తల్లిపాలతో వ్యాపారం వద్దే వద్దని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) తేల్చి చెప్పేసింది. మానవ తల్లిపాలు, దాని ఉత్పత్తులను విక్రయించరాదని గట్టి హెచ్చరికలు జారీ చేసింది.
‘మానవ తల్లిపాలు, దాని ఉత్పత్తుల వాణిజ్యీకరణకు సంబంధించి వివిధ రిజిస్టర్డ్ సొసైటీల నుంచి ఈ కార్యాలయానికి విజ్ఞప్తులు అందుతున్నాయి. ఎఫ్ఎస్ఎస్ చట్టం, 2006 కింద మానవ తల్లిపాలను ప్రాసెసింగ్ చేయడానికి, విక్రయించడానికి ఎఫ్ఎస్ఎస్ఎఐ అనుమతించదు’ ప్రకటనలో ఎఫ్ఎస్ఎస్ఎఐ తెలిపింది.
మానవ తల్లిపాలు, దాని ఉత్పత్తుల వాణిజ్యీకరణకు సంబంధించిన అన్ని కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని పేర్కొంది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే ఎఫ్ఎస్ఎస్ చట్టం, 2006తోపాటు దాని అనుబంధ నియమనిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లను (ఎఫ్‌బీఓ) హెచ్చరించింది.
తల్లి పాలను విక్రయించే ఇలాంటి యూనిట్లకు అనుమతి ఇవ్వవద్దని ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సింగ్ అధికారులను కోరింది. 'మదర్స్ మిల్క్/హ్యూమన్ మిల్క్' ప్రాసెసింగ్ లేదా అమ్మకంలో పాల్గొనే ఇలాంటి ఎఫ్‌బీఓలకు ఎలాంటి లైసెన్స్/ రిజిస్ట్రేషన్ ఇవ్వకుండా రాష్ట్ర, కేంద్ర లైసెన్సింగ్ అథారిటీలు చూసుకోవాలని సూచించింది.
జాతీయ మార్గదర్శకాల ప్రకారం డోనర్ హ్యూమన్ మిల్క్ (డీహెచ్ఎం)ను వాణిజ్య అవసరాలకు ఉపయోగించకూడదు. కాంప్రహెన్సివ్ పాలిటీ మేనేజ్‌మెంట్ సెంటర్స్ (సీఎల్ ఎంసీ)ల్లోని ఆరోగ్య కేంద్రాల్లో చేరిన శిశువులకు దీన్ని అందించవచ్చు. తల్లిపాలను ఇచ్చే దాత ఇందుకోసం ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలు లేకుండా స్వచ్ఛందంగా దానం చేయాలి. దానం చేసిన పాలను ఆసుపత్రిలోని నవజాత శిశువులు, ఇతర తల్లుల శిశువులకు ఆహారం అందించడానికి ఉచితంగా ఉపయోగించాలని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment