వన్య మృగాలలో కమ్మనైన అమ్మతనం
పిల్లల దగ్గరకు వస్తే చీల్చి చెండాడే క్రూరత్వం
మరికొన్ని జంతువులు, పక్షుల్లో అరుదైన మమకారం
పులి – ఆవు.. పాము – కాకి నీతి కథలు
అందరికీ తెలిసే ఉంటాయి. కథల సారాంశం ఏదైనా.. అందులో తల్లి ప్రేమ కనిపిస్తుంది. మనుషుల్లోనే కాదు పశుపక్షాదుల్లో కూడా కమ్మనైన అమ్మతనం ఎంతో మధురం. తల్లి జంతువు ప్రేమ ముందు ఏ ప్రాణి అయినా, జీవి అయినా తలవంచక తప్పదు.
తన కళ్లముందు తన బిడ్డకు కష్టం వస్తే తిరగబడి పోరాడుతుంది. ఇలాంటి దృశ్యాలు ఎక్కువగా అడవుల్లో కనిపిస్తాయి. అతి చిన్న ప్రాణి అయిన గిజిగాడు మొదలు అతి క్రూరమైన జంతువులుగా చెప్పుకునే పులి, చిరుత, ఎలుగుబంటి వంటి జంతువుల వరకు వాటి పిల్లల లాలన చూస్తే ‘తల్లి ప్రేమ అడవంతా’ అని అనకమానరు.
– ఆత్మకూరు రూరల్
పశుపక్షాదుల్లో తల్లి ప్రేమను దగ్గరిగా పరిశీలిస్తే కొన్ని ఆసక్తికర విషయాలు కనిపిస్తాయి. కోతి, పిల్లులు తమ పిల్లల పెంపకం అందరికీ తెలిసే ఉంటుంది. మాతృప్రేమలో మాత్రం మర్కటాలు మనుషులకే పాఠాలు చెబుతాయి. ఇక పిల్లి నిండు గర్భంతో ఉన్నపుడే తను ప్రసవించే ప్రదేశాన్ని ఎంచుకుని ప్రసవానంతరం కొంత సమయ వ్యత్యాసంతో పిల్లలను కనీసం ఏడు చోట్లకు మార్చడం దాని విశిష్ట లక్షణం. కీటకాలు, పక్షులు, జంతువుల్లో తల్లి ప్రేమ నిశితంగా పరిశీలిస్తే ఔరా.. అనాల్సిందే.
నల్లమల అడవుల్లో పెద్దపులులు ప్రధాన రక్షిత జీవి. అంతరించి పోయే దశకు చేరుకుంటున్న వాటి సంతతిని పెంచి పోషించడంలో ఆడ పులులు ఒక యుద్ధ్ధమే చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఈతలోనూ రెండు నుంచి నాలుగు పిల్లలకు జన్మనిచ్చే ఆడపులి వాటిని పెంచడంతో ఎంతో క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. పులి పిల్లలకు ప్రధాన ముప్పు మగపులుల నుంచే ఉంటుంది. సాధారణంగా పులి తన పిల్లలకు మూడేళ్ల వయçస్సు దాటేంత వరకు అవి స్వయంగా తమ ఆహారం సంపాదించుకునే నైపుణ్యం పొందే వరకు తిరిగి సమాగానికి సిద్ధపడదు. అందుకే మగ పులులు ఈ పిల్లలను అడ్డు తొలగిస్తే ఆడపులితో సమాగానికి సిద్ధ పడవచ్చనే ధోరణే పులి పిల్లలకు ప్రమాదం తెచ్చి పెడుతుంది.
అందుకే తన సంతానం సమీపంలోకి మగపులి రాకుండా ఆడపులి తరిమి కొడుతుంది. పులిపిల్లలకు మరో ప్రమాదం నక్క, తోడేలు, కొండ్రాసిగాడుగా పిలువబడే దొమ్మలగొండి (హైనా)వంటి స్కావెంజర్ జంతువుల నుంచి కూడా పొంచి ఉంటుంది. తల్లి పులి ఆహారం కోసం వెళ్లినప్పుడు ఈ జంతువులు పులి పిల్లలకు హాని కలిగిస్తాయి. అందుకే తల్లి పులి తన పిల్లలను గుహల్లో, చెట్టు బొరియల్లో ఉంచి వాటి ఉనికి బయటకు తెలియనంతగా జాగ్రత్త పడుతుంది. ఆహార సేకరణ కోసం పెద్దగా పిల్లలను విడిచి దూరం వెళ్లదు. పిల్లలు కాస్త తిరుగాడే వయస్సు వచ్చినపుడు వాటిని వెంట పెట్టుకునే వేటకు ఉపక్రమిస్తుంది. అప్పుడు పులి పిల్లలు మొదట తల్లి చేసే వేట పద్ధతులను పరిశీలిస్తూ మెల్లమెల్లగా వేటాడేందుకు సిద్ధమవుతాయి.
ఆహారం భద్రపరిచి.. కూనల కడుపు నింపి
పిల్లి కుటుంబానికే చెందిన చిరుతపులి (లెప్పర్డ్) కూడా రెండు నుంచి మూడు పిల్లలను పెడుతుంది. ఇది కూడా పెద్దపులిలాగే పిల్లల కోసం అత్యంత అప్రమత్తంగా సంచరిస్తుంది. పిల్లి జాతిలో పిల్లి తరువాత చెట్టు ఎక్కగలిగే సామర్థ్యం ఉన్న ఏకైక పులి చిరుత మాత్రమే.
ఈ ప్రత్యేకతను తన పిల్లలకు ఆహారం దాచి పెట్టే విషయంలో ఉపయోగించుకుంటుంది. పిల్లలను భధ్రమైన చోట దాచి వేటకు వెళ్లి తాను చంపి తెచ్చిన వేట జంతువు కళేబరాన్ని పిల్లల ముందు ఆహారంగా వేస్తుంది. అవి తినగా మిగిలిన భాగాన్ని చెట్టు కొమ్మపై భద్రపరచి మరుసటి రోజు మళ్లీ ఆకలిగొన్న పిల్లలకు పెడుతుంది.
అంతా.. ఏకాంతం..
ఎత్తైన, ముదిరిన వృక్షాల కాండాలపై సహజంగా ఏర్పడ్డ తొర్రలను ఆడ హార్న్‌బిల్ గూడుగా ఎంపిక చేసుకుంటుంది. వయస్సు కొచ్చిన మగపక్షి తనతో జతగట్టేందుకు అంగీకరించిన ఆడపక్షితో కలసి ఇలాంటి తొర్రల్లో ప్రవేశిస్తు్తంది. ఆపై ఆడపక్షి తొర్ర ప్రవేశ మార్గాన్ని చెట్ల బెరళ్లు, కర్ర పుల్లలు, బంక మట్టితో కలిపి మూసివేస్తుంది. గాలి చొరబడేందుకు మాత్రం చిన్న రంధ్రాన్ని మాత్రం ఉంచుకుంటుంది. సమాగమనంతరం మగ పక్షి మూసిన ప్రవేశ మార్గాన్ని తిరిగి తెరుచుకుని బయటకు వస్తుంది.
ఆడపక్షి మాత్రం గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లలను చేసే వరకు గూటిలోనే జైలు జీవితం గడుపుతుంది. మూసివేయబడిన తొర్ర ప్రవేశ మార్గానికి ఏర్పరచిన చిన్నపాటి రంధ్రం ద్వారానే ఆడపక్షికి.. మగపక్షి ఆహారాన్ని అందిస్తుంది. అనంతరం ఆడపక్షి గూటి వెలుపలికి వచ్చి పిల్లలున్న గూటిని తిరిగి మూసి వేస్తుంది. ఆ తరువాత పక్షి దంపతులు కలసి పిల్లల పోషణ భారం వహిస్తాయి. పిల్లలకు రెక్కలొచ్చి గాలిలో ఎగిరే వరకు ఈ తరహా రక్షణలోనే వాటి పోషణ సాగుతుంది.
నీ ప్రేమ భల్లూకం గాను..
వన్యప్రాణుల్లో తల్లులన్నింటిలోను ఎలుగుబంటి అమితమైన ప్రత్యేక శైలి కలిగినది. ఆడ ఎలుగు బంటి తన పిల్లలను వాటికి వేగంగా పరిగెత్తగల వయçస్సు వచ్చే వరకు తన మూపున మోసుకుని తిరుగుతూ ఉంటుంది. పుట్టలు తవ్వి చెదపురుగులను, చెట్టు ఎక్కి తేనె పట్టును తెచ్చి పిల్లలకు పెడుతూ ఎంతో ప్రేమ పూర్వకంగా పిల్లలను సాకుతుంది. పిల్లలున్న ఎలుగు బంటి మరింత క్రోధంతో సమీపంలోకి వచ్చే జంతువును, మనిషిని చీల్చి చెండాడుతుంది. ళీ నల్లమలలోని హనీబాడ్జర్ నేల బొరియలలో నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. తమ పిల్లలు ఇతర జంతువుల బారిన పడకుండా బొరియలో ప్రత్యేక గదులు తవ్వుకుని రక్షణ కల్పిస్తాయి.
గిజిగాడు పక్షి అందమైన గూళ్లను అత్యంత భధ్రమైన ప్రదేశాలలో (చిటారు కొమ్మలకు నీటి తలం అంచున) కట్టి అందులో గుడ్లను పొదిగి పిల్లలకు నిరంతరం కీటకాలను, ధాన్యం గింజలను ఆహారంగా అందించి పెంచుతుంది.
కందిరీగలు వివిధ కీటకాల లార్వాలను తీసుకు వచ్చి గూడులో ఉన్న పిల్లలకు ఆహారంగా పెడతాయి.
తేనె టీగలు తెట్టెలో షడ్భుజాకారంలో ఉండే గదుల్లో ఉండే పిల్ల ఈగలకు అవి సేకరించిన మకరందాన్ని ఆహారంగా అందిస్తాయి.
రేచుకుక్కలు (వైల్డ్ డాగ్స్) వేట జంతువులను చంపి మాంసాన్ని కడుపులో నిల్వ చేసుకుని తమ పిల్లల వద్దకు వెళ్లి వాటి ముందు మాంస కండలను కక్కి తినిపిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment