అమృతాన్ని పంచే అమ్మలు! | Mother milk bank in hyderabad | Sakshi
Sakshi News home page

అమృతాన్ని పంచే అమ్మలు!

Published Tue, Jun 3 2014 10:44 PM | Last Updated on Sat, Sep 2 2017 8:16 AM

అమృతాన్ని పంచే అమ్మలు!

అమృతాన్ని పంచే అమ్మలు!

తల్లిప్రేమకు సాటి మరేదీ రాదు.
 అలాగే తల్లిపాలకు కూడా.
 తల్లిపాలకు ప్రత్యామ్నాయం లేదు.
 అమ్మ పాలు అంటే అమృతమే...
 ఆ అమృతాన్ని పంచగలిగింది అమ్మలే!!
 మరి పురిటిలోనే తల్లికి దూరమైన బిడ్డకు?
 మరో తల్లి పెద్ద మనసుతో తన బిడ్డతోపాటు తల్లిలేని బిడ్డకూ పాలివ్వడం ఒక్కటే మార్గం.
 అందుకు ముందుకు వచ్చే వాళ్లెంతమంది?
 ఆ ప్రశ్నకు సమాధానంగా
 ‘నేనున్నాను’ అన్నారు లక్ష్మి.
 అలా ముందుకొచ్చే లక్ష్మిలాంటి ఎంతోమంది నుంచి పాలను సేకరించి, చంటి పాపలకు ఆ అమృతాన్ని అందించేందుకు ఇప్పుడు ఓ ‘అమ్మ పాల బ్యాంకు’ ప్రయత్నం జరుగుతోంది.
 
లక్ష్మి తొమ్మిదవ నెల గర్భిణి. ప్రసవం అయిన తర్వాత తన బిడ్డతోపాటు మరో బిడ్డకు కూడా తన పాలనిచ్చి ఆ బిడ్డకు తల్లిపాల లోటును భర్తీ చేస్తానంటూ ‘అమ్మ పాల బ్యాంకు’కు పాలను దానమిచ్చే తొలి దాత అయ్యారు. తన సంకల్పానికి భగవంతుడు సహకరించి తగినన్ని పాలను ప్రసాదించాలని ప్రార్థిస్తున్నారామె. అమ్మ పాలను నిల్వ చేయడం, దానమివ్వడమనే ఆలోచన ఇప్పుడు ‘అమ్మ పాల బ్యాంకు’గా హైదరాబాద్‌లో ఆచరణలోకి వస్తోంది. తల్లిదండ్రులకు దూరమైన బిడ్డలు, తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యానికి బలైపోయి చెత్తకుప్పలోకి విసిరివేతకు లోనయిన చంటిబిడ్డలకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తోంది.

వారిని పెంచి పెద్ద చేసి పిల్లల్లేని వారికి దత్తతనిస్తోంది కూడా. అలాంటి పిల్లలు హైదరాబాద్‌లోని ఒక్క శిశువిహార్‌లోనే వందల్లో ఉంటున్నారు. సరాసరిన రోజుకు పదహారు మంది చంటిబిడ్డలు కొత్తగా వచ్చి చేరుతూనే ఉన్నారు. కొందరిని పెంపకానికి తీసుకునే వాళ్లు తీసుకెళ్లే ప్రక్రియ కొనసాగుతూ ఉండగా... ఏడాదిలోపు పిల్లలు దాదాపు 80  మంది వరకు ఉంటున్నారు. వారందరినీ ప్రభుత్వం పోతపాలతో పోషిస్తోంది. వైద్యం అందిస్తోంది. తల్లిపాలు అందకపోతే అంటువ్యాధులు సులభంగా దాడిచేస్తాయి. పుట్టిన ప్రతి ఐదుగురిలో ఒక బిడ్డ మొదటి పుట్టిన రోజును చూడకనే కన్నుమూస్తోందని, పిల్లలకు తల్లిపాలతోనే ఆరోగ్యకరమైన భావితరం తయారవుతుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిస్తూనే ఉంది.
 
ఈ నేపథ్యంలో ఎ.పి బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనూరాధారావు అనాథ పిల్లలకు తల్లిపాలను అందించడానికి ‘అమ్మ పాల బ్యాంకు’ను ఏర్పాటు చేశారు. పాలను దానం చేయాలనుకునే తల్లులను గుర్తించడం, పాలను సేకరించడం, నిల్వ చేయడం, ఆ పాలను అవసరమైన పిల్లలకు చేర్చడం ఈ ప్రక్రియకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రపంచ పిల్లల దినోత్సవం సందర్భంగా ఈ నెల ఒకటో తేదీన ప్రారంభించారు.
 
ప్రస్తుతం హైదరాబాద్‌కే పరిమితమైన ఈ ప్రయత్నంలో పేరు నమోదు చేసుకున్న తల్లుల దగ్గరకు ‘అమ్మపాల బ్యాంకు’ కార్యకర్తలు రోజుకొకసారి వెళ్లి పాలను సేకరిస్తారు. తమతోపాటు సక్కర్, చల్లదనాన్ని నిలిపి ఉంచే ఫ్లాస్కు తీసుకెళ్తారు. ఆ పాలను స్థానిక లోటస్ హాస్పిటల్‌లోని ఫ్రీజర్‌లో ఉంచడానికి హాస్పిటల్ నిర్వాహకులు అంగీకరించారు. ఆ పాలను చంటిబిడ్డలకు చేర్చడం కూడా కార్యకర్తలే చేస్తారు. పాల సేకరణ పనిలో మహిళలే ఉంటారు.
 
మరో బిడ్డకు ప్రాణదానం చేసిన సంతృప్తి!

పాల దానం చేయడం ద్వారా మరో బిడ్డకు ప్రాణం పోసిన తల్లిగా సంతృప్తిని పొందవచ్చు. అయితే ‘‘నీ ఉదారత చాటుకోవడం కోసం కన్న బిడ్డను అర్ధాకలితో ఉంచుతావా’’ అని భర్త, అమ్మానాన్నలు, అత్తమామలు ప్రశ్నించడం సహజమే. సంగతిని వివరించి వాళ్లను సమాధానపరచడం చాలా ముఖ్యం. ఈ సందేహాలను నిపుణులు నివృత్తి చేస్తారు. పాలను దానం చేసే తల్లులు క్యాల్షియం లోపం రాకుండా, రక్తహీనతకు లోనుకాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటే చాలు... ఇద్దరు బిడ్డలకు పాలివ్వడం కష్టమేమీ కాదు.
 
తల్లిపాలదానం అనే జ్యోతిని లక్ష్మి ఉదాత్తమైన మనసుతో అందుకున్నారు. ఆమె నుంచి ఈ జ్యోతిని అందుకుంటూ ప్రస్థానాన్ని కొనసాగించడానికి మరెందరో తల్లులు ముందుకు వస్తారు. ఇందుకు నిదర్శనం ప్రారంభోత్సవం రోజునే హైదరాబాద్‌లోని మదీనాగూడలోని సత్యవేణి మురుగన్ నుంచి వచ్చిన ఫోన్‌కాలే!. బిడ్డ కోసం తల్లి ఏం చేయడానికైనా సిద్ధమవుతుంది. తల్లి మనసు... తల్లి లేని బిడ్డకు తల్లి ప్రేమను పంచడానికి ఏ మాత్రం సంశయించదు. తల్లి పాలు లేని బిడ్డను కూడా ఆదరించగలుగుతుంది. అందుకే ప్రపంచంలో అన్నింటికంటే తల్లి గొప్పది, తల్లి మనసు ఇంకా గొప్పది. అచ్చం తల్లిపాలలాగే.
 - వాకా మంజులారెడ్డి
 ఫొటో: ఠాకూర్

 
దేశంలో ఇదే తొలి ప్రయత్నం!
దేశంలో ఈ ప్రక్రియ దాదాపు పది హాస్పిటళ్లలో ఉంది. అనారోగ్య కారణాల వల్ల తల్లి లేదా బిడ్డ ఐసియులో ఉన్నప్పుడు తల్లి నేరుగా పాలివ్వడం కుదరదు. అలాంటప్పుడు తల్లి నుంచి సేకరించిన పాలను హాస్పిటల్ వాళ్లే బిడ్డకు టైమ్ ప్రకారం పడతారు. అయితే ఈ పద్ధతిని తల్లికి దూరమైన బిడ్డలకు పట్టే ప్రయత్నం చేయడం మాత్రం మన దేశంలో ఇదే మొదటిసారి. గతంలో పురిట్లో తల్లిపోయిన బిడ్డలకు మరో తల్లి విశాల దృక్పథంతో తనబిడ్డతోపాటుగా పాలిచ్చి బతికించేది. అలాంటిదే ఇది కూడా.
 - అనూరాధారావు, ఎ.పి బాలల హక్కుల సంఘం నిర్వాహకురాలు
 
తల్లులకు ఏ రకంగా మేలు!
సెల్ఫ్ కాంట్రాసెప్టివ్... సాధారణంగా పాలిస్తున్నంత కాలం గర్భధారణ జరగదు.
 బినైన్ కణుతులు... పాలు ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఉండి కూడా వినియోగించుకోని వారిలో రొమ్ములలో బినైన్ కణుతులు ఏర్పడడాన్ని గమనిస్తుంటాం. ఇవ్వగలిగినంత కాలం బిడ్డకు పాలివ్వడం వల్ల ఈ కణుతులను నివారించవచ్చు.

బిడ్డను కోల్పోయిన మహిళ మానసిక స్థితి ఆందోళనకరంగా ఉంటుంది. అలాంటి వారు ఈ సమయాన్ని మరో బిడ్డకు పాలివ్వడానికి కేటాయిస్తే మానసిక సాంత్వన కలుగుతుంది. ఒక బిడ్డ ప్రాణాన్ని నిలుపుతున్నాననే సంతోషం ఉంటుంది.
 
తల్లి పాల గురించి ...
- చంటిబిడ్డకు రోజుకు 150 మిల్లీలీటర్ల తల్లిపాలు కావాలి.
- ఆరోగ్యవంతమైన తల్లికి రోజుకు 600- 700 మి.లీ పాలు ఉత్పత్తి అవుతాయి.
- ఒక బిడ్డ గరిష్ఠంగా 300 మిల్లీలీటర్ల పాలను మాత్రమే తాగుతుంది.
- తల్లి నుంచి సేకరించిన పాలను 63 డిగ్రీల ఫారన్‌హీట్‌లోపు ఉష్ణోగ్రతలో నిల్వ చేస్తే 90 రోజులు ఉంటాయి. పాశ్చరైజేషన్ చేస్తే ఆరు నెలలు పాడవవు.
- ఎందరు తల్లుల పాలనైనా కలిపి ఒకే పాత్రలో నిల్వ చేయవచ్చు.
- మొదటిసారి పాలను సేకరించిన తర్వాత ఆ పాలను స్క్రీనింగ్ చేస్తారు.
 
అవకాశం ఉంటే వదులుకోవద్దు!
అవసరం నుంచి వచ్చిన ఆలోచన ఇది. పాలు లేని పిల్లలు ఎదురుగా కనిపిస్తుంటే చూస్తూ ఊరుకోవడం చేతకాలేదు. నా భర్త వెంటనే ఒప్పుకున్నారు. తర్వాత నా బిడ్డకు వచ్చిన నష్టం ఏమీ లేదని అమ్మకు, అత్తగారికి వివరించాను. నేను బాలింతలకు చెప్పేది ఒక్కటే... ‘మరో బిడ్డను కాపాడే అవకాశం ఉంటే దానిని అనవసరమైన భయాలతో వదులుకోవద్దు. ప్రాణం పోయడంలో ఉండే ఆనందాన్ని అనుభవంలోకి తెచ్చుకోండి’ అని.
 - లక్ష్మి, అమ్మపాల దానానికి సిద్ధపడిన కాబోయే తల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement