సాక్షి, ప్రకాశం: రష్యా నుంచి విదేశీ పక్షులు నల్లమల ప్రాంతానికి వచ్చాయి. రష్యా, మధ్య ఆసియా, ఉజ్బెకిస్తాన్, కజికిస్తాన్ దేశాల నుంచి సుమారు 8 వేల కిలోమీటర్లు ప్రయాణించిన ఈ పక్షులు ప్రస్తుతం నల్లమలలో తిరుగుతున్నాయి. పెద్దదోర్నాల, రోళ్లపెంట ప్రాంతాల్లో వీటిని బయోడైవర్శిటీ శ్రీశైలం ఎఫ్‌ఆర్‌వో హాయత్ ఫొటోలు తీశారు. ప్రతి ఏడాది డిసెంబర్ మొదటి వారంలో పక్షులు ఈ ప్రాంతానికి వచ్చి ఫిబ్రవరి నెలలో మళ్లీ సొంత గూటికి చేరతాయన్నారు.
అరుదైన ఈ పక్షులు నల్లమలకే అందాలనిస్తున్నాయని చెప్పారు. మన దేశంలో నల్లమలలోని శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్టులోనే ఈ పక్షులు ఉన్నాయి. గడ్డి మైదానాలకు మాత్రమే ఈ పక్షులు వలస వస్తాయి. మిడతలు, చిన్నచిన్న పురుగులను తిని జీవిస్తాయి. ఈ సమయంలో మధ్య ఆసియాలో ఆహారం దొరకదు.
దీంతో విడిది కోసం ఇక్కడికి వచ్చి ఆహారం తింటూ ఎండలు ప్రారంభం కాగానే వెళతాయి. డేగ జాతికి చెందిన ఈ పక్షులలో మాన్‌టెగ్యూస్ హారియర్, పాలిడ్ హారియర్, ఎరూషియన్ మార్స్ హారియర్ ముఖ్యమైనవి. నెల రోజుల పాటు కష్టపడి వీటి జీవనశైలిని పరిశీలించి ప్రత్యేక కెమెరాలతో ఫొటోలు తీసినట్టు హాయత్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment