకూర్ దేశంలో ఇదే తొలి ప్రయత్నం! దేశంలో ఈ ప్రక్రియ దాదాపు పది హాస్పిటళ్లలో ఉంది. అనారోగ్య కారణాల వల్ల తల్లి లేదా బిడ్డ ఐసియులో ఉన్నప్పుడు తల్లి నేరుగా పాలివ్వడం కుదరదు. అలాంటప్పుడు తల్లి నుంచి సేకరించిన పాలను హాస్పిటల్ వాళ్లే బిడ్డకు టైమ్ ప్రకారం పడతారు. అయితే ఈ పద్ధతిని తల్లికి దూరమైన బిడ్డలకు పట్టే ప్రయత్నం చేయడం మాత్రం మన దేశంలో ఇదే మొదటిసారి. గతంలో పురిట్లో తల్లిపోయిన బిడ్డలకు మరో తల్లి విశాల దృక్పథంతో తనబిడ్డతోపాటుగా పాలిచ్చి బతికించేది. అలాంటిదే ఇది కూడా. - అనూరాధారావు, ఎ.పి బాలల హక్కుల సంఘం నిర్వాహకురాలు తల్లులకు ఏ రకంగా మేలు! సెల్ఫ్ కాంట్రాసెప్టివ్... సాధారణంగా పాలిస్తున్నంత కాలం గర్భధారణ జరగదు. బినైన్ కణుతులు... పాలు ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఉండి కూడా వినియోగించుకోని వారిలో రొమ్ములలో బినైన్ కణుతులు ఏర్పడడాన్ని గమనిస్తుంటాం. ఇవ్వగలిగినంత కాలం బిడ్డకు పాలివ్వడం వల్ల ఈ కణుతులను నివారించవచ్చు. బిడ్డను కోల్పోయిన మహిళ మానసిక స్థితి ఆందోళనకరంగా ఉంటుంది. అలాంటి వారు ఈ సమయాన్ని మరో బిడ్డకు పాలివ్వడానికి కేటాయిస్తే మానసిక సాంత్వన కలుగుతుంది. ఒక బిడ్డ ప్రాణాన్ని నిలుపుతున్నాననే సంతోషం ఉంటుంది. తల్లి పాల గురించి ... - చంటిబిడ్డకు రోజుకు 150 మిల్లీలీటర్ల తల్లిపాలు కావాలి. - ఆరోగ్యవంతమైన తల్లికి రోజుకు 600- 700 మి.లీ పాలు ఉత్పత్తి అవుతాయి. - ఒక బిడ్డ గరిష్ఠంగా 300 మిల్లీలీటర్ల పాలను మాత్రమే తాగుతుంది. - తల్లి నుంచి సేకరించిన పాలను 63 డిగ్రీల ఫారన్హీట్లోపు ఉష్ణోగ్రతలో నిల్వ చేస్తే 90 రోజులు ఉంటాయి. పాశ్చరైజేషన్ చేస్తే ఆరు నెలలు పాడవవు. - ఎందరు తల్లుల పాలనైనా కలిపి ఒకే పాత్రలో నిల్వ చేయవచ్చు. - మొదటిసారి పాలను సేకరించిన తర్వాత ఆ పాలను స్క్రీనింగ్ చేస్తారు. అవకాశం ఉంటే వదులుకోవద్దు! అవసరం నుంచి వచ్చిన ఆలోచన ఇది. పాలు లేని పిల్లలు ఎదురుగా కనిపిస్తుంటే చూస్తూ ఊరుకోవడం చేతకాలేదు. నా భర్త వెంటనే ఒప్పుకున్నారు. తర్వాత నా బిడ్డకు వచ్చిన నష్టం ఏమీ లేదని అమ్మకు, అత్తగారికి వివరించాను. నేను బాలింతలకు చెప్పేది ఒక్కటే... ‘మరో బిడ్డను కాపాడే అవకాశం ఉంటే దానిని అనవసరమైన భయాలతో వదులుకోవద్దు. ప్రాణం పోయడంలో ఉండే ఆనందాన్ని అనుభవంలోకి తెచ్చుకోండి’ అని. - లక్ష్మి, అమ్మపాల దానానికి సిద్ధపడిన కాబోయే తల్లి