nallamala forest
-
పులి కోటలో ఓ రాత్రి!
ప్రకృతి రమణీయతకు మారుపేరు నల్లమల అభయారణ్యం (Nallamala Forest). విశేషమైన వృక్ష సంపద... లెక్కలేనన్ని వన్యప్రాణులు... పక్షులు... క్రూరమృగాలు... ఔషధ మొక్కలు ఈ అడవి సొంతం. పులులకు పెట్టని కోటగా పేరొందిన నల్లమలలో జాలీగా జంగిల్ సఫారీ (jungle safari) చేస్తూ వన్యప్రాణులను ప్రత్యక్షంగా తిలకించేందుకు అటవీశాఖ అవకాశం కల్పిస్తోంది. నంద్యాల జిల్లా పరిధిలోని పచ్చర్ల, బైర్లూటిలలో ఏర్పాటుచేసిన ఎకో టూరిజం ప్రాజెక్టుల నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అమలు చేస్తోంది. వినోదంతోపాటు విజ్ఞానాన్ని అందించేందుకు నల్లమలలోని నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ ప్రాజెక్ట్ (ఎన్ఎస్టీఆర్) స్వాగతిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం... నిర్భయంగా పులి కోటలో ఓ రాత్రి గడిపేద్దాం పదండి.ఆళ్లగడ్డ: రోజువారీ ఉరుకుల పరుగుల జీవన పోరాటంలో అలసిన మనసులను ఆహ్లాదపరిచేందుకు... ప్రకృతి ప్రేమికులకు ఆనందాన్ని పంచేందుకు.. నల్లమలలోని పచ్చర్ల, బైర్లూటి ఎకో టూరిజం (Eco Tourisam) కేంద్రాలు స్వాగతం పలుకుతున్నాయి. అహోబిలం, యాగంటి, మద్దిలేటయ్య, మహానంది, శ్రీశైల మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తులతోపాటు ఆసక్తిగల ప్రజలకు జంగిల్ సఫారీకి అటవీశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వారాంతాలు, సెలవు రోజుల్లో కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీ సంఖ్యలో జంగిల్ సఫారీకి విచ్చేస్తున్నారు. రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతున్నారు. ఇక్కడి సౌందర్యాన్ని చూడటానికి విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుండటం విశేషం. ముఖ్యంగా ఫొటోషూట్ల కోసం కొత్త జంటలు క్యూ కడుతున్నాయి. వన నివాసం ఇలా... » పచ్చర్ల, బైర్లూటీ ఎకో టూరిజం క్యాంప్‌ల నుంచి ఓపెన్ టాప్ సఫారీ (జీపు)లు పర్యాటకుల కోసం అందుబాటులో ఉంటాయి. » ఒక్కో వాహనంలో 10 మంది కూర్చోవచ్చు. ఒక్కో వ్యక్తికి రూ.300 చొప్పున కనీసం ఐదుగురు ఉండాలి. లేదా రూ.1,500 చెల్లించి ఒకరు, ఇద్దరు అయినా వెళ్లవచ్చు.» ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అడవిలో పర్యటించి క్యాంపునకు చేరుకోవాల్సి ఉంటుంది. » పర్యాటకులను కనువిందు చేసేందుకు ఎకోవాక్, హెరిటేజ్‌వాక్, జంగిల్ సఫారీ, ట్రెక్కింగ్, కయా కింగ్, బర్డ్స్ బట్టర్ ఫ్లై గార్డెన్ వంటివి ఏర్పాటు చేశారు.» సాయంత్రం ఐదు గంటల వరకు అటవీ ప్రాంతంలో తిరిగి వచ్చినవారికి జంగిల్ క్యాంప్‌లో రాత్రి బస చేసేందుకు సాధారణ కాటేజీలు, మిలట్రీ టెంట్ హౌజ్, ఉడెన్ కాటేజీలతోపాటు వన కుటీర్ (మట్ కాటేజీ)లు అందుబాటులో ఉన్నాయి.» కాటేజీ ఒక రోజు అద్దె రూ.6 వేల నుంచి రూ.9వేల వరకు ఉంటుంది. ఇద్దరు బస చేయవచ్చు. అంతకుమించి ఉంటే ఒక్కో వ్యక్తికి అదనంగా రూ.1,500 చెల్లించాలి. » కాటేజీ బుక్ చేసుకున్నవారికి జంగిల్ సఫారీ, భోజనం, టీ, టిఫిన్ వంటివి ఉచితం. చిన్నపిల్లలు ఆడుకునేందుకు రకరకాల ఆటవస్తువులు అంటుబాటులో ఉన్నాయి. » కాటేజీ బుక్ చేసుకోకపోయినా ఉదయం వచ్చి ఐదుగురితో కలిసి రూ.1,500 చెల్లించి జంగిల్ సఫారీ చేయడంతోపాటు సాయంత్రం వరకు ఎకో టూరిజం క్యాంపులో గడపవచ్చు.ఇలా వెళ్లాలి... » నంద్యాల–గిద్దలూరు మార్గంలో నంద్యాలకు 25 కిలో మీటర్లు, గిద్దలూరుకు 35 కిలో మీటర్ల దూరంలో పచ్చర్ల ఎకో టూరిజం క్యాంప్ ఉంది.» ఆత్మకూరు నుంచి శ్రీశైలం వెళ్లే రహదారిలో 14 కిలో మీటర్ల దూరంలో బైర్లూటీ ఎకో టూరిజం క్యాంపు ఉంది.» ఈ క్యాంపుల వద్దకు పర్యాటకులు రోడ్డు మార్గాన ఆర్టీసీ బస్సులు లేదా సొంత వాహనాల్లో చేరుకోవాలి. పర్యాటకుల ఆసక్తి మేరకు ఎకో టూరిజం క్యాంపుల్లో విడిది కల్పిస్తారు.» అక్కడి నుంచి సఫారీలో నల్లమల అందాలు తిలకించేలా అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.జంగిల్ సఫారీ సాగేదిలా.. » క్యాంపుల నుంచి సుమారు 25 నుంచి 30 కిలో మీటర్లు నల్లమలలోని టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో జంగిల్ సఫారీ సాగుతుంది. » ఆహ్లాదకరమైన వాతావరణంలో నెమళ్లు, వివిధ రకాల పక్షులు, జింకలు, దుప్పులు, అడవి పందులు, కొండ గొర్రెలు, భయపెట్టే కొండ చిలువలు, తాచు పాములు వంటివాటి మధ్య ఈ పర్యటన ఆద్యంతం కొనసాగుతుంది. » మధ్యలో రెండు చోట్ల వాచ్ టవర్లను ఏర్పాటు చేశారు. సందర్శకులు వీటిని ఎక్కితే నల్లమల అంతా చూడవచ్చు. » ప్రస్తుతం నల్లమలలో దాదాపు 50 చిరుత పులులు, 70 పెద్ద పులులు ఉన్నట్లు అంచనా. అప్పుడప్పుడు చిరుత, పెద్ద పులులు కూడా జంగిల్ సఫారీలో కనిపిస్తున్నాయి.» అడవిలోకి వెళ్లే పర్యాటకులు అటవీ సిబ్బంది ఆపిన చోట మాత్రమే కిందకు దిగాలి. అడవి మధ్యలో దిగడం, ఫొటోలు తీసుకోవడం పూర్తిగా నిషేధం.» జంగిల్ సఫారీకి నల్లమలలో స్థానికంగా నివసించే చెంచులే గైడ్లుగా ఉంటూ చూపిస్తారు. పక్షులు, వన్యప్రాణుల విశిష్టతలను వివరిస్తారు. ఆహ్లాదకరంగా ఉంది: చందన, సాఫ్ట్వేర్ ఉద్యోగి, చెన్నైస్నేహితుడి పెళ్లి తర్వాత ఆల్బమ్ కోసం ఫొటో షూట్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. ముందుగా ఇంత ఆహ్లాదకరంగా ఉంటుందని అనుకోలేదు. ఇప్పుడు మళ్లీమళ్లీ రావాలనిపిస్తోంది. చాలా బాగుంది.మళ్లీ రావాలని అనుకుంటున్నాం: చందన, కర్నూలుకుటుంబ సభ్యులతో కలిసి మొదటిసారి ఇక్కడికి వచ్చాం. పచ్చర్ల జంగిల్ సఫారీ చాలా బాగుంది. మరోసారి బంధువులు అందరితో కలిసి రావాలని అనుకుంటున్నాను. అడవి వాతావరణంలో విహరించడం అద్భుతంగా ఉంది. -
అడవిలో అమ్మప్రేమ!
పులి – ఆవు.. పాము – కాకి నీతి కథలుఅందరికీ తెలిసే ఉంటాయి. కథల సారాంశం ఏదైనా.. అందులో తల్లి ప్రేమ కనిపిస్తుంది. మనుషుల్లోనే కాదు పశుపక్షాదుల్లో కూడా కమ్మనైన అమ్మతనం ఎంతో మధురం. తల్లి జంతువు ప్రేమ ముందు ఏ ప్రాణి అయినా, జీవి అయినా తలవంచక తప్పదు.తన కళ్లముందు తన బిడ్డకు కష్టం వస్తే తిరగబడి పోరాడుతుంది. ఇలాంటి దృశ్యాలు ఎక్కువగా అడవుల్లో కనిపిస్తాయి. అతి చిన్న ప్రాణి అయిన గిజిగాడు మొదలు అతి క్రూరమైన జంతువులుగా చెప్పుకునే పులి, చిరుత, ఎలుగుబంటి వంటి జంతువుల వరకు వాటి పిల్లల లాలన చూస్తే ‘తల్లి ప్రేమ అడవంతా’ అని అనకమానరు.– ఆత్మకూరు రూరల్పశుపక్షాదుల్లో తల్లి ప్రేమను దగ్గరిగా పరిశీలిస్తే కొన్ని ఆసక్తికర విషయాలు కనిపిస్తాయి. కోతి, పిల్లులు తమ పిల్లల పెంపకం అందరికీ తెలిసే ఉంటుంది. మాతృప్రేమలో మాత్రం మర్కటాలు మనుషులకే పాఠాలు చెబుతాయి. ఇక పిల్లి నిండు గర్భంతో ఉన్నపుడే తను ప్రసవించే ప్రదేశాన్ని ఎంచుకుని ప్రసవానంతరం కొంత సమయ వ్యత్యాసంతో పిల్లలను కనీసం ఏడు చోట్లకు మార్చడం దాని విశిష్ట లక్షణం. కీటకాలు, పక్షులు, జంతువుల్లో తల్లి ప్రేమ నిశితంగా పరిశీలిస్తే ఔరా.. అనాల్సిందే.నల్లమల అడవుల్లో పెద్దపులులు ప్రధాన రక్షిత జీవి. అంతరించి పోయే దశకు చేరుకుంటున్న వాటి సంతతిని పెంచి పోషించడంలో ఆడ పులులు ఒక యుద్ధ్ధమే చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఈతలోనూ రెండు నుంచి నాలుగు పిల్లలకు జన్మనిచ్చే ఆడపులి వాటిని పెంచడంతో ఎంతో క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. పులి పిల్లలకు ప్రధాన ముప్పు మగపులుల నుంచే ఉంటుంది. సాధారణంగా పులి తన పిల్లలకు మూడేళ్ల వయçస్సు దాటేంత వరకు అవి స్వయంగా తమ ఆహారం సంపాదించుకునే నైపుణ్యం పొందే వరకు తిరిగి సమాగానికి సిద్ధపడదు. అందుకే మగ పులులు ఈ పిల్లలను అడ్డు తొలగిస్తే ఆడపులితో సమాగానికి సిద్ధ పడవచ్చనే ధోరణే పులి పిల్లలకు ప్రమాదం తెచ్చి పెడుతుంది.అందుకే తన సంతానం సమీపంలోకి మగపులి రాకుండా ఆడపులి తరిమి కొడుతుంది. పులిపిల్లలకు మరో ప్రమాదం నక్క, తోడేలు, కొండ్రాసిగాడుగా పిలువబడే దొమ్మలగొండి (హైనా)వంటి స్కావెంజర్ జంతువుల నుంచి కూడా పొంచి ఉంటుంది. తల్లి పులి ఆహారం కోసం వెళ్లినప్పుడు ఈ జంతువులు పులి పిల్లలకు హాని కలిగిస్తాయి. అందుకే తల్లి పులి తన పిల్లలను గుహల్లో, చెట్టు బొరియల్లో ఉంచి వాటి ఉనికి బయటకు తెలియనంతగా జాగ్రత్త పడుతుంది. ఆహార సేకరణ కోసం పెద్దగా పిల్లలను విడిచి దూరం వెళ్లదు. పిల్లలు కాస్త తిరుగాడే వయస్సు వచ్చినపుడు వాటిని వెంట పెట్టుకునే వేటకు ఉపక్రమిస్తుంది. అప్పుడు పులి పిల్లలు మొదట తల్లి చేసే వేట పద్ధతులను పరిశీలిస్తూ మెల్లమెల్లగా వేటాడేందుకు సిద్ధమవుతాయి.ఆహారం భద్రపరిచి.. కూనల కడుపు నింపిపిల్లి కుటుంబానికే చెందిన చిరుతపులి (లెప్పర్డ్) కూడా రెండు నుంచి మూడు పిల్లలను పెడుతుంది. ఇది కూడా పెద్దపులిలాగే పిల్లల కోసం అత్యంత అప్రమత్తంగా సంచరిస్తుంది. పిల్లి జాతిలో పిల్లి తరువాత చెట్టు ఎక్కగలిగే సామర్థ్యం ఉన్న ఏకైక పులి చిరుత మాత్రమే.ఈ ప్రత్యేకతను తన పిల్లలకు ఆహారం దాచి పెట్టే విషయంలో ఉపయోగించుకుంటుంది. పిల్లలను భధ్రమైన చోట దాచి వేటకు వెళ్లి తాను చంపి తెచ్చిన వేట జంతువు కళేబరాన్ని పిల్లల ముందు ఆహారంగా వేస్తుంది. అవి తినగా మిగిలిన భాగాన్ని చెట్టు కొమ్మపై భద్రపరచి మరుసటి రోజు మళ్లీ ఆకలిగొన్న పిల్లలకు పెడుతుంది.అంతా.. ఏకాంతం..ఎత్తైన, ముదిరిన వృక్షాల కాండాలపై సహజంగా ఏర్పడ్డ తొర్రలను ఆడ హార్న్‌బిల్ గూడుగా ఎంపిక చేసుకుంటుంది. వయస్సు కొచ్చిన మగపక్షి తనతో జతగట్టేందుకు అంగీకరించిన ఆడపక్షితో కలసి ఇలాంటి తొర్రల్లో ప్రవేశిస్తు్తంది. ఆపై ఆడపక్షి తొర్ర ప్రవేశ మార్గాన్ని చెట్ల బెరళ్లు, కర్ర పుల్లలు, బంక మట్టితో కలిపి మూసివేస్తుంది. గాలి చొరబడేందుకు మాత్రం చిన్న రంధ్రాన్ని మాత్రం ఉంచుకుంటుంది. సమాగమనంతరం మగ పక్షి మూసిన ప్రవేశ మార్గాన్ని తిరిగి తెరుచుకుని బయటకు వస్తుంది.ఆడపక్షి మాత్రం గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లలను చేసే వరకు గూటిలోనే జైలు జీవితం గడుపుతుంది. మూసివేయబడిన తొర్ర ప్రవేశ మార్గానికి ఏర్పరచిన చిన్నపాటి రంధ్రం ద్వారానే ఆడపక్షికి.. మగపక్షి ఆహారాన్ని అందిస్తుంది. అనంతరం ఆడపక్షి గూటి వెలుపలికి వచ్చి పిల్లలున్న గూటిని తిరిగి మూసి వేస్తుంది. ఆ తరువాత పక్షి దంపతులు కలసి పిల్లల పోషణ భారం వహిస్తాయి. పిల్లలకు రెక్కలొచ్చి గాలిలో ఎగిరే వరకు ఈ తరహా రక్షణలోనే వాటి పోషణ సాగుతుంది.నీ ప్రేమ భల్లూకం గాను..వన్యప్రాణుల్లో తల్లులన్నింటిలోను ఎలుగుబంటి అమితమైన ప్రత్యేక శైలి కలిగినది. ఆడ ఎలుగు బంటి తన పిల్లలను వాటికి వేగంగా పరిగెత్తగల వయçస్సు వచ్చే వరకు తన మూపున మోసుకుని తిరుగుతూ ఉంటుంది. పుట్టలు తవ్వి చెదపురుగులను, చెట్టు ఎక్కి తేనె పట్టును తెచ్చి పిల్లలకు పెడుతూ ఎంతో ప్రేమ పూర్వకంగా పిల్లలను సాకుతుంది. పిల్లలున్న ఎలుగు బంటి మరింత క్రోధంతో సమీపంలోకి వచ్చే జంతువును, మనిషిని చీల్చి చెండాడుతుంది. ళీ నల్లమలలోని హనీబాడ్జర్ నేల బొరియలలో నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. తమ పిల్లలు ఇతర జంతువుల బారిన పడకుండా బొరియలో ప్రత్యేక గదులు తవ్వుకుని రక్షణ కల్పిస్తాయి. గిజిగాడు పక్షి అందమైన గూళ్లను అత్యంత భధ్రమైన ప్రదేశాలలో (చిటారు కొమ్మలకు నీటి తలం అంచున) కట్టి అందులో గుడ్లను పొదిగి పిల్లలకు నిరంతరం కీటకాలను, ధాన్యం గింజలను ఆహారంగా అందించి పెంచుతుంది.కందిరీగలు వివిధ కీటకాల లార్వాలను తీసుకు వచ్చి గూడులో ఉన్న పిల్లలకు ఆహారంగా పెడతాయి.తేనె టీగలు తెట్టెలో షడ్భుజాకారంలో ఉండే గదుల్లో ఉండే పిల్ల ఈగలకు అవి సేకరించిన మకరందాన్ని ఆహారంగా అందిస్తాయి.రేచుకుక్కలు (వైల్డ్ డాగ్స్) వేట జంతువులను చంపి మాంసాన్ని కడుపులో నిల్వ చేసుకుని తమ పిల్లల వద్దకు వెళ్లి వాటి ముందు మాంస కండలను కక్కి తినిపిస్తాయి. -
నల్లమలలో 11వ శతాబ్దం నాటి శిలాశాసనాలు
ఆత్మకూరు రూరల్: గతం తెలియని వారికి భవిష్యత్తు ఉండదని పెద్దలు చెబుతుంటారు. అందుకే గతకాలంలో జరిగిన విషయాలను పరిశోధించి, ఫలితాలను గుదిగుచ్చి చరిత్రగా మన ముందు ఉంచుతుంటారు చరిత్రకారులు. అలాంటి వారి దృష్టికి రాకుండా కొన్ని గతకాలపు ఆనవాళ్లు మరుగున పడిపోతుంటాయి. అలాంటివి కృష్ణా తీరంలో, నల్లమల అడవుల్లో ఎన్నో గుప్తంగా ఉండిపోతున్నాయి. ఇక్కడ కనపడుతున్న రెండు శిలాశాసనాలు కూడా అలాంటివే.. ఇవి నాగార్జునసాగర్ – శ్రీశైలం పులుల అభయారణ్యం ఆత్మకూరు అటవీ డివిజన్లోని ఇందిరేశ్వరం బీట్‌లో పెద్ద గుమ్మితం వద్ద ఉన్నాయి. గుమ్మితం ఒక ప్రాచీన శైవ క్షేత్రం. కొండపైనుంచి దుమికే జలపాతాన్ని ఏర్పరచిన ఒక కొండ వాగు ఒడ్డున ఈ క్షేత్రం ఉంది. ఈ క్షేత్ర ఆవరణలో పురాతన లిపి ఉన్న రెండు శిలా శాసనాలు ఉన్నాయి. బాగా పాతకాలంనాడు అప్పటి వారు ఉపయోగించిన తెలుగు లిపితో ఈ శాసనాలు ఉన్నాయి. ఇవి కాకతీయ – విజయనగర పాలన మధ్య కాలంలోనివి(క్రీశ11–12 శతాబ్ధాలు) అయి ఉండొచ్చునని చరిత్రపై అవగాహన ఉన్న కొందరు చెబుతున్నారు. ఇవి ఎర్రయ్య అనే వ్యక్తి వేయించిన దాన శాసనాలుగా తెలుస్తోంది. మల్లికార్జున స్వామికి ఏదో బహుమానం రూపంలో సమర్పించినట్లు లిపిని కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే తెలుస్తోంది. అయితే ఈ శిలాశాసనాలను పూర్తిస్థాయిలో పరిశోధిస్తే చరిత్రలో మరుగున పడ్డ విషయాలు వెలుగులోకి వస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
నల్లమల ‘మన్ కీ బాత్’.. చెంచులే చేయూత!
సాక్షి, నాగర్‌కర్నూల్: నల్లమలలోని పులులు, వన్యప్రాణుల సంరక్షణలో స్థానిక చెంచులు రక్షణగా ఉంటున్నారు. అడవినే నమ్ముకొని బతుకుతున్న వారు ఇక్కడి చెట్లు, వన్యప్రాణులు, సహజ సిద్ధమైన జలధారల పట్ల ఎంతో మమకారంగా ఉంటారు. వన్యప్రాణుల రక్షణకు అటవీశాఖ సిబ్బందిలోనూ చెంచులు క్షేత్రస్థాయిలో పాలు పంచుకుంటూ అడవికి పహారాగా నిలుస్తున్నారు. నల్లమల అటవీప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని దట్టమైన కోర్ ఏరియాలో 20 వరకు చెంచుపెంటలు, చెంచుల ఆవాసాలు ఉండగా, వీరి సంపూర్ణ తోడ్పాటుతో పులుల సంతతి క్రమంగా పెరుగుతోంది.అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో 2018లో 12 పులులు ఉండగా, ప్రస్తుతం పులుల సంఖ్య 32కు చేరినట్టు అంచనా వేస్తున్నారు. వీటికి తోడు 187 వరకు చిరుతలు, వందల సంఖ్యలో వన్యప్రాణులు, మిశ్రమ జంతుజాతులకు నల్లమల నిలయమైంది. ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ నల్లమలలోని చెంచుల కృషిని ప్రస్తావించారు. ప్రకృతితో మమేకమవుతూ జీవిస్తున్న చెంచులు నల్లమలలో టైగర్ ట్రాకర్లుగా గొప్ప సేవలందిస్తున్నారని కొనియాడారు. ఇక్కడ సంఘర్షణకు తావులేదు.. దేశంలో చాలాచోట్ల పులుల అభయారణ్యాల్లో మనుషులు, జంతువులకు మధ్య సంఘర్షణ తలెత్తుతోంది. మనుషులపై పులుల దాడులు చేస్తున్న సంఘటనలు పెరుగుతున్నాయి. అయితే నల్లమలలోని అమ్రాబాద్ కోర్ ఏరియాలోని దట్టమైన అరణ్యంలో చెంచులు నివసిస్తుండగా.. చెంచులు, పులులకు మధ్య ఇప్పటివరకు ఎలాంటి సంఘర్షణ తలెత్తలేదు. అడవిలో పులులు, వన్యప్రాణులకు ఆటంకం కలగకుండా జీవనం సాగిస్తున్నారు. అడవిలో ఎప్పుడైనా పులితోపాటు ఇతర వన్యప్రాణులు ఎదురైన సందర్భంలో దూరం నుంచే గమనించి వాటి స్వేచ్ఛా విహారానికి భంగం కలిగించకుండా మసులుకుంటారు. క్షేత్రస్థాయిలో వాచర్లుగా చెంచులు.. అటవీ, వన్యప్రాణుల సంరక్షణతోపాటు పులుల అడుగుజాడలను గుర్తించడం, క్షేత్రస్థాయి విధుల్లో అటవీశాఖ ఇక్కడి స్థానిక చెంచులనే భాగస్వాములను చేస్తోంది. పులుల జాడ తెలుసుకునేందుకు, పాదముద్రలు, విసర్జితాల సేకరణ, పులులు తిరగాడిన ప్రాంతాలకు వెళ్లేందుకు సుమారు 130 మంది చెంచు సిబ్బందిని అటవీశాఖ నియమించుకుంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో మొత్తం 27 బేస్‌క్యాంపులకు గానూ 24 క్యాంపుల్లో చెంచులే పనిచేస్తున్నారు.టైగర్ ట్రాకర్లు, ఎనిమల్ ట్రాకర్లు, ఫారెస్ట్ వాచర్లుగా చెంచులే క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నారు. నల్లమలలో చెంచులు, సమీప ఆవాసాల ప్రజల సహకారంతోనే పులుల సంతతి పెరిగిందని నాగర్‌కర్నూల్ డీఎఫ్ఓ రోహిత్ తెలిపారు. అడవిలో క్షేత్రస్థాయి విధుల్లో ఎక్కువగా చెంచులే సేవలందిస్తున్నారని, భవిష్యత్‌లోనూ వీరి సంఖ్యను మరింత పెంచనున్నట్టు వివరించారు.పులి కనిపిస్తే ఆగిపోతాం.. అడవిలో పోతున్నప్పుడు పులి ఎదురైతే దూరం నుంచే చూసి అక్కడే ఆగిపోతాం. చప్పుడు చేయకుండా ఉండి పులి అక్కడి నుంచి వెళ్లే దాకా వేచిచూస్తాం. వాటి జోలికి వెళ్లకుండా ఉంటే మమ్మల్ని ఏమీ చేయవు. పులులు, వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా పనులు చేసుకుంటాం. – గురువయ్య, మేడిమల్కల చెంచుపెంట, నాగర్‌కర్నూల్ జిల్లా -
వన విహారం చేద్దాం రండి
పెద్దదోర్నాల: నల్లమల అభయారణ్యం... ఈ పేరు వింటేనే ప్రకృతి ప్రేమికుల మనసు పులకిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వేచ్ఛగా సంచరించే పెద్దపులులు, చిరుతలు, జింకలు, దుప్పులు మరెన్నో వన్యప్రాణులు కనువిందు చేస్తాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో పచ్చని పచ్చికబయళ్ల నడుమ వన్యప్రాణులను వీక్షిస్తూ ఓపెన్ జిప్సీల్లో పర్యటిస్తూ ఉంటే ఆ అనుభూతి చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇలాంటి అద్భుత అవకాశాన్ని అటవీశాఖ పర్యాటకులకు కల్పించింది. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని శ్రీశైలం ఘాట్‌రోడ్డులో తుమ్మలబైలు సమీప ప్రాంతం నుంచి ‘జంగిల్ సఫారీ’ పేరుతో అటవీ ప్రాంత సందర్శనకు ఏర్పాట్లు చేసింది. వివిధ ప్యాకేజీలతో పర్యాటకులు సురక్షితంగా అటవీ ప్రాంతాన్ని చుట్టి వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంది.విభిన్న ప్యాకేజీలతో టైగర్ సఫారీ..పెద్దదోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే రహదారిలోని 24వ కిలో మీటరు వద్ద ఉన్న గోర్లెస్ కాలువగా పిలిచే ప్రాంతం నుంచి ఓపెన్ జిప్సీల్లో ‘టైగర్ సఫారీ’ ప్రయాణం మొదలవుతుంది. మొదటి ప్యాకేజీగా రాను, పోనూ కలిపి 26 కిలోమీటర్ల మేర ప్రయాణం ఉంటుంది. దీని ధర రూ.2,400. (ఆరుగురు) లోతట్టు అటవీ ప్రాంతంలోని నరమామిడి చెరువు, వ్యూ పాయింట్, పులిచెరువు తదితర ప్రాంతాల మీదుగా సాగే ఈ ప్రయాణం తిరిగి ముఖద్వారం వద్దకు చేరుకోవటంతో ముగుస్తుంది. రెండవ ప్యాకేజీ ధర రూ.4 వేలు(ఆరుగురు). ఈ ప్యాకేజీలో 40 కిలోమీటర్ల మేర నల్లమలలో ప్రయాణం ఉంటుంది. నల్లమలలోని పెద్దారుట్ల గేట్, పెద్దారుట్ల వాచ్ టవర్, బేస్ క్యాంపు, పుల్లలదొన, గుడిమెట్ల, పులిచెరువు తదితర ప్రాంతాల మీదుగా ప్రయాణం ఉంటుంది.కనువిందు చేస్తున్న వన్యప్రాణులు జంగిల్ సఫారీలో భాగంగా నల్లమలలో జిప్సీ వాహనంలో పర్యటిస్తున్న సందర్శకులకు రాజసానికి ప్రతీకగా నిలిచే పెద్దపులులు కనువిందు చేస్తుంటాయి. పులిచెరువు, నరమామిడి చెరువు ప్రాంతాల్లో స్వేచ్ఛగా సంచరిస్తున్న పెద్దపులులు, చిరుతలు, కృష్ణజింకలు, దుప్పులు, నెమళ్లు తారసపడుతుండటంతో పర్యాటకులు అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతున్నారు. అదేవిధంగా జంగిల్ సఫారీ ప్రారంభమయ్యే గోర్లెస్ కాలువ ప్రాంతం వద్ద ఏర్పాటుచేసిన పర్యావరణ విజ్ఞాన కేంద్రం సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఈ కేంద్రంలో పెద్దపులి, జింకలు, కృష్ణజింక, నీల్గాయ్, సాంబార్, హనీబ్యాడ్జర్, మూషిక జింకలు, రెడ్ జంగిల్ పౌల్, గ్రే జంగిల్ పౌల్, హార్న్‌బిల్ పక్షులు, గుడ్లగూబ, నెమలితోపాటు ఎన్నో రకాల పక్షుల అందమైన ఆకృతులను ప్రతిష్టించారు.దీంతోపాటు సరికొత్త టెక్నాలజీతో ఒక్కో వన్యప్రాణి బొమ్మ వద్ద నిలబడినప్పుడు ఆ వన్యప్రాణి అరుపులతోపాటు దానికి సంబంధించిన పూర్తి వివరాలు లౌడ్ స్పీకర్లో వినబడేలా ఏర్పాట్లుచేశారు. వాహనాలు ప్రయాణించే దారి పొడవునా ఉండే వివిధ జాతుల వృక్షాలపై వాటి పేర్లతో కూడిన బోర్డులను ఏర్పాటుచేసి సందర్శకులకు అవగాహన కలి్పస్తున్నారు. మరోవైపు నల్లమలలోని దట్టమైన అటవీ ప్రాంతంలో సాగే ఈ జంగిల్ సఫారీని సుక్షితులైన అటవీ సిబ్బంది పర్యవేక్షణలో నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రయాణం మధ్యలో వాహనాలు మరమ్మతులకు గురైతే ఉన్నతాధికారులకు సమాచారం అందించి మరో వాహనాన్ని ఘటనాస్థలానికి పంపించేలా అధునాతన టెక్నాలజీతో కూడిన వాకీటాకీలను వినియోగిస్తున్నారు. -
చిక్కిన చిరుత.. అటవీ ప్రాంతంలో వదిలిన అధికారులు
మహబూబ్‌నగర్: రెండేళ్ల నుంచి రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన చిరుత పులి ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు పెట్టిన బోనులో శనివారం రాత్రి చిక్కింది. రెండు నెలల నుంచి మరికల్ మండలం రాకొండ శివారులోని గుట్టపై ఓ చిరుత రెండు పిల్లలకు జన్మనించి అక్కడే ఉంటుంది. నిత్యం రాత్రి కాగానే వ్యవసాయ పొలాల వద్ద కట్టేసిన పశువులపై ఎక్కడో ఒక చోట దాడి చేసి ఆకలి తీర్చుకుంటుంది. చిరుత పులిని పట్టుకోవాలని పది రోజుల కిందట గ్రామస్తులు నారాయణపేట అటవీ శాఖ అధికారులను సంప్రందించారు. మూడు రోజుల కిందట రాకొండ గుట్ట సమీపంలో బోనులో మేకపిల్లను ఉంచి చిరుతను పట్టేందుకు చర్యలు తీసుకున్నారు. ఎట్టకేలకు తల్లి చిరుత బోనులో చిక్కడంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు ఆదివారం మేకపిల్లను బయటకు పంపించి క్రేన్ సాయంతో బొలెరొ వాహనంలో శ్రీశైలం అడవిలోకి తరలించారు. బోనులో చిక్కిన చిరుత మండలంలో రాకొండ, పూసల్‌పహాడ్, మాద్వార్ తదితర గ్రామాల్లోని పశువులపై దాడి చేసి చంపేసిన ఘటనలు ఉన్నాయి. ఈ చిరుతకు సంబంధించిన రెండు చిరుత పిల్లలు తప్పించుకోవడంతో వాటిని కూడా పట్టుకోవాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. లేకుంటే తమ వ్యవసాయ పొలాలకు వెళ్లాలంటే భయమేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడవుల్లో వన్యప్రాణులు సంచరిస్తే తమ దృష్టికి తీసుకురావాలని అటవీశాఖ అధికారి వీణావాణి తెలియజేశారు. అటవీ ప్రాంతంలో వదిలిన అధికారులు పట్టుబడిన చిరుతను ఆదివారం అటవీ శాఖ వారు బోనులో బంధించి నల్లమల అటవీ ప్రాంతంలోని లింగాల మండలం గిరిజ గుండాల బేస్ క్యాంపు సమీపంలో అడవిలోకి వదిలిపెట్టారు. -
శివనామస్మరణతో మారుమోగిన నల్లమల్ల అడవి
-
పులి కూనా.. అమ్మను వీడకు!
ఆత్మకూరురూరల్: పులుల స్వర్గధామమైన భారతదేశంలో వాటి సంరక్షణకు ప్రభుత్వం తీసుకునే చర్యలు ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి పొందాయి. జాతీయ పులుల సంరక్షణ ప్రాధికారసంస్థ (ఎన్టీసీఏ) ప్రాజెక్ట్ టైగర్‌ను ఏర్పాటు చేసి పులుల సమీకృత సంరక్షణకు పాటు పడుతోంది. ఇంతటి మార్గదర్శకాలు ఉన్నప్పటికీ నల్లమలలో మాత్రం తరచూ పులికూనల మరణాలు సంభవిస్తుండటం అధికా రుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. తల్లి నుంచి తప్పిపోయిన పులికూనలు అధికారుల సంరక్షణలో చేరిన తర్వాత మరణిస్తుండటం అటవీ శాఖ పర్యవేక్షణ లోపాలను ఎత్తిచూపుతున్నాయి. ఇటీవల ఆత్మకూరు అటవీ డివిజన్లోని పెద్దగుమ్మడాపురం గ్రామ సమీపంలో తల్లిని వీడిన నాలుగు ఆడ పులికూనలను తిరుపతి జంతు ప్రదర్శన శాలకు చేర్చారు. వీటిని 108 అనే పులికి చెందిన కూనలుగా గుర్తించారు. పులి ప్రవర్దనంలో ఆడపులులే ప్రధాన పాత్ర వహించే సందర్భంలో ఒకే సారి నాలుగు ఆడకూనలు తల్లిని వీడటం జఠిలమైన సమస్యగా మారింది. వీటిని అత్యంత శాసీ్త్రయ పద్ధతులలో తల్లికి చేరువ చేయాల్సి ఉండగా అధికారుల వైఫల్యంతో తిరుపతి జంతు ప్రదర్శనశాలకు చేర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ వీటిని వన్య జీవనానికి దగ్గరగా పెంచుతూ క్రమేపీ అడవిలో వదులుతామని అప్పట్లో అటవీ అధికారులు ప్రకటించారు. అప్పటి వరకు ప్రత్యేక ఎన్‌క్లోజర్ల్లలో ఉంచి పర్యవేక్షిస్తామని చెప్పిన జూ అధికారులు మూడు నెలలుగా వాటిని ఒక ఏసీ గదికే పరిమితం చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో తీవ్రమైన ఆందోళనతో ఉన్న పులి కూనలలో ఒకదానికి చిన్నపాటి గాయ మైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. గాయం ఇన్ఫెక్ష న్ అయి అది ఇతర అవయవాలకు విస్తరించడంతో పులికూన మరణించినట్లు సమాచారం. పులికూనలను త్వరలో నల్లమలకు తీసుకు రావాల ని ఇక్కడ అడవిలో ప్రత్యేకమైన ఎన్క్లోజర్లలో ఉంచాలని, ఆ మేరకు అనువైన అటవీ ప్రాంతాలను అధికారులు గుర్తించే క్రమంలో ఉండగా జూలో పులి కూన మరణించి స్థానిక నల్లమల అధికారులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీంతో మిగిలిన మూడు పులికూనల భవితవ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. గతంలో మత్తు మందు వికటించి.. ఆత్మకూరు అటవీ డివిజన్లోని వెలుగోడు పట్టణం శివార్లలోకి గతంలో రెండు పులికూనలు వచ్చాయి. అప్పట్లో కూడా ఈ కూనలు తల్లి నుంచి విడిపోయి జనారణ్యంలోకి వచ్చాయి. కాకపోతే అవి సంవత్సరం వయసు దాటిన కూనలు. వీటిని నేరుగా పట్టుకోవడానికి వీలు కాదు కాబట్టి వాటికి మత్తు ఇచ్చి బంధించారు. అయితే వాటిలో ఒక పులికూనకు పరిమితికి మించిన మత్తు ఇవ్వడంతో చనిపోయినట్లు అప్పట్లో పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. మిగిలిన రెండో పులికూన జూకు చేర్చారు. -
ఏడు నెలల గర్భిణి..పెళ్లి చేసుకోవాలని అడిగిన ప్రేయసి..అడవిలోకి తీసుకెళ్లి
నాగర్‌కర్నూల్: పెళ్లి చేసుకోమని ప్రియురాలు గట్టిగా అడుగుతుండటంతో శ్రీశైలంలో చేసుకుందామంటూ నల్లమల అడవిలోకి తీసుకెళ్లి దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని పెట్రోల్ పోసి దహనం చేసిన ఓ కిరాతకుడి ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జడ్చర్ల సీఐ రమేష్‌బాబు తెలిపిన వివరాలిలా.. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం గొరిటకు చెందిన లక్ష్మి అలియాస్ రత్నమ్మ(34) మూడేళ్ల క్రితం భర్తతో గొడవ పడి దూరంగా ఉంటూ.. కూలి పనులకు వెళ్లే క్రమంలో అదే గ్రామానికి చెందిన లింగన్ చెన్నయ్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. కాగా, చెన్నయ్యకు మరో యువతితో వివాహం కాగా.. లక్ష్మి గొడవపడి పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టడంతో రూ.లక్ష జరిమానా చెల్లించాడు. గతేడాది చెన్నయ్య భార్య గర్భిణిగా ఉండడంతో మళ్లీ లక్ష్మికి దగ్గరయ్యాడు. ప్రస్తుతం లక్ష్మి కూడా 7 నెలల గర్భిణి. ఈ సమయంలో తననూ పెళ్లి చేసుకోవాలని, తన పేరిట 2 ఎకరాల భూమి రాసివ్వాలని లేకపోతే గ్రామానికి వచ్చి గొడవ చేస్తానని చెన్నయ్యపై ఒత్తిడి తెచ్చింది. దీంతో ఎలాగైనా ఆమెను అంతమొందించాలని చెన్నయ్య పథకం వేశాడు. పక్కా ప్లాన్ ప్రకారమే.. శ్రీశైలంలో పెళ్లి చేసుకుందామని నమ్మించి ఫిబ్రవరి 28న జడ్చర్ల నుంచి తన బైక్‌పై లక్ష్మిని తీసుకెళ్లాడు. మార్గమధ్యలో ఫర్హాబాద్– మన్ననూర్ మధ్యలో తాళ్ల చెరువు వద్ద నల్లమల అడవిలోకి వెళ్లారు. అక్కడ కర్రతో ఆమె తలపై బాది గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం బైక్‌లో ఉన్న పెట్రోల్ తీసి మృతదేహంపై చల్లి కాల్చివేశాడు. ఈ క్రమంలో తన కూతురు కనిపించడం లేదంటూ చెన్నయ్యపై అనుమానం వ్యక్తం చేస్తూ హతురాలి తల్లి చెన్నమ్మ మార్చి 25న జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పరారీలో ఉన్న చెన్నయ్యను సోమవారం స్థానిక నిమ్మబాయిగడ్డ వద్ద పోలీసులు పట్టుకుని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా నిందితుడు చెన్నయ్యపై గతంలో తిమ్మాజిపేట పోలీస్‌స్టేషన్‌లో ఓ ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన కేసు కూడా నమోదైందని, .మూడేళ్ల జైలుశిక్ష కూడా అనుభవించాడని సీఐ తెలిపారు. చదవండి: బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణ.. భర్త, ఆడపడచుతో గొడవ.. బ్యాంకుకు వెళ్తున్నానని చెప్పి... -
రష్యా టూ నల్లమల.. 8 వేల కిలోమీటర్లు ప్రయాణించి..
సాక్షి, ప్రకాశం: రష్యా నుంచి విదేశీ పక్షులు నల్లమల ప్రాంతానికి వచ్చాయి. రష్యా, మధ్య ఆసియా, ఉజ్బెకిస్తాన్, కజికిస్తాన్ దేశాల నుంచి సుమారు 8 వేల కిలోమీటర్లు ప్రయాణించిన ఈ పక్షులు ప్రస్తుతం నల్లమలలో తిరుగుతున్నాయి. పెద్దదోర్నాల, రోళ్లపెంట ప్రాంతాల్లో వీటిని బయోడైవర్శిటీ శ్రీశైలం ఎఫ్ఆర్వో హాయత్ ఫొటోలు తీశారు. ప్రతి ఏడాది డిసెంబర్ మొదటి వారంలో పక్షులు ఈ ప్రాంతానికి వచ్చి ఫిబ్రవరి నెలలో మళ్లీ సొంత గూటికి చేరతాయన్నారు. అరుదైన ఈ పక్షులు నల్లమలకే అందాలనిస్తున్నాయని చెప్పారు. మన దేశంలో నల్లమలలోని శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్టులోనే ఈ పక్షులు ఉన్నాయి. గడ్డి మైదానాలకు మాత్రమే ఈ పక్షులు వలస వస్తాయి. మిడతలు, చిన్నచిన్న పురుగులను తిని జీవిస్తాయి. ఈ సమయంలో మధ్య ఆసియాలో ఆహారం దొరకదు. దీంతో విడిది కోసం ఇక్కడికి వచ్చి ఆహారం తింటూ ఎండలు ప్రారంభం కాగానే వెళతాయి. డేగ జాతికి చెందిన ఈ పక్షులలో మాన్టెగ్యూస్ హారియర్, పాలిడ్ హారియర్, ఎరూషియన్ మార్స్ హారియర్ ముఖ్యమైనవి. నెల రోజుల పాటు కష్టపడి వీటి జీవనశైలిని పరిశీలించి ప్రత్యేక కెమెరాలతో ఫొటోలు తీసినట్టు హాయత్ తెలిపారు. -
Nallamala Forest: వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు
నల్లమల అటవీ ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చుకు వన్యప్రాణులు బలవుతున్నాయి. వేటగాళ్ల ఆటకట్టించేందుకు, అటవీ సంపదను కాపాడేందుకు అటవీశాఖ అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. వేటగాళ్లపై నిరంతర నిఘా పెట్టి వారి కదలికను నియంత్రిస్తున్నారు. అభయారణ్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు గూడేలలో గార్డుల నిఘాతోపాటు కొరియర్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నారు. ఇటీవల కాలంలో 15 కేసులు నమోదు చేసి 35 మంది వేటగాళ్లను జైలుకు పంపారు. మార్కాపురం: ప్రకాశం జిల్లాలో 3568 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో నల్లమల అటవీ ప్రాంతం విస్తరించింది. మార్కాపురం, పెద్దదోర్నాల, పెద్దారవీడు, అర్థవీడు, కంభం, గిద్దలూరు, కొనకనమిట్ల, తర్లుపాడు, పొదిలి, యర్రగొండపాలెం, పుల్లలచెరువు పరిధిలో ఉన్న అటవీ సమీప గ్రామాల్లో వన్యప్రాణులను వేటాడడం, అటవీ సంపదను వేటగాళ్లు దోచుకుంటున్నారు. మార్కాపురం అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పరిధిలో మార్కాపురం, దోర్నాల, కొర్రపోలు, నెక్కంటి, గంజీవారిపల్లి, యర్రగొండపాలెం, విజయపురి సౌత్‌లో అటవీ శాఖ అధికార కార్యాలయాలు ఉన్నాయి. వీరి పరిధిలో ఏడుగురు రేంజ్ ఆఫీసర్లు, పది మంది డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు, 14 మంది సెక్షన్ ఆఫీసర్లు, 60 మంది బీట్ అధికారులు ఉన్నారు. వేటగాళ్ల ఆగడాలను అరికట్టేందుకు అభయారణ్యంలో సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. ఏమాత్రం కదలికలు కనిపించినా వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో వేటగాళ్లు గిరిజన గూడేలు, సమీప గ్రామాలను ఎంపిక చేసుకుని నిరంతరం వన్యప్రాణులను సంహరిస్తున్నారు. జింకలు, దుప్పులు, కణుతులు, కుందేళ్లను రాత్రిపూట వేటకు వెళ్లి ఉచ్చులేసి చంపి విక్రయిస్తున్నారు. దీంతో రేంజ్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు గార్డులు, నిఘా పెట్టారు. కొరియర్ వ్యవస్థను మరింత పటిష్టం చేశారు. ఐదు నెలల కాలంలో 35 మందిని అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ కేసులకు సంబంధించి మార్కాపురం డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయ పరిధిలో 35 మంది వేటగాళ్లను అరెస్టు చేశారు. దాదాపు 2.25 లక్షల అపరాధ రుసుము విధించారు. మార్కాపురం పరిధిలో 9 కేసుల్లో 19 మందిని, పెద్దదోర్నాల పరిధిలో 3 కేసుల్లో 10, యర్రగొండపాలెం పరిధిలో 1 కేసులో 3, విజయపురి సౌత్ పరిధిలో 2 కేసుల్లో ముగ్గురిని అరెస్టు చేశారు. రాత్రిపూట అటవీశాఖ సిబ్బంది గస్తీని పెంచారు. అటవీ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. వేటాడితే కఠిన చర్యలు వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటాం. వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అటవీ జంతువులు కనిపిస్తే ఎవరూ చంపవద్దు. జీవ వైవిధ్యాన్ని కాపాడాలి. 1972 వన్యప్రాణి చట్టం ప్రకారం శిక్షలు అమలవుతాయి. – విఘ్నేష్ అప్పావ్, డీడీ, మార్కాపురం ముఖ్య సంఘటనలు ► సెప్టెంబర్ 24న కలుజువ్వలపాడు దగ్గర కుందేళ్లను వేటాడుతున్న ఇద్దరు వేటగాళ్లను అరెస్టు చేశారు. ► సెప్టెంబర్ 1న కొనకనమిట్ల మండలం మునగపాడు వద్ద ముగ్గురు వేటగాళ్లను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ► నవంబర్ 7న పట్టణంలోని బాపూజీ కాలనీకి చెందిన ముగ్గురు వేటగాళ్లను అరెస్టు చేశారు. వీరితో పాటు దోర్నాల మండలం కొత్తూరు వద్ద అడవిపందిని పట్టుకుని చంపి మాంసం విక్రయిస్తున్న వేటగాళ్లను అరెస్టు చేశారు. మార్కాపురం మండలం చింతగుంట్ల పరిధిలో ఇద్దరు వేటగాళ్లను, బోడపాడు వద్ద అక్టోబర్‌లో ఇద్దరు వేటగాళ్లను అరెస్టు చేశారు. గత నెలలో గిద్దలూరులో కూడా పలువురు వేటగాళ్లను అరెస్టు చేశారు. -
వీర్లకొండ ఎక్కేద్దాం రండి!
ప్రకృతి సౌందర్యానికి నెలవైన నల్లమల అభయారణ్యం పర్యాటకులకు స్వర్గధామం. ఇప్పటికే జంగిల్ సఫారీతో యాత్రికులను ఆకట్టుకుంటున్న అటవీ శాఖ.. మరో అడుగు ముందుకేసింది. ట్రెక్కింగ్‌పై ఆసక్తి ఉండేవారి కోసం వీర్లకొండ వద్ద ట్రెక్కింగ్ పాయింట్ ఏర్పాటు చేసింది. టెక్కింగ్ చేసే పర్యాటకుల కోసం స్థానిక గిరిజనులను గైడ్లుగా వినియోగించనుంది. ఫలితంగా వారికి ఉపాధి లభిస్తుంది. పచ్చని కొండలను సాహసోపేతంగా ఎక్కేయాలని సరదాపడుతున్నారా.. వీర్లకొండ విశేషాలేంటో చూద్దాం రండి.. పెద్దదోర్నాల(ప్రకాశం జిల్లా): నల్లమలలో పర్యటించే యాత్రికులకు వసతి, సౌకర్యాలు కల్పించటంతో పాటు వారిలోని ఉత్సాహం, పట్టుదల, ధైర్య సాహసాలను ప్రదర్శించేందుకు అటవీశాఖ సరికొత్త కార్యక్రమాలను రూపొందించనుంది. పర్యాటకులకు చిన్న చిన్న సాహసాలతో కూడిన ఎన్నో అడ్వంచర్లను చేపట్టేందుకు అద్భుత అవకాశాన్ని కల్పించే దిశగా అడుగులు వేయనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే శ్రీశైలం వెళ్లే యాత్రికుల కోసం రెస్టు రూములు, సావనీర్ షాపులు ఏర్పాటు చేసిన అధికారులు సరికొత్తగా పర్వతారోహణ (ట్రెక్కింగ్)కు అవకాశం కల్పించి యాత్రికులకు ఉల్లాసాన్ని కలిగించనున్నారు. ఇందు కోసం మండల పరిధి తుమ్మలబైలు సమీపంలోని వీర్లకొండ అనువుగా ఉందన్న విషయాన్ని గుర్తించిన అధికారులు యుద్ధప్రాతిపదిన పర్వతారోహణ కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు ఉత్సాహవంతులైన గిరిజన యువకులకు ఉపాధి కల్పించటంతో పాటు, అటవీశాఖ కూడా కొంత ఆదాయం సమకూర్చుకోనుంది. వీర్లకొండ వద్ద ట్రెక్కింగ్ ఏర్పాట్లు వేగవంతం అటవీశాఖ సరికొత్తగా ఏర్పాటు చేయనున్న ట్రెక్కింగ్ కార్యక్రమానికి పెద్దదోర్నాల, తుమ్మలబైలు మధ్య ఉన్న వీర్లకొండ అనువుగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించిన అధికారులు కొన్ని రోజుల కిందట వీర్లకొండ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అక్కడి వాతావరణ పరిస్థితులతో పాటు, వన్యప్రాణుల సంచారం, తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ట్రెక్కింగ్‌కు సంబంధించిన పనులు ఇప్పటికే మొదలయ్యాయి. పర్వతారోహణకి అనువుగా వీర్లకొండ పైకి నడిచి వెళ్లేందుకు నడక మార్గాన్ని ఏర్పాటు చేయటంలో అటవీశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. నడక దారిలో అడ్డంగా ఉన్న చెట్లకు ఏమాత్రం నష్టం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయటంతో పాటు, దట్టంగా ఉన్న గడ్డి పొదలను తొలగించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. పెద్దదోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే మార్గంలో తుమ్మలబైలు గిరిజన గూడేనికి 2 కిలోమీటర్లు ముందుగానే వీర్లకొండ వస్తుందని, శ్రీశైలం ప్రధాన రహదారిలోనే వీర్లకొండ ఉండటం వల్ల యాత్రికులు, పర్యాటకులు నడవాల్సిన అవసరం లేకుండా వారి వాహనాలను అక్కడే పార్కింగ్ చేసుకోవటానికి వీలుంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రధాన రహదారి వద్ద నుంచి కొండపైకి ఎక్కేందుకు 500 మీటర్లు, కొండ దిగేందుకు 500 మీటర్లు మొత్తంగా ఒక 1 కిలో మీటరు మేర ట్రెక్కింగ్ ఉంటుంది. ట్రెక్కింగ్‌కు సంబంధించి ఒక్కొక్కరికి రూ.300 మేర ట్రెక్కింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించి వీర్లకొండపై ఇప్పటికే వాచ్ టవర్‌ను అధికారులు సిద్ధం చేశారు. దీంతో పాటు అత్యాధునిక బైనాక్యులర్ను ఏర్పాటు చేసి నల్లమల అభయారణ్య పరిసరాలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాన్ని అధికారులు కల్పించనున్నారు. ఇప్పటికే కొండపైకి నడక మార్గాన్ని సిద్ధం చేశారు. ఈనెలాఖరు నాటికి ట్రెక్కింగ్‌కు పర్యాటకులకు అనుమతించనున్నారు. ట్రెక్కింగ్‌తో చెంచు గిరిజనులకు ఆర్థికాభివృద్ధి నల్లమలలో ట్రెక్కింగ్ ఏర్పాటు చేయటంతో పాటు అక్కడి చెంచు గిరిజనులకు ఆదాయ మార్గాలను పెంపొందించేందుకు అవకాశం ఉంటుంది. కొంత మంది గిరిజన యువకులకు శిక్షణ ఇచ్చి వారిని గైడ్లుగా ఏర్పాటు చేసి వారి సేవలను వినియోగించనున్నారు. ఇందులో భాగంగా ట్రెక్కింగ్‌కు వెళ్లే ఒక్కో పర్యాటకుడితో పాటు ఒక్కో గైడు వారి వెంట ఉంటారు. ట్రెక్కింగ్‌కు వెళ్లే వారిని జాగ్రత్తగా తీసుకెళ్లటంతో పాటు, నల్లమల విశిష్టతను తెలియజేయటం, వారి రక్షణ పట్ల జాగ్రత్తలు తీసుకుని వారిని మళ్లీ తిరిగి కిందికి తీసుకురావటం గైడ్లు చూసుకుంటారని అధికారులు పేర్కొంటున్నారు. దీని వల్ల ఒక్కో గైడుకు అటవీశాఖ వసూలు చేసే రూ.300 రుసుములో రూ.200 గైడ్‌లకే ఇస్తామని అటవీశాఖ రేంజి అధికారి విశ్వేశ్వరరావు తెలిపారు. ప్రతి యువకుడికి రోజుకు రెండు పర్యాయాలు మాత్రమే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఎక్కువ మంది యువకులకు గైడ్‌గా ఉండే అవకాశం కలుగుతుంది. ట్రెక్కింగ్ పనులు వేగవంతం నల్లమలలో పర్యటించే యాత్రికులు, పర్యాటకుల కోసం ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇందులో భాగంగా తుమ్మలబైలు వద్ద పర్వతారోహణ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ట్రెక్కింగ్‌తో గిరిజన యువకులకు ఆదాయ మార్గాలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నాం. దీని వల్ల పర్యాటకులకు మరొక సందర్శనీయ ప్రాంతంగా వీర్లకొండ మారనుంది. – విశ్వేశ్వరరావు, ఫారెస్టు రేంజి అధికారి -
అడవి పిలుస్తోంది!
సాక్షి,అమరావతి: ప్రకృతి ఒడిలో సేద తీరాలని.. ఈ ఉరుకుల పరుగుల జీవితం నుంచి కొద్ది రోజులపాటు దూరంగా, ప్రశాంతంగా గడపాలనుకునేవారికి అడవి ఆహ్వానం పలుకుతోంది. ఇందుకోసం అటవీ ప్రేమికులు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలోనే ఎన్నో ప్రకృతి రమణీయ ప్రదేశాలు అటవీ ప్రాంతాల్లో నెలకొని ఉన్నాయి. తూర్పు కనుమల్లో నల్లమల, శేషాచలం, ఎర్రమల, పాపికొండలు ఇలా పలు అడవులు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. ఈ అడవుల్లోని కొత్త ప్రదేశాలు, కొండలు, లోయల సందర్శనలు, ట్రెక్కింగ్ పట్ల పర్యాటకులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. విభిన్న వృక్ష, జంతుజాలానికి ఆలవాలం.. రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం.. 1.64 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇందులో 36,914 చదరపు కిలోమీటర్లలో (22.46 శాతం) అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. అందులో 8,139 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం రిజర్వు అటవీ ప్రాంతం. శ్రీశైలం–నాగార్జునసాగర్ టైగర్ రిజర్వు, రాయల్ ఎలిఫెంట్ రిజర్వు, శేషాచలం బయోస్పియర్.. ఇవి కాకుండా 3 జాతీయ పార్కులు, 13 వన్యప్రాణుల అభయారణ్యాలున్నాయి. ఇవన్నీ విభిన్నమైన పర్యావరణ వ్యవస్థలు, గొప్ప జీవవైవిధ్యం, ప్రత్యేకమైన వృక్ష, జంతుజాలంతో విలసిల్లుతున్నాయి. 30కి పైగా ప్రదేశాలు.. తలకోన, ఉబ్బలమడుగు, నేలపట్టు, పులికాట్, పెంచలకోన, బైర్లూటి, పెచ్చర్ల, మారేడుమిల్లి, కంబాలకొండ, తెలినీలాపురం, చొల్లంగి, వంటి 30కిపైగా పర్యావరణ పర్యాటక ప్రదేశాలను ప్రకృతి ప్రేమికుల కోసం అటవీ శాఖ ప్రత్యేకంగా తీర్చిదిద్దింది. ఈ సంవత్సరం తలకోన ప్రాంతాన్ని 2 లక్షల మంది సందర్శించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఉబ్బలమడుగు, మారేడుమిల్లి, చొల్లంగి ప్రాంతాలకూ లక్షల మంది వస్తున్నారు. వీటన్నింటినీ మరింత అభివృద్ధి చేసి ప్రజలకు చేరువ చేసేందుకు అటవీ శాఖ ప్రణాళిక రూపొందించింది. థీమ్ పార్కుల ఏర్పాటుకు ప్రణాళికలు.. ప్రతి జిల్లాలో కొత్తగా నగర వనాలు, వనమిత్ర, జూపార్కులకు అనువైన ప్రదేశాలను అధికారులు గుర్తించనున్నారు. అలాగే ఉన్నవాటిని అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు. అక్కడకు వచ్చిన పర్యాటకులు ఆహ్లాదంగా గడిపేలా ఏర్పాట్లు చేయనున్నారు. పిల్లలు ఆడుకునేలా ఏర్పాట్లు, వాకింగ్ ట్రాక్, ట్రెక్కింగ్, బర్డ్ వాచింగ్, అవుట్డోర్ జిమ్ వంటివి నెలకొల్పనున్నారు. తద్వారా అన్ని వయసుల వారిని ఆకర్షించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. అలాగే అటవీ, స్థానిక గిరిజన సంఘాలు, స్వయం సహాయక సంఘాలు తమ ఉత్పత్తులను అక్కడ విక్రయించుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. రాశి వనం, నక్షత్ర వనం, నవగ్రహ వనం వంటి థీమ్ పార్కులు సృష్టించడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రస్తుతం కడపలో ఉన్న నగర వనం మోడల్లో అన్ని నగర వనాలను అభివృద్ధి చేయాలని యోచిస్తున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖతో కలిసి ఈ ప్రాంతాలకు ప్రత్యేక టూర్ ప్యాకేజీలు రూపొందించే యత్నాలు ఊపందుకుంటున్నాయి. జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణుల అభయారణ్యాలు, రిజర్వ్ ఫారెస్ట్, ఇతర అడవుల సందర్శనకు నూతన పర్యాటక విధానాన్ని రూపొందిస్తున్నారు. కర్ణాటక తరహాలో జంగిల్ లాడ్జిలు, రిసార్ట్స్ ఏర్పాటు చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నో పర్యాటక అద్భుతాలు అటవీ సందర్శనలు, ప్రకృతి పర్యటనలకు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలోనే తలకోన, బైర్లూటి వంటి ఎన్నో అందమైన పర్యావరణ పర్యాటక ప్రాంతాలున్నాయి. శేషాచలం, నల్లమల వంటి అటవీ ప్రాంతాలున్నాయి. ప్రజలు అక్కడికి వెళ్లి ఆహ్లాదంగా గడపొచ్చు. ఇలాంటి పర్యటనల ద్వారా ప్రజలు ఒత్తిడి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ వినియోగించకుండా, వన్యప్రాణులు, మొక్కలకు నష్టం కలిగించకుండా పర్యాటకులు నడుచుకోవాలి. రాష్ట్రంలో కొత్త తరహా ఎకో టూరిజం అభివృద్ధికి ప్రయత్నిస్తున్నాం. ప్రజలు ఇందులో భాగమవ్వాలి. – మధుసూదన్‌రెడ్డి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, రాష్ట్ర అటవీ దళాల అధిపతి -
Tiger Mating Season: ఏకాంతమైతేనే 'సై'ఆట
ఆత్మకూరు రూరల్: జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు శ్రీశైలం అటవీ రేంజ్ పరిధిలోని ఇష్టకామేశ్వరి పుణ్యక్షేత్రానికి భక్తుల రాకపోకలను తాత్కాలికంగా అటవీ శాఖ నిలిపేసింది. ఇష్టకామేశ్వరి క్షేత్రం ఒక్కటే కాదు.. అన్ని పర్యావరణ పర్యాటక కేంద్రాలనూ ఈ మూడు నెలలు మూసివేశారు. ఇది పెద్ద పులుల సంతానోత్పత్తి సమయం(బ్రీడింగ్ పీరియడ్) అయినందున వాటికి ఏకాంతం కల్పించడమే ఈ ఆంక్షలకు కారణమని అటవీ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పెద్దపులి ఎంతో సిగ్గరి మనస్థత్వం కలిగినది. ఎంతో ఠీవీగా రాజసంతో నడిచే పెద్దపులి తన సంగమ సమయంలో మాత్రం పూర్తిగా ఏకాంతాన్ని కోరుకుంటుంది. అడవిలో ఏ చిన్న అలజడి రేగినా పులులు సంగమంలో పాల్గొనవు. అయితే తరుచూ అడవుల్లో మానవ సంచారం కారణంగా పెద్ద పులుల్లో సంగమించడం తగ్గిపోయి గర్భధారణ అవకాశాలు పడిపోతున్నాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఎన్టీసీఏ(నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ) 2015లో పులుల అభయారణ్యాలున్న రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. ఆ మేరకు రుతుపవనాల సమయమైన జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు అభయారణ్యాల్లో మానవ సంచారాన్ని అదుపు చేసే చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఈ ఏడాది జూన్ 1 నుంచి ఈ నిషేధాజ్ఞలను ఎన్ఎస్టీఆర్(నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్), జీబీఎం(గుండ్ల బ్రహ్మేశ్వరం) అభయారణ్యాల పరిధిలో అటవీ శాఖ అమలు చేస్తోంది. దీంతో అభయారణ్యాల పరిధిలోని అన్ని ఎకో టూరిజం రిసార్ట్లు, జంగల్ సఫారీలు, పుణ్యక్షేత్రాలను మూసివేశారు. అవసరం అనుకుంటే ఈ నిషేధాజ్ఞలను మరో రెండు నెలలు కూడా పొడిగించే అవకాశాలున్నాయి. తల్లి తలపైకెక్కిన పులి కూనలు ఆ సమయంలో మనుషుల పైనా దాడి చేసే అవకాశం పులులు సంతానోత్పత్తి సమయాల్లో చాలా ఆవేశపూరితంగా ఉంటాయి. సంగమం సమయంలో ఆవేశంతో మనుషులపై దాడులకు పాల్పడతాయి. అందుకే పులుల సంతానోత్పత్తి కాలంలో నల్లమలలోని అన్ని పర్యాటక, పుణ్యక్షేత్రాలను తాత్కాలికంగా మూసివేయించాం. – అలెన్ చోంగ్ టెరాన్, డీఎఫ్‌వో, ఆత్మకూరు డివిజన్, నంద్యాల జిల్లా -
నల్లమల ప్రయాణం... ఓ నిర్వేద జ్ఞాపకం!
ఆర్తి అంజన్న ... ‘తల్లి నల్లమల’ నాకు ఇచ్చిన అన్న! దివంగత సోలిపేట రామలింగన్న తరువాత అంతే గాఢమైన ప్రేమను పంచే ఆత్మ బంధువు. నల్లమల కీకారణ్య ఆదివాసీ. కుమ్మెనపెంట పెద్దమనిషి. ఆయనతో 21 ఏళ్ల అనుబంధం. వయసులో నాకంటే చాలా పెద్ద. కానీ ఆయన ఇంట జరిగే ప్రతి కార్యానికి నేనే పెద్ద. పెళ్లి, పండగ, పురుడు, పుణ్యం... కార్యం ఏదైనా నాదే పెద్దరికం! తెలంగాణ ఉద్యమ సమయంలో హరీశ్ రావు పోరాట స్ఫూర్తిని విని ‘హరీష్ అన్న ఎట్లుంటడు’ అని అడిగి, ఆయన్ను నల్లమల సానువు మన్ననూరు వరకు రప్పించి, చెంచులతో ఆత్మీయ సభ పెట్టించింది ఈ అంజన్నే. ఇప్పుడు ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నను తన ఇంటి గుమ్మం వరకు నడిపించిండు. చెంచులకు క్యాలెండర్ లేదు. నాగరిక కాలమానం లేదు. రేల పూతలు, కోయిల కూతలతోనే కాల కొలమానం ఆరంభం అవుతుంది. కోయిల పిట్ట రేల పూత మేసి, మర్రి, జువ్వి చెట్ల కొమ్మల కొన చివుర్ల నుంచి నీళ్లు తాగి, కమ్మని కూతతో తోటి పిట్టలను పిలుస్తుంది. అట్లా కోయిల తొలి కూత నుంచి కోయిలలు విరివిగా కూసే కాలాన్ని తొలి కార్తెగా గుర్తిస్తారు. చెంచుల తొలి కార్తె రోణి (రోహిణి). ఆ కార్తె ప్రాంభ నేపథ్యంలో అంజన్న దేవర్లకు పెట్టుకున్నడు. అమ్రాబాద్ కు వచ్చి నాకు ఫోన్ చేసిండు. నేనప్పుడు యాదృచ్ఛికంగా ప్రజాకవీ, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న; టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్ కలిసే ఉన్నాం. ‘నా పెంటకు రాయే... పండ్గ సేద్దం’ అని గోరటినీ, సాగర్‌నూ ఆప్యాయంగా ఆహ్వానించాడు. వెంకన్న కూడా నాగరికపు నీడ సోకని దట్టమైన అడవిలో, ప్రిమిటివ్ తెగల మధ్య ఓ రాత్రి గడపాలనీ, ఓ కావ్యం రాయాలనీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు... సాగర్ ఆయన ఛానల్ కోసం ఓ స్టోరీ చేయాలనే ఆలోచనతో ఉన్నాడు. ముగ్గురి మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. డీఎఫ్ఓ కిష్ట గౌడ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు. అడవికి తొవ్వ సాగింది. చీకటి ప్రయాణం! అంజన్న దండు రక్షణగా వచ్చింది. అమ్రాబాద్ నుంచి నాలుగు కిలోమీటర్లు నడిచి పాలకుర్వ ఎక్కినం. కుందేటి సుక్క పొడిచే యాళ్లకు ఇంకో ఆరు కిలోమీటర్లు సాగి మర్రి సెట్టు సార్వ దిగి కోయిలపడె చేరినం. చెలిమ నీళ్లు దొరికినయి. చల్లటి, తియ్యటి నీళ్లు దోసిళ్లతో కడుపారా తాగినం. అసలు సిసలైన అడవి ఆరంభం అయింది. కింద పదును తేలిన ఏనె రాళ్లు... పైన మొన తేలిన కొక్కెల్లాంటి పరిక కంప... దారికి రెండు వైపులా జిట్టీత పొదలు... నాకు పాత తొవ్వే. వెంకన్న అడవి జంతువును మించిన సంచార జీవి. 60 ఏళ్ళ వయసులోనూ అలుపు లేకుండా... అడుగు తడబడకుండా నడుస్తుండు. గోరటి పాటలతో, పరిశీలనతో తెలవకుండానే అడవి సాగిపోతున్నం. నర్లింగల పొదలకు కలేవచ్చినం. దీన్నే ఎలుగల బయలు అంటారట. ‘ఎలుగులు ఉంటయి... చూసి నడువురి’ అంజన్న ఆదేశం . అంజన్నకు అడవి మీద అంతులేని పట్టుంది. ఏ కుర్వన ఏ జంతువు ఉంటదో... ఏ సార్వకు ఏ పాము ఉంటదో... కార్తెను బట్టి పొద్దును చూసి వాటి నడత, నడక అంచనా వేసి చెప్పగలడు. ‘ఇది పులి తిరిగే సోటు.. మాట్లాడకుంటా నడువురి’ అని అంజన్న హెచ్చరించిండు. అంజన్న బావమర్ది ఈదన్న చేతిలో సోలార్ టార్చి లైటు ఉంది. దాని ఫోకస్‌కు ఎర్రటి కొర్రాయి తీరున రెండు కండ్లు మెరుస్తూ కనిపించాయి. రెండో సారి ఈదన్న టార్చిలైటు ఫోకస్‌ను రెండు కళ్ల మీద కేంద్రీకరించాడు. ఈ సారి ఒక్క కన్నే కనిపించింది. ‘పులి’ అని గట్టిగా అరిచిండు. అంజన్న, ఈదన్న, లింగయ్య, అంజన్న కొడుకు చిన అంజన్న అంతా ఆరేడు మంది పెద్ద కత్తులు, దబ్బలు పట్టుకొని మా చుట్టూ రక్షణగా నిలబడ్డారు. లైటు వెలుతురుకు ఒక కన్ను మూసి, ఇంకో కన్నుతో చూడటం పులి సహజ లక్షణమట. మాకు సరిగ్గా వంద మీటర్ల లోపే కడితి పోతు చెంగున ఎగిరి దూకింది. పులి వెంట పడ్డది అని అర్థం అయింది. ఈ పులి కోపగొండిదనీ, ఎప్పుడూ ఆకలి మీదనే ఉంటదనీ అంజన్న చెప్పిండు. తెలంగాణ పరిధిలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులో 2018లో తీసిన గణనలో 19 పులులు ఉన్నట్లు తేలింది. ఆ సంఖ్య ఇప్పుడు 30కి పెరిగినట్టు అటవీ అధికారులు చెప్పారు. వీటిలో 7 నుంచి 8 పులికూనలు ఉన్నట్లు కూడా నిర్ధారించారు. అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నాగార్జున సాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో 63 పులులను కెమెరా ట్రాప్ ద్వారా గుర్తించారు. దీనిని బట్టి వీటి సంఖ్య మరింత ఎక్కువే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 2014లో కేవలం 40 పులులు మాత్రమే ఉండగా... ఏడేళ్లలో ఈ సంఖ్య రెట్టింపైంది. ‘వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్’ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 3,900 పులులు మాత్రమే మిగిలి ఉండగా... మన దేశంలో 2,967 పులులు ఉన్నాయి. అంటే ప్రపంచంలోని 80 శాతం పులులు మన దేశంలోనే ఉన్నాయి. నల్లమలలో లక్ష ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూమి ఉంది. ఈ భూమిని చెంచులకు స్వాధీన పరిచి, వ్యవసాయం ప్రోత్సహించాలని భారతీయ ఆదిమ తెగలపై పరిశోధన చేసిన ఆస్ట్రియన్ మానుష శాస్త్రవేత్త హేమన్‌డార్ఫ్ 1940వ దశకంలో నైజాం సర్కార్‌కు సిఫారసు చేశాడు. ఆమేరకు నైజాం సర్కార్ ఫర్మానా జారీ చేసింది. కానీ స్వాతంత్య్రానంతరం ప్రజా ప్రభుత్వాలు ఆ ప్రతిపాదనను అటకెక్కించాయి. కానీ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అటవీ హక్కుల చట్టానికి సాధికారత కల్పిస్తూ నల్లమలలో ప్రతి చెంచుకు ఎకరన్నర భూమిని పట్టా చేసి, దాదాపు 11 వేల చెంచు కుటుంబాలకు హక్కులు కల్పించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అదే హక్కుదారులకు ‘వైఎస్సార్ రైతు భరోసా’ ఇచ్చారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కెసీఆర్ ‘రైతు బంధు’ పథకం అందిస్తున్నారు. అవన్నీ మనసులో మెదులుతుండగా అర్ధ రాత్రి వేళ కుమ్మినిపెంటకు చేరుకున్నాం. మా అంజన్న పెంట ఇదే. ఓ గుడిసె మాకు విడిది ఇల్లుగా ఇచ్చారు. వేడి వేడి తైద అంబలి కాసి పోశారు. నులక మంచం ఆల్చుకొని పడుకున్నం. నెమలి పిట్ట, అడవి కోడి కూసింది... తెల్లారింది. గోరటి వెంకన్న కలం ‘కథం’ తొక్కుతోంది. గళం పదం పాడుతోంది. ‘వెదురు తడకలతోని ఎంతందమీ ఇండ్లు, ఆవు పేడ తోని అలికిన వాకిల్లు, చెంచులా నవ్వులే చెట్లకు పువ్వులు, రాలె పుప్పొడి వాన అడివి పూల వీణ, ఉరిమె నగరి కెరవ అడవి చెంతకు నడువ, అమ్మలా లాలించి అన్నిటిని మరిపించే పరుసుకున్న, రావి నీడల తావున పట్టిన కునుకులో పుట్టెనే ఈ పదం’ అంటూ కమ్మటి పాట పొద్దు పొద్దున్నే చెవులకు ఇంపుగా తాకంగ నిద్ర లేచినం. దేవర్ల కార్యం మొదలైంది. మేకపోతు తెగింది. రక్త తర్పణం జరిగింది. కూర ఉడికింది. తంతు ఆరంభం అయింది... జోరందుకుంది... సూర్యాస్తమయంతో పాటే ముగిసింది. మిత్రుడు మారుతీ సాగర్ తన ఛానల్ స్టోరీ కోసం మైక్ ముందు పెట్టినప్పుడు చెంచుల్లో ఓ భయం బయట పడ్డది. అదీ అంతులేని భయం! మృత్యు భయం. తల్లి పాల పొదుగు నుంచి లేగ దూడను వేరు చేసినట్టుగా... అడవి తల్లి నుంచి చెంచులను వేరు చేయడానికి కేంద్ర పాలకులు పన్నిన ఉచ్చుల భయం! అడవుల్లో మానవ నివాస ప్రాంతాలు ఉండటంవల్ల వన్యప్రాణుల ఉనికికి భంగం కలుగుతోందనీ... వారిని మైదాన ప్రాంతాలకు తరలించే ప్రయత్నం నిర్విఘ్నంగా సాగుతూనే ఉంది. ‘అడవి బయట బతకలేమనీ... వనం విడిచిన కోతి బతుకు అయితదనీ’ దండం పెట్టి చెప్పినా కేంద్ర పాలకులకు వినపడటం లేదు. చెంచుల తరలింపునకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకమని స్పష్టం చేసినా... కేంద్రం తన పంతం వీడలేదు. ఇప్పటి దాక జాతి సమస్యగా ఉన్నదాన్ని పాలకులు దిగ్విజయంగా జాతుల వైరంగా మార్చేశారు. నల్లమల నుంచి బయటికి రావటానికి ఇష్టపడే జాతి... ససేమిరా అంటున్న జాతి అని రెండు వర్గాలను నిట్ట నిలువుగా చీల్చేశారు. తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా వటువార్లపల్లి, సార్లపల్లి, కుడిచింతల బైలులో ఎస్సీ, బీసీ, లంబాడాలు ఎక్కువ ఉన్నారు. వీళ్లు రూ. 15 లక్షల ప్యాకేజీ తీసుకొని అడవిని వదలటానికి సిద్ధపడ్డారు. చెంచులు ఆ ప్యాకేజీని తృణీకరించారు. ‘అడవి నుంచి బయటికి వెళ్ళటానికి ఇష్టపడని చెంచులతోనే మీరు కూడా నష్టపోతున్న’రంటూ ఫారెస్ట్ అధికారులు గిరిజనేతరులకు నూరి పోస్తున్నారు. ఇది చెంచు, లంబాడీ, ఇతర జాతుల మధ్య ఘర్షణకు దారి తీసింది. వటువార్లపల్లి, సార్లపల్లి, కుడి చింతలబైలు వగైరా పెంటలు అభయా రణ్యంలో కాక, అడవి అంచునే ఉన్నాయి. పైగా అది పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్న ‘మల్లెల తీర్థా’నికి వెళ్లే దారిలో ఉంటాయి. వన్యప్రాణులకు పర్యాటక కేంద్రంవల్ల లేని ముప్పు చెంచు పెంటల వల్ల కలుగుతుందా? గిరిజనుడికి అడవి... తల్లితో సమానం. అడవిలోని సమస్త జీవరాశినీ అతడు ప్రేమిస్తాడు. అటువంటి గిరిజనుడి వలన వన్యప్రాణులకు ప్రమాదమని చెప్పడం ఎంత బూటకం? యురేనియం నిక్షేపాల కోసం అడవినే బలిపెట్ట చూసిన మోదీ సర్కారుకు పులి మీద జాలి ఎందుకో అని మదిని తొలుస్తుండగా మర్మం తెలియక నిర్వేదంతో నల్లమలను వీడాం! వ్యాసకర్త: వర్ధెల్లి వెంకటేశ్వర్లు, మీడియా కో ఆర్డినేటర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం -
ఆ కాసేపు.. అడవి పుత్రులుగా..
సాక్షి, అమరావతి: ప్రకృతి అందాలకు పరవశించి ‘ఆకులో ఆకునై..పువ్వులో పువ్వునై.. కొమ్మలో కొమ్మనై .. నునులేత రెమ్మనై .. ఈ అడవీ సాగిపోనా.. ఎటులైనా ఇచటనే ఆగిపోనా’ అని తన కృష్ణపక్షం తొలి కవితగా రాసుకున్న దేవులపల్లి కృష్ణశాస్త్రి భావుకతకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నది నల్లమల. ఈ అభయా రణ్య విహారం పర్యాటకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నది. పచ్చని ప్రకృతి సోయగాలు, లోయలు, ఎత్తైన పర్వతాలు, నింగిని తాకుతున్న మహావృక్షాలు, స్వేచ్ఛగా సంచరించే వన్య ప్రాణులను చూస్తూ సాగే జంగిల్ సఫారీ సందర్శకులను మంత్ర ముగ్ధులను చేస్తున్నది. కర్నూలు జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలోని పచ్చర్ల, బైర్లూటి, ప్రకాశం జిల్లా పెదదోర్నాల సమీపంలోని తుమ్మలబయలు క్యాంపుల్లో ఏకో టూరిజం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ.. పలువురు పర్యావరణ ప్రేమికులకు కనువిందు చేస్తున్నది. కొండల్లో..కోనల్లో.. ఎకో టూరిజంలో భాగంగా ఆరుగురు ప్రయాణించే ఓపెన్ టాప్ జీప్‌లో గంటన్నర పాటు జంగిల్ సఫారీ సాగుతుంది. స్థానిక చెంచుజాతి యువత గైడులుగా జంగిల్ క్యాంప్, ప్రకృతి వీక్షణం, ట్రెక్కింగ్, బర్డ్ అండ్ బటర్‌ఫ్లై వాకింగ్, హెరిటేజ్ వాక్, సిద్ధాపురం ట్యాంక్ వాక్.. అటవీ అందాలను పరిచయం చేస్తుంది. ఆదిమ గిరిజన జాతి ‘చెంచులు’ సంప్రదాయ విలువిద్య సాధన యువతలో సరదాను నింపుతోంది. మూడు క్యాంపుల్లో.. ► పెద్దదోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే రహదారిలోని గోర్లెస్ కాలువ నుంచి లోతట్టు అటవీ ప్రాంతంలోని నరమామిడి చెరువు, వెదురు పడియ బేస్ క్యాంప్, పులిచెరువు తదితర ప్రాంతాల మీదుగా తుమ్మలబయలు సఫారీ ఉంటుంది. ఇక్కడే వన్య ప్రాణులను వీక్షించేందుకు వాచ్ టవర్‌ను నిర్మించారు. సుమారు 13కిలో మీటర్ల ప్రయాణం 1.30 గంటల పాటు ఉంటుంది. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సఫారీకి అనుమతిస్తారు. ► మహానంది సమీపంలోని పచ్చర్ల గిరిజన గ్రామం నుంచి సుమారు 10 కిలో మీటర్ల జంగిల్ ట్రాక్ ఉంది. దాదాపు గంటర్నరకుపైగా సాగే సఫారీలో సూర్యుడు కంటికి కనిపించనంతగా ఆకాశాన్ని కమ్మేసిన దట్టమైన చెట్ల కింద ప్రయాణం పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇక్కడ సందర్శకులు బస చేసేందుకు రెండు కాటేజీలు, నాలుగు టెంట్ హౌస్‌లు అందుబాటులో ఉన్నాయి. ► ఆత్మకూరు సమీపంలోని బైర్లూటి గిరిజన గ్రామంలో 10 కిలో మీటర్ల సఫారీ ట్రాక్ ఉంది. ఈ గ్రామం నుంచి మూడు కిలో మీటర్లు దూరం వెళ్తే టైగర్ జోన్ ఉంటుంది. ఇక్కడికి సమీపంలోనే శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన వీరభద్రస్వామి దేవాలయం శిథిలావస్థలో దర్శనమిస్తోంది. ఇక్కడ నాలుగు కాటేజీలు, ఆరు టెంట్లు, డార్మెట్రీలు అందుబాటులో ఉన్నాయి. ► సఫారీకి ఆరు ప్రయాణించే ఓపెన్ టాప్ జీప్లను వినియోగిస్తున్నారు. ఒక రైడ్‌కి రూ.800 (ఒక వ్యక్తికి రూ.150) వసూలు చేస్తున్నారు. ఇక కాటేజీలు, టెంట్లకు రూ.5వేల నుంచి రూ.4వేల వరకు ధర ఉంది. ఇందులోనే భోజన సదుపాయం, సఫారీ కూడా కలిపి ఉంటుంది. జీవ వైవిద్యానికి నిలయం.. తూర్పు కనుమల్లోని నల్లమల శ్రేణుల్లో నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ జీవవైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. అంతరించిపోతున్న ఎన్నో వృక్ష, జంతుజాలానికి నిలయంగా ఉంది. పులులు, మచ్చల జింకలు, ఇండియన్ బస్టర్డ్స్, ఎలుగుబంట్లు, కుందేళ్లు, అడవి పందులతో పాటు దాదాపు 70 రకాల క్షీరదాలు, 300 రకాల పక్షులు, 100 రకాల సీతాకోక చిలుకల ఆవాసాలున్నాయి. గ్రే హార్న్‌బిల్ (పొడవాటి ముక్కు పక్షి), డ్రోంగో, కోయెల్, ఇండియన్ రోలర్, ప్యారడైజ్ ఫ్లై చోచర్, బ్లాక్ హెడ్ ఓరియోల్, రెడ్ వెంటెడ్ బుల్బుల్, పర్పుల్ సన్‌బర్డ్ జాతులు కనువిం దు చేస్తాయి. వీటిని చూడటానికి సందర్శకులు రెండు నుంచి మూడు కిలోమీటర్లకు పైగా ప్రకృతి నడకకు వెళ్తారు. అడవుల పరిరక్షణ, స్థానిక తెగల జీవన ప్రమాణాల పెంపు, అటవీ సంపదను రక్షించుకోవడంపై పర్యాటకులకు అవగాహన కల్పనలో భాగంగా పర్యాటక, అటవీశాఖ సంయుక్తంగా ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తోంది. ఇప్పుడు వన్యప్రాణి వారోత్సవాలకు సిద్ధమవుతోంది. -
‘వెదురు’ లేని అక్రమాలు
సాక్షి, రుద్రవరం(కర్నూలు) : నల్లమల అటవీ ప్రాంతంలో వెదురు సేకరణ ప్రక్రియ సెప్టెంబరులో మొదలయ్యింది. లాగింగ్ (కలప డిపో) సిబ్బంది రుద్రవరం, చెలిమ అటవీ రేంజ్ పరిధిలోని ఎనిమిది కూపుల్లో శ్యాంపిల్ ప్లాట్లు వేయించారు. ఆ నివేదికల ఆధారంగా నంద్యాలలో డీఎఫ్ఓ శివశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో టెండర్లు నిర్వహించారు. ఒక్కో కూపు నుంచి వెదురు సేకరణ, ట్రాన్స్‌పోర్టు (కలప డిపోకు తరలించడం), గ్రేడింగ్ అనే మూడు అంశాలకు సంబంధించి మొత్తం ఎనిమిది కూపులకు గాను 24 టెండర్లు చేపట్టారు. అయితే కాంట్రాక్టర్లు సిండికేట్‌గా మారి టెండర్లను ఏకపక్షంగా దక్కించుకున్నారు. వీరిలో ఎక్కువగా టీడీపీ మద్దతుదారులు ఉన్నారు. గత ఐదేళ్లూ వెదురు సేకరణలో అక్రమాలకు పాల్పడిన వీరు..ఈసారి కూడా రంగంలోకి దిగడం గమనార్హం. నిబంధనలు గాలికి.. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు కూలీలతో వెదురు సేకరించి డిపోలకు తరలించాలి. ఉదాహరణకు రుద్రవరం అటవీ రేంజ్ పరిధిలోని అహోబిలం కూపులో వెదురు సేకరణ టెండరును శంకర్ అనే కాంట్రాక్టర్ దక్కించుకున్నారు. నిబంధనల ప్రకారం ఆ కాంట్రాక్టరే సదరు కూపులో వెదురు సేకరించాలి. అక్కడ సేకరించిన వెదుర్లను చెన్నయ్య అనే రవాణా కాంట్రాక్టర్ తన వాహనంలో రుద్రవరం కలప డిపోకు తరలించాలి. ఈ రెండు పనులకు సంబంధించి ఒక్కో వెదురుపై ప్రభుత్వం రూ.5 చొప్పున చెల్లిస్తుంది. అయితే క్షేత్రస్థాయిలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. నేరుగా వ్యాపారులు ఎవరికి వారుగా కూలీలతో వెదుర్లను సేకరించుకుంటున్నారు. వెదురు గ్రేడింగ్‌ను బట్టి ఒక్కో దానిపై రూ.4.50 నుంచి రూ.11.50 వరకు కూలి చెల్లిస్తున్నారు. అనంతరం ఒక్కో వెదురుకు రూ.2 చొప్పున బాడుగ ఇచ్చి డిపోకు తరలిస్తున్నారు. అక్కడా కొంత సొమ్ము చెల్లించి గ్రేడింగ్ చేయించి లాట్లుగా పేర్చి వేలానికి సిద్ధం చేసుకుంటున్నారు. డివిజన్ పరిధిలోని అన్ని కూపుల్లోనూ ఇదేవిధంగా జరుగుతోంది. వాస్తవానికి ఇందులో ఓ మతలబు ఉంది. వెదురు సేకరణ, ట్రాన్స్‌పోర్టు, గ్రేడింగ్ కాంట్రాక్టర్లు...వెదుర్లను వేలం పాడే వ్యాపారులు అందరూ ఒక్కరే. రుద్రవరం కలప డిపో పరిధిలో పది మంది, గాజులపల్లి (చెలిమ అటవీ రేంజ్) డిపో పరిధిలో మరో పది మంది దాకా వ్యాపారులు సిండికేట్ అయ్యి గుత్తాధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. వెదురు సేకరణ, వేలం పాటల్లో అంతా తామై వ్యవహరిస్తూ భారీఎత్తున అక్రమాలకు ఒడిగడుతున్నారు. వీరికి అధికారుల సహకారం కూడా ఉంటోంది. కొత్త వారిని దరిదాపుల్లోకి రానివ్వడం లేదు. ప్రభుత్వం చెల్లిస్తున్న ధర కంటే అధికంగా కూలీలకు ఇస్తూ సొంతంగా వెదుర్లను సేకరించుకుంటున్నారంటేనే అక్రమాలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. కనుమరుగవుతున్న వెదుర్లు వేలానికి ముందు అటవీ అధికారులు అడవిలోకి వెళ్లే కూలీలకు వెదురు నరకడంపై శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటిదేమీ ఇవ్వకపోవడంతో కూలీలు వెదుర్లను అడ్డదిడ్డంగా నరికి వేస్తున్నారు. ఒక పొద నుంచి వెదురు సేకరించాలంటే భూమికి అడుగు ఎత్తు ఉంచి నరకాలి. అలాగే ఆ పొదలో ముదురు వెదుర్లు కనీసం ఐదు మిగిల్చాలి. అలా ఉంచక పోవడంతో ఆ వెదురు పొద పట్టు కోల్పోయి కూలిపోతోంది. ఇలా అడవిలో ఎక్కడ చూసినా కూలిన వెదురుపొదలే దర్శనమిస్తున్నాయి. ఫలితంగా దినదినానికి వెదురు ఉత్పత్తి తరిగి పోతోంది. కొరవడిన అధికారుల పర్యవేక్షణ వెదురు వేలం మొదలుపెట్టే ముందు కలప డిపో అధికారులు శ్యాంపిల్ ప్లాట్లు మేస్త్రీలతో వేయించి నివేదికలను ఉన్నతాధికారులకు పంపిస్తున్నారు. టెండర్లు పూర్తయ్యి వెదురు సేకరణ ప్రారంభం కాగానే.. కూలీల వెంట ఉండి నిబంధనల మేరకు పనులు జరిగేలా చూడాల్సిన బాధ్యత కూడా వారిదే. కూపుల్లో వెదుర్లను సేకరించిన తర్వాత వాటిని వాహనంలోకి చేర్చే సమయంలో సదరు ఫారెస్టర్ వెదుర్ల సంఖ్యను లెక్కించి వాటికి అనుమతి పత్రం అక్కడే ఇవ్వాలి. అయితే వారు ఇళ్ల వద్ద ఉంటూ మేస్త్రీలను అడవికి పంపిస్తున్నారు. మేస్త్రీలు అడవి లోపలి నుంచి వాహనాలు బయటకు వచ్చే సమయానికి రోడ్లపైకి చేరుకుని.. కూలీలు చెప్పినన్ని వెదుర్లకు అనుమతి పత్రాలు ఇస్తున్నారు. -
‘యురేనియంపై టీఆర్ఎస్ రెండు నాలుకల ధోరణి’
సాక్షి, న్యూఢిల్లీ : టీఆర్ఎస్ పార్టీ యురేనియం తవ్వకాలపై రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. గతంలో యురేనియం తవ్వకాలకు టీఆర్ఎస్ మద్దతిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనేక సంప్రదింపుల తరువాతే ఈ ప్రక్రియ మొదలు పెట్టిందని, అయితే ఇప్పటి వరకు యురేనియం తవ్వకాల గురించి ఎవరికి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని దేశంలోని అనేక ప్రాంతాల్లో యురేనియం నిక్షేపాలపై పరిశోధనలు జరుగుతున్నాయని, ప్రధాని నరేంద్ర మోదీ దేశ శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. యురేనియం తవ్వాకాలపై కొన్ని పార్టీలు కావాలనే రాజకీయం చేస్తున్నాయని, గతంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు యురేనియం నిక్షేపాల వెలికితీత గురించి అన్వేషణలు చేశాయని మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నల్లమలలో యురేనియం గురించి పరిశోధనలు చేసిందని, అధికారం ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు ఒకలా ఊసరవెల్లిలా మాటలు మార్చుతుందని ఆరోపించారు. కేంద్ర పభుత్వం అనేక సంప్రదింపుల తర్వాతే ఈ ప్రక్రియ మొదలు పెట్టిందని, ప్రస్తుతం టీఆర్ఎస్ అసెంబ్లీలో దీనికి వ్యతిరేకంగా తీర్మానం చేసిందని మండిపడ్డారు. గ్యాస్, బొగ్గు, బంగారం, సీసం, విద్యుత్ ఎంత ఉన్నదో తెలుసుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని, కాగా ఇంత వరకు అసలు ఎంత యురేనియం ఉందో ఇంకా తేల్చలేదని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. -
నల్లమలలో వేటగాళ్ల హల్చల్
సాక్షి, కర్నూలు(ఆత్మకూరురూరల్) : నల్లమలలో గురువారం రాత్రి వేటగాళ్ళు రెచ్చిపోయారు. వేటగాళ్ళు నాటుతుపాకీతో రెండు పొడదుప్పు(స్పాటెడ్ డీర్) లను కాల్చి చంపి మాంసంగా మార్చి తరలిస్తూ అటవీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. బైర్లూటీ ఎఫ్ఆర్ఓ శంకరయ్య తెలిపిన మేరకు నలమలలో అలజడి రేపిన ఈ ఘటన వివరాలు.. ఆత్మకూరు అటవీ డివిజన్లోని రుద్రకోడు అటవీ సెక్షన్లో ఉన్న సీతమ్మ పడె ప్రాంతంలో గురువారం రాత్రి గస్తీ తిరుగుతున్న అటవీ సిబ్బందికి కొందరు వేటగాళ్లు సైకిల్‌పై మాంసాన్ని తరలిస్తూ కనిపించారు. అటవీ సిబ్బంది వారిని వెంటాడి పట్టుకునే యత్నం చేయగా ఇరువురు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు. మండలంలోని సిద్దాపురం గ్రామానికి చెందిన డేరంగుల మురళి సైకిల్‌పై తరలిస్తున్న సుమారు 50 కేజీల దుప్పి మాంసం, ఒక ఎస్బీ ఎంల్ (సింగిల్ బ్యారల్ మజిల్ లోడ్) నాటు తుపాకీతో పట్టుబడ్డాడు. అతన్ని అటవీ అధికారులు ప్రశ్నించగా సిద్దాపురం గ్రామానికి చెందిన కుంచాల రంగన్న, ఆనంద్‌లతో కలసి నాటుతుపాకితో దుప్పుల మందపై కాల్పులు జరపగా రెండు దుప్పులు మృతిచెందినట్లు తెలిపాడు. వాటిని ముక్కలుగా కట్ చేసి గ్రామాల్లో విక్రయించేందుకు వెళ్తున్నట్లు ఒప్పుకున్నాడు. రుద్రకోడు ఎఫ్బీలో శ్రీనివాసులు నిందితులపై పీఓఆర్ నమోదు చేశారు. పశువైద్యాధికారి రాంసింగ్ దుప్పుల శరీర భాగాలకు పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం నిందితుడు మురళిని నంద్యాల జెఎఫ్ఎంసీ ముందు హాజరు పరిచగా జూనియర్ సివిల్ జడ్జీ 15 రోజుల రిమాండ్‌కు ఆదేశించారు. వేటగాళ్లను అరెస్టు చేసిన అధికారుల బృందంలో ఎఫ్‌ఎస్‌ఓలు వెంకటరమణ, తాహీర్, ఎఫ్‌బీఓలు శ్రీనివాసులు, మహబూబ్ బాషా ఉన్నారు. -
సేవ్ నల్లమల : ఫైర్ అయిన రౌడీ
యురేనియం నిక్షేపాల కోసం నల్లమల అడవుల్లో చేపట్టనున్న మైనింగ్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఉద్యామాలు జరుగుతున్నాయి. పర్యావరణ వేత్తలతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ పరిణామాలపై తమ గళం వినిపిస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు శేఖర్ కమ్ముల సేవ్ నల్లమల క్యాంపెయిన్‌కు తన మద్దతు తెలపగా తాజాగా హీరో విజయ్ దేవరకొండ కూడా ఈ లిస్ట్‌లో చేరాడు. ‘20000 వేల ఎకరాల నల్లమల అడువులు ప్రమాదంలో పడ్డాయి. ఇప్పటికే చెరువులను నాశనం చేశాం, కొన్ని రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కరువు పరిస్థితులున్నాయి. నిత్యావసరాలకు కూడా నీరు దొరకని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్న కొద్దిపాటి అవకాశాలను కూడా నాశనం చేస్తున్నాం. అదే వరుస దట్టమైన నల్లమల అడవులను నాశనం చేసేందుకు సిద్ధమవుతున్నాం. మీకు పునరుత్పాదక వనరు కానీ యురేనియం కావాలంటే కొనండి. యురేనియం కొనొచ్చు..? కానీ నల్లమల అడవులను కొనొచ్చా?ఒకవేల మన కొనలేకపోతే, సోలార్ ఎనర్జిలాంటి వాటిని ప్రోత్సహించండి. ప్రతీ మేడ మీద సోలార్ ప్యానల్స్ ఏర్పాటును తప్పనిసరి చేయండి. పీల్చేందుకు గాలి, తాగేందుకు నీరు లేనప్పుడు యురేనియం, కరెంట్ ఏం చేసుకుంటాం’ అంటూ ట్వీట్ చేశాడు విజయ్ దేవరకొండ. #SaveNallamala pic.twitter.com/zGEe8fVk6N — Vijay Deverakonda (@TheDeverakonda) September 12, 2019 -
సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: ఆమ్రాబాద్‌లో యురేనియం తవ్వకాలను నిలిపేయాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ప్రాంతం పులులకు నివాస యోగ్యమైందని, చెంచుల జీవితాలను చిన్నాభిన్నం చేయడంతోపాటు పర్యావరణాన్ని నాశనం చేసే తవ్వకాల అనుమతులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని పేర్కొన్నారు. శుక్రవారం ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ఆయన బహిరంగ లేఖ రాశారు. ఈ తవ్వవకాలతో వేలాది మంది చెంచుల కుంటుబాలు అటవీ ప్రాంతం వదిలి వెళ్లిపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తవ్వకాల వల్ల ఏర్పడే వాయు కాలుష్యంతో కేన్సర్ వ్యాధులు సోకడంతోపాటు జంతు జాతులు నాశనమయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. మన్ననూర్, పదిర, దేవరకొండ, నాగార్జునసాగర్ ప్రాంతంలోని లంబాపూర్‌లో తవ్వకాలకు యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం ఉందని వివరించారు. యురేనియం తవ్వకాలకు సంబంధించిన అనుమతులను వెంటనే రద్దు చేసి ఆయా ప్రాంతాల్లో నివసించే అటవీ జాతులను, పర్యావరణాన్ని కాపాడాలని లేఖలో కోరారు. -
అరుదైన అలుగును విక్రయిస్తూ..
సాక్షి, పెద్దదోర్నాల : అరుదైన పంగోలిన్ జాతి జంతువు అలుగును విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అటవీశాఖ అధికారులు పట్టుకొని జంతువును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన పెద్దదోర్నాలలో బుధవారం చోటుచేసుకుంది. పెద్దదోర్నాల మండల పరిధిలోని కడపరాజుపల్లెకు చెందిన కర్రావుల పెద్దిరాజులు మంగళవారం రాత్రి నల్లమల అటవీ ప్రాంతంలో అలుగును పట్టుకున్నాడు. వన్యప్రాణుల సంరక్షణ చట్టంలో అంతరించి పోయే జంతువుల జాబితాలో ఉన్న అలుగును రహస్యంగా విక్రయించి సొమ్ము చేసుకోవాలనుకున్నాడు. ఈ విషయంపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు. బుధవారం మధ్యాహ్నం మార్కాపురం పరిసర ప్రాంతంలో అలుగును విక్రయించే ప్రయత్నం చేస్తున్నట్టు గుర్తించి, కొనుగోలుదారులుగా అక్కడికి వెళ్లిన అధికారులు అలుగుతో సహా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విదేశాల్లో అలుగుకు డిమాండ్.. సాధారణంగా మెత్తటి ఇసుక నెలల్లో బొరియలు చేసుకొని చీకటి వేళల్లో సంచరించే జంతువు అలుగు. ఇది ఎక్కువగా చీమలు, చెదుపురుగులు, చిన్న కీటకాలు తిని జీవిస్తాయి. ఇది సాధారణంగా 10 నుండి 16 కేజీల బరువు వుండి, శరీరంపై 160 నుంచి 200 పొలుసులు కలిగి ఉంటుంది. ఇది సంవత్సరానికి ఒక పిల్లను పెట్టి పాలిచ్చి సాకుతుంది. వీటికి ఇతర దేశలలో డిమాండ్ ఉండటం వలన ఎక్కువ రేటు పలుకుతుంది. దీని పొలుసులను చైనా దేశంలో సంప్రదాయ వైద్యంలో లైంగిక పటుత్వం కోసం, ఆభరణాలు తయారీలో వాడుతారు. దీని చర్మం బూట్లు, చెప్పుల తయారీలో వాడుతారు. ఈ కారణంగా వీటిని పెద్ద ఎత్తున స్మగ్లింగ్ చేయటం వలన అవి వేగంగా అంతరించి పోయే దశలో ఉన్నాయి. దీనిని వేటాడితే వన్యప్రాణల సంరక్షణ చట్టం ప్రకారం మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష అనుభవించవలసి ఉంటుంది. -
వజ్రాల వాటాలో గొడవ.. అందుకే చంపేశాం
సాక్షి, శిరివెళ్ల(కర్నూలు) : నల్లమల అటవీ ప్రాంతం శ్రీ సర్వనరసింహస్వామి ఆలయ పరిసరాల్లో జరిగిన యువకుని హత్య కేసు మిస్టరీ వీడింది. భూమిలో నుంచి బయటకు తేలి వున్న కాలి బొటన వేలు ఈ నెల 12న ఓ వ్యక్తి గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు అక్కడికి వెళ్లి మృతదేహాన్ని వెలికి తీసి అనుమానాస్పదంగా కేసు నమోదు చేసుకున్నారు. హతుడు ఆళ్లగడ్డ పట్టణం పుల్లారెడ్డి వీధికి చెందిన షేక్ జాకీర్ బాషా(20)గా గుర్తించారు. తల నుంచి మొండెం వేరు చేసి ఉండటంతో నర బలి ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తగా విచారణంలో అవన్నీ వదంతులేనని తేల్చారు. నిందితులను బుధవారం అరెస్ట్ చేశారు. శిరివెళ్ల, గోస్పాడు ఎస్ఐలు తిమ్మారెడ్డి, చంద్రశేఖరరెడ్డి తెలిపిన వివరాలు.. ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన యువకుడు షేక్ జాకీర్బాషాతో రుద్రవరం మండలం నాగిరెడ్డిపల్లెకు చెందిన నీలి శ్రీరాములు, ఆళ్లగడ్డ మండలం మర్రిపల్లెకు చెందిన పత్తి నాగప్రసాదు, పత్తి నాగేంద్ర, కోటకందుకూరుకు చెందిన దుర్వేసుల శ్రీనివాసులు, డి.కొట్టాలకు చెందిన దేరంగుల గోపాల్‌కు పరిచయాలున్నాయి. ఈ క్రమంలో వారందరు కలిసి ఈ నెల 5న వజ్రాల అన్వేషణకు సర్వ నరసింహ్మస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. వజ్రాలు దొరికితే పంచుకునే వాటాలపై వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఐదుగురు కలిసి షేక్ జాకీర్బాషాను కత్తితో గొంతు కోసి హత్య చేసి ఎవరికీ అనుమానం రాకుండా పూడ్చిపెట్టారు. ఆళ్లగడ్డ, ఇతర గ్రామాల్లోని సీసీ ఫుటేజీల ఆధారంగా మోటార్ సైకిల్‌పై వెళ్తున్న దృశ్యాలను సేకరించి నిందితులను గుర్తించారు. బుధవారం రుద్రవరం మండలం చిన్న కంబలూరు మెట్ట వద్ద అనుమానంగా సంచరిస్తుండగా అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కత్తి, ఇతర పరిçకరాలను స్వాధీనం చేసుకున్నారు. -
కర్నూలు జిల్లాలో అరుదైన పాము గుర్తింపు
శ్రీశైలం ప్రాజెక్ట్: కర్నూలు జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతం సున్నిపెంట పరిధిలో రామాలయం సమీపంలో అరుదైన పామును బయోల్యాబ్ సిబ్బంది గుర్తించారు. సమాచారం అందుకున్న బయోల్యాబ్ రేంజ్ అధికారి ఎ.ప్రేమ అక్కడికి చేరుకుని పామును పట్టుకున్నారు. ఈ పామును మొదటిసారిగా.. నాగార్జునసాగర్, శ్రీశైలం అభయారణ్యంలో గుర్తించామని, దీని శాస్త్రీయ నామం లైకోడాన్స్లావికోల్లీస్ అని తెలిపారు. దీనిని ఎల్లోకలర్డ్ ఊల్ఫ్ స్నేక్‌గా పేర్కొంటారని, వీటిల్లో 5 రకాల జాతులుంటాయని, ఇవి విషపూరితం కాదని చెప్పారు. -
తాగర అన్నా.. తాగి ఊగర అన్నా..!
గిద్దలూరు: నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నాటుసారా తయారు చేసి విక్రయించడం కొందరు ఉపాధిగా మార్చుకుంటున్నారు. సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతాలను సారా తయారీ కేంద్రాలుగా రూపాంతరం చెందిస్తున్నారు. బేస్తవారిపేట మండలం, కొమరోలు మండలంలోని కొన్ని గ్రామాలు, గిద్దలూరు మండలంలోని నల్లమల అడవికి సమీపంలో ఉన్న వెంకటాపురం, దూర్‌చింత్ తండా, బరుజుపల్లె తండా, కొత్తకోట, దిగువమెట్ట, ఓబులాపురం తండా, గడికోట, అంకాలమ్మపల్లె, బేస్తవారిపేట మండలం కోనపల్లె లోయలోని గ్రామాల్లోని నాటుసారా తయారీదారులు అడవిలో బట్టీలు ఏర్పాటు చేసుకుని విచ్చలవిడిగా నాటుసారా వ్యాపారం చేస్తున్నారు. రోజూ కొన్ని వందల లీటర్ల నాటుసారాను ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. దట్టమైన అటవీ ప్రాంతంలో నాటుసారా బట్టీలను గుర్తించడం ఎక్సైజ్ అధికారులకు కష్టంగా మారింది. ఇటీవలి కాలంలో గ్రామాల్లోనూ నాటుసారా విక్రయం జోరుగా సాగుతోంది. గ్రామ చివరలో కాపలాదారులను ఉంచి అధికారుల రాకను సెల్ఫోన్ల ద్వారా సమాచారం తెలుసుకుంటూ తప్పించుకుంటున్నారని తెలుస్తోంది. అడవిలోనే మకాం నాటుసారా తయారీకి అడవిలోనే రోజుల తరబడి మకాం వేస్తున్నారు. సారా తయారీకి అవసరమన తుమ్మచెక్క, బెల్లం, యూరియా అడవిలోకి చేరవేస్తున్నారు. వారికి అవసరమైన ఆహార పదార్థాలను కుండలు, క్యాన్లలో వెంట తీసుకుని వెళ్తున్నారు. నీటి వసతి ఉన్న చోట సారా బట్టీలు ఏర్పాటు చేసుకుని అక్కడే మకాం వేస్తున్నారు. సారా తయారు కాగానే క్యాన్లతో పల్లెల్లోకి వస్తున్నారు. కొందరు వ్యాపారులు రోజువారీ కూలీలను వినియోగిస్తున్నారు. సారా తయారీకి అవసరమైన సరుకును వారికి అప్పగిస్తున్నారు. కూలీలు సారా తయారు చేసేంత వరకు వారికి అవసరమైన భోజనం, కుటుంబాల అవసరాలను వారే తీరుస్తుంటారు. ఇందుకోసం కూలికి రోజుకు ఐదు వందల నుంచి రూ.వెయ్యి వరకు చెల్లిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కలిసొచ్చిన వివాహాల సీజన్ నెల రోజులుగా వివాహ, శుభకార్యాలు ప్రారంభం కావడంతో నాటుసారాకు గిరాకీ పెరిగింది. శుభకార్యాలకు గ్రామాల్లో ఎక్కువగా నాటుసారా వినియోగిస్తుంటారు. ఇటీవల సారాకు డిమాండ్ పెరిగింది. కొందరు కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు, కర్నాటకకు నాటుసారా తరలిస్తున్నట్లు తెలుస్తోంది. సారా తయారీదారులు, విక్రయించేవారు అధికారులంటే భయంలేనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రతి నెలా ముడుపులు సమర్పించి మచ్చిక చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు వచ్చినప్పుడు మాత్రమే నామమాత్రపు దాడులు నిర్వహించి బైండోవర్లు, చిన్న కేసులతో చేతులు దులుపుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రోడ్డు, రైలు మార్గంలో ఇతర రాష్ట్రాలకు నాటుసారా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ పనులన్నీ రాత్రిళ్లు చక్కదిద్దుతున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించి అడవుల్లో ఏర్పాటు చేసిన సారా బట్టీలను తొలగించి తమ కుటుంబాలను కాపాడాలని వివిధ గ్రామాల మహిళలు కోరుతున్నారు. దాడులు నిర్వహిస్తున్నాం ఇటీవల నాటుసారా బట్టీలపై దాడులు నిర్వహిస్తున్నాం. అటవీ ప్రాంతాల్లో ఉన్న బట్టీలను ధ్వంసం చేసి పలువురిపై కేసులు పెట్టాం. ఎక్కడైనా నాటుసారా బట్టీలు ఉన్నట్లు మాకు సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటాం. నాటుసారాతో కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.– రాజేంద్రప్రసాద్, ఎస్ఐ, ఎక్సైజ్ శాఖ