పసిబిడ్డకు తల్లిపాలే అమృతం. కానీ అమ్మతనం అందివచ్చినా పిల్లలకు పాలు ఇవ్వలేని స్థితికొందరు తల్లులది. ఆ తల్లుల పాలిట ఆపద్బాంధవిలా, శిశువులకు తల్లిలా నిలుస్తోంది ఖమ్మం జిల్లా ప్రధాన ఆస్పత్రిలోని సమగ్ర తల్లిపాల సేకరణ కేంద్రం. ఏడాదిలో 599 మంది తల్లుల నుంచి సేకరించిన పాలను 626 మంది శిశువులకు అందజేసి ఆకలి తీర్చింది.
శిశు మరణాలు తగ్గించడం, వారిని ఆరోగ్యవంతులను చేయడమే లక్ష్యంగా నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా దేశంలోని బెంగళూరు, కేరళ, ఢిల్లీ, చెన్నై తర్వాత ఐదో పెద్ద కేంద్రాన్ని ఖమ్మం ఆస్పత్రిలో గత ఏడాది ఏప్రిల్ 30న ఏర్పాటుచేశారు. హైదరాబాద్‌లోని నిలోఫర్, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రుల్లో మినీ మిల్క్ బ్యాంకులు ఉండగా ఖమ్మంలో మాత్రం ‘అమృతం’ పేరిట మెగా మదర్ మిల్క్ బ్యాంక్ అందుబాటులోకి వచ్చింది.
– సాక్షిప్రతినిధి, ఖమ్మం
ప్రసవాలే ప్రాధాన్యతగా..
ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోజుకు సగటున 30 నుంచి 40 వరకు ప్రసవాలు జరుగుతుంటాయి. ఇక్కడ కంగారూ మదర్ కేర్ సెంటర్ ఉండటంతో బరువు తక్కువగా పుట్టిన శిశువులను తీసుకొస్తారు. వీరిలో తల్లి పాలు అందని పిల్లలు ఎక్కువగా ఉంటుండడంతో నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో సమగ్ర చనుబాల నిర్వహణ కేంద్రం(ఎస్‌ఎల్‌ఎంసీ) ఇక్కడ ఏర్పాటు చేశారు. రూ.42 లక్షల వ్యయంతో కేంద్రం.. భవన నిర్మాణానికి మరో రూ.73.39 లక్షలు వెచ్చించారు. ఇక్కడ తల్లుల నుంచి సేకరించిన చనుబాల బాటిళ్లను 400 నుంచి 600 వరకు నిల్వ సామర్థ్యం కలిగిన యంత్రాలున్నాయి.
తల్లుల నుంచి సేకరించిన పాలను మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో భద్రపరుస్తుండడంతో ఆరునెలల పాటు వినియోగించే అవకాశం ఉంటుంది. కేజీన్నర లోపు బరువుతో పుట్టిన పిల్లలకే కాక, తల్లికి సరిపడా పాలు రాని సందర్భాల్లో పిల్లలకు ఈ పాలు పట్టిస్తారు. ఫలితంగా తల్లిపాలు అందక జరిగే శిశు మరణాలను అరికట్టడం సాధ్యమవుతోంది. ఆస్పత్రికి ప్రసవాల కోసం వచ్చే వారికి ఈ విషయమై అవగాహన కల్పించడంతో ఇప్పటివరకు 599 మంది తల్లుల నుంచి 2,14,100 మి.లీ. పాలను సేకరించి 626 మంది శిశువులకు అందజేశారు. ఇక్కడ తల్లిపాలు సేకరించేందుకు ఆరు బ్రెస్ట్ పంప్స్ ఏర్పాటు చేశారు.
నిల్వ చేసుకునేందుకు వీలుగా..
ఆస్పత్రిలో డెలివరీ అయిన శిశువులు అనారోగ్యం పాలైతే ఇంక్యుబేటర్‌లో మూడు, నాలుగు రోజులు ఉంచాల్సి ఉంటుంది. దీంతో వారి తల్లులు తమ పాలను నిల్వ చేసుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. బ్రెస్ట్ పంప్స్ ద్వారా పాలు సేకరించి నిల్వ చేశాక, మళ్లీ శిశువులకు అవసరమైనప్పుడు అవే పాలు పడుతున్నారు. ఇలా 1,274 మంది తల్లులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు.
అంతేకాకుండా శిశుగృహాలు, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రసవం జరిగి పాలు లేని శిశువులకు కూడా ఈ కేంద్రం ద్వారా పాలు అందజేస్తున్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రితోపాటు ఏరియా ఆస్పత్రులు, అర్బన్ హెల్త్ సెంటర్లు, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అవసరమైన శిశువులకు పాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
శిశువులకు వరం
ఆస్పత్రిలోని ఎస్‌ఎల్‌ఎంసీ పాలు అందని శిశువులకు ఇది వరం లాంటిది. పాలు ఎక్కువగా ఉన్న తల్లులు ఈ బ్యాంకుకు అందజేసేలా అవగాహన కల్పిస్తున్నాం. శిక్షణ తీసుకున్న స్టాఫ్ నర్సుల పర్యవేక్షణలో పాల సేకరణ, నిల్వ, పంపిణీ కొనసాగుతోంది. – డాక్టర్ బి.వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్, ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి
తల్లులు ముందుకొస్తున్నారు
ఈ అంశాలపై 14 రోజుల పాటు నీలోఫర్‌లో శిక్షణ పొందాం. ఆస్పత్రిలో ప్రసవించే తల్లులకు పాలు ఎక్కువగా ఉంటే ఈ కేంద్రంలో ఇవ్వాలని అవగాహన కల్పిస్తున్నాం. పాలు ఉండి పిల్లలకు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నవారికి కూడా ఫీడింగ్ విధానం గురించి వివరిస్తున్నాం. చాలా మంది తల్లులు పాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. – కృష్ణవేణి, స్టాఫ్ నర్స్, ఎస్‌ఎల్‌ఎంసీ, ఖమ్మం
పిల్లలు ఏడవడం చూడలేక..
జిల్లా ఆస్పత్రిలోనే నాకు డెలివరీ జరిగింది. నేను ఉంటున్న వార్డులో కొందరు తల్లుల వద్ద పాలు సరిపోక పిల్లలు ఏడుస్తుండడం చూశా. అది చూడలేక.. నా దగ్గర మా పాపకు సరిపోను పాల కన్నా ఎక్కువే ఉండటంతో కేంద్రంలో ఇచ్చా. ఆ పిల్లలకు ఈ పాలు ఇస్తుండటం ఆనందాన్ని కలిగించింది. – గుగులోతు అనిత, పెద్దతండా, ఖమ్మం
Comments
Please login to add a commentAdd a comment