తల్లిపాలకు ఓ బ్యాంక్ | Mother milk Bank formed in Rajasthan | Sakshi
Sakshi News home page

తల్లిపాలకు ఓ బ్యాంక్

Published Sun, Jul 27 2014 4:16 PM | Last Updated on Sat, Sep 2 2017 10:58 AM

తల్లిపాలకు ఓ బ్యాంక్

తల్లిపాలకు ఓ బ్యాంక్

గౌరీ మీనా... ఏడో నెలలోనే బిడ్డకు జన్మనిచ్చింది. భారతదేశంలోని ఎడారి ప్రాంతం అయిన రాజస్థాన్‌లోని ఒక చిన్న గ్రామంలో ఆవిడ ప్రసవించింది. జన్మించిన  శిశువు...ఉండవలసిన బరువులో సగం కంటె తక్కువ ఉన్నాడు. దాంతో ఆ తల్లిదండ్రులు... బిడ్డ బతుకుతాడా? లేదా? అని భయపడ్డారు.

స్థానిక వైద్యుడి దగ్గర సలహా తీసుకుని, మందంగా ఉన్న ఒక దుప్పటిలో బిడ్డను చుట్టి, 130 కి.మీ.దూరంలో ఉన్న గవర్నమెంటు హాస్పిటల్‌కి బస్‌లో తీసుకువెళ్లారు. అక్కడి ఆసుపత్రివారు ‘బిడ్డ బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి’ అని చెప్పారు. నిరోధక శక్తి వ్యవస్థ చాలా బలహీనంగా ఉండండం, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశం ఉండడం వల్ల బతకడం కష్టమని చెప్పారు. అయినప్పటికీ బిడ్డను బతికించడం కోసం యాంటీబయాటిక్స్ మొదలుపెట్టారు. వీటితోపాటు తల్లి పాలు చాలా అవసరమనీ, ఆ పాల ద్వారానే నిరోధక శక్తి పెరుగుతుందనీ డాక్టర్లు చెప్పారు.

అయితే ఇరవై రెండు సంవత్సరాల వయసున్న మీనా తగినంత పోషకాలు తీసుకోకపోవడం, దానికి తోడు మానసిక ఒత్తిడి... ఈ రెండు కారణాల కారణంగా, చంటి పిల్లలకు సరిపడేన్ని పాలు ఆమె దగ్గర లేకపోయాయి. ఆమె అదృష్టమో ఏమో కానీ, ద్రవ రూపంలో ఉన్న బంగారం ద్వారా ఆమెకు సహాయం లభించింది. ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి తల్లి పాల బ్యాంకును ఒక ఎన్‌జీవో స్థాపించింది. కిందటి సంవత్సరం ఏప్రిల్ మాసం నుంచి, ఈ సంస్థ ‘తల్లి పాల’ను అవసరమైన వారికి ఉచితంగా అందిస్తోంది. నిపుణులు ఈ పాలను ‘లిక్విడ్ గోల్డ్’ అని ప్రశంసిస్తున్నారు.

ఒక గవర్నమెంట్ హాస్పిటల్‌లోని, చిన్న ప్రదేశంలో అత్యంత ఆధునిక పరికరాలతో ఈ సంస్థను స్థాపించారు. తల్లుల దగ్గర నుంచి అధికంగా ఉత్పత్తి అవుతున్న తల్లిపాలను సేకరిస్తారు ఈ సంస్థ నిర్వాహకులు. అయితే ఆ పాలను తీసుకునే ముందే, పాలిచ్చే తల్లులకు గొట్టం ద్వారా  హెఐవి, హెపటైటిస్ వంటి అనేక రకాల పరీక్షలు నిర్వహించి, ఆ తరువాతే పాలను సేకరిస్తారు. వెంటనే ఆ పాలను పాశ్చరైజ్ చేసి, ఆ తరువాత వాటిని ఫ్రోజెన్ చేసి నిల్వ చేస్తారు. ఈ పాలు నాలుగు నెలల వరకు నిల్వ ఉంటాయి.

దగ్గరలో ఉన్న తల్లుల నుంచి...

పరిసరాలలో ఉన్న తల్లుల దగ్గరకు వెళ్లి, వారి దగ్గర అధికంగా ఉన్న తల్లిపాలను ఈ సంస్థవారు అడిగి తీసుకువస్తారు. బ్యాంకు ప్రారంభమయ్యాక ఇప్పటివరకు 660 మందికి పైగా తల్లులకు స్వచ్ఛందంగా పాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అలా వారి నుంచి సేకరించిన పాలను 450 మంది పిల్లలకు అందచేయగలిగారు. ముఖ్యంగా ఉదయ్‌పూర్‌లోని ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్న పసికందులకు (మీనా బిడ్డలాంటి వారికి) ఈ పాలను అందచేశారు.ఙఞ్చట‘‘మా అబ్బాయి చాలా వేగంగా కోలుకొంటున్నాడు’’ అంటారు మీనా భర్త. బిడ్డను ఇంటెన్సివ్ కే ర్‌లో ఉంచిన ఆరు రోజులకో ‘లిక్విడ్ గోల్డ్’ వల్ల ఆ పసికందులో ఎంతో మార్పు కనిపించింది. నెల రోజుల తర్వాత మీనా తన బిడ్డను తీసుకుని ఎంతో ఆనందంగా ఇంటికి చేరుకుంది.

రకరకాల అనారోగ్యాల కారణంగా 2001 - 2012 మధ్య కాలంలో ఐదు సంవత్సరాల లోపు వయసున్న 2.3 మిలియన్ల పిల్లలు మర ణించారు. భారతదేశంలో నేటికీ 20 శాతం శిశు మరణాలు నమోదవుతున్నాయి. మరణించిన వారిలో 28 రోజుల పసికందుల సంఖ్య సగానికి పైగా ఉంటోంది. ఈ మరణాలకు కారణం ముఖ్యంగా రకరకాల ఇన్ఫెక్షన్లు, తక్కువ బరువుతో పుట్టడం, మొదటి నెలలోనే ఏదో ఒక అనారోగ్యం కలగడం, విరేచనాలు, నిమోనియా మొదలైనవి అంటున్నారు డాక్టర్లు.

పోషకాహారం...

శిశు మరణాలను ఆపడంలో భాగంగా ఈ సంస్థ చేపట్టినదే ‘లిక్విడ్ గోల్డ్’ బ్యాంక్. అప్పుడే పుట్టిన పసికందులకు తల్లి పాలను మించిన పోషకాహారం లేదు. ఎన్నో వ్యాధులు రాకుండా కాపాడగలిగే శక్తి తల్లి పాలకి మాత్రమే ఉంది. ముఖ్యంగా బిడ్డ జన్మించగానే తల్లి పాలు పట్టిస్తే అది అమృతంతో సమానం. కనీసం బిడ్డకు ఆరు నెలలు వచ్చేవరకైనా తల్లి పాలు తప్పనిసరిగా పట్టించాలి. ప్రపంచం ఆరోగ్య సంస్థ, యునిసెఫ్ సంస్థలు ఈ విషయాన్ని సంపూర్ణంగా అంగీకరించాయి. అనేక రాష్ట్రాలలోని ఎన్‌జివోలు... తల్లి పాలను సేకరించే బ్యాంకులను స్థాపించడానికి నడుం బిగిస్తున్నాయి. అనేకమంది ఆరోగ్య నిపుణులు ఈ సేవలను స్వాగతిస్తున్నారు. అయితే ఇందుకోసం బాగా కృషి చేయాలని మాత్రం చెబుతున్నారు.

‘‘పాలను సేకరించడం, సేకరించిన పాలను అవసరంలో ఉన్న వారికి వినియోగించడం చాలా కష్టం. ఎందుకంటే తల్లి పాల వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయనే విషయంలో చాలా మందికి నమ్మకం లేదు’’ అంటారు డా. ఆర్మిడా ఫెర్నాండెజ్. 1989లో ముంబై లో మొట్టమొదటి తల్లి పాల బ్యాంకును స్థాపించారు ఈయన.

పోస్ట్‌మ్యాన్... ఢిల్లీలో లాభాపేక్ష లేకుండా స్థాపించిన తల్లి పాల కేంద్రం గురించి, విస్తృతంగా ప్రచారం చేస్తున్న అరుణాగుప్తా, ‘తల్లి పాల వల్ల శిశు మరణాలను తగ్గించవచ్చు’ అని పూర్తిగా నమ్ముతున్నారు. ద క్షిణ అమెరికాలో ప్రపంచంలో ఎక్కడా లేనన్ని తల్లి పాల కేంద్రాలు ఉన్నాయి. అక్కడ ఈ కేంద్రాల సంఖ్య 200 పై మాటే. బ్రెజిల్ దేశంలో తల్లి పాలను సేకరించడానికి, తల్లి పాలు అవసరమైన వారికి ఈ పాల గురించి వివరించడానికి తపాలా బంట్రోతులను ఉపయోగించుకుంటున్నారు. ఎక్కడ తల్లి పాలు అధికంగా లభిస్తాయో పోస్ట్ మ్యాన్ చెబితే చాలు అక్కడకు వెళ్లి బ్యాంకు వారు పాలను తీసుకువస్తారు. అలాగే ఎక్కడైనా కన్నతల్లి... బిడ్డకు పాలిచ్చే స్థితిలో లేదని సదరు పోస్ట్‌మ్యాన్ చెప్పగానే, వారికి ఈ పాలను అందచేస్తున్నారు. ఈ విధానం వల్ల బ్రెజిల్‌లో శిశు మరణాల సంఖ్య 73 శాతం తగ్గింది. బ్రెజిల్‌లో ఇప్పుడు ఐదు సంవత్సరాల లోపు వయసు శిశు మరణాల సంఖ్య వెయ్యికి పద్నాలుగు మంది మాత్రమే అని యునిసెఫ్ చెబుతోంది. భారతదేశంలో ఈ సంఖ్య నాలుగు రెట్లు ఎక్కువగా ప్రతి వెయ్యి మందికి 56 మంది శిశువులు మరణిస్తున్నారని ఆ సంస్థ చెబుతోంది.
ఏది ఏమైనా తల్లి పాల సేకరణ, వినియోగం విషయంలో బ్రెజిల్ మొదటిస్థానంలో ఉంది.

డా. అగర్వాల్‌కి మాత్రంకి ఒక పెద్ద కల ఉంది.  ‘ఎప్పటికైనా తల్లి పాలను పాల పొడిగా మార్చి సరుకుల దుకాణాలలో అందరికీ అందుబాటులో లభ్యమయ్యేలా చూడాలి’ అని. పశువుల పాలు పొడి రూపంలో దొరుకుతున్నప్పుడు, తల్లి పాలు మాత్రం ఆ రూపంలో ఎందుకు తయారుచేయలేం... అంటున్నారు అగర్వాల్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement